• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ విజేతలకు అద్భుత శిక్షణ

అత్యంత స్ఫూర్తిదాయకం... ఆసక్తికరం

సివిల్‌ సర్వెంట్లు కావాలని కోట్ల మంది కలలు గంటారు. వారిలో కొన్ని లక్షల మందికే ఆ ప్రయత్నం చేసే ధైర్యం ఉంటుంది. అందులో సుమారు వెయ్యి మందే సఫలీకృతులవుతారు. తాజాగా సివిల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ర్యాంకులు సాధించిన వారంతా ముస్సోరీలోని ‘లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌’లో శిక్షణకు బయల్దేరుతున్నారు. కొన్ని వేల మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌... ఇతర సర్వీసుల ఆఫీసర్లను తయారుచేసిన ఈ అకాడమీది 65 ఏళ్ల చరిత్ర! ఇందులో పాటించే శిక్షణ విధానం ప్రపంచంలోనే విజయవంతమైన కరిక్యులమ్స్‌లో ఒకటి. దీని విశిష్టత తెలుసుకోవడం ప్రతి విద్యార్థికీ, ఉద్యోగార్థికీ ఆసక్తికరమే కాదు... స్ఫూర్తిదాయకం కూడా! ఆ వివరాలను తన అనుభవాల ద్వారా మనతో పంచుకుంటున్నారు ఇంకో రెండు నెలల్లో అకాడమీలో ఐఏఎస్‌ శిక్షణ పూర్తిచేసుకోనున్న గుంటూరుకు చెందిన మల్లవరపు సూర్యతేజ. అకాడమీ గురించి ఆయన మాటల్లోనే..

ఆల్‌ ఇండియా స్థాయిలో 76వ ర్యాంకు సాధించి 2020లో అకాడమీలో అడుగుపెట్టాను. నేను ఎనిమిదోతరగతిలో ఉన్నప్పుడు మా నాన్నగారితో కలిసి ఇదే అకాడమీ చూడటానికి వచ్చాను. ‘నేను కూడా పెద్దయ్యాక కలెక్టర్‌నవుతా నాన్నా’ అని ఆయనకి చెప్పానప్పుడు. కానీ నేను ఐఏఎస్‌ సాధించేటప్పటికి ఆయన నాకు దూరమైపోయారు. ఆ క్షణం మనసంతా ఏదోలా అయిపోయింది. కానీ అప్పుడే బ్యాచ్‌మేట్స్‌ పలకరించారు. అందరం మాట్లాడుకుంటూ వెళ్లాం. అలా మా ప్రయాణం మొదలైంది..

భారత్‌దర్శన్‌

శిక్షణార్థులంతా ఆసక్తిగా ఎదురుచూసేదీ, ప్రముఖంగా చెప్పుకోవాల్సిందీ భారత్‌దర్శన్‌ గురించి. మొత్తం అందరినీ బృందాలుగా విభజించి 45 రోజులపాటు దేశంలోని వివిధ చోట్లకు పంపిస్తారు. ఆ సమయంలో కొన్ని అసైన్‌మెంట్లు, అటాచ్‌మెంట్లు కూడా ఉంటాయి. ప్రదేశాలన్నింటినీ చూస్తూ, వాటి గురించి నేర్చుకుంటూ, ఇచ్చిన పని పూర్తి చేయడం ఆసక్తికరంగా అనిపించింది. ఆర్మీ అటాచ్‌మెంట్‌లో భాగంగా కశ్మీర్‌లోని ఉరి సెక్టర్‌కు వెళ్లాం. 10 రోజులపాటు శ్రీనగర్‌లో తిరిగాం. పాకిస్థాన్‌ సరిహద్దులో రాత్రిపూట సైనిక దుస్తుల్లో గస్తీలో ఉన్నప్పుడు... మనసంతా ఏదో తెలీని భావోద్వేగంతో నిండిపోయింది. నేనూ ఒక సైనికుడిలాగానే ఆలోచించా. తర్వాత ఏర్‌ఫోర్స్‌ అటాచ్‌మెంట్‌ కోసం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వెళ్లాం. అపాచీ హెలికాప్టర్లు ఎలా పనిచేస్తాయో అక్కడి అధికారులు చూపించారు. అనంతరం నేవల్‌ అటాచ్‌మెంట్‌ కోసం ముంబై చేరుకున్నాం. సబ్‌మెరైన్‌ ద్వారా సముద్రంలోకి వెళ్లినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. త్రివిధ దళాల పనితీరుపై అవగాహన కల్పించేందుకే ఇవన్నీ!

అనంతరం ట్రైబల్‌ అటాచ్‌మెంట్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఆదివాసీల తండాకు వెళ్లాం. ‘పైగా’ అనే తెగ ప్రజలను కలిసి వారి జీవనవిధానాన్ని దగ్గర్నుంచి పరిశీలించాం. భూమిని తల్లిగా భావించే ఆ జనం... నేలను దున్నరు, చెట్లు నరకరు, అబద్ధాలు చెప్పరు! వారి నిబద్ధతను చూసి ఇలాంటి ప్రజలకు ఎంతో చేయాలనే ఆలోచన కలిగింది నాకు. తర్వాత స్టాటిస్టికల్‌ అటాచ్‌మెంట్‌ కోల్‌కతాలో జరిగింది. దేశవ్యాప్తంగా విభిన్న అంశాల గురించి ఎంతో సమాచారం ఉంటుంది కదా! దాన్ని ఏ కోణంలో చూడాలి, ఎలా ఉపయోగించాలన్నది ఇందులో నేర్చుకున్నాం. ఐలాండ్‌ అటాచ్‌మెంట్‌లో భాగంగా అండమాన్, నికోబార్‌ దీవులకు తీసుకెళ్లారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రజల స్థితిగతులను పరిశీలించాం. ఆ తర్వాత ఇస్రోకు వెళ్లాం. అక్కడి శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3 ప్రయోగం గురించి వివరించారు. ల్యాండర్, రోవర్‌ను చూపించారు. అదో చక్కటి  అనుభవం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అటాచ్‌మెంట్‌లో బెంగళూరు, ముంబై ఎయిర్‌పోర్ట్‌లను చూశాం. ఆధునిక నిర్మాణశైలి గురించి తెలుసుకున్నాం.

కొవిడ్‌ సమయంలో ముంబై అధికారుల తీరు ప్రశంసనీయం. వారి నిర్ణయాలతో ఆ నగరం కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంది. అది అక్కడి అధికారులు ఎలా చేశారో వాళ్లతో మాట్లాడి తెలుసుకున్నాం. దేశమంతా పర్యటించడంతోపాటు ఏ క్యాడర్‌కు చెందిన అధికారులు ఆ రాష్ట్ర దర్శన్‌కు కూడా వెళ్తారు. అలా నేను ఏపీలో ఇంతకుముందు చూడలేని ప్రాంతాలు చూశాను. ఎందుకంటే నాది ఆంధ్రా క్యాడరే.

ఐఏఎస్‌ అధికారుల శిక్షణ కాలం మొత్తం రెండేళ్లు. తొలి ఏడాది అకాడమీలోనే వివిధ తరగతులుంటాయి. మొదటి మూడు నెలలు ఫౌండేషన్‌ కోర్సు. రెండో ఏడాది ఏదైనా ఒక జిల్లాకు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పంపిస్తారు. నేనలా అనంతపురం వెళ్లాను. తొలుత తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను తర్వాత అనుభవపూర్వకంగా నేర్చుకుంటాం. అకాడమీలో ఉన్నప్పుడు ప్రాథమిక అంశాలతోపాటు లా, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ నేర్పిస్తారు. ఇతర రాష్ట్రాల క్యాడర్‌కు ఎంపికైన అధికారులకు ఆయాచోట్ల మాట్లాడే భాషలపై కూడా తరగతులుంటాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, వివిధ రంగాల్లో నిష్ణాతులతో అతిథి ఉపన్యాసాలు జరుగుతాయి. జిల్లాలకు పంపేటప్పుడు ఆ జిల్లా కలెక్టర్‌కు మమ్మల్ని అనుసంధానం చేశారు. వారిని దగ్గర్నుంచి చూసి చాలా విషయాలు నేర్చుకున్నాం. అక్కడ ఉన్నప్పుడు తహసీల్దార్, ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్, స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకెండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేÆట్‌గా వివిధ స్థాయుల్లో పనిచేసి వారి విధులపై అవగాహన పెంచుకున్నాం.

విశాల భారత్‌

ఒక సివిల్‌ సర్వెంట్స్‌ బ్యాచ్‌లో ‘రాయల్‌ భూటాన్‌ సివిల్‌ సర్వీస్‌’ అధికారులతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అధికారులు ఉంటారు. తొలిరోజు నుంచి మనమంతా ఒక్కటనే భావనను అకాడమీ కల్పిస్తుంది. అందరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వటంతోపాటు   దేశాన్ని కలిపి ఉంచే ప్రేమను అధికారుల్లో నింపుతుంది. అది ఎంత బలంగా వారి మనసుల్లో నాటుకుంటుందంటే.. సర్వీస్‌ చివరిరోజు వరకూ వారు అదే ఆలోచనతో పనిచేస్తారు!

ఫేజ్‌ 2లో...

ఫేజ్‌ 1 శిక్షణలో అనుభవాలు పోగుచేసుకుంటాం. ఫేజ్‌ 2లో వాటిని అందరితో పంచుకుంటాం. కలెక్టర్‌ కాబోయే వ్యక్తికి డాక్యుమెంటేషన్‌ ఎలా చేయాలో తెలియడం చాలా ముఖ్యం. అందుకే మా అనుభవాలు, అభిప్రాయాలను రెండు నెలలకోసారి అకాడమీకి డీవో (డెమీ అఫీషియల్‌) లేఖ ద్వారా తెలియజేస్తాం. ప్రతి ఆఫీసర్‌ ఏదో ఒక మారుమూల పల్లె గురించి అధ్యయనం చేస్తారు. ప్రజల జీవనశైలిని తెలుసుకుంటారు. వారి అభివృద్ధికి ఏంచేయాలో ఆలోచిస్తారు. ప్రతి స్థాయిలోనూ పరీక్షలు ఉంటాయి. చివర్లో దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పట్టా అందుతుంది.

కేంద్రం పనితీరుపై..

శిక్షణలో కొత్తగా దిల్లీలో కూడా కొద్దిరోజులపాటు పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి అధికారి మూడు నెలలపాటు అక్కడ అసిస్టెంట్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తారు. గతంలో నేరుగా రాష్ట్రాలకు కేటాయించడం వల్ల ఎప్పుడైనా కేంద్రానికి వెళ్తే అధికారులు కొత్తలో ఇబ్బంది పడేవారు. అందుకే అందరికీ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు.

హిమాలయాల్లో ట్రెక్కింగ్‌

ప్రతి ఒక్కరూ 14 రోజులపాటు హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లాలి. మేం అలా జోషి మఠ్‌ ప్రాంతానికి వెళ్లాం. ఎలాంటి సౌకర్యాలు లేకుండా, ఫోన్‌ సిగ్నల్స్‌ సైతం అందుబాటులో లేని ఆ చోటు... ఓ కొత్త ప్రపంచంలా కనిపిస్తుంది. పగలంతా నడిచినంత నడిచి, రాత్రుళ్లు క్యాంప్‌లు వేసుకుని కాలక్షేపం చేసేవాళ్లం. ఆ సమయంలో ప్రతి ఒక్కరిలోనూ స్నేహితులను వెతుక్కుంటాం. అదో గొప్ప అనుభూతి.

5 గంటలకే..

అక్కడ ప్రతి అధికారి పొద్దున్న 5 గంటలకల్లా నిద్ర లేవాలి. శారీరక సామర్థ్యానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. శిక్షకుల ఆధ్వర్యంలో కసరత్తులు చేయిస్తారు. అన్నిరకాలైన ఆటలూ ఆడే వీలుంది. స్విమ్మింగ్‌ పూల్, జిమ్, టెన్నిస్‌కోర్ట్, బ్యాడ్మింటన్‌ కోర్టు సైతం ఉన్నాయి. గుర్రపుస్వారీని స్వయంగా దేశ అధ్యక్షుడి రక్షణదళ అధికారులు నేర్పిస్తారు. అకాడమీకి సొంతంగా బోలెడు గుర్రాలున్నాయి.

అన్ని రకాల రుచులు..

శిక్షణకు అన్ని రాష్ట్రాల నుంచి అధికారులు రావడం వల్ల మొత్తం దేశంలో లభించే ఆహార పదార్థాలన్నీ అక్కడ దొరుకుతాయి. మెస్‌ కమిటీ ఉంటుంది, అందులో ట్రైనీలే సభ్యులు. ఏ వారం ఏ రాష్ట్రం మెనూ అమలు కావాలో వారే నిర్ణయిస్తారు. అందరూ సంతృప్తిగా భోజనం చేసేలా ఏర్పాట్లుంటాయి. భవిష్యత్తులో దేశవిదేశాల అధికారులతో కలిసి భోంచేసే అవసరం ఉండటం వల్ల... భోజనకాల మర్యాదలు (ఎటికెట్స్‌) కూడా నేర్పిస్తారు. ఎందరో ఉన్నత స్థాయి అధికారులు భోంచేసిన చోటు కావడంతో దాన్ని ఆఫీసర్స్‌ మెస్‌ అంటారు. అధికారులంతా అక్కడికి ఫార్మల్స్, సూట్స్‌లోనే వెళ్తారు. అది ఒక సంప్రదాయంగా నడుస్తోంది. ఆ చోటుకు మనం ఇచ్చే మర్యాద అది! 

ఎన్నో విభాగాలు..

తరగతులన్నీ జ్ఞాన్‌శిలా భవనంలో జరుగుతాయి. సభలు, సమావేశాల కోసం సంపూర్ణానంద ఆడిటోరియం ఉంది. ఇవే కాకుండా శిక్షణ తీసుకుంటున్న అధికారులంతా రకరకాలైన క్లబ్‌లుగా ఏర్పడతారు. సాహసాలు, కళలు, సాహిత్యం... ఇలా 20కిపైగా క్లబ్‌లు ఉన్నాయి. ప్రతి అధికారికీ ప్రత్యేకంగా గది ఉంటుంది. ఎప్పుడైనా అవసరమైతే ఇతరులతో పంచుకోవాల్సి ఉంటుంది.

వ్యక్తి నుంచి అధికారిగా..

ఈ శిక్షణ ఉద్దేశం మన తెలివిని పెంచడం కాదు. ఎందుకంటే తెలివి, క్రమశిక్షణ, శ్రమించే గుణం  కలిగిన వారు మాత్రమే సివిల్స్‌ పరీక్ష నెగ్గగలరు. ఒక అధికారిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా దేశ సమగ్రతను కాపాడేలా... ప్రజల బాగు కోసం పనిచేసేలా మనల్ని తీర్చిదిద్దుతుంది ఈ అకాడమీ.  పరీక్ష పాసై శిక్షణార్థిగా లోపలికి ప్రవేశించిన వారు ఒక సంపూర్ణ వ్యక్తిగా, సమర్థుడైన ఐఏఎస్‌ అధికారిగా బయటకొస్తారు. ఈ పరీక్ష రాయాలి అనుకునే యువతకు చెప్పేది ఒక్కటే. మిమ్మల్ని మీరు నమ్మి...మీ కష్టానికి పదునుపెట్టి శ్రమించండి. మీ లాంటి వారికోసమే లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎదురుచూస్తోంది!
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ దివ్యమైన కోర్సులు

Posted Date : 22-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌