• facebook
  • whatsapp
  • telegram

50 శాతం మార్కులుంటే అగ్రశ్రేణిలోనే!

సివిల్‌ సర్వీసులకు రానురానూ ప్రాధాన్యం పెరుగుతోంది. ఇతర ప్రైవేటు కొలువులు ఎంత పెద్ద జీతం వచ్చేవైనా ఉద్యోగ భద్రత ఉండదు. అందుకే ఇటీవలి కాలంలో చాలామంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఈ సర్వీసుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇతర పోటీ పరీక్షలు కూడా కష్టంగానే వుంటుండడంతో కష్టపడితే సివిల్‌ సర్వెంట్‌గా మారి ప్రజాసేవ చేయొచ్చని భావిస్తున్నారు.

ఐ.ఐ.టి.ల్లో చదివినవారు కూడా సివిల్‌ సర్వీసులను ఎంచుకోవడంతో సాధారణ డిగ్రీ చేసినవారికి కొంత కష్టమైనా వారు కూడా సివిల్‌ సర్వీసులకు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఎంపికవుతుండటం విశేషం.
లక్ష్యం పెట్టుకుని పద్ధతి ప్రకారం చదివితే సివిల్‌ సర్వీసు పరీక్షలు ఇతర పోటీ పరీక్షల్లాంటివేనన్న అభిప్రాయం కూడా ఉంది. అందువల్లనే ఏడాదికేడాదీ ఈ పరీక్షలకు హాజరవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.

ఈ పరీక్షలు నెగ్గడానికి అనుసరిచాల్సిన పద్ధతులను కొన్ని విశ్లేషిద్దాం.

జనరల్‌ స్టడీస్‌లో అధిక మార్కులు

సివిల్స్‌ సర్వీసు రావడానికి ఆప్షనల్‌ ఎంపిక కీలకంగా ఉంటోంది. ఆప్షనల్‌లో వీలైనన్ని ఎక్కువ మార్కులు సంపాదిస్తేనే సర్వీసు రావడానికి వీలుంటుంది.

జనరల్‌ స్టడీస్‌లో విద్యార్థులు ఎక్కువ మార్కులు స్కోరు చేయలేకపోతున్నారు. 2013, 2014 సంవత్సరాలలో ఈ పేపర్లలో వచ్చిన సరాసరి మార్కులు వరుసగా 70, 80. అది 2015కు 90 మార్కులకు మాత్రమే పెరిగింది.

2011వ సంవత్సరానికి ముందు రెండు పేపర్లు మాత్రమే ఉండేవి. అవి ఇప్పుడు నాలుగు అయ్యాయి. టైమ్‌టేబుల్‌లో మార్పులు, పేపర్లు రెండు నుంచి నాలుగుకు పెరగడం కూడా దీనికి ఓ కారణంగా విశ్లేషించవలసిన అవసరం వుంది. గతంలో రెండు ఆప్షనల్‌ సబ్జెక్టులు ఉన్నప్పుడు ప్రధాన పరీక్ష దాదాపు నెల రోజులు జరిగేది. రెండు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి జరిగేవి. ఇప్పుడు మెయిన్‌ పరీక్ష అంతా వారం రోజుల్లో ముగుస్తోంది.

తొలిరోజున ఉదయం ఎస్సే, సాయంత్రం ఇంగ్లిషు పరీక్ష. ఇవి రాసి మరునాటి పరీక్షకు సాయంత్రం 6.30 గంటలకు ఉపక్రమించి రాత్రి 11 గంటల వరకు చదివితే ఓ ఐదు గంటలు చదవవచ్చు. తిరిగి ఉదయం నాలుగు గంటలకు చదువు ప్రారంభిస్తే ఎక్కువలో ఎక్కువగా ఆరు గంటలు. అంటే రెండో రోజు జరిగే పరీక్షకు అభ్యర్ధికి లభించే సమయం ఏడెనిమిది గంటలు మాత్రమే.

పరీక్షల సందర్భంలో... ఇంత తక్కువ సమయంలో పునశ్చరణ చేయాల్సిన సిలబస్‌ను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఉదాహరణకు మొదటి పేపరు జి.ఎస్‌.లో భారతదేశం, ప్రపంచ చరిత్ర, భారతదేశ, ప్రపంచ భూగోళశాస్త్రంతో పాటుగా భారతీయ సమాజం ఉన్నాయి. అదేవిధంగా రెండో పేపర్లో ఇండియన్‌ పాలిటీ, అంతర్జాతీయ సంబంధాలతో పాటు సాంఘిక న్యాయం ఉన్నాయి. ఈ సబ్జెక్టులన్నింటినీ ఏడెనిమిది గంటల్లో పునశ్చరణ చేయాల్సివుంటుంది.
ఉదాహరణకు ప్రపంచ చరిత్రను ఓ అర్థ గంటలో, భారతదేశ చరిత్రను ఓ గంటలో పునశ్చరణ చెయ్యగగలగాలి. ఇది అవలంబించకుంటే మిగతా వాటి రివిజను చేయలేరు. జనరల్‌ స్టడీస్‌లో విద్యార్థులు గణనీయమైన స్కోర్లను సాధించకపోవడానికి ఇదీ ఓ కారణం. అందుకే జనరల్‌స్టడీస్‌ పేపర్లు క్రమ విధానంలో సిద్ధమైతే గణనీయమైన మార్కులు సాధించవచ్చు.

విద్యార్థి తన సన్నద్ధతను మొదలుపెట్టినప్పుటి నుంచి సిలబస్‌లో పేర్కొన్న ప్రతి విషయాన్నీ చర్చిస్తూ పరీక్షలు రాస్తూవుండాలి. అనుభవజ్ఞులతో మూల్యాంకనం చేయించుకొంటూ ఏ ప్రశ్న అయినా రాసే విధంగా తయారవ్వవచ్చు. దీనికి తగినట్లుగా విద్యార్థి అనుభవం సంపాదించాలి. అందుకు ముఖ్యమైన పాయింట్లను ముందుగా నోట్‌ చేసుకొని వాటిని మననం చేయాలి. ఈ విధానాన్ని అవలంబిస్తే విద్యార్థి 110 నుంచి 120 మార్కుల దాకా ప్రతి పేపరులో సాధించుకోవచ్చు. అంటే జి.ఎస్‌.లో 440 నుంచి 480 మార్కుల దాకా సంపాదించుకోవచ్చు.

ఎధిక్స్‌ పేపరు + వ్యాసం

ఈ రెండు పేపర్లు ఒక్కొక్కటి 250 చొప్పున 500 మార్కులకు ఇస్తున్నారు. ఆప్షనల్స్‌ తరువాత ఈ పేపర్లకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అభ్యర్థులు ఈ రెండు పేపర్లలో 250 కంటే ఎక్కువ సాధించలేక పోతున్నారు. ఎక్కువమందికి ఈ రెండింటిలో 150కి మించి రావడం లేదు. ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తోంది? ఈ పేపర్లలో ఆంథ్రోపాలాజికల్‌ కోణాన్ని ఆవిష్కరించిన విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి. గత సంవత్సరం, ఈ ఏడాది మన తెలుగు విద్యార్థుల గెలుపోటములను విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 78 మంది సర్వీసు సాధించగా వారిలో అత్యధికులు ఆంత్రపాలజీనే ఆప్షనల్‌గా ఎంచుకొన్నారు. వాళ్ళకు ఈ రెండు పేపర్లలో 220 నుంచి 250 వరకు వచ్చాయి. వారు ఈ రెండు పేపర్లను ఆంత్రపాలజీ కోణంలో రాయగలగడమే దీనికి కారణం. ఆప్షనల్‌ ఎప్పుడూ ఇతర పేపర్లకు సహాయపడేదిగా ఉంటే అభ్యర్ధికి సులువుగా వుంటుంది. ఈ రెండు పేపర్లలో మార్కులు తక్కువగా వస్తే సర్వీసు వచ్చే అవకాశాలు దాదాపు తక్కువే.

ఆప్షనల్‌ తోడ్పాటుగా ఉండాలి

రాత పరీక్షలోని 1750 మార్కులలో 1250 మార్కులు జనరల్‌ స్టడీస్‌కు- ఎస్సేకే కేటాయించారు. అంటే ఇవి సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు ఎంత ముఖ్యమో అర్ధమవుతోంది. ఉదాహరణకు ఇంజినీరింగ్‌, మెడికల్‌ అభ్యర్థులు తమ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకొంటే అవి ఏవీ జనరల్‌ స్టడీస్‌, ఎస్సే రాసేందుకు ఉపయోగపడవు. జీఎస్‌ అంశాలున్న ఆప్షనల్‌ ఎంచుకుంటే సమయం కలిసివచ్చే అవకాశం ఉంటుంది.

తగ్గిన ఇంటర్వ్యూ మార్కుల సరాసరి

ఈ పరిణామం అభ్యర్ధులకు చాలా ఆనందాన్ని ఇచ్చిందనే చెప్పాలి. యు.పి.ఎస్‌.సి.పై కొంతకాలంగా ఉన్న విమర్శ ఇదే. ఒక్కో ప్యానెల్‌ ఒక్కో విధంగా మార్కులు వేయడం. గత ఏడాది ఓ విద్యార్థికి అత్యధికంగా ఒక ప్యానెల్‌ 225 మార్కులు వేయగా మరో ప్యానెల్‌ అత్యధికంగా 160 వేసింది. దీనివల్ల విద్యార్థులు ర్యాంకులు కోల్పొవలసివస్తోంది. ఈసారి దానిని స్కేలింగ్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఇది ఇలాగే సాగితే విద్యార్థులు నష్టపోరు. దీనిపై సమగ్ర విధానాన్ని ప్యానలిస్టులే రూపొందించుకోవడమో; యు.పి.ఎస్‌.సి.నే నిర్ణయించుకోవడమో చేస్తే మెరుగు. ఏదిఏమైనా అభ్యర్ధి ఇంటర్వ్యూని పరిగణనలోకి తీసుకోకుండా మెయిన్స్‌ పరీక్షనే మెరుగ్గా రాసేందుకు కృషి చేయాలి. అప్పుడు ఇంటర్వ్యూ మార్కులు కాకుండా రాత పరీక్షలో వచ్చిన మార్కులే ఫలితాన్ని నిర్దేశిస్తాయి.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌