• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Junior inter: ప్రశ్నల సరళిపై పట్టు.. గెలుపు తెచ్చిపెట్టు


* మోడల్‌ ప్రశ్నపత్రాలు, సిలబస్‌పై అవగాహనతో మంచి మార్కులు  

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కారణంగా ఏడాదంతా ఆన్‌లైన్‌లోనే గడిచి పోయింది. ఇంటర్‌ మొదటి ఏడాది పూర్తి చేసుకుని ఇప్పటికే రెండో ఏడాదిలోని పాఠ్యాంశాల అభ్యసన ప్రారంభించారు. పదో తరగతిలో సైతం బోర్డు పరీక్షలు లేకపోవడంతో తొలిసారిగా బోర్డు పరీక్షలను ఎదుర్కోనున్నారు. ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలు అక్టోబరు 25 నుంచి ప్రారంభం కానున్నాయి. గత విద్యా సంవత్సరంలో అంతంతమాత్రంగా సాగిన చదువులతో పాఠాలు సరిగా నేర్చుకోలేదు. మరి. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల సన్నద్ధత ఎలా ఉండాలి.. ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి. తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? విద్యానిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారన్న విషయంపై ‘ఈనాడు’ కథనం.

 

మోడల్‌ ప్రశ్నపత్రాలతో..

పరీక్షలకు 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు రానున్నాయి. ప్రశ్నపత్రం 50 శాతం ఛాయిస్‌ ఉంటుందని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. మోడల్‌ ప్రశ్నప్రతాలతో క్షుణ్నంగా తెలుసుకుని తొలగించిన సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఏవో తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్‌ కావడంతో మంచి మార్కులు సాధించే వీలుంటుందని బోర్డు అధికారులు చెబుతున్నారు.

ప్రీఫైనల్‌ తరహాలో పరీక్షలు రాయాలి 

పరీక్షలకు మరో వారం రోజులు ఉన్నందున దానికి తగ్గట్టుగానే చదువుకుంటే మంచిది. ఇప్పటికే ద్వితీయ సంవత్సర బోధన కొనసాగుతోంది. తక్కువ సమయంలో అన్ని పేపర్లు ప్రిపేర్‌ అవ్వడం ఇబ్బందే అయినప్పటికీ ప్రాక్టీసు చేస్తే మంచి మార్కులు సాధించే వీలుంది. 

* సిలబస్, ఛాయిస్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ పాఠ్యాంశాలు చదవాలి? ఏవి చదవనక్కర్లేదు వివరాలు తెలుసుకుని అక్కడి వరకు కచ్చితంగా ప్రిపేర్‌ అవ్వాలి. ఇందులోనూ కఠినమైనవి వదిలేస్తేనే మంచిది.

* 3 గంటల పరీక్ష విషయంలో సమయ పాలన ముఖ్యం. ఈ వారం రోజులపాటు నిత్యం చదువుతూనే ప్రీఫైనల్‌ తరహాలో పరీక్షలు రాస్తే మంచిది. పూర్తి ప్రశ్నపత్రాన్ని రాసేందుకు ప్రయత్నించాలి. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీసు చేయాలి. 

* ఈసారి పరీక్షలలో ఇబ్బంది పెట్టే కఠినమైన ప్రశ్నలు ఉండవని భావిస్తున్నాం. కాస్త కష్టపడితే 70-80 శాతం మార్కులు సులువుగా తెచ్చుకునే వీలుంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు సైతం విద్యార్థులతో భయాన్ని పోగొట్టేలా ప్రోత్సహించాలి. 

                              - డి.శంకర్‌రావు, శ్రీచైతన్య సంస్థల కూకట్‌పల్లి జోన్‌ డీన్‌

ప్రాథమిక అభ్యాసన దీపికతో పట్టు 

ప్రతి పాఠ్యాంశం వెనుక ఉన్న ప్రశ్నలపై పట్టు సాధిస్తే మేలు. మోడల్‌ పేపర్లను అధ్యాపకులు అవగాహన పెంచుకుని విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తే మంచిది. సమయం వృథా కాకుండా అవసరమైన ప్రశ్నలపైనే ఫోకస్‌ చేసే వీలుంటుంది. 

మరోసారి పరిశీలిస్తే.. 

www.tsbie.cgg.gov.in  వెబ్‌సైట్‌లో ప్రశ్నలు వచ్చే 70 శాతం.. తొలగించిన 30 శాతం సిలబస్‌ ఉంచాం. సిలబస్‌ను మరోసారి పరిశీలించుకుంటే మంచిది. దీనివల్ల ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయో సులువుగా అర్థమవుతుంది. 

* వెబ్‌సైట్‌లో మోడల్‌ పేపర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రశ్నల సరళి, ఛాయిస్‌ పరంగా అవగాహన తెచ్చుకోవచ్చు. 50శాతం ఛాయిస్‌తో ప్రశ్నపత్రాలు రానున్నాయి.

వెబ్‌సైట్లలో మెటీరియల్‌ 

* ప్రాథమిక అభ్యాసన దీపిక పేరిట రెండు, మూడు రోజుల్లో వెబ్‌సైట్‌లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్‌ ఉంచనున్నాం. ఇది తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. ముఖ్యమైన ప్రశ్నలూ ఉంటాయి. దీన్ని బాగా చదివితే నిర్భయంగా పరీక్షలు ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించే వీలుంది. దీనికితోడు పాఠ్య పుస్తకాలు, కళాశాల మెటీరియల్‌ చదువుకుంటే మరిన్ని మార్కులు పొందవచ్చు.

సులువైనవి తొలుత 

* ఎక్కడైతే ప్రశ్నలు రావని భావిస్తున్నారో అక్కడ ఎక్కువ సమయం కేటాయించకుండా ఉంటే వృథా అవ్వదు.

* పరీక్షల్లోనూ సులువుగా వచ్చే ప్రశ్నలను తొలుత రాయాలి. రానివి ఛాయిస్‌లో విడిచిపెట్టే వీలుంటుంది.

* ప్రశ్నపత్రంలో రాయాల్సిన అన్ని ప్రశ్నలను రాసేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల సగం సమాధానం రాసినా.. కొన్ని మార్కులైనా వస్తాయి.

                           - ఉడిత్యాల రమణారావు, ఇంటర్‌ బోర్డు విద్యా పరిశోధన విభాగం రీడర్‌

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే

సిలబస్‌ తగ్గించడం, ఛాయిస్‌ ఎక్కువగా ఇవ్వడం చేస్తున్నట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా ప్రశ్నల సరళి, ప్రశ్నపత్రం విధానంలో మార్పులు తీసుకు వచ్చి విద్యార్థులపై భారం లేకుండా పరీక్షల నిర్వహణ కొనసాగాలి. కరోనా పరిస్థితుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధ్యాపకులు, విద్యార్థులకు అవసరమైన డిజిటల్‌ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలి. పరీక్షల నిర్వహణ మంచిదే అయినప్పటికీ నిర్వహణ విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలి.  

                      - ఎంవీ గోనారెడ్డి, ఉన్నత విద్య ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఎఫ్‌సీఐ, పంజాబ్‌లో 860 వాచ్‌మెన్‌ పోస్టులు 

యూసీఐఎల్‌, ఝార్ఖండ్‌లో 242 అప్రెంటిస్‌లు

ఉద్యోగ వేటకు పదును ఇలా!

మెరిపించే మెలకువలు

There is no accounting for taste 

భౌతికశాస్త్రం

Posted Date : 18-10-2021

ప్రత్యేక కథనాలు

మరిన్ని