• facebook
  • whatsapp
  • telegram

వయసు పెరిగితే  విజయం కష్టమా !

సివిల్స్‌ పరీక్షపై అపోహలు..వాస్తవాలు

మహిళలకు సివిల్స్‌ అనువైనది కాదనీ, ఫలానా సబ్జెకులతోనే డిగ్రీ చేసినవారికే ఎక్కువ ప్రయోజనంఅనీ, సివిల్‌ సర్వీసెస్‌ అంతిమ లక్ష్యం అయినప్పుడు కాలేజీకి వెళ్లడం అనవసరమనీ.. రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. ఇలాంటివి అపోహలేనని స్పష్టత రావాలంటే వాస్తవా లేమిటో గ్రహించాలి.  సివిల్‌ సర్వీస్‌ పరీక్షపై ప్రాచుర్యంలో ఉన్న కొన్ని అపోహలూ.. వాస్తవాలను పరిశీలిద్దాం! 

ఆర్థిక సహాయంతోపాటుగా సివిల్స్‌ అభ్యర్థులకు మానసిక భరోసాను అందించడంలో తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర

తుది ఫలితాలు ప్రకటించినప్పుడు.. ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఉత్తర భారతదేశానికి చెందినవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తున్నట్టుగా... ఉత్తరాది వారికే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది.

వాస్తవం: ఎలాంటి పక్షపాతానికీ తావు లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పక్షపాతరహితంగా, ఎలాంటి వివక్షకూ తావులేకుండా యూపీఎస్‌సీ గుర్తింపు పొందింది. పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థుల సంఖ్య పరీక్షకు ఎంతమంది హాజరయ్యారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. గడిచిన ఏడు దశాబ్దాల నుంచీ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన అభ్యర్థుల వాటానే ఎక్కువ.

వయసు పెరిగే కొద్దీ సివిల్స్‌ పరీక్ష పాసవడం కష్టమే. 21 లేదా 23 ఏళ్లలో పాసవకపోతే ఇక ఉత్తీర్ణత సాధ్యం కాదు. 

వాస్తవం: ఐఏఎస్‌కు ఎంపికైన అభ్యర్థి సగటు వయసు 27.4 సంవత్సరాలు. ఈ పరీక్షలో అర్హత సాధించడానికి వయసుతో వచ్చే మానసిక పరిపక్వత అవసరమని అర్థమవుతోంది. 1950లో ఈ వయసు 23గా ఉండేది. చాలామంది అభ్యర్థులు 2 లేదా 3 ఏళ్లపాటు ఉద్యోగం చేసిన తర్వాత సివిల్స్‌కు ఎంపికవుతున్నారు. పరీక్షలో విజయానికి వయసు అడ్డంకి కాదు. అంకితభావంతో కృషి చేస్తే విజయం సాధించవచ్చు.

పురుషులతో పోల్చిచూస్తే మహిళా అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అమ్మాయిలకు సివిల్స్‌ అనువైనది కాదు.

వాస్తవం: ఐఏఎస్‌తోపాటు మిగతా అన్ని విభాగాల్లోనూ ఇది అపోహ మాత్రమే అని రుజువైంది. 1951 నుంచి 6,575 మంది ఐఏఎస్‌ ఆఫీసర్లుగా నియమితులైతే అందులో 18 శాతం మహిళలే. 1950లో మహిళల వాటా 2.7 శాతం ఉంటే.. పురుషుల వాటా 97.3 శాతంగా ఉంది. 2010 నాటికి మహిళల వాటా 30 శాతానికి పెరిగింది. ఈ సంఖ్య స్థిరంగా పెరుగుతూ వచ్చింది. లింగవివక్ష తగ్గినప్పటికీ ఈ రంగంలో మహిళల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే.. టాపర్ల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది మహిళలు ఉన్నారని మర్చిపోకూడదు.

సైన్స్, ప్రొఫెషనల్‌ కోర్సులు చేసినవారి కంటే హ్యుమానిటీస్‌/ సోషల్‌ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసినవారికి సివిల్స్‌లో ప్రయోజనం ఎక్కువ.

వాస్తవం: ఇది 1950లలో అయితే నిజం. అప్పట్లో నియమితులైనవారిలో 72 శాతం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ అండ్‌ మ్యాథమేటిక్స్‌ నేపథ్యం లేనివాళ్లే ఉన్నారు. 2010 నాటికి ఇది 33 శాతానికి తగ్గింది. 2020లో అభ్యర్థుల్లో 80 శాతం మంది సైన్స్‌ నేపథ్యం ఉన్నవాళ్లే. ఇప్పుడు సివిల్స్‌ విజేతల్లో ఎక్కువమంది ఇంజినీరింగ్, సైన్స్, మ్యాథ్స్‌ నేపథ్యం ఉన్నవాళ్లే. కాబట్టి ఫలానా సబ్జెక్టు నేపథ్యం అనేది మొత్తమ్మీద పెద్ద వ్యత్యాసం చూపించదు. 

సివిల్‌ సర్వీసెసే అంతిమ లక్ష్యం అయినప్పుడు కాలేజీకి వెళ్లడం కూడా అనవసరమే. ఓపెన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేస్తూ సివిల్స్‌కు సన్నద్ధమైతే పూర్తి సమయాన్ని సివిల్స్‌కే అంకితం చేయొచ్చు.

వాస్తవం: కాలేజీలో తరగతులకు స్వయంగా హాజరుకావడమనేది చక్కని అనుభవం. కాలేజీ అనేది కేవలం చదువుల కోసమే కాదు. అధ్యాపకులు బోధించే విషయాలను స్వయంగా వింటూ, సహ విద్యార్థులతో కలిసిమెలిసి ఉంటూ ఎన్నో నైపుణ్యాలను నేర్చుకుంటారు. సాధ్యమైనంత వరకు విద్యార్థులు ఈ అనుభవాన్ని వదులుకోకూడదు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధించడమంటే.. విద్యా, సాంఘిక, ఉద్యోగ నైపుణ్యాల కలబోతే. దీన్నే పరిణతి అనొచ్చు. దీన్ని సాధించాలంటే కాలేజీకి వెళ్లడం అవసరమే! 

అభ్యర్థుల విజయంలో తల్లి   దండ్రులూ, కుటుంబ సభ్యులకు ఎలాంటి పాత్రా ఉండదు. పుస్తకాలు కొనుక్కోవడానికి, కోచింగ్‌ క్లాసులకు ఆర్థిక సాయం చేయ  డానికే వీరు పరిమితం. 

వాస్తవం: ఈ పరీక్షలో విజయం సాధించిన ప్రతి అభ్యర్థీ తల్లిదండ్రులకు ఎంతగానో కృతజ్ఞతలు చూపుతున్నారు. ఇదేదో లాంఛనంగా చేస్తున్నది కాదు. సివిల్స్‌కు హాజరుకావాలంటే.. భౌతికంగా, మానసికంగా కుటుంబసభ్యుల సహాయ, సహకారాలు ఎంతో అవసరం. భౌతిక సహాయంతోపాటుగా అభ్యర్థులకు మానసిక భరోసాను అందించడంలో తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర. ఈ పరీక్షలో సఫలం కావాలంటే అనేక ప్రయత్నాలు చేయాలి కాబట్టి ఇలాంటి సహకారం అభ్యర్థులకు ఎంతో అవసరం. 

పరీక్షలో అర్హత సాధించాలంటే కోచింగ్‌ తప్పనిసరిగా అవసరమే! 

వాస్తవం: సిలబస్‌లోని వివిధ సబ్జెక్టుల సన్నద్ధతకు కోచింగ్‌ పునాది వేస్తుంది. మాదిరి పరీక్షలు నిర్వహించడం ద్వారా పరీక్ష రాయడంలో కొంత అనుభవం వచ్చేలా చేస్తుంది. అంతకుమించి పరీక్షలో పాసయ్యేలా చేయలేదు. ఈ మధ్య పరీక్షను సమీక్షించిన అన్ని కమిటీలూ... కోచింగ్‌ సెంటర్లు అంచనా వేయలేనివిధంగా ప్రశ్నపత్రాలు రూపొందించాలని సూచించాయి. సివిల్స్‌ పరీక్షలో అభ్యర్థి నిజమైన సామర్థ్యాన్ని పరీక్షించాలన్నదే దీని ఉద్దేశం. కాబట్టి కోచింగ్‌ అనేది తప్పనిసరి కాదు. ఇది ఒక పునాదిగా మాత్రమే పనికొస్తుంది.

దిల్లీలో కోచింగ్‌ తీసుకుంటే.. సివిల్స్‌ పరీక్ష పాసవడానికి అవకాశాలు ఎక్కువ. 

వాస్తవం: ముందే చెప్పినట్టుగా కోచింగ్‌ అనేది పునాదిలా పనిచేస్తుంది. దాన్ని ఎక్కడైనా తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రొఫెషనల్‌ శిక్షణ కేంద్రాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి చాలా చోట్ల అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కోచింగ్‌ అవసరమైన అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న కోచింగ్‌ సెంటర్‌లో చేరొచ్చు. దిల్లీ దాకా వెళ్లి కోచింగ్‌ తీసుకోవడం వల్ల ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. 

కోచింగ్‌ తీసుకోవాలనుకుంటే.. ఆన్‌లైన్‌..ఆఫ్‌లైన్‌ ఏదైనా ఒకటే. 

వాస్తవం: కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు లేకపోవడం వల్ల సివిల్స్‌ ఆన్‌లైన్‌ తరగతులకు ప్రాధాన్యం పెరిగింది. కొంతమంది విద్యార్థులు ముందుగా ఆఫ్‌లైన్‌ ఆ తర్వాత ఆఫ్‌లైన్‌ తరగతులకు హాజరయ్యారు. వీరంతా కూడా ప్రత్యక్ష తరగతుల వల్లే మెరుగైన ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. పాఠ్యాంశాలు, బోధకులు రెండు పద్ధతుల్లో ఒకేరకంగా ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా పాఠాలు వినడం వల్ల ప్రభావం ఎక్కువ. తరగతి హాజరుతో క్రమశిక్షణా అలవడుతుంది. ఇవన్నీ ఆన్‌లైన్‌ తరగతుల్లో ఉండవు. కాబట్టి సాధ్యమైనంతవరకు ప్రత్యక్ష తరగతులకే ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. 

సంక్షిప్తంగా...

1. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో వివక్షకు ఎలాంటి అవకాశమూ లేదు. విజేతల్లో ఒక ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం... ఆ ప్రాంతం నుంచి ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటమే. 

2.  పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థుల సగటు వయసు పెరుగుతోంది. ఈ పరీక్ష పాసైనవారిలో 22 లేదా 23 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు చాలా తక్కువమంది. చాలావరకూ 25 ఏళ్ల పైబడినవాళ్లే ఉంటున్నారు. ఈ పరీక్షలో నెగ్గటానికి వయసు ఏ మాత్రం అవరోధం కాదు. 

3. ఈ సర్వీసులో నియమితులయ్యే మహిళా అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. యూపీఎస్‌సీ అమ్మాయిలను దరఖాస్తు చేసేలా ప్రోత్సహిస్తోంది. నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని పేర్కొంటోంది కూడా! 

4.  ఆన్‌లైన్‌ కోచింగ్‌ కంటే ఆఫ్‌లైన్‌ కోచింగే ఉత్తమమని విద్యార్థులు చెబుతున్నారు. ఆఫ్‌లైన్‌ తరగతుల్లో క్రమశిక్షణ తోపాటు నేరుగా వ్యక్తిగత శ్రద్ధతో నేర్చుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు. 

5. సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో డిగ్రీ రెగ్యులర్‌ తరగతుల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. 

6.  కోచింగ్‌ అనేది పరీక్ష సన్నద్ధతను సులభతరం చేసే ప్రక్రియ మాత్రమే. తప్పనిసరేమీ కాదు.

7.  సివిల్స్‌ శిక్షణ కోసమని సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. 

8.  సివిల్స్‌ పరీక్ష పాసవడానికి ఏ సబ్జెకులతో డిగ్రీ చేసినా ఫర్వాలేదని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. 

9.  ఈ పరీక్షలో విద్యార్థులు నెగ్గటంలో తల్లిదండ్రుల, కుటుంబసభ్యుల పాత్ర గణనీయమైనది.
 

Posted Date : 16-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌