• facebook
  • whatsapp
  • telegram

అద్భుత విజయాన్ని శ్రుతి చేసింది!

‘‘సొంత నోట్సుపై దృష్టి పెట్టడం, మెయిన్స్‌లో సమాధానాలు రాయటాన్ని సాధన చేయటం నా విజయానికి కారణాలు’ అంటోంది శ్రుతి శర్మ. సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో అఖిలభారత స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఆమె ప్రణాళిక, సన్నద్ధత తీరు ఏమిటో పరిశీలిద్దాం! 

 

 

‘‘ఇంటర్వ్యూలో నేను కొంత తడబడ్డాను. అందుకే టాప్‌ ర్యాంకును సాధించిన విషయాన్ని నమ్మలేకపోయా. ఫలితాలు విడుదలయ్యేవరకు ప్రథమ ర్యాంకులో ఉంటానని ఊహించలేదు’’ అంటోంది శ్రుతిశర్మ.  సివిల్స్‌లో ఆమెకిది రెండో ప్రయత్నం. 

 

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నార్‌కు చెందిన శ్రుతిశర్మ చదువుకోవడం కోసం దిల్లీలోని నానమ్మ, తాతయ్యల వద్దకు వచ్చింది. ఉద్యోగరీత్యా ఈమె తల్లిదండ్రులు ఇండోర్‌లో ఉంటారు. దిల్లీలో స్కూల్‌చదువు పూర్తిచేసి సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ (దిల్లీ యూనివర్శిటీ)లో హిస్టరీ (ఆనర్స్‌) గ్రాడ్యుయేషన్‌ చేసింది. తర్వాత జేఎన్‌యూలో మోడర్న్‌ హిస్టరీలో పీజీలో చేరింది. చిన్నప్పటి నుంచి సివిల్స్‌ చదవాలన్నది ఆమె లక్ష్యం. జేఎన్‌యూలో చదువుతూనే సివిల్స్‌కు సిద్ధమవడం మొదలుపెట్టింది. శిక్షణ తీసుకోవడానికి జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీలో చేరింది. అయితే తొలి ప్రయత్నం విఫలమైంది. అయినా వెనకడుగు వేయలేదీమె. సొంతంగా చదువుకోవడం మొదలుపెట్టింది.

 

‘మొదటిసారి మంచి ర్యాంకు రాకపోయేసరికి ప్రణాళిక మార్చుకున్నా. సిలబస్‌ విభజించుకోవడం నుంచి నోట్సు తయారుచేసుకోవడం వరకు నేనే చేసుకునేదాన్ని. రోజూ రివిజన్‌ చేయడానికి కొంత సమయాన్ని కేటాయించుకునేదాన్ని. రోజూ నిర్దిష్టంగా ఇన్ని గంటలు చదవాలనే నియమం లేదు. ఎంత సమయం చదివామన్నది ముఖ్యం కాదు, చదివింది గుర్తుండిపోయేలా ఉంటే చాలు. నేనిలాగే సాధన చేశా. మధ్యలో విశ్రాంతి తీసుకునేదాన్ని. పాత ప్రశ్నపత్రాలను గమనించడంతోపాటు గత సివిల్స్‌ విజేతల వ్యూహాలను తెలుసుకుని నా సన్నద్ధతలో వాటిని అనుసరించేదాన్ని’’ అని చెప్పుకొచ్చింది శ్రుతి. 

 

ప్రేరణ మీలోంచే రావాలి 

‘‘సివిల్స్‌ అభ్యర్థులకు నా సలహా..‘కష్టపడి చదవండి’. సర్వీసు సాధించాలనే ప్రేరణ బయటనుంచి కాకుండా మీ  నుంచే రావాలి. నోట్సు సొంతంగా తయారుచేసుకోవాలి. రీడింగ్‌ మెటీరియల్‌ మీద ఆధారపడకుండా  రోజూ వార్తాపత్రికలు చదవాలి. ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవాలి.  కరెంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. వీలైనన్నిసార్లు చదివిన పాఠాలను రివిజన్‌ చేస్తూనే ఉండాలి. ప్రతి అక్షరం మెదడులో నిక్షిప్తమయ్యేలా గుర్తుండిపోవాలి. ఇందులో వచ్చే ఓటమినీ, గెలుపునూ సహనంతో తట్టుకొని నిలబడాలి. తిరిగి పోరాడాలి. మనకు మనమే స్ఫూర్తి అవ్వాలి. పట్టుదలతో కృషి చేస్తే చాలు, విజయం మనల్ని వరిస్తుంది’ 
 

Posted Date : 04-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌