• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీర్ల‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు

యూపీఎస్‌సీ - ఈఎస్ఈ - 2022 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ) నోటిఫికేషన్‌ వెలువడింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్‌లో 327 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈఎస్‌ఈ ద్వారా ఉద్యోగం పొందినవారికి సమాజంలో గౌరవం, ఉద్యోగ భద్రత, పదోన్నతులతో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంతృప్తీ లభిస్తుంది. ఈ పరీక్షకు మెరుగ్గా సన్నద్ధమవ్వాలంటే ఏయే మెలకువలు పాటించాలో తెలుసుకుందాం! 

జాతీయ స్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ లాంటి గ్రూప్‌-ఎ ఉద్యోగాల భర్తీ కోసం సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ విభాగాల్లో ఏటా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఎంపికైనవారికి లెవెల్‌-10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. తొలి నెల నుంచే దాదాపు రూ.లక్ష వేతనం పొందవచ్చు.

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ)

దరఖాస్తు ఎలా?    www.upsconline.nic.in లో వివరాలు నమోదు చేసుకోవాలి.. 

పరీక్ష రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు పరీక్ష రుసుము చెల్లించనవసరం లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 04, 2022 

ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌/స్టేజ్‌-1 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 19, 2023 

ఈఎస్‌ఈ మెయిన్స్‌/స్టేజ్‌-2 పరీక్ష తేదీ: జూన్‌ 25, 2023 

విద్యార్హతలు: ఇంజినీరింగ్‌లో ఏదైనా డిగ్రీ/సమాన అర్హత, ఎంఎస్సీ/తత్సమానం. ప్రతిపాదించిన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. 

వయసు: పరీక్ష రాసే సంవత్సరం జనవరి 1 నాటికి 21 నుంచి 30 సంవత్సరాలు (అంటే పరీక్ష రాసే అభ్యర్థి 2 జనవరి, 1993 తర్వాత, 1 జనవరి 2002 ముందు జన్మించి ఉండాలి. కొన్ని కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

నెగిటివ్‌ మార్కులతో జాగ్రత్త: ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కుకు 1/3 (0.33) రుణాత్మక మార్కులుంటాయి. ప్రతి ప్రశ్నకూ రెండు మార్కులు కేటాయించడం వల్ల ఒక సమాధానం తప్పుగా రాస్తే 0.66 రుణాత్మక మార్కులుంటాయి. 

ఇది కేవలం క్వాలిఫైయింగ్‌ దశ మాత్రమే కాదు. ఇందులో సాధించిన మార్కులను అంతిమ సెలక్షన్‌లోనూ పరిగణనలోకి తీసుకుంటారు. 

ఇది అన్ని విభాగాలకూ కామన్‌గా ఉంటుంది. పేపర్‌-1లో కనీసార్హత మార్కులు సాధించాలి. కాబట్టి టెక్నికల్‌ సబ్జెక్ట్‌తోపాటు ఈ జనరల్‌ స్టడీస్‌ చాలా కీలకం. జనరల్‌ స్టడీస్‌ అంటే హిస్టరీ, జాగ్రఫీ లాంటివి కాకుండా ఇంజినీరింగ్‌ అంశాలు ఉంటాయి. మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, కరెంట్‌ అఫైర్స్‌తోపాటు అభ్యర్థులు తమకు సంబంధించిన విభాగంపై పట్టు సాధిస్తే వీలైనన్ని ఎక్కువ మార్కులు సులువుగా పొందవచ్చు..

పేపర్‌-2లో అభ్యర్థులకు సంబంధించిన ఇంజినీరింగ్‌ (కోర్‌) సబ్జెక్టు అంశాలు ఉంటాయి.

స్టేజ్‌-1 + స్టేజ్‌-2 = 1100 మార్కులు 

ఇందులో ఇంజినీరింగ్‌ సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు. రెండూ అభ్యర్థి సంబంధిత కోర్‌ సబ్జెక్టులకు చెందినవే. 

ప్రశ్నల నిడివి ఎక్కువ కాబట్టి చదవడంతోపాటు రాయడం బాగా అలవాటు చేసుకోవాలి. 

 క్వశ్చన్‌ కమ్‌ ఆన్సర్‌ బుక్‌లెట్‌ (క్యూసీఏబీ) విధానంలో సమాధానాలకు నిర్ణీత స్థలాన్ని కేటాయించారు. వీలైనంత సూటిగా జవాబు రాయడం మంచిది. 

 ఇందులో బేసిక్స్‌తోపాటు అడ్వాన్స్‌ విషయాలపై పూర్తిస్థాయి అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. 

 చేతిరాత అనేది అత్యంత కీలకం. అందువల్ల హ్యాండ్‌రైటింగ్‌ను మెరుగు పరుచుకోవాలి. 

 ఇందులో సమాధానాలు రాయవలసిన ప్రశ్నలు ఎంచుకోవడం కూడా ముఖ్యం. 

 థియరీ ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు నేరుగా బుల్లెట్‌ పాయింట్లలో రాయడానికి ప్రయత్నించాలి. 

 న్యూమరికల్‌ ప్రశ్నలకు సమాధానాలను రాసేటప్పుడు మ్యాథమెటికల్‌ స్టెప్‌లతో దశలవారీగా పూర్తిచేయాలి. 

స్టేజ్‌-3: మౌఖిక పరీక్ష 

(పర్సనాలిటీ టెస్ట్‌)  

 రెండు స్టేజిల్లో సాధించిన మార్కుల ఆధారంగా (1100 మార్కులకుగాను) అభ్యర్థులను 1 : 2 నిష్పత్తిలో స్టేజ్‌-3 (పర్సనల్‌ ఇంటర్వ్యూ) పరీక్షకు అనుమతిస్తారు. మొత్తం 200 మార్కులు. ఈ సంవత్సరం 654 మందిని మౌఖిక పరీక్షకు అనుమతిస్తారు. 

 దీంట్లో అభ్యర్థుల ఆలోచనా విధానాన్నీ, శక్తి సామర్థ్యాలను, నాయకత్వ లక్షణాలు, నీతి, నిజాయతీలను అంచనా వేస్తారు. వ్యక్తిగత విషయాలకూ, హాబీలకూ కొంత ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు అడగవచ్చు. 

 సామాజిక, వర్తమాన విషయాల గురించి అడిగే అవకాశం ఉంది.

 అభ్యర్థి ఉద్యోగం లేదా ఎంటెక్‌ చేస్తున్నా.. సంబంధిత విషయాలపై ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి ప్రణాళిక ప్రకారం వెళితే ఈ మౌఖిక పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. 

ఫైనల్‌ సెలక్షన్‌ జాబితా: ఫైనల్‌ సెలక్షన్‌ మూడు స్టేజ్‌లలో కలిపి 1300 మార్కులకుగాను వచ్చిన మార్కుల ఆధారంగా ఉన్న ఖాళీలకు అనుగుణంగా జాబితాను రూపొందిస్తారు. 

విజయ సాధనకు వ్యూహం 

ఈఎస్‌ఈ సిలబస్‌ను వీలైనన్నిసార్లు పరిశీలించి అందులోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సిలబస్‌ను బట్టి ఏ అంశాల్లో బలంగా ఉన్నామో, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలి.

ఈఎస్‌ఈ పరీక్షను మొదటి ప్రయత్నంలోనే సాధించవచ్చు. దీనికి తగిన ప్రణాళిక, కృషి అవసరం.  

అభ్యర్థులు మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలు/ స్టడీ మెటీరియల్‌ ఎంచుకోవడం ముఖ్యం. విజయంలో ఇవే కీలకం.

ఎన్‌సీటీఈఎల్‌ పాఠాలు ప్రాథమిక అంశాల అవగాహనకు ఉపయోగపడతాయి. సందేహాలు కలిగినప్పుడు నివృత్తి చేసుకోవడానికీ ఇవి పనికొస్తాయి. విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలోనూ ఈ పాఠాలు బాగా  సహాయపడతాయి.  

ప్రాథమిక అంశాల సన్న్నద్ధత తర్వాత గత ఈఎస్‌ఈ, గేట్, సివిల్‌ సర్వీసెస్, ఇతర స్టేట్‌ సర్వీసెస్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఏయే అంశాలపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అర్థం అవుతుంది. 

 సిలబస్‌ పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. ప్రశ్నలు 20 నుంచి 25 శాతం సులభం, మధ్యస్తం; 20 నుంచి 25 శాతం కొంత కఠినంగా ఉంటాయి.

క్లిష్టతరమైన, సాధారణ, అతి సాధారణమైన అంశాలకు సన్నద్ధతలో సమ ప్రాధాన్యం ఇస్తేనే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 

గత కొద్ది సంవత్సరాల నుంచి ఆచరణాత్మకమైన (ప్రాక్టికల్‌) ప్రశ్నలు చేర్చడం వల్ల ప్రశ్నపత్రం కఠినత్వం పెరిగింది. ఈ పరీక్షకు పోటీతత్వం కూడా ఎక్కువే. 

అభ్యర్థులు నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌లో బేసిక్స్‌పై ఎంతో కొంత అవగాహన సాధించి ఉంటారు. ఈఎస్‌ఈ సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగా బేసిక్స్‌పై పూర్తి పట్టు సాధించాలి. 

ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు ఎక్కువ.. సమయం తక్కువ. అందువల్ల అందుబాటులో ఉన్న పరీక్ష సమయంలోనే ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించామనేది ముఖ్యం.

ప్రిలిమ్స్‌లో కాలిక్యులేటర్‌కు అనుమతి లేనందువల్ల న్యూమరికల్‌ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం తప్పనిసరి. 

పునశ్చరణ అనేది అత్యంత కీలకం. చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. ఆన్‌లైన్‌లో నిర్వహించే మాదిరి ప్రశ్నపత్రాలను (మాక్‌టెస్టులు) రాయడం, నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 

చాప్టర్లవారీగా టెస్టులు, మాక్‌ టెస్టులు రాసేటప్పుడు, నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేసేటప్పుడు తప్పుగా సమాధానం రాసిన ప్రతి ప్రశ్ననూ సవరించుకుని, వాటిని ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి. దీనివల్ల ఆ తప్పులు పరీక్షలో పునరావృతం కాకుండా ఉంటాయి. 

గేట్, ఈఎస్‌ఈ.. రెండూ రాస్తున్నారా?

 గేట్, ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌) రెండూ ఫిబ్రవరి నెలలోనే జరగనున్నాయి. అంటే ఈ రెండు పరీక్షలకు సుమారు ఐదు నెలల కాలవ్యవధి ఉంది.  

 గేట్, ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌) పరీక్షల సన్నద్ధత దాదాపు సమానం. కాబట్టి ఈ సమయంలో గేట్‌తోపాటు ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌ పరీక్షపైన మాత్రమే దృష్టి సారించాలి. 

 గేట్‌తోపాటు ఈఎస్‌ఈ కూడా రాయదలిచిన అభ్యర్థులు టెక్నికల్‌ సబ్జెక్ట్స్‌తోపాటు జనరల్‌ స్టడీస్‌లోని పది అంశాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. జనరల్‌ స్టడీస్‌ విషయంలో ప్రాథమిక అంశాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. 

 ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌లోని జనరల్‌ ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్‌... రెండు పరీక్షల్లో ఉంటాయి. అభ్యర్థులు తమ విభాగానికి సంబంధించిన జనరల్‌ స్టడీస్‌ అంశాలపై తగినంత పట్టు సాధిస్తే ఇందులో 200 మార్కులకుగాను 100 మార్కులు పొందవచ్చు. 

 ఈఎస్‌ఈ కోసం సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేయాలి. గేట్‌లో సబ్జెక్టు ప్రాథమిక అంశాల ఉపయోగాలపై ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.

 సబ్జెక్టుల వెయిటేజిని దృష్టిలో ఉంచుకుని సన్నద్ధం కావాలి. అంటే ఈ రెండు పరీక్షల్లో అధిక వెయిటేజీ ఉన్న సబ్జెక్టులను విస్మరించకుండా సాధన చేయాలి. 

 ఈ రెండు పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు 4 నుంచి 5 స్టెప్‌లలో సమాధానం రాబట్టే విధంగా ఉంటాయి. అలాంటి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షను ఎదుర్కోవాలి.  


- ప్రొ. వై.వి.గోపాలకృష్ణమూర్తి, ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం!

‣ జేఈఈ స్కోరుతో బీటెక్‌ డిగ్రీ, ఆర్మీ కొలువు

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Posted Date : 22-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌