• facebook
  • whatsapp
  • telegram

హెచ్చవేతకు భాగహార మార్గం!

పోటీ పరీక్షల్లో లెక్కల చిట్కాలు

 

 

పోటీ పరీక్షల్లో వచ్చే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలంటే.. గుణకారాలు వేగంగా చేయాల్సివుంటుంది. అందుకని స్పీడ్‌ మ్యాథ్స్‌ మెలకువల సాధన అవసరం. గత వారం కొన్ని హెచ్చవేతల విధానాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరికొన్ని పద్ధతులు చూద్దాం! 

 

ఏ సంఖ్యనైనా ‘5’ తో..

ఏ సంఖ్యనైనా ‘5’ తో గుణించే తేలికైన పద్ధతిని తెలుసుకుందాం.

ముందుగా ఇచ్చిన సంఖ్యకు చివరగా ఒక ‘0’ చేర్చాలి. ఆ తర్వాత ఆ సంఖ్యలో సగం తీసుకోవాలి. లేదా ఆ సంఖ్యను ‘2’ తో భాగించాలి. ఆ వచ్చిన ఫలితమే జవాబు అవుతుంది.

ఉదాహరణకు: 68752 × 5

ఈ సంఖ్యకు చివరగా ‘0’ చేర్చితే అది 687520 అవుతుంది. 

దీన్ని ‘2’ తో భాగిస్తే 343760 వస్తుంది. ఇదే జవాబు. 

68752 × 5 = 343760. 

ఈ పద్ధతిలో ఎన్ని అంకెల సంఖ్యనైనా ‘5’ తో చాలా తేలికగా గుణించవచ్చు. 

 

ఏదైనా సంఖ్యను ‘25’తో..

ఏదైనా సంఖ్యను ‘5’ తో గుణించడం చూశాం. దాదాపు ఇటువంటి పద్ధతిలోనే  ‘25’తో గుణించడం చూద్దాం. 

ఈ పద్ధతిలో ముందుగా ఇచ్చిన సంఖ్యకు చివరలో రెండు ‘00’ ఉంచాలి. తర్వాత ఆ సంఖ్యను ‘4’తో భాగిస్తే వచ్చే ఫలితమే జవాబు.

ఉదాహరణకు: 8437 × 25

ఇచ్చిన సంఖ్య 8437కు చివరలో రెండు ‘00’ ఉంచితే అది 843700 అవుతుంది. ఈ సంఖ్యను ‘4’తో భాగించాలి.

843700 ÷ 4 అప్పుడు 210925 వస్తుంది. ఇదే జవాబు! 

ఈ పద్ధతిలో ఎన్ని అంకెల సంఖ్యనైనా ‘25’తో తేలికగా గుణించవచ్చు. 

 

ఇచ్చిన సంఖ్యను ‘125’తో...

ఇదే విధంగా ఎన్ని అంకెల సంఖ్యనైనా ‘125’తో కూడా తేలికగానే గుణించవచ్చు. 

ఇచ్చిన సంఖ్యకు చివరన మూడు ‘000’ ఉంచాలి. ఆ తర్వాత ఆ సంఖ్యను ‘8’తో భాగించాలి. ఆ వచ్చిన ఫలితమే జవాబు అవుతుంది. 

ఉదాహరణకు: 3842 × 125

ముందుగా 3842కు చివర మూడు ‘000’ ఉంచాలి. 

3842000. తర్వాత ఈ సంఖ్యను ‘8’తో భాగించాలి.    

3842000 ÷ 8 అప్పుడు 480250 వస్తుంది. ఇదే సరైన జవాబు! ఇదే పద్ధతిలో ఇచ్చిన సంఖ్యను ‘625’తో గుణించడానికి సంఖ్య చివరన నాలుగు ‘0000’ ఉంచాలి. దాన్ని ‘16’తో భాగిస్తే జవాబు వస్తుంది. ఈ మెలకువలన్నీ గుర్తుపెట్టుకుని బాగా సాధన చేస్తే సంప్రదాయ పద్ధతిలో కంటే చాలా వేగంగా జవాబులు సాధించవచ్చు.

 


 

Posted Date : 19-07-2021

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌