• facebook
  • whatsapp
  • telegram

పోలీస్ ఉద్యోగాల‌కు మీరు సిద్ధ‌మేనా?

ప్రిపరేషన్ మొదలు పెట్టారా?

తెలుగు రాష్ట్రాల్లో 34 వేలకు పైగా ఖాళీలు

పోటీ పరీక్షార్థుల్లో చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడుతుంటారు. ఇదే పెద్ద పొరపాటు. అప్పటికప్పుడు చేసే ప్రిపరేషన్ వల్ల పోటీలో నిలబడటం కష్టమవుతుంది. ఉద్యోగం సాధించాలనుకునే వారు ముందు నుంచి దీర్ఘకాలిక అధ్యయనాన్ని సాగించాలి. ఏ ఉద్యోగాన్ని లక్ష్యంగా చేసుకున్నారో, దానికి సంబంధించిన సిలబస్‌ను పరిశీలించి స్వీయ ప్రణాళిక రూపొందించుకోవాలి.  

అభ్యర్థులు మూడు రకాలు

సాధారణంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మూడు రకాలుగా ఉంటారు. మొదటి వర్గం ఇప్పటికే పలు పరీక్షలు రాసిన వారు. రెండో రకం ఈ మధ్యకాలంలోనే ప్రిపరేషన్ మొదలు పెట్టి ఒకటి రెండు పరీక్షలు రాసిన వారు. మూడో తరహా కొత్తగా పరీక్షలకు సిద్ధమవుతున్నవారు. స్థాయుల్లో తేడా ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ ప్రణాళిక వేర్వేరుగా ఉండాలి. 

కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టిన వారు ప్రాథమికాంశాలపై పట్టు సాధించడంపై దృష్టి పెట్టాలి. క్రమంగా సిలబస్ ప్రకారం డిగ్రీ లేదా పీజీ స్థాయి పుస్తకాలను చదవడంతోపాటు, నిపుణుల సూచనల మేరకు ఇతర ప్రామాణిక పుస్తకాలను చదవాలి. 
మధ్య రకం అభ్యర్థులు తమ స్వీయ బలాబలాలపై ఒక అంచనాకు వచ్చేందుకు ప్రయత్నించాలి. ఏయే సబ్జెక్టుల్లో తాము బలహీనంగా ఉన్నారో, బలంగా ఉన్నారో గ్రహించాలి. దాని ప్రకారం తమకు కష్టం అనిపించిన లేదా తాము మార్కులు సాధించలేక పోయిన అధ్యాయాలు లేదా సబ్జెక్టులపై దృష్టి పెట్టాలి. వాటిపై పట్టు సాధించిన తర్వాత మిగతా వాటినీ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చదవాలి.

మూడో వర్గం... సీనియర్లు. వారికి అన్ని తెలిసినట్లే ఉంటాయి. ఏం చదవాలో ఒక్కోసారి అర్థం కాదు. చేతికి దొరికింది తీసుకొని చదివేస్తుంటారు. రకరకాల స్టడీ మెటీరియల్స్ గురించి తెలిసి ఉండటంతో అన్నింటినీ పోగేసి చదివేస్తుంటారు. దేనిపైనా పూర్తిస్థాయి పట్టు లేకపోవడంతో ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటికీ ఉద్యోగం సాధించలేకపోయామనే ఆత్మన్యూనత కొంత మందిని వేధిస్తుంటుంది. ఇంతకాలం చదివాం, ఇంకెంత చదివినా ఇంతేనేమో, ఉద్యోగం సాధించలేమేమో అనే అనుమానం ఇంకొందరిని వేధిస్తుంటుంది. అలాంటి అపోహాలేమి పెట్టుకోకుండా పట్టులేని అంశాలపై వేగంగా పట్టు సాధించండి. క్రమపద్ధతిలో ప్రణాళిక రివిజన్ చేయండి. గత పరీక్షల్లో చేసిన పొరపాట్లను నోట్ చేసుకొని నిపుణుల సూచనలు, సలహాలతో వాటిని అధిగమించండి. 

శిక్షణ సంస్థ‌లు ఇంకా తెరుచుకోలేదు. వాటి కోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ సమయం వృథా చేస్తున్నారు. ఇప్పుడు ప్రిపరేషన్‌కు చాలా మార్గాలు ఉన్నాయి. వెబ్ సైట్లు, వీడియోలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు, ఇతర ప్రామాణిక గ్రంథాలను చదవడంతోపాటు ఆన్ లైన్ పాఠాలు వినవచ్చు. చదువుకోవచ్చు. ప్రాక్టీస్ కోసం ఎన్నో రకాల పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

గ‌త ప‌రీక్షల ప్రశ్నపత్రాలు, నమూనా ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటికే ఉద్యోగాలు సాధించిన వారి ద‌గ్గ‌ర నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాలి. వ‌ర్త‌మాన అంశాల‌పై ప‌ట్టు సాధించేందుకు రోజూ వార్తాప‌త్రిక‌లు చ‌ద‌వాలి. మెటీరియ‌ల్‌కు సంబంధించిన వెబ్‌సైట్ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని సేక‌రించుకోవాలి. 

రాష్ట్ర ప్రభుత్వాల కసరత్తు మొదలు 

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలు పెట్టాయి. తెలంగాణలో దాదాపు 19 వేలకు పైగా పోలీసు ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వమే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోనూ సుమారు 15వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రిపరేషన్ ను ఇప్పటి నుంచే కొనసాగించడం మంచిది. 

Posted Date : 28-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌