• facebook
  • whatsapp
  • telegram

గగన వీధిలో ఘన సారథి!

ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు అవకాశం
శిక్షణలో నెలకు రూ.50 వేలకుపైగా స్టైపెండ్‌
 

ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఉద్యోగం నలుగురు నడిచేదారి నాకొద్దని.. ప్రత్యేకతను కోరుకుంటూ కలల ఆకాశంలో విహరించే వారికి విలువైన ఉద్యోగం పైలట్‌. చక్కటి ఫిట్‌నెస్‌, హుందాగా యూనిఫాం, సామాజిక గౌరవం.. అన్నింటికి మించి ఆకర్షణీయమైన ఆరంకెల జీతం. రాష్ట్రాలు దాటి, ఖండాలను చుట్టి ప్రపంచం మొత్తం పనిగా తిరిగి వచ్చే పసందైన కొలువు. అది కావాలంటే కమర్షియల్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) పొందాలి. పైలట్‌గా చేరడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పలు అవకాశాలు ఉన్నాయి. శిక్షణతోపాటు ఉద్యోగాన్ని కూడా ఆయా సంస్థలు అందిస్తున్నాయి.
 

ఆకాశంలో ఎగిరే విమానం చూస్తే అందరికీ అదో ఆనందం. విమానం శబ్దం వినగానే ఎవరైనా మిద్దె మీదకో, బాల్కనీ అంచుకో చేరి కుడిచేతిని ఎత్తి కళ్లపై కాంతి పడకుండా అడ్డం పెట్టుకొని కన్నార్పకుండా చూసి వెళ్లాల్సిందే. పెద్దయ్యాక ఏమవుతావురా అని అడిగితే పిల్లలు కొంతమంది పైలట్‌ అవుతా.. అంటారు. అదీ విమానం మోజే. ప్రైవేటు విమానయానం విస్తరించిన తర్వాత ఈ రంగంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఇంతకీ మన పిల్ల పిడుగులు ఎవరికీ అందనంత ఎత్తులో ఎగిరే పైలట్‌ కావడం ఎలా అంటారా.. దానికి పలు రకాల మార్గాలు ఉన్నాయి. శిక్షణ పొందుతూనే నెలకు రూ.50 వేలపైనే స్టైపెండ్‌ అందుకోవచ్చు. మెరుగైన నైపుణ్యాలు సాధిస్తే యుద్ధ విమానాలూ నడిపే వీలుదొరుకుతుంది. అన్నీ కలిసొస్తే భవిష్యత్తులో భారతీయ వాయుసేనను ఆధిపత్యం చేసే స్థాయికీ చేరుకోవచ్చు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ (ఎన్డీఏ అండ్‌ ఎన్‌ఎ), కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలతో పైలట్‌ శిక్షణ, ఉద్యోగం రెండూ అందిస్తున్నాయి. అవే కాకుండా ఎయిర్‌ ఫోర్స్‌ (ఏఎఫ్‌ క్యాట్‌), నేవీ (షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌)లు గ్రాడ్యుయేట్లకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి పైలట్‌ శిక్షణ, ఉద్యోగాన్ని కల్పిస్తున్నాయి.
 

ఇంటర్‌తో ఎన్డీఏ
పైలట్‌ కావడానికి మొదటి ప్రధాన అవకాశంగా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్డీఏ) పరీక్షను పేర్కొనవచ్చు. దీన్ని ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. జనవరి, జూన్‌లో ప్రకటనలు వస్తాయి. ఎన్డీఏతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. పైలట్‌ కావాలనుకునేవాళ్లు ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాన్ని ఎంచుకోవాలి. ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు ఎయిర్‌ ఫోర్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం అర్హులే. వయసు 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్లలోపు ఉండాలి. బాలురు మాత్రమే అర్హులు. అలాగే పైలట్‌ ఉద్యోగానికి 162.5 సెం.మీ. ఎత్తు ఉండాలి.
 

ఎంపిక ఇలా: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. అవి: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ తరహా), ఇంటెలిజెన్స్‌ - పర్సనాలిటీ టెస్ట్‌. రాత పరీక్షలో మొత్తం 900 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 మ్యాథ్స్‌, పేపర్‌-2 జనరల్‌ ఎబిలిటీ. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు రెండు అంచెల్లో నిర్వహిస్తుంది. రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరికి పైలట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పైలట్‌ శిక్షణలోకి అనుమతి లభిస్తుంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్సులో చేర్చుకుంటారు.
 

చదువు, శిక్షణ: ఏడు వేల ఎకరాల సువిశాల క్యాంపస్‌ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ) పుణెలో అభ్యర్థులకు శిక్షణ, చదువు మూడేళ్లపాటు ఉంటాయి. పుస్తకాలు, భోజనం, వసతి సౌకర్యం అన్నీ ఉచితమే. అనంతరం అసలు సిసలైన పైలట్‌ శిక్షణ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ (ఏఎఫ్‌ఏ) - హైదరాబాద్‌ (దుండిగల్‌)తో పాటు పలు కేంద్రాల్లో సుమారు 18 నెలల వరకు నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి బీటెక్‌ను దిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రదానం చేస్తుంది. పట్టా పుచ్చుకున్న తర్వాత వీరు ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఎయిర్‌ ఫోర్స్‌లో చేరిపోవచ్చు.
 

డిగ్రీతో సీడీఎస్‌ఈ
డిగ్రీ అర్హతతో యూపీఎస్సీ ఏడాదికి రెండు సార్లు కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ను నిర్వహిస్తోంది. నవంబరు, ఆగస్టుల్లో ప్రకటనలు వెలువడతాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సీడీఎస్‌ఈ నిర్వహిస్తున్నారు. పైలట్‌ కావాలనుకున్నవారు ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాన్ని ఎంచుకోవాలి.
 

అర్హత: ఏదైనా సాధారణ డిగ్రీ లేదా బీఈ / బీటెక్‌ ఉత్తీర్ణత. అయితే ఇంటర్‌లో మాత్రం మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి. ఆఖరు సంవత్సరం డిగ్రీ కోర్సులు చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
 

వయసు: 20-24 ఏళ్లలోపు ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు 162.5 సెం.మీ. ఉండాలి.
 

ఎంపిక విధానం: ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లతో స్టేజ్‌-1 రాత పరీక్ష, స్టేజ్‌-2లో జరిపే ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ల ద్వారా జరుగుతుంది. పైలట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టులోనూ అర్హత సాధించాలి. ఎంపికైనవారికి 74 వారాల పాటు ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ ఇస్తారు. అనంతరం ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఎయిర్‌ ఫోర్స్‌లో విధుల్లోకి తీసుకుంటారు.
 

ఉద్యోగంలో...

ఎన్డీఏ, సీడీఎస్‌ఈ, ఏఎఫ్‌ క్యాట్‌ తదితర ఏ విధానాల్లో అభ్యర్థులు ఎంపికైనప్పటికీ విజయవంతంగా పైలట్‌ శిక్షణ ముగించుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత వేతనం, హోదా అంతా సమానంగానే ఉంటాయి. ఎయిర్‌ ఫోర్స్‌లో అయితే ఫ్లయింగ్‌ ఆఫీసర్‌, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదా ఇస్తారు. రూ.56,100 మూల వేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు అదనం. మిలటరీ సర్వీస్‌ పే కింద ప్రతి నెల రూ.15,500 చెల్లిస్తారు. వీటితోపాటు ఫ్లయింగ్‌ అలవెన్సు (విమానం నడిపే వ్యవధికి) కూడా ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్సు, చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్సు, రాయితీ ధరలకు క్యాంటీన్‌, ఫర్నీచర్‌తో కూడిన నివాస సముదాయం, తక్కువ వడ్డీకి రుణాలు, ఎల్టీఏ, 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు... ఉంటాయి. వేతన రూపంలో ప్రతినెలా రూ. లక్ష వరకు అందుకోవచ్చు. ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఎయిర్‌ ఫోర్స్‌లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందుతారు. ఆరేళ్ల అనుభవం ఉన్నవారు స్క్వాడ్రన్‌ లీడర్‌ అవుతారు. పదమూడేళ్ల సర్వీస్‌తో వింగ్‌ కమాండర్‌ స్థాయికి చేరుకుంటారు. అనంతరం శాఖాపరమైన నియామకాల ద్వారా ఇంకా ఉన్నత స్థాయులకు చేరుకోవచ్చు. అత్యున్నత ప్రతిభావంతులు భవిష్యత్తులో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ (ఎయిర్‌ ఫోర్స్‌లో అత్యున్నత ఉద్యోగం)గా భారతీయ వాయు సేనకు దిశానిర్దేశం కూడా చేయవచ్చు.

Posted Date : 07-12-2020

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌