‣ సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్ విధానంపై నిపుణుల సూచనలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగబోతున్నాయి. ప్రత్యక్ష తరగతులు లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. లేనిపోని భయాల వల్ల నష్టం తప్ప ప్రయోజనమేమీ ఉండదు. ఈ పరిస్థితుల్లో మానసిక ఒత్తిడిని జయించటం ముఖ్యం. ఇంటర్ పరీక్షల్లో వివిధ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కుల సాధనకు ఏయే మెలకువలు పాటించాలో నిపుణుల సూచనలు.. ఇవిగో!
ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పదో తరగతి బోర్డు పరీక్షలు రాయకపోవడం, దాదాపు ఒకటిన్నర సంవత్సరాలపాటు ఆన్లైన్ ద్వారా పాఠాలు వినడం, పూర్తి ఏకాగ్రత పెట్టలేకపోవడం, నోట్సు రాయకపోవడం, తరగతులు ప్రత్యక్షంగా వినకపోవడం, విన్నదాన్ని పునశ్చరణ చేయకపోవడం..వీటన్నిటి కారణంగా అవగాహనా స్థాయులు తగ్గాయి. ఏకాగ్రత, సాధన, కాగితంపై సమాధానాలు రాసే సామర్థ్యం, ఓపిక దెబ్బతిన్నాయనే చెప్పాలి. ప్రస్తుతం సిలబస్ తగ్గింది. మొత్తం ఇంటర్ సిలబస్‌లో 70 శాతం మాత్రమే ఉంది. తెలంగాణలో చాయిస్ పెంచారు. కొన్ని చాప్టర్లు బాగా చదివితే మార్కులు తెచ్చుకోవచ్చని విద్యావేత్తలు భావిస్తారు. కానీ ముందుగా విద్యార్థి భవిష్యత్తుపై అవగాహన పెంచుకుని చదువు పట్ల సన్నగిల్లుతున్న ఆసక్తిని పునరుద్ధరించుకోవటం ముఖ్యం. ఆ విధంగా పరీక్షలకు మెరుగ్గా సమాయత్తం కావాలి.
ప్రతి విద్యార్థీ కాన్సెప్టులూ, ఫార్ములాల్లో పట్టు పెంచుకోవాలి. కరోనా పరిస్థితులను అవకాశంగా భావించి.. ప్రభుత్వాలు తమని గట్టిక్కిస్తాయనే పొరపాటు భావనల నుంచి బయటకు రావాలి. కష్టపడేతత్వాన్ని అలవర్చుకునేలా పరీక్షలకు సంసిద్ధమవ్వాలి. విద్యా సంస్థలు, ఉపాధ్యాయులతో సమానంగా తల్లిదండ్రులూ బాధ్యత తీసుకుంటే విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అవ్వగలుగుతారు.
భౌతికశాస్త్రం (ఫిజిక్స్)
గతంలో పరీక్షలు రాయడం వల్ల ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలపై కొంత అనుభవం కలిగివుంటుంది. కానీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇదే మొదటి బోర్డు పరీక్ష కాబట్టి ప్రణాళికతో సన్నద్ధత మొదలుపెడితే మంచి మార్కులను సాధించవచ్చు.
ప్రశ్నపత్రం 70 శాతం సిలబస్ ఆధారంగా పరీక్షలు ఉంటాయని ఇప్పటికే బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం సెక్షన్-బి, సెక్షన్-సిలలో 50 శాతం చాయిస్తోపాటు అన్ని సెక్షన్లలో అదనంగా ప్రశ్నలు పెంచారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే చేతిరాత, ప్రజెంటేషన్. ఆన్లైన్ క్లాసుల వల్ల చాలామంది విద్యార్థులకు రాసే అలవాటు తగ్గింది. అందుకే ప్రతి ప్రశ్నకూ రాసే జవాబు సరైన పద్ధతిలో ఉండేట్టు చూసుకోవాలి. భౌతికశాస్త్రంలో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే ముందుగా లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు రాయడానికి సన్నద్ధం కావాలి.
మొదటి సంవత్సరం
ఇంటర్ మొదటి సంవత్సరం భౌతికశాస్త్రంలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు వర్క్పవర్ ఎనర్జీ (16 మార్కులు), ఆసిలేషన్స్ (8 మార్కులు), థర్మల్ ప్రాపర్టీన్ ఆఫ్ మ్యాటర్ (12) అడిగే అవకాశం ఉంది. వీటికి ప్రాబ్లమ్స్ (10 మార్కులు), గ్రావిటేషన్ (8), సాలిడ్స్ (4 ), ఫ్లూయిడ్ (4), థర్మోడైనమిక్స్ (8), కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ (4 మార్కులు).. ఈ విధంగా ప్రిపరేషన్ చూసుకోవాలి.
పూర్తి మార్కులు రావడానికి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను అన్నింటినీ చదవాల్సిన అవసరం ఉంది. సంబంధిత ప్రాబ్లమ్ కూడా చేయాలి. కనీస మార్కుల గురించి పైన తెలిపిన చాప్టర్స్‌లో మీకు బాగా తేలికగా, సులువుగా ఉన్న చాప్టర్స్‌ను ఎంపిక చేసుకుని సన్నద్ధత మొదలుపెడితే సరిపోతుంది. గత ఏడాది ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలు అన్నీ ఒకసారి తయారైతే అవగాహన పెరుగుతుంది.
ద్వితీయ సంవత్సరం
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్స్... వేవ్స్ (16 మార్కులు), కరెంట్ ఎలక్ట్రిసిటీ (8), న్యూక్లియి (8). వీటికి సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి.
స్వల్ప, అతిస్వల్ప సమాధాన ప్రశ్నల గురించి ఆప్టిక్స్ (14 మార్కులు), ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ (12), ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ (12), మూవింగ్ ఛార్జెస్ అండ్ మాగ్నటిజమ్ (8), మ్యాగ్నటిజమ్ అండ్ మ్యాటర్ (4), ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్ (4), ఆల్టర్నేటివ్ కరెంట్ (2), ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ (4), డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ (4), ఆటమ్స్ (8), సెమీ కండక్టర్స్ (6), కమ్యూనికేషన్ సిస్టమ్ (4 మార్కులు) వచ్చే అవకాశం ఉంది.
విద్యార్థులు పైనవాటిలో బాగా తెలిసిన, సులువైన చాప్టర్స్ చదివితే 60 శాతంతో పాసయ్యే అవకాశం ఉంది. పూర్తి మార్కులకు సిద్ధమవుతున్న విద్యార్థులు అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అన్నింటినీ చదవాలి. ప్రాబ్లమ్స్‌ని కూడా చేయాలి.
రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ)
కొవిడ్ పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధన పూర్తిగా జరగలేదని విద్యార్థులు భయాలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తొలగించిన సిలబస్‌ను గుర్తించి, బోర్డ్ మోడల్ పేపర్ వెయిటేజి ప్రకారం ప్రిపేరయితే కచ్చితంగా మంచి మార్కులు సాధించవచ్చు. ఇప్పటి నుంచే ఒక కచ్చితమైన స్టడీ ప్లాన్ ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది.
ఇంటర్ మొదటి సంవత్సర కెమిస్ట్రీ పరీక్షలకు దీర్ఘ సమాధాన ప్రశ్నలు పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, కర్బన రసాయన శాస్త్రం చాప్టర్స్ నుంచి వస్తాయి. వీటిలో ఏవైనా మూడు పాఠాల్లో ప్రశ్నలు చదువుకుంటే అన్ని దీర్ఘ సమాధాన ప్రశ్నలకూ సమాధానం రాయవచ్చు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు - పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, పదార్థ స్థితులు, స్టైకియోమెట్రీ, ఉష్ణగతిక రసాయనశాస్త్రం, రసాయన సమతాస్థితి, అయానిక సమతాస్థితి, హైడ్రోజన్- దాని సమ్మేళనాలు, గ్రూప్ 13, 14, కర్బన రసాయన శాస్త్రాల నుంచి వస్తాయి. వీటిలో పదార్థస్థితులు, స్టైకియోమెట్రీ, సమతాస్థితుల నుంచి 2 స్వల్ప సమాధాన ప్రశ్నలు (ఒకొక్క చాప్టర్ నుంచి) వస్తాయి. వీటినీ, గ్రూప్ 13, 14నూ పూర్తిగా చదువుకుంటే స్వల్ప సమాధాన ప్రశ్నలు చాయిస్‌తో సహా రాసేయొచ్చు.
ఆవర్తన పట్టిక, రసాయన బంధం, పదార్థ స్థితులు, స్టైకియోమెట్రీ, ఉష్ణగతిక రసాయన శాస్త్రం, రసాయన, అయానిక సమతాస్థితులు, ఎస్-బ్లాక్ మూలకాలు, గ్రూప్ 14, కర్బన రసాయన శాస్త్రం, మూలకాలు పూర్తిగా చదువుకుంటే అన్ని అతి స్వల్ప ప్రశ్నలకూ సమాధానాలు రాయొచ్చు.
‣ పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధం చాప్టర్లను సంపూర్ణంగా ప్రిపేర్ అయితే 50 నుంచి 60 శాతం మార్కులు సంపాదించుకోవచ్చు. కాబట్టి భయాన్ని వదిలేసి ఇప్పటినుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టినా మార్కులు సాధించవచ్చు.
‣ మొదటిగా అన్ని పాఠాల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు, ఆ తర్వాత స్వల్ప సమాధాన ప్రశ్నలు, ఆపై అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు చదవాలి.
‣ రసాయన శాస్త్రంలో సమీకరణాలు బాగా సాధన చేయాలి. సాధారణంగా సరిగా బ్యాలెన్స్ చేయని సమీకరణాలు రాయడం వల్ల మార్కులు కోల్పోతారు. కాబట్టి బాగా ప్రాక్టీస్ అవసరం.
‣ ఫార్ములాలు బాక్సులో రాయడం, ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేయడం, సమీకరణాలను జాగ్రత్తగా రాయడం, కొట్టివేతలు లేకుండా రాయడం వల్ల మంచి మార్కులు సంపాదించుకోవచ్చు.
గణిత శాస్త్రం (మ్యాథ్స్)
సిలబస్‌ను తగ్గించడం వల్ల విద్యార్థులు తొలగించిన పాఠాలు గుర్తించి వెయిటేజి ప్రకారం చదవాలి. ముఖ్యమైన ప్రశ్నలను ముందు చదువుకోవాలి. క్రమమైన పునశ్చరణ (రివిజన్) తప్పనిసరి. పేపర్‌ను రెండు భాగాలుగా చేసి సంసిద్ధమైతే 100 శాతం మార్కులు సాధించవచ్చు.
1. ప్రతి పేపర్లో 1 సెట్ ప్రిపేర్ అయినవారు 60 శాతం స్కోర్‌తో ఉత్తీర్ణులు అవుతారు.
2. సెట్ 1, 2లను ప్రిపేర్ అయినవారు సులభంగా 100 శాతం సాధించగలుగుతారు.
3. పరీక్షకు 15 రోజుల ముందు నుంచి గణితం మోడల్ పేపర్లను సాల్వ్ చేసుకోవాలి.
గణితం 1ఎ:
సెట్-1
1. మాత్రికలు 45 మార్కులు (టీఎస్), 22 (ఏపీ)
2. సదిశా లబ్ధం 26 (టీఎస్), 13 (ఏపీ)
3. త్రిభుజ ధర్మాలు 22 (టీఎస్), 11 (ఏపీ)
సెట్-2
1. త్రికోణమితి నిష్పత్తులు 19 మార్కులు (టీఎస్), 23 మార్కులు (ఏపీ) (పరివర్తనాల వరకు)
2. సదిశా సంకలనం 21 (టీఎస్), 15 (ఏపీ)
3. ప్రమేయాలు 11 (టీఎస్), 11 (ఏపీ)
4. అతిపరావలయ ప్రమేయాలు 8 (టీఎస్), 2 (ఏపీ)
గణితం -1బి:
సెట్-1
1. సరళరేఖలు 37 మార్కులు (టీఎస్), 15 మార్కులు (ఏపీ)
2. అవకలనం 21 (టీఎస్), 15 (ఏపీ)
3. సరళరేఖాయుగ్మాలు 14 (టీఎస్), 14 (ఏపీ)
సెట్-2
1. బిందు పథం 12 మార్కులు (టీఎస్), 8 మార్కులు (ఏపీ)
2. అక్షపరివర్తనం 8 (టీఎస్)
3. త్రిపరిమాణ జ్యామితి 10 (టీఎస్), 2 (ఏపీ)
4. దిక్ సంఖ్యలు నిష్పత్తులు 7 (టీఎస్), 7 (ఏపీ)
5. అవధులు అవిచ్ఛిన్నత 10 (టీఎస్), 8 (ఏపీ)
6. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 19 (టీఎస్) 26 (ఏపీ)
7. తలం (ఏపీ, టీఎస్) 2
గణితం 2ఎ:
సెట్-1
1. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 22 మార్కులు (టీఎస్), 16 మార్కులు (ఏపీ)
2. ప్రస్తారాలు, సంయోగాలు 21 (టీఎస్), 14 (ఏపీ)
3. సంభావ్యత 22 (టీఎస్), 15 (ఏపీ)
సెట్-2
1. సంకీర్ణ సంఖ్యలు 14 మార్కులు (టీఎస్), 8 మార్కులు (ఏపీ)
2. డిమోయర్స్ సిద్ధాంతం 13 (టీఎస్), 16 (ఏపీ)
3. వర్గ సమాసాలు 15 (టీఎస్), 6 (ఏపీ)
4. ద్విపద సిద్ధాంతం 09 (టీఎస్)
5. పాక్షిక భిన్నాలు 12 (టీఎస్), 4 (ఏపీ)
6. యాదృచ్ఛిక చలరాశులు 18 (టీఎస్), 9 (ఏపీ)
గణితం-2బి:
సెట్-1
1. వృత్తాలు 41 మార్కులు (టీఎస్), 22 (ఏపీ)
2. వృత్తసరళి 19 (టీఎస్), 6 (ఏపీ)
3. అనిశ్చిత సమాకలనం 29 (టీఎస్), 18 (ఏపీ)
4. నిశ్చిత సమాకలనం 19 (టీఎస్), 15 (ఏపీ)
సెట్-2
1. పరావలయం 9 మార్కులు (టీఎస్, ఏపీ)
2. దీర్ఘవృత్తం 8 (టీఎస్, ఏపీ)
3. అతిపరావలయం- 6 (టీఎస్, ఏపీ)
4. అవకలన సమీకరణాలు 17 (టీఎస్), 13 (ఏపీ)
వృక్షశాస్త్రం (బోటనీ)
ఈ సంవత్సరం కరోనా పరిస్థితుల వల్ల 70 శాతం సిలబస్‌లో మొత్తం మూడు సెక్షన్లలో చాయిస్ ప్రశ్నలు ఇస్తున్నారు. కాబట్టి ఈ సిలబస్‌తో వెయిటేజ్ ఆధారంగా సిద్ధమైతే మంచి మార్కులను సాధించవచ్చు. మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంటర్ బోర్డ్ పరీక్షలు మొదటిసారిగా రాస్తున్నారు. వారు ఆందోళన పడకుండా కింది పాఠ్యాంశాల్లో ప్రశ్నలకు సిద్ధం కావాలి.
మొక్క బాహ్య స్వరూపశాస్త్రంలోని పుష్పవిన్యాసం, పుష్పం (22 మార్కులు), మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి (16), ఆవృతబీజాల వర్గీకరణ (14), మొక్కల జీవావరణ శాస్త్రం (12). వీటిని చదవడం వల్ల మొత్తం అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 8, స్వల్ప సమాధానాలు 8, వ్యాసరూప ప్రశ్నలు రెండు వస్తాయి. అదేవిధంగా మొదటి సంవత్సర విద్యార్థులు వీటితోపాటు జీవ ప్రపంచం (8 మార్కులు), జీవ వర్గీకరణ (8 మార్కులు)... ఈ పాఠ్యాంశాలు చదవడం వల్ల 60 మార్కులు పొందొచ్చు.
ద్వితీయ సంవత్సర విద్యార్థులు కింది పాఠ్యాంశాలను ప్రణాళిక ప్రకారం చదవాలి. జన్యుశాస్త్రంలోని అనువంశిక సూత్రాలు, వైవిధ్యం, అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం, జీవసాంకేతికశాస్త్రం, సూత్రాలు, ప్రక్రియలు, దీని అనువర్తనాలు. వీటి నుంచి మొత్తం 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, 11 స్వల్ప సమాధాన ప్రశ్నలు, 1 వ్యాసరూప సమాధాన ప్రశ్న వస్తాయి. సాధారణ విద్యార్థులు వీటిని ప్రణాళికతో సన్నద్ధమైతే మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధ్యం. మెరిట్ విద్యార్థులు వీటితోపాటు మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మ జీవులు పాఠ్యాంశం చదవడం వల్ల 3 అతిస్వల్ప, 1 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీరు తక్కువ సమయంలో సంసిద్ధమై 60 శాతం మార్కులను పొందొచ్చు. ఈ సూచనలు పాటిస్తూ సమయాన్ని సద్వినియోగపరుచుకుని చదివితే మంచి మార్కులు సంపాదించవచ్చు.
జంతుశాస్త్రం (జువాలజీ)
విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలైెనా పనిదినాలు సరిపోయినట్లుగా వచ్చాయి కాబట్టి అందరికీ అన్ని సబ్జెక్టుల్లో సిలబస్ పూర్తయివుండొచ్చు. ఐపీఈ ప్రశ్నపత్రంలో అన్ని విభాగాల్లోనూ చాయిస్ ఇచ్చారు. 60/60 మార్కులు సాధించడానికీ, ప్రతి ఒక్కరూ పాస్ మార్కులు సంపాదించడానికీ ఇది మంచి అవకాశం. జువాలజీలో కొన్ని చాప్టర్లలో పూర్తిగా సన్నద్ధమైతే 40 మార్కులు, ఆపైన సంపాదించవచ్చు.
‘జువాలజీ అంతా రివిజన్ చేశాను. పాఠాలన్నీ పూర్తిగా వచ్చు’ అని అతి విశ్వాసంతో ఉంటే మార్కులు తగ్గే అవకాశం ఎక్కువ. జువాలజీలో ప్రతి సమాధానంలోనూ కీ వర్డ్స్/ సెంటెన్సెస్ ఉంటాయి. క్షుణ్ణంగా చదివి వాటిని పూర్తిగా రాస్తేనే 60/60 లభిస్తాయి. కాబట్టి అన్ని చాప్టర్స్‌లో ఉండే 2, 4, 8 మార్కుల ప్రశ్నల సమాధానాలనూ, వాటిలో ఉన్న ప్రతి డయాగ్రమ్నూ క్షుణ్ణంగా నేర్చుకోవాలి. డయాగ్రమ్ నీట్‌గా ఉండే విధంగా చూసుకోవాలి. చాయిస్ ప్రశ్నలకు కూడా సమాధానాలు రాయడం మరిచిపోవద్దు. వెయిటేజి ప్రకారం 1, 2, 3, 4, 6, 8 యూనిట్లలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు, 1,2,4 యూనిట్లలో అన్ని 2, 4 మార్కుల సమాధానాలు, 3వ యూనిట్లో 2, 8 మార్కుల సమాధానాలు, 6, 8ల్లో 2 మార్కులు, 8 మార్కుల సమాధానాలు నేర్చుకుంటే 60 శాతం సాధించవచ్చు.
కనీసం 1, 2 4 చాప్టర్‌ల్లో ఉండే అతిస్వల్ప, స్వల్ప సమాధాన ప్రశ్నలు క్షుణ్ణంగా నేర్చుకుంటే 30 లేదా ఆపైన మార్కులు సంపాదించవచ్చు. ఈ చాప్టర్స్‌లో ఉన్న సమాధానాలను చదివాక.. చూడకుండా ఒకటి లేదా రెండుసార్లు నేర్చుకుంటే సమాధానాలను పూర్తిగా రాయవచ్చు. మంచి మార్కులు సంపాదించవచ్చు. ఉన్న సమయం తక్కువ కాబట్టి అన్ని పాఠ్యాంశాలూ చదవాలనే సాకుతో ఏ పాఠ్యాంశాన్నీ పూర్తిగా చదవకుండా అక్కడక్కడా ఒకటి లేదా రెండు సమాధానాలు నేర్చుకుంటే అవి పరీక్షలో రావచ్చు, రాకపోవచ్చు. మనకు అనుకూలంగా, సులువుగా ఉండే సమాధానాలు నేర్చుకుంటే అవి కూడా రాకపోవచ్చు. కాబట్టి అధ్యాపకులను సంప్రదించి ఏయే చాప్టర్లో ప్రశ్నలు ముఖ్యమైనవో తెలుసుకోవాలి. వాటిని చదివితే ఏ సమాధానాన్నయినా రాయగలిగే సామర్థ్యాన్ని సాధించవచ్చు.
జువాలజీ రెండో సంవత్సరంలో 60/60 సంపాదించడానికి అన్ని పాఠ్యాంశాల్లోని అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు, 1, 2, 4, 8 యూనిట్లలో స్వల్ప సమాధాన ప్రశ్నలు, శరీర ద్రవాలు, ప్రసరణ, మానవ ప్రత్యుత్పత్తి లేదా జన్యుశాస్త్రం చాప్టర్లలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు నేర్చుకోవాలి. 30, ఆపైన మార్కులు సంపాదించడానికి 1బి, 2బి, 4బి, 8 చాప్టర్స్‌లో అతిస్వల్ప, స్వల్ప సమాధాన ప్రశ్నలు, మానవ ప్రత్యుత్పత్తి లేదా శరీర ద్రవాలు, ప్రసరణ చాప్టర్స్‌లో దీర్ఘ సమాధాన ప్రశ్నలను నేర్చుకోవాలి.
ప్రజంటేషన్ బాగా ఉంటే మార్కులు సంపాదించవచ్చు.
1. ముందుగా పూర్తిగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అవి అతిస్వల్ప, స్వల్ప లేదా దీర్ఘ సమాధాన ప్రశ్నలు- ఏవైనా సరే.
2. కొట్టివేతలూ లేకుండా, నీట్‌గా సమాధానం రాయాలి.
3. ప్రశ్న సంఖ్యను సరిగా వేయాలి.
4. ప్రతి సమాధానమూ రాసిన తర్వాత ఒక లైన్‌ను గీయాలి. దీనివల్ల సమాధానాలు కలిసిపోకుండా, విడివిడిగా చూపించవచ్చు
5. సమయానుకూలతను బట్టి అదనపు సమాధానాలను కూడా రాయటం మేలు.
(రచయితలు శ్రీ చైతన్య విద్యాసంస్థల అధ్యాపకులు)
మరింత సమాచారం... మీకోసం!
Intermediate Study Material
English Medium | తెలుగు మీడియం |
Download |
‣ Previous Papers | E.M | T.M |
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.