• facebook
  • whatsapp
  • telegram

అలా చూసి ఇలా కలిపితే సరి

పోటీ పరీక్షల్లో లెక్కల చిట్కాలు

భాగహారాలను వేగంగా, కచ్చితంగా చేయటం నేర్చుకుంటే పోటీ పరీక్షల్లో ఎంతో ఉపయోగం. గతవారం భాగహారాలను వేగంగా చేయగలిగే కొన్ని విధానాలను నేర్చుకున్నాం. ఈవారం భాగహారాలను చూసి, లెక్క చేయకుండానే జవాబు తెలుసుకునే కొన్ని సులువైన పద్ధతులను తెలుసుకుందాం! 

రెండంకెల సంఖ్యను ‘9’తో భాగించడం

ఏదైనా రెండంకెల సంఖ్యను ‘9’తో భాగించినప్పుడు వచ్చే భాగఫలం (కోషంట్‌), శేషం (రిమైండర్‌) లను తేలికగా తెలుసుకోవచ్చు.

ఇచ్చిన రెండంకెల సంఖ్యలోని పదుల స్థానంలో ఉన్న అంకె భాగఫలం, ఆ రెండు అంకెలను కలిపితే వచ్చే ఫలితం శేషం అవుతాయి. 

ఉదాహరణకు 43 ÷ 9

దీనిలో 43లోని పదుల స్థానంలో ఉన్న ‘4’ భాగఫలం అవుతుంది. అదేవిధంగా 4 + 3 = 7 శేషం అవుతాయి. 

వచ్చే సంఖ్యా రెండంకెల సంఖ్య అయితే... 

ఒకవేళ రెండు అంకెలను కలిపితే వచ్చే సంఖ్య కూడా రెండంకెల సంఖ్య అయితే పదుల స్థానంలోని అంకెను ఇంతకుముందు భాగఫలానికి కలపాలి. ఆ రెండు అంకెలను కలిపితే శేషం వస్తుంది.

ఉదాహరణకు 78 ÷ 9

78లోని పదుల స్థానంలో ఉన్న ‘7’ భాగఫలం అవుతుంది. 7+8=15 రెండంకెల సంఖ్య కాబట్టి దీనిలోని పదుల స్థానంలో ఉన్న ‘1’ని ఇంతకుముందు భాగఫలం ‘7’కు కలపాలి. 7+1=8. ఇది భాగఫలమవుతుంది. 1 + 5 = 6 శేషం అవుతుంది. అంటే 78ని 9తో భాగిస్తే భాగఫలం 8, శేషం 6 అవుతాయి.

మూడంకెల సంఖ్యను ‘9’తో భాగించడం

ఈ పద్ధతిలో మూడంకెల సంఖ్యలోని వందల స్థానంలో ఉన్న అంకె భాగఫలంలోని పదుల స్థానం అవుతుంది. వందల, పదుల స్థానంలోని అంకెలను కలిపితే భాగఫలంలోని ఒకట్ల స్థానం అవుతుంది. 

అదేవిధంగా ఇచ్చిన సంఖ్యలోని అంకెలన్నీ కలిపితే శేషం అవుతుంది.

ఉదాహరణకు 321÷9

దీనిలో వందల స్థానంలో ఉన్న 3 భాగఫలం పదుల స్థానం అవుతుంది. వందల స్థానంలో, పదుల స్థానంలో ఉన్న 3, 2లను కలిపితే భాగఫలంలోని ఒకట్ల స్థానం అవుతుంది. 

3(3+2) 35 భాగఫలం. 

అంకెలన్నీ కలిపితే 3+2+1=6 శేషం అవుతుంది. 

రెండంకెల సంఖ్య వస్తే..

భాగఫలం కోసం వందల, పదుల స్థానంలోని అంకెలను కలిపినప్పుడు ఒకవేళ రెండంకెల సంఖ్య వస్తే దానిలోని పదుల స్థానంలోని అంకెను ఇంతకుముందు భాగఫలంలోని పదుల స్థానంలోని అంకెకు కలపాలి. 

ఉదాహరణ 394÷9 

394లోని వందల స్థానంలో ఉన్న ‘3’ భాగఫలంలో పదుల స్థానంగా తీసుకోవాలి. 

3, 9 కలిపితే 12 వస్తుంది. దీనిలో 1 కి 3 కలిపితే 4 అవుతుంది. కాబట్టి 42 భాగఫలం అవుతుంది. 

అంకెలన్నీ కలిపితే 3+9+4=16 శేషం అవుతుంది. అయితే ఇది రెండంకెల సంఖ్య కాబట్టి దీనిలో ‘1’ని ఇంతకుముందు భాగఫలం 42కు కలపాలి. అప్పుడు భాగఫలం 42+1=43 అవుతుంది. 1, 6 కలిపితే 1+6=7 శేషం అవుతుంది. కాబట్టి 394ను 9తో భాగిస్తే 43 భాగఫలం, 7 శేషం అవుతాయి.


 

Posted Date : 09-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌