• facebook
  • whatsapp
  • telegram

ప్రిలిమ్స్‌ వ్యూహం!

మెరుగైన మార్కుల కోసం తుది మెరుగులు

ఎందరో విద్యార్థుల అపురూపమైన కల.. ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ సాధించటం! అక్టోబరు 10న సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష జరగబోతోంది. గత ఏడాది అనిశ్చిత పరిస్థితుల మధ్య ఈ ప్రిలిమ్స్‌ను నిర్వహించారు. ఈ ఏడాది పరిస్థితులు కాస్త మెరుగవటంతో      సజావుగా పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. దీనిలో నెగ్గి, మెయిన్స్‌కు అర్హత పొందాలంటే.. తుది మెరుగులు ఎలా దిద్దుకోవాలో తెలుసుకుందాం!  

సివిల్స్‌ ప్రిలిమినరీ అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించిన కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. 

పోటీ ఎక్కువ: కిందటి ఏడాది అనిశ్చిత పరిస్థితుల కారణంగా చాలామంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి వెనకడుగేశారు. కోచింగ్‌ సెంటర్లలో చేరి శిక్షణ తీసుకోలేకపోవడం, కొవిడ్‌ సంబంధిత వార్తలు వినడం వల్ల కలిగిన మానసిక ఆందోళనతో అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. ఈ ఏడాది పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ పద్ధతుల్లో క్లాసులకు హాజరవుతున్నారు. చాలా శిక్షణ సంస్థలు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో క్లాసులను నిర్వహిస్తున్నాయి. దాంతో పరీక్షకు మెరుగ్గా సిద్ధమవుతున్న విద్యార్థుల సంఖ్య, పోటీ పెరిగాయి. 

ఖాళీలు తక్కువే: ఈ ఏడాది ఖాళీల సంఖ్యా తక్కువే. ఈ సంవత్సరం 712 ఖాళీలు ఉంటే.. కిందటి ఏడాది 796 ఉన్నాయి. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది 84 ఖాళీలు తగ్గాయి. అంటే మెయిన్స్‌కు అర్హత పొందే అభ్యర్థులు 9250- 9500 మంది మాత్రమే ఉంటారు. అంటే పోటీ పెరిగినట్టే!  

ఎక్కువమంది తెలుగు రాష్ట్రాల నుంచే: ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా విద్యార్థులు హాజరవుతున్నా.. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువమంది హాజరయ్యే అవకాశముంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రూప్‌-1, గ్రూప్‌-2 నియామకాలు జరగకపోవడం వల్ల ఆ పరీక్షల అభ్యర్థులూ సివిల్స్‌కు పెద్దసంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. 

మొదటిసారి పరీక్ష రాసేవాళ్లే ఎక్కువ: సాధారణంగా డిగ్రీ చివరి ఏడాది చదివే విద్యార్థుల్లో చాలా తక్కువమంది ప్రిలిమ్స్‌ రాసేవారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌ తరగుతుల వల్ల విద్యార్థులకు సమయం ఆదా అయింది. దాంతో చాలామంది ప్రిలిమ్స్‌ రాయడానికి సిద్ధమవుతున్నారు. చాలామంది ఈ పరీక్ష ఎలా ఉంటుందోననే కుతూహలంతో హాజరవుతుంటారు. పోటీ స్థాయిని పెంచేయటంలో వీరి పాత్రా ఉంటుంది. 

పేపర్‌ స్థాయి గత ఏడాది మాదిరే: క్లిష్టత విషయంలో పేపర్‌-1 కిందటి ఏడాది మాదిగానే ఉంటుంది. పేపర్‌-2 మాత్రం కఠినతరంగా ఉండవచ్చని అంచనా. 

ఏ అంశాలు? ఎన్ని ప్రశ్నలు?

ఏయే అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశముందనే విషయంలో మానసికంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. గత నాలుగేళ్లుగా వచ్చిన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని ఒక టేబుల్‌ను తయారుచేసుకోవచ్చు. వ్యూహాత్మకంగా ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం.
ముఖ్యాంశాల పఠనం: ఈ సమయానికల్లా సిలబస్‌లోని ముఖ్యాంశాలను చదివేయాలి. మీరు ఇంకా చదవనట్లయితే రాబోయే పది రోజుల్లో చదివేయాలి. ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంత చదివినా కొన్ని అంశాలు మిగిలిపోతూనే ఉంటాయి. పది రోజుల తర్వాత కూడా ఇంకా కొన్ని అంశాలు మిగిలిపోయినట్లయితే వాటి గురించి పట్టించుకోకండి. ఎందుకంటే ప్రిపరేషన్‌కు అంతం అంటూ ఉండదు. 

కరెంట్‌ అఫైర్స్‌ సమీక్ష: వర్తమాన అంశాలంటే.. అంతే లేని సముద్రం లాంటివి. ప్రతి విషయమూ ముఖ్యమైందిగానే కనిపిస్తుంది. ఆన్‌లైన్‌లో ప్రిపేర్‌ కావడంలోని లోపం ఏమిటంటే.. పుంఖాను పుంఖాలుగా సమాచారం అందుబాటులో ఉంటుంది. కోచింగ్‌ సెంటర్లు కూడా ఆఫ్‌లైన్‌ విధానంతో పోలిస్తే... ఆన్‌లైన్‌లో ఎక్కువ సమాచారాన్ని అందిస్తున్నాయి. కాబట్టి ఏవి ముఖ్యమైనవనే విషయాన్ని సమీక్షించుకోవాలి. 

కీలకాంశాలు గుర్తించటం: కరెంట్‌ అఫైర్స్‌ను క్షుణ్ణంగా చదివాక వాటిలోని ముఖ్యాంశాలను గుర్తించాలి. ఇక్కడ మీరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబోయే ప్రజా సేవకుడిగా అనేకాంశాల్లోంచి ప్రజా ప్రాధాన్యం ఉన్న విషయాలను గుర్తించగలగాలి. అలాంటివాటిపైనే మీ దృష్టిని కేంద్రీకరించటం అవసరం. 
సంక్షేమ మంత్రిత్వశాఖల వెబ్‌సైట్లు: అన్ని మంత్రిత్వ శాఖలకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ సంక్షేమ మంత్రిత్వ శాఖలకు మరింత ప్రాధాన్యమివ్వాలి. వీటి వెబ్‌సైట్లలోకి వెళ్లి ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాల్లో అతి ముఖ్యమైన వాటిని గుర్తించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా గత ఏడాది ప్రారంభించిన పథకాలపై పట్టు పెంచుకోవటం ముఖ్యం. 

సాధన చేయాలి: పేపర్‌-1కు సంబంధించిన కాంప్రహెన్సివ్‌ క్వశ్చన్‌ పేపర్లు 8-10 వరకు తీసుకుని సాధన చేయాలి. హార్డ్‌కాపీ విధానంలో సాధన చేయాలి గానీ ఆన్‌లైన్‌లో కాదు. 

పరీక్ష రాయడం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో విరామం తీసుకోకూడదు. ఒకసారి పరీక్ష రాయడం మొదలుపెడితే.. పూర్తయిన తర్వాతే ఆపాలి. రాసిన తర్వాత ఎన్ని మార్కులు సాధించారో చూసుకోవాలి. మీరు ఏ కేటగిరీకి చెందిన అభ్యర్థులైనా గత సంవత్సరాల కటాఫ్‌ కంటే కనీసం పది మార్కులు ఎక్కువగా సంపాదించడం మీ లక్ష్యం కావాలి.

ఊహించటం సాధన చేయాలి 

చాలామంది అభ్యర్థులు నేరుగా అడిగిన ప్రశ్నలకు సరిగ్గానే సమాధానాలు రాస్తారు. కానీ పరోక్షంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలను ఊహించడంలోనే వెనబడుతుంటారు. సరిగ్గా ఊహించగలిగినప్పుడే కటాఫ్‌ మార్కులను సాధించగలుగుతారు. అలా ఊహించడానికి సాధన అవసరం.  

ఓఎంఆర్‌ షీట్ల మీద సాధన చేయడాన్ని చాలామంది అభ్యర్థులు నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇలా చేయడం చాలా ముఖ్యమని గుర్తించాలి. సమాధానం తెలియక మరో ప్రశ్నకు వెళ్లిపోయినపుడు దాని సమాధానం గుర్తించటం ఏ సర్కిల్‌లో చేస్తున్నారో గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.  

కరోనా పరిణామాల కారణంగా పరిస్థితులు మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష రాయడానికి తగిన సాధన చేయాలి. అంటే మాస్కు వేసుకుని పరీక్ష రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. సుమారు పది మాదిరి పేపర్లను ఇలాగే రాయడం మంచిది. ఇలా చేయడం వల్ల మారిన పరిస్థితులకు మీరూ అలవాటుపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయగలుగుతారు. 

అర్హత పరీక్షే కదా అని పేపర్‌-2ని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. గత పరీక్షలకు చెందిన రెండు, మూడు మాదిరి పేపర్లను రాయడం సాధన చేస్తే ఒక అవగాహన వస్తుంది. ఏవిధంగా ముందుకెళ్లాలో తెలుస్తుంది. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎప్పుడూ మ్యాథ్స్‌ ప్రశ్నలకు ముందుగా జవాబులు రాయాలి. ఆ తర్వాత ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌కు సమాధానాలు రాయాలి.  

టెస్ట్‌ స్కోరు విశ్లేషణ 

1. మొదటి పరీక్ష విశ్లేషణ ప్రకారమే మీ సామర్థ్యంపై తుది అంచనాకు రాకూడదు. పరీక్ష పరీక్షకూ మధ్య తేడా ఉంటుంది. ఒక పేపర్‌లో కొన్ని అంశాలు ఎక్కువ క్లిష్టంగా ఉంటే మరోపేపర్లో  అవి తక్కువ క్లిష్టంగా ఉండవచ్చు. 

2. మూడు లేదా అంతకంటే ఎక్కువ పేపర్లలో మీరు సాధించిన మార్కులను నోట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కింది విషయాలను గమనించాలి... 

మీరు తరచూ ఒకే సబ్జెక్టులో ఎక్కువ తప్పులు చేస్తున్నట్లయితే.. దాన్ని మరింత క్షుణ్ణంగా చదవాలని అర్థం. అలాగే ఆ సబ్జెక్టులోని వర్తమానాంశాల మీదా దృష్టి పెట్టాలి. 

ప్రశ్నలకు సమాధానాన్ని ఊహించడంలో తప్పు చేస్తున్నట్లయితే..అది సబ్జెక్టు స్థాయిలో జరుగుతోందా, ఓవరాల్‌ పేపర్లో జరుగుతోందా? మీ విశ్లేషణ ఆధారంగా సమాధానాన్ని ఊహించే వ్యూహాన్ని సరిచూసుకోవాలి. 

పెద్దగా మార్పు చేసుకోవాల్సిన అంశాలేవీ కనిపించకపోతే.. సబ్జెక్టు స్థాయిలో లోతుగా గమనించాలి. ఏవైనా నిర్దిష్ట అంశాల్లో వెనకబడివున్నారా అనేది పరిశీలించుకోవాలి. 

ఈ విశ్లేషణలన్నీ పూర్తయిన తర్వాత... మరింత ఏకాగ్రతగా చదవాల్సిన అంశాలు ఉంటే వాటి పునశ్చరణకు సమయాన్ని కేటాయించాలి. 

ఆ తర్వాత మరో పరీక్షకు హాజరుకావాలి. ఇంతకుముందు రాసిన పరీక్షలతో దీన్ని పోల్చి చూసుకుని అందుకు అనుగుణంగా  మీ  వ్యూహాన్ని మార్చుకోవాలి. 

Posted Date : 16-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌