• facebook
  • whatsapp
  • telegram

సమగ్రంగా.. స్పష్టంగా!

మెరుగైన సమాధానాలకు మెలకువలు

ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయడం విద్యార్థులకు సులువుగానే ఉంటుంది. కానీ గ్రూప్స్, సివిల్స్‌ లాంటి పరీక్షల్లో వ్యాసరూప సమాధానాలు రాయాల్సివుంటుంది. నిర్ణీత  పదాలతో, నిర్ణీత సమయంలో స్పష్టంగా, అర్థవంతంగా రాయగలగాలి. ఇది ఒక్కరోజులో సాధించగలిగే నైపుణ్యం కాదు. దీనికి నిరంతర సాధన అవసరం! 

వ్యాసరూప సమాధానాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని మాత్రమే పరీక్షించరు. నిర్ణీత సమయంలో నిర్మాణాత్మక సమాధానాలు రాసే నేర్పు ఉందో లేదో కూడా పరిశీలిస్తారు. ప్రశ్న అడగడంలోని ఉద్దేశానికి అనుగుణంగా సమాధానం రాయాల్సి ఉంటుంది. చాలామంది అభ్యర్థులు సమాధానం సరిగ్గా రాస్తే చాలనే అపోహలో ఉంటారు. కానీ ప్రశ్న అడగడంలోని అసలు ఉద్దేశాన్ని సూటిగా అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ విషయంలో నిపుణులు తెలిపే కొన్ని ప్రత్యేకమైన సూచనలు చూద్దాం!  

ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి: అభ్యర్థి ముందుగా ప్రశ్నను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. దాంట్లోని ముఖ్యమైన పదాలను గుర్తించాలి. ప్రశ్న అడగడంలోని ముఖ్యోద్దేశాన్ని గ్రహించాలి. వివరించు, విమర్శనాత్మకంగా విశ్లేషించు, లెక్కించు... ఈ పదాల్లో దేన్ని ప్రశ్నలో వాడారో చూడాలి. ఇలాంటి పదాలు ప్రశ్న అడగడంలోని ఆంతర్యాన్ని తెలియజేస్తాయి. అందుకే ప్రశ్నను సరిగా అర్థం చేసుకుంటేనే దానికి అనుగుణంగా సమాధానం రాసే వీలుంటుంది. 

నిర్మాణాత్మకంగా: సమాధానం వివరంగా, నిర్మాణాత్మకంగా ఉండాలి. చదివేవాళ్లకు సులువుగా అర్థంకావాలి. అలాగే ప్రజెంటేషన్‌ కూడా బాగుండాలి. సమాధానాన్ని విషయ పరిచయంతో మొదలుపెట్టాలి. ముఖ్యమైన పదాలను మొదట్లోనే విశ్లేషించాలి. తాజా పరిశోధనలు వెల్లడించిన వాస్తవాలను ముందుగానే తెలియజేయాలి. ప్రశ్నలో అడిగిన అంశాలకు ఉపశీర్షికల ద్వారా సమాధానం తెలపాలి. పాయింట్ల రూపంలో సమాధానం రాస్తే చదవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ముగింపు ఎప్పుడూ సమాధానంలోని అన్ని అంశాలనూ సంతృప్తి పరిచేదిగా ఉండాలి. వ్యాసాన్ని ఆశావహ దృక్పథంతో ముగించాలి. సామాజిక-ఆర్థిక లేదా పాలనాపరమైన అంశాలకు సంబంధించిన ప్రశ్న అడిగితే... వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే పరిష్కారాలను సూచించాలి. సమాధానం ఎలా రాయాలనే విషయంలో కొద్ది నిమిషాల పాటు స్కెచ్‌ వేసుకోవాలి. దానికి అనుగుణంగా తర్వాత రాయడం మొదలుపెట్టాలి. 

నిర్ణీత సమయం: ‘చిన్న ఉత్తరం రాయడానికి నాకు సమయం లేదు. అందుకే పెద్దది రాస్తున్నా’ అంటాడు మహా రచయిత మార్క్‌ ట్వెయిన్‌. నిర్ణీత సమయంలో ముఖ్యమైన అంశాలను వెల్లడించాలంటే ఎంతో నైపుణ్యం కావాలి. అభ్యర్థి పది మార్కుల ప్రశ్నకు సమాధానం రాయడానికే సాధారణంగా 15-25 నిమిషాల సమయం పడతుంది. యూపీఎస్సీ పరీక్షల్లో సగటున పదిమార్కుల ప్రశ్నకు సుమారు 7.2 నిమిషాల్లోనూ సమాధానం రాయగలగాలి. నిర్ణీత సమయంలో రాయడం పూర్తిచేయాలంటే సాధన చేయడం ఎంతో అవసరం. 

సృజనాత్మకంగా: ఫ్లో చార్ట్స్, డయాగ్రమ్స్‌ వేసి సమాధానం రాస్తే.. ఆ విధానం ఎగ్జామినర్‌ను ఆకట్టుకుంటుంది. వీటి వల్ల సమయమూ వృథా కాదు. ముఖ్యమైన విషయాలను సృజనాత్మకంగా వివరించినట్టు అవుతుంది. సాధన సమయంలోనే డయాగ్రమ్స్‌ వేసుకోవడం అలవాటు చేసుకుంటే సమయం ఆదా చేసుకోవచ్చు. 

నిర్ణీత పదాలు: ఏమి రాయాలో కాదు... ఏమి రాయకూడదో కూడా తెలిసుండాలి. ఎక్కువ రాయడం వల్ల ఎక్కువ మార్కులు వస్తాయనుకోవడం పొరపాటు. దీనివల్ల విలువైన సమాయాన్ని కోల్పోతారు. అంతేకాదు మిగతా ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలను రాయలేరు! 

నిత్య సాధన: యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రతిరోజూ రాయడం సాధన చేయాలి. చాలామంది దీన్నే నిర్లక్ష్యం చేస్తుంటారు. రోజూ రాయడం వల్ల సమయం విషయంలో స్పష్టమైన అవగాహన వస్తుంది. నెమ్మదిగా రాస్తున్నారనే విషయం అర్థమైతే... వేగాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రిలిమినరీ పరీక్ష తర్వాత అభ్యర్థులు రాయడాన్ని తప్పనిసరిగా సాధన చేయాలి. దీంతో ఎలారాస్తే సమయాన్ని ఆదా చేసుకోవచ్చనే విషయం అర్థమవుతుంది. 

మూల్యాంకనం: అభ్యర్థులు తాము రాసిన సమాధానాలను అనుభవజ్ఞులైన ఎగ్జామినర్లతో తనిఖీ చేయించుకోవాలి. లేదా టీచర్లు, మెంటర్లు సిద్ధంచేసిన మోడల్‌ పేపర్లతోనూ పరీక్షించుకోవచ్చు. గత ఏడాది పరీక్ష రాసిన సీనియర్లకూ చూపించవచ్చు. స్వయంగా లేదా ఇతరులతో మూల్యాంకనం చేయించడం చాలా అవసరం. అలాగే ఎదుటివాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. సాధనతో ప్రశ్నపత్రాలను వేగంగా రాయడం అలవాటు చేసుకోవాలి. ప్రత్యేకమైన రచనాశైలిని అభివృద్ధి చేసుకుంటే అదనపు మార్కులు పొంది.. విజయం సాధించే అవకాశం ఉంటుంది! 

Posted Date : 04-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌