• facebook
  • whatsapp
  • telegram

ఏది.. ఎప్పుడు ఎలా మాట్లాడాలి?

దేశంలోనే అత్యున్నత సర్వీసులోకి ప్రవేశించే అధికారి అంటే.. లోతైన పరిజ్ఞానం.. ఆత్మవిశ్వాసాలకు మారుపేరు.. సామాజిక సేవకు సదా సిద్ధంగా ఉండే సేవకుడు.. ధీరోదాత్త నాయకుడు.. నిజాయతీకి నిలువుటద్దం. ఈ లక్షణాలన్నింటినీ పసిగట్టి వడగట్టే పరీక్ష పర్సనాలిటీ టెస్ట్‌. సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ ఫలితాలు జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇరవై రోజుల్లో ఇంటర్వ్యూలు మొదలవుతాయి. ఈ మధ్యలోనే చివరిదశ వ్యక్తిత్వ పరీక్షకు అభ్యర్థులు సిద్ధం కావాలి. సివిల్స్‌ శిఖరారోహణలో చివరి సోపానం ఇంటర్వ్యూ. మొత్తం పరీక్షలో 275 మార్కులున్న ముఖాముఖీ... అభ్యర్థి ర్యాంకు నిర్ధారణలో కీలకపాత్రను పోషిస్తుంది. తుది దశ అయిన ఈ మౌఖిక పరీక్ష పరిజ్ఞాన పరీక్ష కాదు. సుమారు అరగంటపాటు జరిగే ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని వివిధ కోణాల్లో తులాభారం వేస్తూ దేశంలోనే అత్యున్నతమైన సర్వీస్‌లో చేరడానికి ఎంతవరకూ అర్హులో పరిశీలిస్తారు.


ఇంటర్వ్యూలో కనీస అర్హత (కటాఫ్‌) మార్కులేమీ ఉండవు. సివిల్‌ సర్వీస్‌ పరీక్ష విధానంలో ఇంటర్వ్యూకు కేటాయించినవి 13.5 శాతం మార్కులే! కానీ దీనిలో స్కోరు చేసిన మార్కులు గరిష్ఠమైన తేడాను తీసుకురాగలవు. మెయిన్స్‌లో నెగ్గిన అభ్యర్థుల మార్కుల్లో సాధారణంగా పెద్దగా అంతరం ఉండదు. దీంతో కొంచెం ఎక్కువ మార్కులను ఇంటర్వ్యూలో తెచ్చుకుంటే ఐపీఎస్‌ బదులు ఐఏఎస్‌ క్యాడర్‌ పొందటం సాధ్యమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే... జీవితకాలం కెరియర్‌ను నిర్ణయించే అత్యంత ప్రధానమైన మార్కులివి. మెయిన్‌ పరీక్షను ప్రాంతీయ భాషలో రాసినవారికి మాత్రమే ఇంటర్వ్యూలో ఆ భాషలో జవాబులు చెప్పే అవకాశం గతంలో ఉండేది. 2011 నుంచీ ఈ నిబంధనను మార్చారు. అభ్యర్థి మెయిన్స్‌ పరీక్ష మీడియంతో సంబంధం లేకుండా ఏ భాషలోనైనా సమాధానాలిచ్చే వెసులుబాటు కల్పించారు.


ఏకకాలంలో 6-7 బోర్డులు
పర్సనాలిటీ టెస్ట్‌ను ఆరు నుంచి ఏడు ఇంటర్వ్యూ బోర్డులు ఏకకాలంలో నిర్వహిస్తాయి. ప్రతి బోర్డుకూ యూపీఎస్‌సీ సభ్యుడి నేతృత్వంలో నలుగురు నిపుణులు (రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంట్లు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ఇతర రంగాలవారు) ప్రాతినిథ్యం వహిస్తారు. ఈ నిపుణులు చివరివరకూ ఒకే బోర్డులో కొనసాగకుండా ప్రతి వారం వివిధ బోర్డులకు మారుతుంటారు. ఒక్కో ఇంటర్వ్యూ బోర్డు ప్రతిరోజూ సుమారు 11 మంది అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తుంది. సిఫార్సులు, ప్రభావితం చేయటం లాంటివాటికి తావివ్వనిరీతిలో పకడ్బందీగా పర్సనాలిటీ టెస్టులు జరుగుతాయి.


ఇలా కసరత్తు చేస్తే మేలు
మెయిన్స్‌కు సిద్ధమైన తరుణంలో ముఖ్యమైన టాపిక్స్‌ను జాబితాగా రాసుకునివుంటారు. వాటిని మళ్లీ రాసుకోవాలి. వాటిలో
1) వాస్తవికాంశాలకు సంబంధించినవీ,
2) అభిప్రాయాల ఆధారమైనవీ ఉంటాయి. వాటిలో రెండో రకం అంశాలు ఇంటర్వ్యూకు ముఖ్యమైనవి. వాటి ప్రాసంగికత (రెలెవన్స్‌)ను అత్యంత, సగటు, తక్కువ అనే మూడు రకాలుగా వర్గీకరించుకోవాలి. ఎక్కువమందిని ప్రభావితం చేసేవి, అభ్యర్థికి నేరుగా సంబంధం ఉన్నవీ అనే గీటురాళ్లతో ఈ ప్రాసంగికతను నిర్ణయించుకోవాలి.
ఇలా చేశాక వాటిపై నోట్సు తయారుచేసుకోవటం మొదలుపెట్టాలి. ఈ నోట్సు అనుకూలం- ప్రతికూలం అనే ఫార్మాట్‌లో ఉండాలి.
నోట్సు రూపొందించుకుని, ఏ అంశంలో ఏ ప్రశ్నలు అడగవచ్చో ఆలోచించుకోవాలి.
వాటికి జవాబులను చెప్పటం సాధన చేయాలి. మొదట్లో అస్పష్టంగా, పొంతన లేకుండా జవాబులు వస్తాయి. అది సహజం. క్రమంగా మెరుగుపడుతుంది.
ఇలా డిసెంబరు వరకూ అన్ని టాపిక్‌లపై కసరత్తు చేయాలి.
జనవరి నుంచి అనుభవజ్ఞుల నేతృత్వంలో నమూనా ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. వారు ప్రతికూల అంశాలను నిర్మొహమాటంగా చెప్పగలిగితే వాటిని సవరించుకునే అవకాశం ఉంటుంది.
బయోడేటాపె, కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల వృత్తి, జిల్లా, రాష్ట్రాలపై అవగాహన ఉండాలి.
చదివిన సబ్జెక్టులో కీలక భావనలూ, తాజా పరిణామాలూ ముఖ్యమే.


ఇంటర్వ్యూలో ఇలా మార్కులు..
ఇంటర్వ్యూలో ఇవ్వదగ్గ మార్కులను నిర్దేశిస్తూ అరుణ్‌ నిగవేకర్‌ కమిటీ కింది పద్ధతిని సిఫార్సు చేసింది. స్వల్ప మార్పులతో దీన్నే అనుసరిస్తున్నారు.
సామాజిక ఏకత, నాయకత్వ లక్షణాలు, సివిల్‌ సర్వీసులకు తగిన లక్షణాలు: 70
మానసిక సంసిద్ధత, విశ్లేషణపూర్వక తార్కికత, నైపుణ్యాల సమీకరణం, అంచనాలో సమతూకం: 70 లోతైన, వైవిధ్యభరిత ఆసక్తులు: 45
భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు: 45
నైతిక, మేధాపరమైన నిజాయతీ: 45 మొత్తం: 275


ఆరు కోణాల్లో అంచనా!
ప్రధాన పరీక్షకు ఏం రాస్తున్నాం? ఎలా విశ్లేషించి రాస్తున్నామన్నవి ప్రధానమైతే, ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాం? ఎలా మాట్లాడుతున్నాం అనేవి ముఖ్యం. ఎదురుగా నిష్ణాతులు ఒకరి తరువాత మరొకరు ప్రశ్నలను సంధిస్తుంటే వెంటనే స్పందించాల్సి ఉంటుంది. అభ్యర్థి తన అంతరంగ ఆవిష్కరణ ఎంత సమర్థంగా చేయగలిగితే అంతగా ఇంటర్వ్యూ బోర్డు సభ్యులను ఆకట్టుకోగలుగుతాడు. ఏం మాట్లాడాలి (కంటెంట్‌), ఎలా మాట్లాడాలి (ప్రెజెంటేషన్‌) అనేవాటిపై పట్టు సాధించగలగాలి.
అభ్యర్థి ప్రతిభను కింది అంశాల్లో బేరీజు వేస్తారు.
1. భావవ్యక్తీకరణ స్పష్టత: అభ్యర్థిని 20 నుంచి 30 నిమిషాలపాటు వివిధ విషయాలపై మాట్లాడించినపుడు.. తన భావాలను క్రమపద్ధతిలో, స్పష్టంగా వ్యక్తీకరించగలుగుతున్నాడా? ఒకే విషయంపై వేరువేరు ప్రశ్నలకు వైరుధ్యమైన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారా? భావాల మధ్య తార్కిక అనుసంధానం, ఆలోచనల్లో హేతుబద్ధత ఉందా?అనేవి పరిశీలిస్తారు.
2. సంక్లిష్ట అంశాల స్వీకారం: సమాజంలో వైరుధ్య భావాలను ఆకళింపు చేసుకుని స్వీకరించగలిగే వ్యక్తిత్వం అభ్యర్థికి ఉందో లేదో పరిశీలిస్తారు.
3. మానసిక చురుకుదనం: అభ్యర్థి మానసికంగా అప్రమత్తత కలిగిన వ్యక్తేనా? వివిధ రకాల మానవ భావోద్వేగాలను అర్థం చేసుకుని, స్పందించే వ్యక్తిత్వమేనా?.. వంటి ప్రశ్నల ద్వారా మానసిక చురుకుదనానికి సంబంధించి అంశాలను పరిశీలిస్తారు.
4. మదింపులో సమతుల్యత: అడిగే వివిధ ప్రశ్నల్లో వివాదాస్పదమైన అంశాలూ ఉండొచ్చు. కొన్ని సున్నిత విషయాలనూ అడగొచ్చు. వీటికి అభ్యర్థి భావోద్వేగాలకు, సామాజిక నేపథ్యానికి అతీతంగా తన అంచనాలు, అభిప్రాయాలను వ్యక్తీకరించగలుగుతున్నాడా లేదా అనుచిత వ్యాఖ్యలు, అసమంజస అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడా అనేవి పరిశీలిస్తారు.
5. వైవిధ్యభరిత విషయాలపై ఆసక్తి: విభిన్న రంగాల్లో నిష్ణాతులైన బోర్డు సభ్యులు అభ్యర్థికి వేర్వేరు రంగాలపై లోతైన అవగాహన, ఆసక్తి ఉన్నాయో లేదో గుర్తించే ప్రయత్నం చేస్తారు.
6. కలుపుగోలుతనం, నాయకత్వ లక్షణాలు: ఇంటర్వ్యూ బోర్డు.. తమ ముందు కూర్చున్న వ్యక్తి నలుగురితో కలిసి పని చేయగలడా లేదా? అతనిలో బృందానికి నాయకత్వం వహించే లక్షణాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది.
ఈ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ అర్థమయ్యే భాష, క్రమబద్ధమైన ఆలోచనలు, అభిప్రాయ వ్యక్తీకరణలో సంయమనం కూడా ముఖ్యం.


సమకాలీనం..
అభ్యర్థి వ్యక్తిత్వంలోని విభిన్న పార్శ్వాలను తెలుసుకోవడానికి వర్తమాన అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తారు. ఉదాహరణకు- లైంగిక వేధింపులపై ‘మీ టూ’ ఉద్యమం, భారత్‌ తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌, పర్యావరణ హితానికి దారితీసే కార్బన్‌ న్యూట్రల్‌, అర్బన్‌ నక్సలిజం.. ఇలా వివిధ అంశాలపై అభ్యర్థికి ఆసక్తి ఉందో లేదో, వాటిపై అభ్యర్థి వైఖరి ఏమిటో బోర్డు తెలుసుకోగలుగుతుంది.
కొందరు మెయిన్స్‌ పరీక్ష ముగియడంతోనే దినపత్రికలను చదవడం, సమకాలీన అంశాలపై దృష్టిపెట్టడం తగ్గిస్తారు. అది సరి కాదు. వివిధ అంశాల్లో అభ్యర్థి రెండువైపుల వాదనలనూ పరిశీలించి వాటిలో తనకు సమంజసమనిపించిన దాన్ని ఎంచుకుని కచ్చితమైన నిర్ణయానికి రావాలి. ఒకవేళ బోర్డు సభ్యులు వివిధ అంశాలపై ప్రశ్నలను అడిగినపుడు ఏ వాదనను సమర్థిస్తే ఏమనుకుంటారోనన్న సంశయంతో గోడమీది పిల్లి వాటం ప్రదర్శించకూడదు. తన వాదనను వినిపిస్తూనే.. సమాధానం రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామ్యయుతంగా ఉండేలా చూసుకోవాలి. అనవసర వాగ్వాదాలకు చోటివ్వకూడదు. ముఖ్యంగా చెప్పే విషయ పరిధిని దాటి, అనవసర విషయాలవైపునకు వెళ్లొద్దు.


లేని అభిరుచి రాస్తే చిక్కులే!
‘‘యూపీఎస్‌సీ నిర్వహించేది కేవలం సాధారణ ఇంటర్వ్యూ కాదు, ఇది వ్యక్తిత్వ పరీక్ష. ఆత్మవిశ్వాసం మన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. అలాంటి లక్షణమే అభ్యర్థుల్లో ఉండాలని ఇంటర్వ్యూ బోర్డు ఆశిస్తుంది. అలాగే బయోడేటాకు చాలా ప్రాముఖ్యం ఉంది. తెలియనిది ఏదీ దానిలో రాయకూడదు. ఉదాహరణకు- స్టాంపుల సేకరణ, డైరీ రాయటం మొదలైనవి తమ హాబీలుగా కొందరు రాస్తారు. వాటిపై వారికి నిజంగానే అభిరుచి ఉంటే మంచిదే. లేకపోతే మాత్రం వాటిపై ఇంటర్వ్యూ చేసేవారు సంధించే ప్రశ్నలతో చిక్కుల్లో పడటం ఖాయం’’ - దురిశెట్టి అనుదీప్‌, 2017 ఆలిండియా సివిల్స్‌ టాపర్‌

Posted Date : 11-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌