• facebook
  • whatsapp
  • telegram

పది ప్రశ్నలతో పరీక్షిద్దాం!

సివిల్స్‌ సత్తా

సివిల్‌ సర్వీసెస్‌ అంటే.. సుదీర్ఘకాలం వెచ్చించి సన్నద్ధం కావాల్సిన అత్యుత్తమ పరీక్ష. దీనిపై ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థి మనసుల్లో ఉండే సందేహం... ‘ఈ పరీక్షలో నెగ్గటానికి కావాల్సిన లక్షణాలూ, ప్రతిభా నాకున్నాయా?’ అనేదే. ఈ విషయంలో సందేహాతీతంగా స్పష్టత ఏర్పరుచుకుంటే... పూర్తి స్థాయి సన్నద్ధతకు పూర్వరంగం సిద్ధం చేసుకున్నట్టే! 

సివిల్స్‌ శిక్షణ కోసం మొట్టమొదటిసారి కోచింగ్‌ కేంద్రాలకు వచ్చే విద్యార్థులూ, తల్లిదండ్రులూ అక్కడి నిర్వాహకులను సాధారణంగా ఈ ప్రశ్నలు అడుగుతారు-

సివిల్‌ సర్వీసెస్‌ మా అబ్బాయి/ అమ్మాయికి సరైన కెరియర్‌ అవుతుందా? 

ఈ సర్వీస్‌ను ఆశించటానికీ, అర్హత పొందటానికీ తగిన లక్షణాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు గ్రహించటం చాలా అవసరం. 

సరైన కెరియరేనా?

ఇరవయ్యేళ్ల వయసులో విద్యార్థులు పబ్లిక్‌ సర్వీస్‌ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. బహుశా సినిమాలూ, సోషల్‌ మీడియా, సర్వీస్‌లో ఉన్న వ్యక్తుల ద్వారా దీని గురించి ఎంతో కొంత గ్రహిస్తారు. సామాజిక మాధ్యమాల్లో ఉండే కొద్ది వీడియోలను చూస్తే సివిల్స్‌ గురించిన సంపూర్ణమైన స్పష్టత రాదు. ఈ రంగంలోని ప్రొఫెషనల్స్‌ను సంప్రదిస్తేనే వాస్తవికాంశాలు సమగ్రంగా, సమతూకంగా తెలుస్తాయి. 

ఎన్ని తర్జనభర్జనలు తర్వాతయినా సముచితమైన సూచన- ‘ఈ కెరియర్‌ను ఇష్టపడితే ముందుకు సాగిపో’. దీనిలో చేరిన కొన్నేళ్ల తర్వాత మరో విభిన్నమైన వృత్తిలోకి వెళ్లగలిగే అవకాశం సివిల్స్‌ ఇస్తుంది. మరే ఇతర కెరియర్‌లోనూ ఇంత అవకాశం ఉండదు. పైగా సెలవు పెట్టి అకడమిక్‌ నైపుణ్యాలు పెంచుకున్నాక తిరిగి విధుల్లోకి చేరే అవకాశం ఇందులో ఉంటుంది.

తగిన గుణాలున్నాయా?

ముందుచూపు, లక్ష్యాల సాధనకు అవసరమైన నిరంతర కృషి, సామర్థ్యం, పారదర్శకత, నిజాయితీ, పేదల పట్ల సహానుభూతి.. ప్రాథమికంగా ఇవి ఉండటం సివిల్‌ సర్వెంట్లకు అవసరం. సివిల్స్‌ ర్యాంకరుకు ఉండాల్సినవి కూడా ఇవే. ఈ లక్షణాలను రాతపరీక్షలో, ఇంటర్వ్యూలో విభిన్న పద్ధతుల్లో పరీక్షిస్తారు.    

సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావాలంటే..విద్యార్హతలతోపాటు కష్టపడేతత్వమూ ఎంతో అవసరం. దీంతోపాటుగా ప్రవర్తనపరమైన కొన్ని ప్రత్యేక లక్షణాలూ ఉండాలి. ఇవి సహజసిద్ధంగా వచ్చినవై ఉండాలి. లేదా నిర్దేశిత సమయంలో వీటిని అలవరుచుకోవడానికి తగినంతగా ప్రయత్నించాలి. ఈ ప్రత్యేక లక్షణాలు ఉన్న ఎవరైనా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయడానికి సిద్ధంకావచ్చు.

కింది ప్రశ్నలు సివిల్స్‌పై మీకో స్పష్టమైన ఆలోచన రావడానికి తోడ్పడతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడం ద్వారా మీ అర్హత స్థాయిని తెలుసుకోవచ్చు.

1. పరీక్షకు హాజరైనప్పుడు ప్రశ్నపత్రం సంతృప్తికరంగా లేదని గుర్తిస్తారు. అలాంటప్పుడు మీరేం చేస్తారు? 

ఎ) పాసవ్వరనే విషయం ముందుగానే తెలిసిపోయింది కాబట్టి పరీక్ష హాలు నుంచి బయటికి వెళ్లిపోతారు. 

బి) ఇతర విద్యార్థులనూ ప్రేరేపించి పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లిపోతారు. 

సి) మీలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారో లేదో తెలుసుకోవడానికి పక్కవారి పేపర్‌లోకి చూస్తారు. 

డి) సహనంతో సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధిస్తారు. 

సమాధానం: డి.

క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాధ్యమైంది చేయకుండా వెనక్కు వెళ్లలేరనే విషయాన్ని ఇది సూచిస్తుంది. సివిల్‌ సర్వీసెస్‌ అనేకాదు- ఏ పరీక్షల్లో అర్హత సాధించాలన్నా ఇలా చేయడం అవసరం. ‘పేపర్‌ చూసిన వెంటనే ఏమీ రాయలేమని అనిపించినా.. మెల్లగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశామ’ని గతంలో ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులు తెలిపారు. 

2. ఒక వ్యక్తి రోడ్డు దాటడానికి ఇబ్బంది పడటం చూశారు. ఆ వ్యక్తి దివ్యాంగుడని అర్థమైంది. మీరేం చేస్తారు? 

ఎ) పాదచారిని సాయం చేయమని అడుగుతారు. 

బి) మీరే సాయం చేస్తారు.

సి) అతడు రోడ్డు దాటేంతవరకు ఎదురుచూస్తారు. అతడు ఏమైనా ఇబ్బందిపడితే అప్పుడు సాయం చేస్తారు. 

డి) దేవుడు చాలామంది విషయంలో ‘నిర్దయ’గా వ్యవహరిస్తున్నాడనే కారణం చెప్పుకుని పట్టించుకోకుండా మీదారిన మీరు వెళ్లిపోతారు. 

సమాధానం: బి.

ఏ పరిస్థితుల్లోనైనా సాయం అందించడానికి మీరు ముందు ఉంటారనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. మీరు మాటల మనిషికాదు, చేతల మనిషి అనేదానికి రుజువు. ఇదే సూత్రం కంబైన్డ్‌ స్టడీస్‌ విషయంలోనూ వర్తిస్తుంది. ఆ సమయంలో ప్రతి విషయాన్నీ చదివి అర్థమయ్యేలా చెప్పమని స్నేహితులను అడగకుండా మీరే స్వయంగా సన్నద్ధమవుతారని తెలుస్తుంది. 

3. సంతోషంగా గడపాలని ‘కార్నివాల్‌’కు వెళతారు. అక్కడ తప్పిపోయిన బిడ్డ గుక్కపెట్టి ఏడవడాన్ని గమనిస్తారు. అప్పుడు మీరు-

ఎ) ఆ బిడ్డను సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళతారు. 

బి) ఏడవొద్దనీ, అమ్మానాన్నలను వెతుకుదామనీ బిడ్డను సముదాయిస్తారు. 

సి) ముందుగా చాక్లెట్‌ కొని ఇచ్చి, ఏడవద్దని చెప్పి, ఆ బిడ్డను మీకు ముందుగా కనిపించిన చోటే ఉండమని చెబుతారు. 

డి) నిర్వాహకులను సంప్రదించి స్పీకర్లో అనౌన్స్‌ చేయిస్తారు. 

సమాధానం: డి.

దీంతో సమస్యకు సున్నితంగా స్పందించి, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే వ్యక్తిత్వం మీదనే విషయం స్పష్టమవుతుంది. సామాజిక సమస్యల పట్ల సున్నితంగా స్పందించడం ఎంతో అవసరం. ఈ పరీక్షలో వచ్చే ఎక్కువ ప్రశ్నలు కూడా ప్రజలకు సంబంధించినవే ఉంటాయి. అలాగే స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవిధంగా ఉంటాయి.

4. స్కూలు/ కాలేజీ వేడుకలో మీరు కొన్ని పొరపాట్లు చేసినట్టు గుర్తిస్తారు. ఇదే విషయాన్ని మీ స్నేహితుడు/ సీనియర్‌ మీ దృష్టికి తీసుకొస్తాడు. అప్పుడు మీరు-

ఎ) అతడిని ముందు నీ సంగతి చూసుకోమంటారు.

బి) కోపం తెచ్చుకుని అతడిపై అరుస్తారు. గతంలో అతడు చేసిన తప్పులను ఎత్తిచూపుతారు. 

సి) అవమానంగా భావించి వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతారు. 

డి) కృతజ్ఞతలు చెప్పి, అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానంటారు. 

సమాధానం: డి.

దీని ద్వారా విమర్శలను సహృదయంతో స్వీకరిస్తారనీ, పొరపాట్ల నుంచి నేర్చుకుంటారనీ అర్థమవుతుంది. పరిపాలనాధికారికి ఈ లక్షణం ఎంతో అవసరం. సివిల్స్‌ పాసవడానికి సాధారణంగా రెండు, మూడుసార్లు అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు. ప్రతి ప్రయత్నంలోనూ గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతూ ముందుకు వెళ్లేవారే విజేతలు. 

5. ఇంటర్వ్యూ తర్వాత భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగానికి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే అడగమంటారు బోర్డు సభ్యులు. అప్పుడు కింది ప్రశ్నల్లో ఏది అడుగుతారు? 

ఎ) పదోన్నతుల కోసం ఎలాంటి అవకాశాలుంటాయి? 

బి) నాకు ఎంత వేతనం ఇస్తారు? 

సి) నా ఆలోచనలతో సంస్థ అభివృద్ధికి తోడ్పడే స్వేచ్ఛ, అవకాశం నాకు ఉంటాయా? 

డి) ఈ ఉద్యోగం చేయడం వల్ల వచ్చే లాభాలేంటి? 

సమాధానం: సి.

ఇది మీ దూరదృష్టిని తెలుపుతుంది. ఈ ఆలోచనా విధానం- సన్నద్ధత సమయంలో మీ సమాధానాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఇస్తుంది.

6. మీతోపాటుగా పనిచేస్తోన్న వ్యక్తి.. సంస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని తనకు చెప్పమని అడుగుతాడు. ప్రతిగా మంచి ఉద్యోగమిస్తాననే ఆశ చూపుతాడు. అప్పుడు మీరు-

ఎ) సందిగ్ధంలో పడతారు. 

బి) కాస్త సమయం ఇస్తే ఆలోచించి మీ నిర్ణయం చెబుతానంటారు. 

సి) లాభం ఉండటంతో ప్రతిపాదనను అంగీకరిస్తారు.

డి) స్థిరంగా ఆ ప్రతిపాదనను నిరాకరిస్తారు. 

సమాధానం: డి.

మీరు నైతిక విలువలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటారనే విషయాన్ని మీ సమాధానం తెలియజేస్తుంది.

7. ఏదైనా చారిత్రక ప్రదేశాన్ని సందర్శించినప్పుడు మీరిలా ప్రయత్నిస్తారు-

ఎ) ఆ ప్రదేశం మొత్తం తిరిగి దాని సౌందర్యాన్ని ప్రశంసిస్తారు.

బి) ప్రత్యేకమైన నిర్మాణ, రూపకల్పన శైలి మీద ప్రత్యేకంగా దృష్టి నిలుపుతారు. 

సి) నిర్మాణం వెనుక దాగిన సాంస్కృతిక, సామాజిక అంశాల గురించి అన్వేషిస్తారు. 

డి) వాస్తవాలను తెలుసుకోవడానికి గైడ్‌ సాయం తీసుకుంటారు. 

సమాధానం: డి.

ఇతరుల నుంచి విషయాలను తెలుసుకోవాలనే మీ తపనకు ఇది అద్దంపడుతుంది. సివిల్‌ సర్వీసెస్‌లోకి ప్రవేశించే ముందూ, ఆ తర్వాత కూడా ఈ నైజం మీకు ఎంతో అవసరం.

8. మీకిష్టం లేని డిమాండ్‌ను ఎవరైనా ప్రస్తావిస్తే.. మీరు-

ఎ) ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.

బి) ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేసి, ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోతారు. 

సి) అతడి డిమాండ్లను అంగీకరించలేని మీ అశక్తతను తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. 

డి) ఆ వ్యక్తి మళ్లీ అలా ప్రవర్తించకుండా అతడికి గుణపాఠం చెప్పడానికి ప్రయత్నిస్తారు. 

సమాధానం: సి.

పరీక్షల సన్నద్ధత సమయంలో దృఢ చిత్తం అవసరం. మీ దృష్టిని ఎప్పుడూ పరీక్షల మీదే నిలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అవాంతరాలు ఎదురవుతుంటాయి. సరదాగా గడపడానికి స్నేహితులూ ఆహ్వానిస్తుంటారు. అలాంటప్పుడు మీరు రాలేననే విషయాన్ని మర్యాదగా చెప్పాల్సి ఉంటుంది. ఇదే సూత్రం పరిపాలనకూ వర్తిస్తుంది. 

9. నది దాటేందుకు మీరు పడవ కోసం ఎదురుచూస్తున్నారు. పడవను నడిపే వ్యక్తి దాన్ని ఎక్కువమందితో నింపేయడాన్ని గమనించారు. అప్పుడు మీరు-

ఎ) ప్రమాదాన్ని ముందే గ్రహించి మీరు ఆ పడవ ఎక్కరు. 

బి) పడవ నడిపే వ్యక్తితో వాగ్వివాదానికి దిగుతారు. 

సి) అదనంగా ఉన్న ప్రయాణికులు కిందికి దిగి, తర్వాతి ట్రిప్‌లో వెళ్లేలా ఒప్పించే ప్రయత్నం చేస్తారు.  

డి) ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా మీరు మరో ట్రిప్‌లో వెళ్లడానికి సిద్ధమవుతారు. 

సమాధానం: సి.

ఈ సమాధానం మీ దూరదృష్టి, పరిపక్వతలను తెలియజేస్తుంది. ప్రమాదం వచ్చాక నివారించటం  కంటే.. ముందస్తు జాగ్రత్తలతో అది జరక్కుండా చూడటం ఎంతో అవసరం. పరీక్షకు ముందు తర్వాత కూడా ఈ లక్షణం ఎంతో ఉపయోగపడేదే. 

10. ఆప్తులను పోగొట్టుకుని బాధపడుతున్న వ్యక్తిని మీరెలా ఓదారుస్తారు?

ఎ) బాధ ఎక్కువవుతుందని చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడరు.

బి) వైద్యుడిని సంప్రదించి తరచూ మత్తుమందులు ఇస్తారు. 

సి) మాట్లాడకుండా సానుభూతితో దగ్గరకు తీసుకుంటారు. 

డి) వాస్తవిక దృక్పథంతో అతడికి సాయం అందిస్తారు. అతడి బాధలను వినడానికి ప్రయత్నిస్తారు. 

సమాధానం: డి.

ఇది మీలోని సున్నితత్వాన్నే కాకుండా కార్యాచరణకూ, లక్ష్యసాధన దృక్పథానికీ అద్దం పడుతుంది.

ఈ ప్రశ్నల్లో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే.. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సన్నద్ధం కావడానికి మీరు అర్హులని అర్థం. అలాగే భవిష్యత్తులో సమర్థ అధికారిగానూ పేరు సంపాదిస్తారు. 


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సిలబస్‌ క్షుణ్ణంగా.. రివిజన్‌ ధీమాగా!

‣ ఆ సంఖ్యల ఘనం... ఇలా సులభం!

Posted Date : 24-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌