• facebook
  • whatsapp
  • telegram

పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

8106 ఖాళీల భర్తీకి ఐబీపీఎస్‌-ఆర్‌ఆర్‌బీ ప్రక్రియ ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్‌ అసిస్టెంట్, ఆఫీసర్ల (స్కేల్‌ 1, 2, 3) ఉద్యోగ నియామకానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 8106 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలోని రెండు బ్యాంకులు- తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకుల్లో 600కు పైగా, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు బ్యాంకులు- ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుల్లో 200కు పైగా పోస్టులు భర్తీ చేస్తారు. నియామకాలు జరిగే సమయానికి ఖాళీల సంఖ్య మరింతగా పెరుగుతుంది.  

తమ సొంత ప్రాంతాల్లోనే ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ చాలా చక్కని అవకాశం. ఆఫీస్‌ అసిస్టెంట్, స్కేల్‌-1 ఆఫీసర్ల పరీక్షలకు కనీస అర్హత గ్రాడ్యుయేషన్‌. స్కేల్‌-2, స్కేల్‌-3 ఆఫీసర్ల పరీక్షలకు 1 నుంచి 5 సంవత్సరాల బ్యాంక్‌/ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి. అభ్యర్థులకు ఆఫీస్‌ అసిస్టెంట్‌తోపాటుగా ఆఫీసర్‌ స్కేల్‌-1, 2, 3ల్లో ఏదో ఒకటి మాత్రమే రాసే అవకాశం ఉంటుంది. అయితే ఆఫీస్‌ అసిసెంట్, స్కేల్‌-1 ఆఫీసర్ల పరీక్షలు స్థాయి భేదం మినహా ఒకే విధంగా ఉంటాయి. 

ఉమ్మడిగా సన్నద్ధత

సాధారణంగా అభ్యర్థులందరూ స్కేల్‌-1 ఆఫీసర్, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పరీక్షలు రెండూ రాస్తుంటారు. కాబట్టి ప్రిపరేషన్‌ను ఉమ్మడిగా కొనసాగించాలి. ఈ రెండు పరీక్షల్లో ఉన్న మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే.. ఈ రెండు పరీక్షా విధానాలు, సబ్జెక్టులు ఒకే విధంగా ఉంటాయి. ప్రశ్నల స్థాయిలో భేదం మాత్రమే ఉంటుంది. కాబట్టి హెచ్చు స్థాయిలో ఉండే స్కేల్‌-1 ఆఫీసర్ల పరీక్షకు సన్నద్ధమయితే ఆఫీస్‌ అసిస్టెంట్ల పరీక్షకు ప్రిపరేషన్‌ పూర్తయినట్టే. 

మరే ఇతర బ్యాంకు పరీక్షల్లోలేని, ఈ పరీక్షల్లో మత్రమే ఉన్న సౌలభ్యం ఏమిటంటే... ప్రిలిమినరీ పరీక్షలో రెండు సబ్జెక్టులు (రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ/క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌) మాత్రమే ఉంటాయి. కాబట్టి మొదటిసారి పరీక్షలు రాసే అభ్యర్థులు సైతం విజయం సాధించగలిగే వీలుంటుంది. అయితే ప్రిపరేషన్‌ మాత్రం ప్రిలిమ్స్‌లోని రెండు సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ, ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలకు కలిపి ఉమ్మడిగానే కొనసాగించాలి. ప్రిలిమ్స్‌ పరీక్షకు దాదాపు 50-60 రోజుల సమయం ఉంటుంది. ఆలోగా ప్రిపరేషన్‌ పూర్తవ్వాలి. 

సులువైన పరీక్ష

బ్యాంకు పరీక్షలన్నింటోనూ ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పరీక్షలు చాలా తేలిగ్గా ఉంటాయి. మొత్తంగా 80 ప్రశ్నలు 45 నిమిషాల్లో పూర్తిచేయాలి. సగటున ప్రతి ప్రశ్నను సాధించడానికి 33.75 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఈ పరీక్షలో పూర్తి మార్కులు (80/80) సాధించడానికి అవకాశం ఉంటుంది. తేలిగ్గా ఉంటుంది కాబట్టి కటాఫ్‌ మార్కులు కూడా ఎక్కువగానే ఉంటాయి. 

రోజూ మాదిరి ప్రశ్నపత్రం

వీలైతే మొదటి రోజు నుంచీ లేకపోతే టాపిక్స్‌ పూర్తయిన దగ్గరనుంచీ.. రోజూ తప్పనిసరిగా ఒక పూర్తిస్థాయి మాదిరి ప్రశ్నపత్రాన్ని 45 నిమిషాల సమయాన్ని నిర్దేశించుకుని రాయాలి. దాన్ని విశ్లేషిస్తూ నిర్దేశిత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో గమనించుకోవాలి. ఈ సమయంలోనే విద్యార్థులకు ఎక్కువ సమయం పట్టే ప్రశ్నలేవో, సాధించడానికి ఇబ్బంది పడే ప్రశ్నలేవో తెలుస్తుంది. వాటిపై ఎక్కువ దృష్టి పెడుతూ ఆ ఇబ్బందులను అధిగమించాలి.  ఇవన్నీ పక్కాగా అమలు చేయగలిగితే పరీక్ష సమయంలోగా 80 ప్రశ్నలు కచ్చితత్వంతో సాధించగలిగే వేగం, నేర్పు సాధించగలుగుతారు. 

ఈ రెండింటితోపాటుగా రోజూ ఇంగ్లిష్, కరెంట్‌ అఫైర్స్‌ను కూడా చూసుకోవాలి. ఇంగ్లిష్‌లో ఏ విధమైన ప్రశ్నలు వస్తున్నాయో గమనించి వాటిని ప్రాక్టీస్‌ చేస్తూ ఇబ్బందిపడినచోట సంబంధిత గ్రామర్‌ విభాగాన్ని చూసుకోవాలి. అప్పుడే ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు. రోజూ వార్తాపత్రికలు చదువుతూ బ్యాంకింగ్, ఆర్థిక, ఇతర ముఖ్యమైన పాయింట్లను నోట్‌ చేసుకుని ప్రతివారం పునశ్చరణ చేసుకోవాలి. అప్పుడే అవన్నీ బాగా గుర్తుంటాయి. వీటితోపాటుగా కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు సంబంధించి ఆ రంగంలోని తాజా విషయాలు కూడా బాగా చూసుకోవాలి.  ఇలా ఒక ప్రణాళికతో సిద్ధమైతే మొదటిసారి పరీక్షరాస్తున్న అభ్యర్థులైనా ఈ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. వారి ప్రాంతాల్లోనే ప్రభుత్వ ఉద్యోగం చేయగలిగే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు.     

ప్రణాళిక ప్రకారమే..

ముందుగా ప్రిపరేషన్‌ ఏ విధంగా కొనసాగించాలో ఒక ప్రణాళికను తయారుచేసుకోవాలి. దాని ప్రకారమే సన్నద్ధతను కొనసాగించాలి. ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ఉండే ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లకే ఎక్కువ సమయం అవసరం అవుతుంది. రోజులో ఎక్కువ సమయాన్ని వీటికే కేటాయిస్తూ, కొంత సమయం మెయిన్స్‌లో ఉండే ఇంగ్లిష్, కరెంట్‌ అఫైర్స్‌లకు కూడా కేటాయించాలి. ఆప్టిట్యూడ్‌లో దాదాపుగా 20 టాపిక్స్, రీజనింగ్‌లో 15 టాపిక్స్‌ ఉంటాయి. వీటన్నింటిపై పూర్తి పట్టు సంపాదించాలి. రోజూ రెండు సబ్జెక్టుల్లో ఒక్కో టాపిక్‌ పూర్తిచేయాలి. ఆపై వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. టాపిక్స్‌ మొత్తం పూర్తి కావడానికి దాదాపు 20-25 రోజుల సమయం పడుతుంది. ప్రశ్నలను సాధించడానికి ఎంత సమయం పడుతుందో కూడా గమనిస్తూ ఉండాలి. ఎక్కువ సమయం తీసుకునే టాపిక్స్‌లోని ప్రశ్నలను బాగా సాధన చేయాలి. 

నెగ్గలేకపోతున్నారా? ఇవీ కారణాలు! 

చాలామంది అభ్యర్థులు చాలా పరీక్షలు రాస్తూ కూడా విజయం సాధించలేకపోతుంటారు. దానికి ప్రధానంగా 4 కారణాలుంటాయి. 

1. ఒకే పరీక్షపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టకపోవడం: అభ్యర్థులు వివిధ రకాలైన పరీక్షలకు సిద్ధమవుతుంటారు. అయితే దేని మీదా పరీక్షకు తగిన పూర్తిస్థాయి దృష్టి పెట్టలేకపోతారు. కొద్ది రోజులు ఒక పరీక్ష, ఆ తర్వాత మరో పరీక్ష అంటూ దేనికీ సరైన విధంగా సిద్ధమవలేకపోతారు. కాబట్టి ముందుగా వారు దేనిలో విజయం సాధించాలనుకుంటున్నారో ఆ పరీక్షను నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు యూపీఎస్‌సీ, రాష్ట్ర స్థాయి పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ పరీక్షలు మొదలైనవి. ఒకేవిధంగా ఉండే కేంద్ర ప్రభుత్వ పరీక్షలైన బ్యాంక్, ఎస్‌ఎస్‌సీ, రైల్వేలకు ఉమ్మడిగా సన్నద్ధం కావచ్చు. 

2. ప్రణాళిక లేకపోవడం: కొంతమంది తాము రాసే పరీక్ష పట్ల ఎలాంటి ప్రణాళికా లేకుండా తోచిన విధంగా చదువుతుంటారు. అలాకాకుండా సబ్జెక్టుల ప్రాధాన్యం, పరీక్షకు ఉన్న సమయం, రోజులో వారు కేటాయించాల్సిన సమయం మొదలైన వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. దానికి తగినట్లుగా సన్నద్ధం కావాలి. 

3. సబ్జెక్టులపై సమ ప్రాధాన్యం లేకపోవడం: కొందరు వారికి నచ్చిన సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తూ, నచ్చని వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణులవ్వాలి. కాబట్టి అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. తమకు పట్టున్న సబ్జెక్టుకు తక్కువ, పట్టులేని వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఇలా ప్రిపేర్‌ అవుతూ అన్నింటిలోనూ పట్టు పెంచుకునేలా చూసుకోవాలి. 

4. మాదిరి ప్రశ్నపత్రాలు రాయకపోవడం: ప్రిపరేషన్‌ ఏ విధంగా కొనసాగుతోందో తెలుసుకోగలిగేది మాదిరి ప్రశ్నపత్రాలు రాయడం ద్వారా మాత్రమే. ఏయే ప్రశ్నలు సాధించగలుగుతున్నారో, వేటికి ఎక్కువ సమయం పడుతుందో, ఏవి సాధించాలో, ఏవి వదిలివేయాలో మొదలైనవన్నీ మాదిరి ప్రశ్నల ద్వారా మాత్రమే తెలుస్తాయి. ప్రిపరేషన్‌లో ఇది చాలా కీలకం. కొంతమంది దీనిపై ఎక్కువగా దృష్టి ఉంచరు. ఈ ప్రశ్నపత్రాల్లో తమ ప్రదర్శనను గమనించి.. ప్రిపరేషన్‌లో తగిన విధంగా మార్పులు చేసుకోవాలి. 


 

Posted Date : 09-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌