• facebook
  • whatsapp
  • telegram

యువ ఐఏఎస్‌లు ఏమంటున్నారంటే..?

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ గెలుపు మెలకువలు

వారు అందరిలా సివిల్స్‌ నెగ్గాలని కలలు కన్నారు. ఐఏఎస్‌లు కావాలని కఠోరంగా శ్రమించారు. మొదటి విడతలో లక్ష్యాన్ని చేరుకోకున్నా తాము చేసిన తప్పులూ పొరపాట్లను సరిదిద్దుకుంటూ విజయపథంలో నడిచారు. ఫలితం...ఇప్పుడు వారు  వివిధ హోదాల్లో అధికారులుగా పనిచేస్తున్నారు. సివిల్‌ సర్వీసెస్‌- 2021 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబరు 10న జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది వరకు హాజరుకానున్నారు. మరి పరీక్షకు ముందు ఎలా సన్నద్ధం కావాలి? ఈ చివరి కొద్దిరోజుల్లో ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? యువ ఐఏఎస్‌ల సూచనలూ, సలహాలూ ఏమిటో తెలుసుకుందామా?

వివిధ సంస్థల నమూనా పరీక్షలు రాయండి - ఎస్‌.కృష్ణ ఆదిత్య, కలెక్టర్, జయశంకర్‌ భూపాలపల్లి

తప్పుగా సమాధానం గుర్తించిన ప్రశ్నలను విశ్లేషించుకుని, ఆ లోపం సవరించుకోవటం అవసరం. 

ఒక అంచనాతో సమాధానాలు గుర్తించిన ప్రశ్నలు మనకు రానట్లుగానే భావించి ఆ అంశాలను బాగా చదవాలి.

2013లో సివిల్స్‌లో 99వ ర్యాంకు సాధించాను. మూడు విడతల తర్వాత లక్ష్యాన్ని చేరుకున్నా. చాలా మంది ఒకే సంస్థ నిర్వహించే నమూనా (మాక్‌) పరీక్షలు రాస్తుంటారు. అందులో మీ ర్యాంకు బాగానే ఉండొచ్చు. అయితే ఒకే సంస్థ పరీక్షలు రాస్తే నష్టపోతారు. అందుకే వివిధ సంస్థలు నిర్వహించే పరీక్షలను రాసి వాటిల్లోనూ మంచి ప్రతిభ చూపాలి. ఇప్పుడు ఎన్నో సంస్థలు ఆన్‌లైన్‌ మాక్‌ పరీక్షలు జరుపుతున్నాయి.

అధిక శాతం మంది పరీక్ష రాసిన తర్వాత ‘ఎన్ని మార్కులు వస్తాయి? ఎన్ని ప్రశ్నలకు సరిగా రాశాం?’ అని ప్రశ్నించుకుంటారు. కానీ తప్పుగా సమాధానం గుర్తించిన ప్రశ్నలపై ప్రధానంగా విశ్లేషించుకోవటం అవసరం. ఏ అంశాలపై ప్రశ్నలను బాగా చేయగలిగాం...ఏవి చేయలేకపోయామని విశ్లేషించుకోవాలి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకున్నా ఒక అంచనాతో సమాధానాలు గుర్తిస్తాం. అవి సరైన జవాబు అయినా మనకు రానట్లుగానే భావించి ఆ అంశంపై బాగా చదవాలి.

సాధారణంగా ప్రశ్నపత్రంలో మొదటి ప్రశ్నలు కొంత కఠినంగా ఉంటాయి. అధిక శాతం మంది మొదటి ప్రశ్న నుంచి జవాబులు గుర్తించే ప్రయత్నం చేస్తారు. కఠినంగా ఉన్నా...దానికి జవాబు తెలియకున్నా ఆ ప్రశ్న వద్దే ఆగిపోతుంటారు. ఒక్కో ప్రశ్నకు ఒకటీ లేదా రెండు నిమిషాల కంటే ఎక్కువ కేటాయించరాదు. జవాబు తెలియకుంటే వెంటనే మరో ప్రశ్న వద్దకు వెళ్లిపోవాలి. 100 శాతం సరైన జవాబులు తెలిసినవాటిని  మొదట గుర్తించి....తర్వాత మిగిలినవి పరిష్కరించుకుంటూ రావాలి.

కొంతమంది అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తిస్తారు. అయితే కొన్ని మార్లు ఓఎంఆర్‌ పత్రంలో మార్కింగ్‌ చేయడం మరిచిపోతారు. నేను దిల్లీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఓ అభ్యర్థి ఓ ప్రశ్నకు జవాబు మార్కింగ్‌ చేయనందువల్ల ఏడాది వృథా చేసుకున్న విషయం తెలుసు. ఒక ప్రశ్న అంటే రెండున్నర మార్కులు. పోటీ ఎక్కువ...పోస్టులు తక్కువ కాబట్టి ఆ మార్కులు అభ్యర్థి జాతకాన్నే తారుమారు చేస్తాయి. రుణాత్మక మార్కులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

హాజరయ్యేది సగం మందిలోపే! 

ఏటా దరఖాస్తు చేసుకునేవారిలో సగం మందే సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్నారు. అందువల్ల ‘అమ్మో....పోటీ తీవ్రంగా ఉంటుం’దని ఆ సంఖ్యను చూసి ఆందోళన చెందవద్దని నిపుణులు సూచిస్తున్నారు. హాజరయ్యే వారిలో కేవలం 10-20 శాతం మందే పూర్తి స్థాయిలో సన్నద్ధమై వస్తారని చెబుతున్నారు.

మూడు అంశాల గణాంకాలపై జాగ్రత్త - ఆదర్శ్‌ సురభి, కమిషనర్, ఖమ్మం నగర కార్పొరేషన్‌

మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అత్యంత అవసరం. ఇది పునశ్చరణ కంటే ఎక్కువ. 

ఏటా వేల మంది అభ్యర్థులు కొన్ని ప్రశ్నలకు బబ్లింగ్‌ మరిచిపోతుంటారు. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. 

ఐఐటీ దిల్లీలో 2016 బీటెక్‌ పూర్తి చేసిన నేను 2017లో రెండో ప్రయత్నంలో 393 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యాను. మొదటి ప్రయత్నంలో మాత్రం మెయిన్‌లో నెగ్గలేదు. సాధారణంగా అభ్యర్థులు అత్యున్నతంగా సన్నద్ధమైనా పరీక్ష తేదీ దగ్గరపడే కొద్దీ ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి ప్రిలిమ్స్‌ సిలబస్‌ చాలా ఎక్కువ. అదో మహా సముద్రం. అందుకే మొదట దాన్ని తలచుకొని కంగారుపడటం ఆపాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం అత్యంత ప్రధానం. ప్రశాంతచిత్తంతో ఉండటం పునశ్చరణ కంటే ఎక్కువని గుర్తించాలి. సివిల్స్‌ 2021 ప్రాథమిక పరీక్షకు ఇక కొద్దిరోజులే గడువు ఉన్నందున పక్కాగా ప్రణాళిక వేసుకొని సిద్ధం కావాలి. 

చాలామంది పరీక్షకు ముందు కూడా కరంట్‌ అఫైర్స్‌పై (వర్తమాన విషయాలు) దృష్టి కేంద్రీకరించి చదువుతుంటారు. వాస్తవానికి పరీక్ష ప్రశ్నపత్రం నెల రోజులు ముందుగానే ప్రచురితమవుతుంది కాబట్టి తాజా వర్తమాన అంశాల జోలికి వెళ్లొద్దు.

ఈ 15 రోజుల్లో గణాంకాలపై మనసు పెట్టాలి. అవి జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి కాబట్టి వాటి పునశ్చరణ ముఖ్యం. మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. భారత రాజ్యాంగం, ఆధునిక చరిత్ర, ఆర్థికశాస్త్రాలపై బాగా పట్టు సాధించేలా...అందులో గణాంకాలను గుర్తుంచుకునేలా కృషి చేయాలి.

రుణాత్మక మార్కులున్నాయి, నిజమే. జవాబుపై 50 శాతం విశ్వాసమున్నా దాన్ని గుర్తించడం మంచిదే.

చివరగా ఓఎంఆర్‌ పత్రంలో బబ్లింగ్‌ చేయడం మరిచిపోవొద్దు. ఇది కూడా తెలియదా? అని చాలామంది అనుకుంటారు. అలాంటి వారు ఏటా వేల మంది కొన్ని ప్రశ్నలకు బబ్లింగ్‌ చేయకుండా మరిచిపోతుంటారనేది వాస్తవం.

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇవిగో సివిల్స్‌ విజయ రహస్యాలు

‣ దూసుకువెళ్తున్న డేటా సైన్స్‌!

‣ న్యాయవిద్యలో మేటి!

Posted Date : 28-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌