• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌... గ్రూప్స్‌ ఏది మీ టార్గెట్‌?

రెండింటికీ ఏకకాలంలో ప్రిపరేషన్‌ సాధ్యమే అంటున్న నిపుణులు

ఇటీవలే 1011 పోస్టులతో సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. మరో పక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గ్రూపు-1 నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలున్నాయని వ్యాపిస్తున్న వార్తలు పోటీ పరీక్షల అభ్యర్థుల్లో ఆశలు పెంచుతున్నాయి. ఇలాంటి సందర్భంలో సివిల్స్‌కు సిద్ధమవ్వాలా? గ్రూపు-1కు ప్రిపేర్‌ అవ్వాలా? అనే సందిగ్ధత చాలామంది అభ్యర్థుల్లో కనిపిస్తోంది. దీనిపై స్పష్టత పెంచుకుంటే.. పూర్తి ఏకాగ్రతతో ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది. ఫ్రెషర్లూ, రెండు మూడు సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు కృషి చేస్తున్నవారూ ఏమేం గమనించాలి? ఏ నిర్ణయం తీసుకోవాలి? నిపుణుల సూచనలు ఇవిగో! 

జాతీయ స్థాయిలో సివిల్స్‌ పరీక్ష ద్వారా అఖిల భారత సర్వీసులు, ఇతర కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం పొందాలనేది చాలామంది కల. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గ్రూప్‌-1 ద్వారా డిప్యూటీ కలెక్టర్, డీఎస్‌పీ లాంటి కొలువులు పొంది జీవిత లక్ష్యాన్ని చేరాలనుకునేవారు మరికొంతమంది. దేశ, రాష్ట్ర స్థాయుల్లో ఈ నోటిఫికేషన్లకు నిరుద్యోగుల్లో ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. 

సివిల్స్‌ పరీక్షలు ఎదుర్కొనేందుకు 2, 3 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళికతో సిద్ధపడటం సహజంగా జరుగుతుంది. రాష్ట్రస్థాయిలో గ్రూప్‌-1 పరీక్షలు మూడు నాలుగేళ్లకు ఒకసారి వస్తాయి. అవి వచ్చినప్పుడు పూర్తిస్థాయిలో సిద్ధపడటం కొంతమంది అభ్యర్థులు అనుసరించే ధోరణి. అయితే విజేతలైనవారిలో ఎక్కువమంది అటు సివిల్స్, ఇటు గ్రూప్‌-1 పరీక్షలను దృష్టిలో పెట్టుకుని సన్నద్ధమవుతూ సమయ సందర్భాలను బట్టి తమ లక్ష్యాలను మార్చుకుని రెండిట్లోనూ నెగ్గినవారు ఉన్నారు. గ్రూప్‌-1 పరీక్షలోనూ విజేతలైన వారున్నారు. తాజాగా సివిల్స్‌ ప్రకటన రావడం, గ్రూప్స్‌ నోటిఫికేషన్లు వస్తాయన్న అంచనాలు పెరగటం ఈ పూర్వరంగంలోనే పరిశీలించాలి.

ఏ ప్రయోజనాలు?  ఏవి అవరోధాలు?

ఏ పరీక్షను ఎంచుకుంటే కెరియర్‌కు మేలు.. అనే సందిగ్ధతను తొలగించుకునేందుకు ఒక్కో పరీక్షకు సంబంధించి లాభ నష్టాలను పరిశీలిద్దాం.

సివిల్స్‌ అనుకూలతలు: అఖిలభారత పరీక్షలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లకు ఎంపికై ఉద్యోగ వ్యవస్థలో అత్యున్నత పదవులు పొందే అవకాశం ఉంది. విధాన నిర్ణయాల్లో, అమలులో భాగస్వామ్యం, సామాజిక గుర్తింపు, ప్రజాసేవకు అవకాశం పుష్కలంగా లభిస్తుంది. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వస్తాయి.

ప్రతికూలతలు: సొంత రాష్ట్రాల్లో ఉద్యోగం పొందే అవకాశాలు తక్కువ. జాతీయస్థాయి పోటీ వల్ల ఎంపికయ్యే అవకాశాలు కూడా తక్కువ. కొన్ని ఉద్యోగాల్లో తప్ప నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం పరిమితం. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు కేటాయించినప్పుడు సొంత రాష్ట్రంలో సామాజిక సంబంధాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. 

గ్రూప్‌- 1 అనుకూలతలు: సొంత రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసే అవకాశం, ఆర్డీఓ, డీఎస్‌పీ మొదలైన ఉద్యోగాల ద్వారా 12 నుంచి 15 సంవత్సరాల్లో ఐఏఎస్‌/ ఐపీఎస్‌ హోదా పొందే అవకాశం లభిస్తుంది. సొంత ప్రాంత ప్రజల్లో సామాజిక గుర్తింపు, సామాజిక సంబంధాలు బలోపేతం అయ్యే సౌలభ్యం ఉంటుంది.

ప్రతికూలతలు: ఆర్డీఓ, డీఎస్‌పీ ఉద్యోగాల్లో తప్ప ఇతర కొలువుల్లో పదోన్నతుల అవకాశాలు తక్కువ. సామాజిక వర్గ, రాజకీయ, ప్రాంతీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం, కొన్ని ఉద్యోగాల్లో ఆశించిన విధులు, జీతాలు తక్కువగా ఉండటం పరిమితులుగా చెప్పొచ్చు. విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం తక్కువ. 3, 4 సంవత్సరాలకు నోటిఫికేషన్‌ రావడం, కోర్టు కేసులు, పరీక్షల వాయిదాలతో సంవత్సరాల తరబడి సాగటం లాంటి చిక్కులు ఉంటాయి.

సత్ఫలితాన్ని పొందేలా సరైన నిర్ణయం 

సివిల్స్‌ సర్వీసుల్లో, రాబోయే గ్రూపు-1 ఉద్యోగాల్లో ఏ తరహా అభ్యర్థులు ఏ నిర్ణయం తీసుకుంటే ప్రయోజనకరమో బేరీజు వేసుకోవాలి. 

ఫ్రెషర్స్‌ 

ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకుని, పైన పేర్కొన్న పోటీ పరీక్షల ద్వారా ఉన్నత ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులు ఈ కేటగిరీకి చెందినవారు. ఈమధ్య కాలంలోనే సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించినవారు కూడా ఈ కేటగిరీకి చెబుతారు. ఈ తరహా అభ్యర్థులు ఈ సంవత్సరానికి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లపై దృష్టి నిలపడం సమయానుకూల నిర్ణయం అవుతుంది. 

గ్రూప్‌-1లోని ప్రిలిమినరీ, మెయిన్స్‌ సిలబస్‌పై పట్టు సాధిస్తే ఆ అంశాలన్నీ తప్పనిసరిగా వచ్చే సంవత్సరం సివిల్స్‌ ప్రయత్నానికి ఉపయోగపడతాయి. 

తొలి ప్రయత్నంలో గ్రూప్‌-1 సాధిస్తే స్వీయ సామర్థ్యం మీద నమ్మకం ఏర్పడుతుంది దానితో సివిల్స్‌ ప్రయత్నాల్లో మరింత ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. 

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకునేవారు అవుతారు. 

సివిల్స్‌ నోటిఫికేషన్‌ ప్రతి సంవత్సరం విడుదల అవుతున్నందున ఈ సంవత్సరం వదులుకున్నా తదుపరి ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. 

అందుకని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 

గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ద్వారా సబ్జెక్టులపై పట్టుకు అవసరమైన పునాదులు బలంగా ఏర్పడతాయి. 

ఇవి సివిల్స్‌లో విజయావకాశాలనూ పెరిగేలా చేస్తాయి. 

సివిల్స్‌లోని పోటీ తీవ్రత వల్ల భవిష్యత్తులో అపజయం పొందినా గ్రూపు-1 ఉద్యోగంతో ఆ లోటును పూరించుకోవచ్చు. 

ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే- ఈ సంవత్సరం/ గత సంవత్సరం సన్నద్ధత ప్రారంభించిన అభ్యర్థులు సివిల్స్‌ కంటే గ్రూప్‌-1 వైపే మొగ్గు చూపటం సముచిత నిర్ణయం అవుతుంది.

రెండు మూడేళ్లుగా సివిల్స్‌లో కృషి చేస్తున్నవారు 

గత ప్రయత్నాల ద్వారా వచ్చిన ఫలితాలని పరిశీలించుకుని గ్రూప్‌-1 రాయాలా, సివిల్స్‌ రాయాలా అనే నిర్ణయాన్ని తీసుకోవాలి. 

గత ప్రయత్నాల్లో సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్ష రాసినా, ఇంటర్వ్యూ వరకు వెళ్లినా సివిల్స్‌ పరీక్ష రాయటమే సరైన నిర్ణయం అవుతుంది. 

సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్ష ముగిసేలోపుగా గ్రూప్స్‌ ప్రి‡లిమ్స్‌ పూర్తి అవుతుందేమో కానీ మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల సివిల్స్‌ పూర్తిచేసుకుని గ్రూప్‌-1పై దృష్టి పెట్టడం మేలు. 

సివిల్స్‌ ప్రయత్నంలో ఉండగానే ఒకవేళ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసినా అనుకూల ఫలితమే ఉంటుంది కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. గత ప్రయత్నాలకు కొనసాగింపుగా మరలా సివిల్స్‌పై దృష్టి పెట్టడం సరైన నిర్ణయం.

గత ప్రయత్నాల్లో కనీసం ప్రిలిమ్స్‌ క్వాలిఫై అవ్వలేని సందర్భంలో రెండో ఆలోచన లేకుండా గ్రూపు-1పై దృష్టి పెట్టడం వల్ల అనుకూల ఫలితాలుంటాయి. 

పూర్తి శక్తులను గ్రూప్‌-1పై నిలిపి సివిల్స్‌ అనుభవాన్ని జోడించడం వల్ల తప్పనిసరిగా గ్రూప్స్‌లో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.

ఆఖరి ప్రయత్న అవకాశం, గరిష్ఠ వయసు దాటిపోయే అభ్యర్థులది ప్రత్యేక పరిస్థితి.

వీరు గత ప్రయత్నాల్లో సాధించిన విజయాలను ప్రామాణికంగా తీసుకుని గ్రూప్‌-1 వైపు మొగ్గాలా, సివిల్స్‌ పరీక్ష వైపు మొగ్గు చూపాలా అనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గణాంక శాస్త్రంలో ఘనమైన కోర్సులు

‣ మరచిపోకుండా నేర్చుకోవాలంటే...!

‣ SSC CHSL: ఇంటర్‌ ఉంటే.. కొట్టేయవచ్చు కేంద్రం కొలువు!

‣ అటవీ ఉత్పత్తుల వృద్ధిలో నైపుణ్యం పెంచే కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌