• facebook
  • whatsapp
  • telegram

పీఓ కొలువుకు ఎస్‌బీఐ పిలుపు

1673 ఖాళీలతో ప్రకటన 

ప్రిపరేషన్‌ విధానం

బ్యాంక్‌ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రొబేషనరీ ఆఫీసర్ల నోటిఫికేషన్‌ను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) విడుదల చేసింది. దీని ద్వారా 1673 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1600 రెగ్యులర్, 73 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఇంతకుముందే ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. రెండు వారాల వ్యవధిలోనే ప్రొబేషరీ ఆఫీసర్ల ప్రకటన.. ఉద్యోగార్థులకు ఎంతో మంచి అవకాశం!

గతంలో జరిగిన పరీక్షతో పోల్చితే మెయిన్స్‌ పరీక్ష విధానంలో స్వల్ప మార్పులను గమనించవచ్చు. రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగంలోని ప్రశ్నల సంఖ్యను 5 చొప్పున, మార్కులను 10 చొప్పున కుదించి.. అలా కుదించిన 10 ప్రశ్నలు- 20 మార్కులను జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో కలిపారు. కాబట్టి మొత్తం ప్రశ్నల సంఖ్య, మార్కుల్లో మార్పేమీ లేదుగానీ.. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం ప్రాధాన్యం పెరిగింది. ప్రిలిమ్స్‌ పరీక్షలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

మూడు దశలు 

అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. 

1. ప్రిలిమినరీ పరీక్ష. ఇది అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో పోస్టుల సంఖ్యకు 10 రెట్ల అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు.

2. మెయిన్స్‌ పరీక్ష. దీనిలో ఉత్తీర్ణులైనవారి నుంచి 5 రెట్ల అభ్యర్థులను మూడో దశకు ఎంపిక చేస్తారు.

3. ఈ దశలో గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ ఉంటాయి. సైకోమెట్రిక్‌ టెస్ట్‌ కూడా నిర్వహిస్తారు. కానీ ఇది అర్హత పరీక్ష మాత్రమే. 

రెండో దశ మెయిన్స్‌లోని మొత్తం మార్కులను 75కూ, మూడో దశలోని గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలోని మొత్తం మార్కులను 25కూ కుదిస్తారు. మొత్తం 100 మార్కులకుగాను అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

పరీక్ష రాసేందుకు ఎన్ని అవకాశాలు? 

ఇతర బ్యాంకు పరీక్షల్లా కాకుండా ఎస్‌బీఐ పీఓ పరీక్ష రాయడానికి కొన్ని పరిమితమైన అవకాశాలుంటాయి. జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 4 సార్లు, ఓబీసీ అభ్యర్థులకు 7 సార్లు మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రం అపరిమితంగా రాసుకోవచ్చు. అయితే ఈ పరిమితి ప్రిలిమినరీ పరీక్షకు కాకుండా మెయిన్స్‌ పరీక్షకు మాత్రమే ఉంటుంది. 2010లో జరిగిన పరీక్ష నుంచి ఈ అవకాశాలను లెక్కిస్తారు. 

ఎలా సిద్ధం కావాలి?

అనుకోకుండా ఒకేసారి ఎస్‌బీఐ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్‌ నోటిఫికేషన్లు వచ్చాయి. కాబట్టి పీఓ పరీక్షకు సిద్ధమైతే సహజంగానే క్లర్క్‌ పరీక్షకు సరిపోతుంది. పీఓ పరీక్షను లక్ష్యంగా చేసుకుంటే పరీక్ష తేదీకి అనుగుణంగా ప్రిపరేషన్‌ ప్రణాళిక వేసుకోవాలి. ప్రిలిమ్స్‌ పరీక్ష డిసెంబరు 17, 18, 19, 20 తేదీల్లో ఉంది. అంటే దాదాపు 80 రోజుల సమయం. ఈ సమయంలో సరైన ప్రణాళికతో ప్రిపేర్‌ అయితే మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులైనా దీనిలో విజయం సాధించవచ్చు.

ఇదీ ప్రణాళిక 

మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు ఈ సమయాన్ని సబ్జెక్టులు నేర్చుకోవడానికీ, ప్రాక్టీసుకూ, మాదిరి ప్రశ్నపత్రాలకూ కేటాయించుకోవాలి. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లలోని టాపిక్స్‌ను అన్నింటినీ దాదాపు నెల రోజుల్లో బాగా నేర్చుకోవాలి. 

‣ టాపిక్‌ కాన్సెప్ట్‌ బాగా అర్థం చేసుకుని దానిలో వివిధ స్థాయుల్లోని ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేసుకోవాలి. 

ఒకసారి టాపిక్స్‌ అన్నీ అయ్యాక సెక్షన్లవారీగా దానిలోని వివిధ టాపిక్స్‌లోని ప్రశ్నలను సమయాన్ని నిర్దేశించుకుని సాధించాలి. అప్పుడే వేగంగా ప్రశ్నలను సాధించడం అలవాటవుతుంది. 

ఇంగ్లిష్‌ గ్రామర్‌ను నిశితంగా గమనించాలి. 

సెక్షన్లవారీగా సాధన చేసే సమయంలోనే.. పరీక్ష పూర్తి స్థాయి మాదిరి ప్రశ్నపత్రం ప్రతీరోజూ ఒకటి తప్పనిసరిగా రాయాలి. 

ఆపై దాన్ని విశ్లేషించుకుంటే ప్రిపరేషన్‌ ఏ మేరకు కొనసాగుతోందో, నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. ఏయే టాపిక్స్‌ మెరుగుపరుచుకోవాలో తెలుస్తుంది. 

దీనికి తగినట్లుగా ఆయా టాపిక్స్‌ ఇంకా సాధన చేయాలి. 

ప్రశ్నలు వేగంగా ఎలా సాధించగలగాలో అర్థమవుతుంది కాబట్టి షార్ట్‌కట్‌ పద్ధతులు నేర్చుకుని ఉపయోగించాలి. 

ఈ మూడు సబ్జెక్టులనూ మెయిన్స్‌ స్థాయిలోనే ప్రిపేర్‌ అవ్వాలి. 

ఇప్పటినుంచే జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగానికి కూడా సిద్ధం కావాలి. ప్రతిరోజూ వివిధ దిన పత్రికలు చదువుతూ వాటిలోని ముఖ్యాంశాలను ముఖ్యంగా ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ నోట్‌ చేసుకోవాలి. ప్రతి వారం ఆ ముఖ్యాంశాలను రివిజన్‌ చేయాలి. అలా చేస్తుంటే ప్రత్యేకంగా ఈ విభాగానికి తయారవ్వాల్సిన అవసరం ఉండదు. 

సన్నద్ధత ఎలా కొనసాగుతోందో మోడల్‌ పేపర్ల సాధన ద్వారా బేరీజు వేసుకోవాలి. 

ఈ రకంగా ఒక ప్రణాళికతో సిద్ధమైతే.. ఈ పరీక్షలో విజయం తథ్యం!

అంచెలంచెలుగా.. 

ఎస్‌బీఐలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువ. ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరిన అభ్యర్థులు 2 సంవత్సరాల ప్రొబేషన్‌ పీరియడ్‌ ముగిశాక బ్యాంకు నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైతే స్కేల్‌-1 ఆఫీసర్లుగా నియమితులవుతారు. ఆపై బ్యాంకులో అంతర్గతంగా ఉండే పదోన్నతుల ప్రక్రియ, ప్రతిభ ద్వారా అంచెలంచెలుగా మేనేజర్‌ (స్కేల్‌-2), సీనియర్‌ మేనేజర్‌ (స్కేల్‌-3), చీఫ్‌ మేనేజర్‌ (స్కేల్‌-4), అసిస్టెంట్‌ మేనేజర్‌ (స్కేల్‌-5), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-6), జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-7)... ఆపై డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్, మేనేజింగ్‌ డైరెక్టర్, బ్యాంక్‌ ఛైర్మన్‌ వరకూ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. 

ఎస్‌బీఐకి విదేశాల్లో కూడా శాఖలు ఉన్నాయి. దాంతో అభ్యర్థులు విదేశాల్లోనూ పనిచేసే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన అంశాలు...

విద్యార్హతలు: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ 

వయసు (01.04.2022 నాటికి): 21-30 సంవత్సరాలు (జనరల్‌ అభ్యర్థులకు)

దరఖాస్తు ఫీజు: రూ.750 (జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌) ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 12, 2022

ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 17/18/19/20, 2022

మెయిన్స్‌ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2023

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/
 

స్టడీ మెటీరియ‌ల్‌
 

మెయిన్స్‌ ప్రిలిమ్స్‌
డేటా ఎనాల‌సిస్ అండ్ ఇంట‌ర్‌ప్రిటేష‌న్‌ ఇంగ్లిష్ లాంగ్వేజ్‌
జ‌న‌ర‌ల్ అండ్ బ్యాంకింగ్ అవేర్‌నెస్‌ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌
రీజ‌నింగ్ అండ్ కంప్యూట‌ర్ అప్టిట్యూట్‌ రీజ‌నింగ్ ఎబిలిటీ
ఇంగ్లిష్ లాంగ్వేజ్‌  


నమూనా ప్రశ్నపత్రాలు

పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డెవాప్స్‌ నిపుణుల‌కు డిమాండ్‌!

‣ కోస్టుగార్డు కొలువుల్లోకి ఆహ్వానం!

‣ 20,000 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు

‣ అవుతారా.. టాబ్లూ డెవ‌ల‌ప‌ర్‌!

‣ ఇంజినీర్ల‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు

‣ ఆంగ్ల‌భాష ప్రావీణ్య ప‌రీక్ష ఏది ప్ర‌యోజ‌న‌క‌రం!

‣ ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

Posted Date : 26-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌