• facebook
  • whatsapp
  • telegram

బట్టీ పట్టొద్దు... పట్టు పెంచుకోండి  

ప్రతి పాఠ్యాంశాన్నీ అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ ముందుకెళితే ఆశించిన ర్యాంకు తప్పకుండా వస్తుందని అంటోంది... డీఎస్‌సీ ఎస్‌జీటీలో మొదటి ర్యాంకు సాధించిన వేమన కుసుమ. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ఈమె ఓవైపు డిగ్రీ చేస్తూనే మరోవైపు డీఎసీస్‌కి సిద్ధమైంది, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలవడానికి తానెలా శ్రమించిందో... ఆ విశేషాలను ఆమె ‘చదువు’తో పంచుకుంది.
                                            ఎప్పుడో డీఎస్‌సీ నోటిఫికేషన్‌ పడుతుందిలే అని వదిలేయకుండా ముందు నుంచీ రోజుకి కొన్ని గంటల పాటు చదువుకుంటే పాఠ్యాంశాలన్నీ కొట్టిన పిండి అవుతాయి. ఒక లక్ష్యం అనుకున్నప్పుడు దాన్ని సాధించాలంటే దానికి కచ్చితమైన ప్రణాళిక కీలకం. 2016లో నా డీఈడీ పూర్తయింది. వెంటనే డిగ్రీలో చేరాను. మధ్యాహ్నంతో కళాశాల అయిపోయేది. అందుకే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ డీఎస్‌సీ సన్నద్ధతలోనే ఉండిపోయేదాన్ని. ప్రతి పాఠ్యాంశాన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ, వాస్తవ పరిస్థితులకు అన్వయించుకుంటూ చదవడం అలవాటుగా చేసుకున్నాను. ఒకవిధంగా బట్టీబట్టకుండా చదవడం వల్లే రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించగలిగాననిపిస్తోంది.
ముందుగా మనకి ఏయే పాఠ్యాంశాలపై పట్టుంది, వేటిలో వీక్‌గా ఉన్నామో గుర్తించాలి. నాకు మ్యాథ్స్, ఆంగ్లం, సైన్స్, తెలుగుల మీద మంచి పట్టుంది. కానీ అత్యధికంగా 25 మార్కులుండే మెథడాలజీ (బోధనా పద్ధతులు)తో పాటు సోషల్‌స్టడీస్, సైకాలజీ, జనరల్‌ నాలెడ్‌్్జల్లో బలహీనంగా ఉండేదాన్ని. అందుకే రోజులో అత్యధిక సమయం ఆ నాలుగు పాఠ్యాంశాల్నే చదివేదాన్ని. పైగా సబ్జెక్టు అందరూ చదువుతారు. కానీ పరీక్షలో వాటితో పాటు మెథడాలజీ, సైకాలజీల్లో ప్రావీణ్యం చూపించగలవారికే ఎక్కువ మార్కులు వస్తాయని గుర్తించి వాటికి ప్రాధాన్యమిచ్చాను. నాకు 91.07 మార్కులు రావడానికీ కారణమదే.

ఏ పుస్తకాలు చదివానంటే...
పోటీ పరీక్షల నిమిత్తం బయట వందల పుస్తకాలుంటాయి. అవన్నీ బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేయకూడదు. ముందుగా అకాడమీ పుస్తకాలు ఎంచుకోవాలి. డీఎస్సీలో సాధారణ పాఠ్యపుస్తకాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అందుకే నేను మూడో తరగతి నుంచి పదో తరగతి వరకూ అకాడమీ టెక్ట్స్‌ బుక్స్‌ చదివాను. వాటివల్ల పాఠ్యాంశాలు బాగా అర్థమయ్యేవి. అంతేకాదు డీఎస్సీలో సంక్షిప్త ప్రశ్నలన్నీ పాఠ్యపుస్తకాల్లో నేను చదివినవే రావడంతో బాగా సమాధానమివ్వగలిగాను. మెథడాలజీ, సైకాలజీ కోసం డీఈడీ మొదటి, రెండో సంవత్సరాల తెలుగు అకాడమీ బుక్స్‌ చదివాను. సైకాలజీ పాఠ్యాంశం చదవడం కంటే ప్రాక్టికల్‌గా పాఠశాలలో పిల్లలకి పాఠాలు చెప్పినపుడే ఎక్కువ అర్థమై ప్రశ్నలకు బాగా సమాధానమివ్వగలుగుతాం. కరెంట్‌ అపైర్స్‌ ప్రశ్నల కోసం రోజూ ‘ఈనాడు’ పత్రిక చదివేదాన్ని. ప్రధానంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పరీక్ష ఎనిమిదో తరగతి స్థాయిలో ఉంటుంది. పదో తరగతి స్థాయి వరకూ పట్టు వచ్చేలా చదవడం కలిసొచ్చింది.
మూడు రోజులకోసారి మాక్‌టెస్ట్‌లు రాసేదాన్ని. దానివల్ల ఏ పాఠ్యాంశంలో వెనకబడుతున్నాను, దేంట్లో మార్కులు బాగా వస్తున్నాయి, ఎక్కడ మెరుగవ్వాలి లాంటి అంశాలు బాగా తెలిశాయి. ఏపీ డీఎస్సీ వాళ్లు ఆన్‌లైన్‌లో పెట్టే టెస్ట్‌లతో పాటు బయట శిక్షణ సంస్థల మాక్‌టెస్ట్‌లకు హాజరవ్వడం మంచిదే..

అన్నీ ముఖ్యమైనవే
గతంలో పాఠ్యాంశాల్లో ఇంపార్టెంట్, అన్‌ ఇంపార్టెంట్‌ అని వేరుచేసి ముఖ్యమైనవే చదివేదాన్ని. దానివల్ల 2018 ఫిబ్రవరిలో టెట్‌లో ఎక్కువ మార్కులు రాలేదు. మొత్తం సబ్జెక్టు అంతా చదవగలిగితేనే ఎక్కువ మార్కులొస్తాయని గ్రహించి అప్పట్నుంచి సంపూర్ణ సాధన మొదలుపెట్టాను. అందుకే 2018 మే టెట్‌లో, తాజాగా డీఎస్సీలో గణనీయమైన మార్కులు తెచ్చుకోగలిగాను.
ఏకధాటిగా చదివితేనే ర్యాంకు వస్తుందనే అభిప్రాయం సరికాదు. నాకైతే ఓ పక్క డిగ్రీ, మరోపక్క డీఎస్‌సీ కాబట్టి సమయం ఎక్కువ పట్టేది కానీ మరీ రోజుల తరబడి గంటల గంటలు పుస్తకాలకే అంకితమైపోవాలని కాదు. కాకపోతే ప్రణాళికబద్ధంగా పట్టు వదలకుండా చదవడం ముఖ్యం. ఈ క్రమంలో ఆరోగ్యం పాడవకుండా చూసుకోవడం అవసరమే. లేదంటే చదువుకి ఆటంకం కలగొచ్చు. రోజూ అరగంటయినా మెడిటేషన్, యోగా, ప్రాణాయామాల్లో ఏదొకటి తప్పనిసరిగా చేసేదాన్ని. దీనివల్ల ఒత్తిడి సైతం తగ్గి చదివింది గుర్తుంటుంది.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌