• facebook
  • whatsapp
  • telegram

అఖిల భార‌త ఇంజి‌నీర్ల‌కు ఆహ్వానం

యూపీఎస్సీ ఈఎస్ఈ-2021 ప్ర‌క‌ట‌న విడుద‌ల 

కేంద్ర ప్ర‌భుత్వ విభాగాల్లో 215 ఖాళీలు

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షను ఐఈఎస్‌ అని కూడా వ్యవహరిస్తారు. మూడంచెల్లో యూపీఎస్‌సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. దీని ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో 215 ఖాళీలు పూర్తి చేస్తారు. దీనికి ఎలా సంసిద్ధం కావాలో తెలుసుకుందాం! 

ఇంజినీరింగ్‌ సర్వీసుకు ఎంపికై ఉద్యోగంలో చేరినవారికి సమాజంలో గౌరవంతో పాటు ఉద్యోగ భద్రత లభిస్తుంది. క్రమం తప్పని పదోన్నతులతో వీరు అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ సంతృప్తి ఉంటుంది. ఏడో పే కమిషన్‌తో మొదటి నెల జీతం రూ. 75,000కు పైగా ఉంటుంది.  

జాతీయస్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ లాంటి గ్రూప్‌-ఎ ఉద్యోగాల భర్తీ కోసం సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో ఏటా ఈఎస్‌ఈని నిర్వహిస్తారు. తుది ఎంపిక తర్వాత సెంట్రల్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీరింగ్, సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్, సెంట్రల్‌ పవర్, నేవల్, బార్డర్‌ రోడ్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్, సర్వే ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్, ఇండియన్‌ టెలికాం సర్వీసెస్, జూనియర్‌ టెలికాం ఆఫీసర్‌ లాంటి విభాగాల్లో నియామకాలు జరుగుతాయి. 

ఇవి గమనించండి

ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 27 ఏప్రిల్, 2021.  

విద్యార్హతలు: ఇంజినీరింగ్‌లో ఏదైనా డిగ్రీ/సమాన అర్హత, ఎంఎస్సీ/తత్సమానం. కానీ ప్రతిపాదించిన మెకానికల్,  సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి.  

వయసు: పరీక్ష రాసే సంవత్సరపు జనవరి 1వ తేదీకి 21 నుంచి 30 సంవత్సరాలు (అంటే అభ్యర్థి 2 జనవరి, 1991 తర్వాత- 1 జనవరి, 2000 ముందు జన్మించి ఉండాలి). కొన్ని కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయః పరిమితిలో సడలింపు ఉంటుంది.  

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ప్రిలిమ్స్, మెయిన్స్‌): హైదరాబాద్, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in/

జనరల్‌ స్టడీస్‌ కీలకం 

ప్రిలిమినరీలో పేపర్‌ -1 అన్ని విభాగాలకూ కామన్‌గా ఉంటుంది. దీనిలో కూడా కనీస అర్హత మార్కులు సాధించాలి. టెక్నికల్‌ సబ్జెక్ట్‌తో పాటు జనరల్‌ స్టడీస్‌ చాలా కీలకం. దీనిపై తగిన శ్రద్ధ వహించి పరీక్షకు సన్నద్ధం కావాలి. 

జనరల్‌ స్టడీస్‌ అంటే హిస్టరీ, జాగ్రఫీ లాంటివి కాకుండా ఇంజినీరింగ్‌ సంబంధిత అంశాలుంటాయి. దీన్నో భూతంలా చూడవలసిన అవసరం లేదు. మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, కరెంట్‌ అఫైర్స్‌లతో పాటు అభ్యర్థులు తమకు సంబంధించిన విభాగంలో పట్టు పెంచుకుంటే కనీస మార్కులు సాధించడం సులభమే.  

పేపర్‌-2 అభ్యర్థులకు సంబంధించిన ఇంజినీరింగ్‌ (కోర్‌) సబ్జెక్ట్‌కు సంబంధించినది.

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ 2021 పరీక్ష విధానం 

స్టేజ్‌-1 (ప్రిలిమినరీ): 500 మార్కులు

ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. కాల్‌క్యులేటర్‌లను అనుమతించరు. ఇందులో నెగెటివ్‌ మార్కులు ఉంటాయి.

ఓఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు మార్క్‌ చేయడానికి బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నును ఉపయోగించాలి. 

నెగెటివ్‌ మార్కులతో జాగ్రత్త అవసరం. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కుకు  1/3 రుణాత్మక మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ప్రతి ప్రశ్నకూ రెండు మార్కులు కేటాయించినందున, ఒక సమాధానం తప్పుగా రాస్తే 0.66 రుణాత్మక మార్కులు.  

రెండు పేపర్లలోనూ కనీస క్వాలిఫైయింగ్‌ మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం యూపీఎస్‌సికి ఉంటుంది. ఇది అర్హత దశ మాత్రమే కాదు. ఇందులో సాధించిన మార్కులు తుది సెలక్షన్‌లోనూ లెక్కిస్తారు.  

స్టేజ్‌ 2 (మెయిన్స్‌) కన్వెన్షనల్: 600 మార్కులు

ప్రిలిమినరీ పరీక్ష ద్వారా 1:6 లేదా 1:7 నిష్పత్తిలో మెయిన్స్‌కు అర్హత ఇస్తారు. ఈ సంవత్సరం మొత్తం ఖాళీల సంఖ్య 215 ఉన్నాయి. అంటే 1290 నుంచి 1505 మంది మాత్రమే మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు.    

కన్వెన్షనల్‌్ ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఉంటాయి. అందుకని చదవడంతో పాటు రాయడం బాగా అలవాటు చేసుకోవాలి.  

క్వశ్చన్‌ కమ్‌ ఆన్సర్‌ బుక్‌లెట్‌ (క్యూసీఏబీ) విధానం వల్ల సమాధానాలు రాయడానికి నిర్ణీత స్థలాన్ని కేటాయించారు. వీలైనంత సూటిగా జవాబు రాయడం మంచిది.  

స్టేజ్‌ 3: మౌఖిక పరీక్ష (పర్సనాలిటీ టెస్ట్‌): 200 మార్కులు  

పైరెండు స్టేజ్‌లలో సాధించిన మార్కుల ఆధారంగా (1100 మార్కులు) అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో స్టేజ్‌-3 పరీక్షకు (ఇంటర్వ్యూ) అనుమతిస్తారు. ఈ సంవత్సరం మొత్తం ఖాళీల సంఖ్య 215 ఉన్నందున 430 మందిని మౌఖిక పరీక్షకు అనుమతిస్తారు. 

తుది ఎంపిక మూడు స్టేజ్‌లలో కలిపి 1300 మార్కులకుగాను వచ్చిన మార్కుల ఆధారంగా, ఉన్న ఖాళీల అనుగుణంగా జాబితాను రూపొందిస్తారు.

ప్రశ్నల స్థాయి?   

ఈఎస్‌ఈ సిలబస్‌ పరిధి విశాలంగా ఉన్నప్పటికీ ప్రశ్నల స్థాయి మాత్రం మధ్యస్థం నుంచి కొంత కఠినంగా ఉంటాయి. కొద్ది సంవత్సరాలుగా ఆచరణాత్మకమైన  ప్రశ్నలు అడుగుతున్నారు. 

 సిలబస్‌ను పరిశీలించి అందులోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సిలబస్‌ను బట్టి ఏ అంశాలలో బలంగా ఉన్నామో, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ ప్రణాళికను రూపొందించుకోవాలి.  

 సాధారణంగా అభ్యర్థులు తమకు నచ్చిన అధ్యాయాలను చదవడానికి సుముఖతతో ఉంటారు. కానీ ఈ పరీక్షలో వెయిటేజిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మార్కులుండే అధ్యాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం.  

అభ్యర్థులు సబ్జెక్ట్‌ పరంగా తమ స్టాయిని బట్టి సొంతంగా ప్రిపేర్‌ కావాలా, కోచింగ్‌లో చేరాలా అనేది నిర్ణయించుకోవాలి.  

 సమయపాలన చాలా ప్రధానం. ఏ రోజు నిర్దేశించుకున్న అంశాలను ఆరోజే క్రమశిక్షణతో చదవటం పూర్తి చేయాలి.  

ఎన్‌టీపీఎల్‌ పాఠాలు విద్యార్థులకు ప్రాథ]మిక అంశాల అవగాహనకు బాగా ఉపయోగపడతాయి. అలాగే విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ఉపయోగపడతాయి.

సన్నద్ధత ఎలా?

ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు దాదాపుగా మూడు నెలల కాలవ్యవధి ఉంది. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని చదవటం కొనసాగించాలి.  

గేట్, ఈఎస్‌ఈ - రెండు పరీక్షలూ రాయదలచిన అభ్యర్థులకు ఈ సంవత్సరం ఈఎస్‌ఈ సన్నద్ధత పూర్వం కంటే సులభమవుతుంది. ఎందుకంటే గేట్‌ తర్వాతే ఈఎస్‌ఈ పరీక్ష జరుగుతోంది.

ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌), గేట్‌ల సిలబస్, సన్నద్ధతా సమానంగానే ఉంటుంది. ఇదివరకే గేట్‌ రాసినవారికి ప్రాధమిక అంశాలపై మంచి అవగాహన ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో  ప్రాధమిక అంశాల పునశ్చరణతో పాటు సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేయాలి. అంతేకాకుండా గేట్‌లో లేకుండా ఈఎస్‌ఈలో మాత్రమే ఉన్న

సబ్జెక్టులను ప్రత్యేకంగా సాధన చేయాలి. 

ఈ పరీక్షకు కాల్‌క్యులేటర్‌ అనుమతి లేనందున కాల్‌క్యులేటర్‌ ఉపయోగించకుండా ప్రశ్నల సాధనపై దృష్టి సారించాలి. దీంతో పాటు ఎక్కువగా థియరీ బేస్డ్‌ ప్రశ్నలను కూడా సాధన చేయాలి. 

  ఇటీవలే జరిగిన గేట్‌ రాయని, మొదటిసారి ఈ పరీక్షను రాస్తున్న అభ్యర్థులు ముందుగా సబ్జెక్టుల ప్రాథ]మిక అంశాలపై పూర్తి పట్టు సాధించి లోతుగా అధ్యయనం చేయాలి.  

ప్రాథమిక అంశాల తర్వాత గత ఈఎస్‌ఈ, గేట్, సివిల్‌ సర్వీసెస్, స్టేట్‌ సర్వీసెస్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఏయే అంశాలపై ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో అర్థం అవుతుంది.  

అభ్యర్జులు టెక్నికల్‌ సబ్జెక్టులతో పాటు జనరల్‌ స్టడీస్‌లో ఉన్న పది అంశాలపై కూడా శ్రద్ధ వహించాలి. కానీ జనరల్‌ స్టడీస్‌ విషయంలో లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం లేదు. ప్రాధమిక అంశాలపై శ్రద్ధ వహించాలి.  

పునశ్చరణ చాలా ముఖ్యం. చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. దీంతోపాటు ఆన్‌లైన్‌లో నిర్వహించే మాదిరి ప్రశ్నపత్రాలను రాయడం, నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల మన సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.  

చాప్టర్‌వైజ్‌ టెస్టులు, మాక్‌ టెస్టులు రాసేటప్పుడూ, నమూనా ప్రశ్నపత్రాలు సాధ]న చేసేటప్పుడూ తప్పుగా సమాధానం రాసిన ప్రతి ప్రశ్ననూ సవరించుకోవాలి. ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి. దీనివల్ల ఆ పొరపాట్లు పరీక్ష సమయంలో  పునరావృతం కాకుండా ఉంటాయి.

Posted Date : 12-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌