• facebook
  • whatsapp
  • telegram

నేవీలోనూ పైలట్‌

షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఇండియన్‌ నేవీ పైలట్‌ పోస్టులను భర్తీ చేస్తుంది. దాంతో నేవీలో పైల‌ట్ అయ్యే అవ‌కాశం ఉంది. నిరుద్యోగ యువ‌త ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎదురుచూస్తోంది.
 ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు అర్హులు. పదోతరగతి, ఇంటర్‌, ఇంజినీరింగ్‌ అన్నింట్లోనూ 60 శాతం మార్కులు తప్పనిసరి. వీటితోపాటు టెన్త్‌, ఇంటర్‌ ఇంగ్లిష్‌లో 60 శాతం మార్కులు ఉండాలి. 162.5 సెం.మీ. ఎత్తుతో, 21-24 ఏళ్లలోపు వారు అర్హులు. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. షార్ట్‌ లిస్ట్‌ చేసి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడుతుంది. ఎంపికైనవారికి నేవల్‌ అకాడమీ ఎజిమాలలో 22 వారాల పాటు శిక్షణ ఉంటుంది. అనంతరం స్టేజ్‌ -1, స్టేజ్‌ -2 ఫ్లయింగ్‌ శిక్షణ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో ఇస్తారు. వీరు నౌకాదళం తరఫున యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు నడుపుతారు. గరిష్ఠంగా 14 ఏళ్లపాటు సేవల్లో కొనసాగుతారు. ఏడాదికి రెండుసార్లు మార్చి, అక్టోబరుల్లో ప్రకటన వెలువడుతుంది. https://www.joinindiannavy.gov.in/


సివిల్‌ పైలట్‌
సివిల్‌ పైలట్‌ కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదవాలి. 17 ఏళ్లు నిండినవారికి అవకాశం లభిస్తుంది. దేశంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) గుర్తింపు పొందిన 30 పైలట్‌ శిక్షణ సంస్థలు ఉన్నాయి. వీటిలో 18 నెలల కోర్సు పూర్తిచేసుకుని కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) అందుకోవచ్చు. ఈ 30 సంస్థల్లో ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్‌ అకాడమీ (ఐజీఆర్‌ యూఏ)కు జాతీయ స్థాయిలో పేరుంది. ఇక్కడ సీపీఎల్‌ కోర్సు పూర్తిచేయడానికి రూ. 45 లక్షల వరకు వ్యయం అవుతుంది. ప్రస్తుతం విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. చిన్న పట్టణాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగవుతున్నాయి. భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అభ్యర్థులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పైలట్‌ వృత్తిలో చేరిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్‌ టెస్టుల్లో ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది.


ఎస్పీఎల్‌తో మొదలు
స్టూడెంట్‌ పైలట్‌ లైసెన్స్‌ (ఎస్పీఎల్‌) తో సివిల్‌ పైలట్‌ శిక్షణ మొదలవుతుంది. కొన్నాళ్ల శిక్షణ అనంతరం ప్రైవేటు పైలట్‌ లైసెన్స్‌ (పీపీఎల్‌) మంజూరు చేస్తారు. ఈ దశలో వీరు ఒంటరిగా చిన్నపాటి శిక్షణ విమానాన్ని నడపాలి. మరికొంత అదనపు శిక్షణ, అనుభవం అనంతరం కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) ప్రదానం చేస్తారు. సీపీఎల్‌ డిగ్రీని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మంజూరు చేస్తుంది. ఈ లైసెన్స్‌తో ప్రయాణికులను చేరవేసే విమానాలు నడపడానికి అర్హత పొందుతారు. కొత్త పైలట్లను ఎయిర్‌ లైన్స్‌ సంస్థలు కో పైలట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటాయి.
పైలట్‌ శిక్షణ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సంస్థల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మెరుగైన శిక్షణ పొందాలనుకునేవారు కెనడా, అమెరికాల్లో పైలట్‌ కోర్సు అభ్యసించవచ్చు.


తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ ద్వారా పైలట్‌ శిక్షణ అందిస్తున్నారు. ఆసియా పసిఫిక్‌ ప్లయిట్‌ ట్రైనింగ్‌ అకాడమీ లిమిటెడ్‌, ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ, వింగ్స్‌ ఏవియేషన్‌ సంస్థలు పైలట్‌ శిక్షణ నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.


వెబ్‌సైట్లు: https://www.upsc.gov.in/, http://careerairforce.nic.in

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌