• facebook
  • whatsapp
  • telegram

తుది అడుగు.. తడబడకు!

యూపీఎస్సీ - సివిల్స్ ఇంట‌ర్వ్యూ మెల‌కువ‌లు

అనుకున్న లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేస్తూ.. తడబడకుండా ఉండటం ముఖ్యం. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులు.. తుది అంకానికి మరింత మెరుగ్గా సన్నద్ధం అవడం అవసరం. పరీక్షలు రాయడం ఒక ఎత్తయితే.. పర్సనల్ ఇంటర్వ్యూలో ముఖాముఖిగా ప్రశ్నలను ఎదుర్కోవడం సవాలే. దాదాపు అరగంట ఉండే ఈ ప్రక్రియలో ఎక్కడా మన ఆత్మస్థైర్యాన్ని సడలనివ్వకూడదు. బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిన పని లేదు. ఏ భాషలోనైనా సమాధానమివ్వచ్చు. వాస్తవానికి ఈ ఏడాది రాతపరీక్షలో ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు ఏప్రిల్ 26 నుంచే జరగాల్సి ఉండగా.. దేశంలో కరోనా రెండో దశ తీవ్రత నేపథ్యంలో వాయిదా వేశారు. పరిస్థితులు కాస్త చక్కబడటంతో యూపీఎస్సీ ఆగస్టు 2 నుంచి ముఖాముఖి పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు విడుదల చేసింది. ఇది అభ్యర్థులు మరింత సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడింది. దాదాపు నాలుగు నెలల సమయం లభించడంతో ఇంటర్వ్యూలపై మరింత దృష్టి పెట్టే అవకాశం దొరికింది. ఇప్పటికీ మరో రెండు నెలల ఉంది. ఈ సమయాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే  కలలను సాకారం చేసుకోవచ్చు. 

అడిగింది చెబితే చాలు.. అనవసరమైనవి వద్దు

సివిల్స్.. సమాజంతో ముడిపడిన ఉద్యోగం. అందుకు తగినట్లుగానే ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిత్వంలోని భిన్న కోణాలను తెలుసుకోవడానికి వర్తమాన అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తారు. అభ్యర్థి అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటారు. వారు సంధించే ప్రశ్నలకు సమాధానాలను/కోణాన్ని సూటిగా చెప్పాలి. అటూఇటూ కాకుండా సంశయించడం ఎంతమాత్రం మంచిదికాదు. వాదనను వినిపిస్తూనే.. సమాధానం రాజ్యాంగ పరిధిలోని ప్రజాస్వామ్యయుతంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అనవసర వాగ్వాదాలకు చోటివ్వకూడదు. అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అంతేకాని అనవసర విషయాల జోలికి వెళ్లకూడదు. కొందరు మెయిన్స్ పరీక్ష ముగియగానే దినపత్రికలు చదవడం, సమకాలీన అంశాలపై దృష్టిపెట్టడం తగ్గిస్తారు. అలా చేస్తే తుది పోటీలో వెనకపడిపోయే ప్రమాదం ఉందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

వీటిపై దృష్టి పెడితే మేలు

ఇంట‌ర్వ్యూకి వెళ్ల‌గానే ముందుగా మ‌న‌కు ఇచ్చే డీటైల్డ్ అప్లికేష‌న్ ఫాం (డీఏఎఫ్‌)ను పూర్తి చేయాలి. అందులో అభ్యర్థులు పొందుప‌రిచే వ్య‌క్తిగ‌త‌ వివ‌రాల ఆధారంగానే ముఖాముఖిలో కొన్ని ప్ర‌శ్న‌లు ఎదురవుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు పేరుకు అర్థం ఏమిటి? పేరుతో ఉన్న‌ ప్ర‌ముఖుల వివ‌రాలు అడ‌గ‌వ‌చ్చు. అలాగే పుట్టిన తేదీన ఏమైనా ప్ర‌త్యేక‌మైన‌ రోజులు ఉన్నాయో చూసుకోవాలి. వాటిని కూడా ప్ర‌స్తావిస్తారు. అలాగే కుటుంబ నేప‌థ్యం, త‌ల్లిదండ్రుల వృత్తి, జిల్లా, రాష్ర్ట్రాల‌పై ప‌ట్టు పెంచుకోవాలి. 

అక‌డ‌మిక్‌ అంశాలకు సంబంధించి లోతైన ప్ర‌శ్న‌లు ఎదురవుతాయి. డిగ్రీ, పీజీ విద్యార్హ‌త ఉంటే ఆయా స‌బ్జెక్టుల‌ను రివైజ్ చేసుకోవాలి. కీల‌క భావ‌న‌లపై దృష్టి పెట్టాలి. పీహెచ్‌డీ చేస్తే సంబంధిత ప‌రిశోధ‌నా ప‌త్రం ప్ర‌జ‌లు, స‌మాజానికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో వివ‌రించ‌గ‌ల‌గాలి.  ఎన్ఎస్ఎస్‌, ఎన్‌సీసీ త‌దితర విభాగాల్లో అభ్యర్థి పోషించిన పాత్ర‌ను వివ‌రించ‌వ‌చ్చు.

గ‌తంలో ఎక్క‌డైనా ప‌ని చేసిన అనుభ‌వం ఉంటే.. వాటిపై ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది.  సాధించిన‌ విజ‌యాలు, అక్క‌డి నుంచి సివిల్స్ వైపు రావ‌డానికి కార‌ణాల‌ను సిద్ధం చేసుకోవాలి. 

సివిల్స్‌లో ఏ విభాగాన్ని ఎంచుకుంటార‌ని అడుగుతారు. మ‌నం కొన్ని ప్రాధాన్యాల‌ను వాళ్ల ముందుంచాలి. వాటినే ఎందుకు ఎంచుకుంటున్నార‌నే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాల్సి ఉంటుంది. 

క‌రెంట్ అఫైర్స్‌లో భాగంగా గ‌త ఏడాది నుంచి జ‌రిగిన పరిణామాలను ప్ర‌స్తావిస్తారు. అతిముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌తోపాటు ఇత‌ర విష‌యాల‌పైనా అవగాహన పెంచుకోవాలి. 

ఈ రెండు నెల‌ల స‌మ‌యంలో అనుభ‌వ‌జ్ఞుల నేతృత్వంలో జరిగే న‌మూనా ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావ‌డం ఉత్త‌మం. దాని ద్వారా ప్ర‌తికూల అంశాల‌ను తెలుసుకుని స‌రిదిద్దుకోవ‌చ్చు. 

మార్కుల కేటాయింపు ఇలా..

ఇంటర్వ్యూలో ఇవ్వదగ్గ మార్కులను నిర్దేశిస్తూ అరుణ్‌ నిగవేకర్‌ కమిటీ కింది పద్ధతిని సిఫార్సు చేసింది. స్వల్ప మార్పులతో దీన్నే అనుసరిస్తున్నారు.

సామాజిక ఏకత, నాయకత్వ లక్షణాలు, సివిల్‌ సర్వీసులకు తగిన లక్షణాలు: 70.

మానసిక సంసిద్ధత, విశ్లేషణపూర్వక తార్కికత, నైపుణ్యాల సమీకరణం, అంచనాలో సమతూకం: 70. 

లోతైన, వైవిధ్యభరిత ఆసక్తులు: 45

భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు: 45

నైతిక, మేధాపరమైన నిజాయతీ: 45 

మొత్తం: 275

సాధారణంగా తలెత్తే సందేహాలు

1. అభ్యర్థికి ఎలాంటి లక్షణాలుండాలి? 

మారుతున్న కాలానికి తగ్గట్టుగా నైపుణ్యాలు అవసరం. అభ్యర్థులకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. అప్రమత్తంగా ఉండటం, తార్కికంగా విశ్లేషించడం, ఒక నిర్థారణకు రావడంలో సమతౌల్యాన్ని పాటించడం, వైవిధ్యభరితమైన, లోతైన ఆసక్తులు ఉండటం, భావ ప్రసార నైపుణ్యం, మేధా, నైతికపరమైన సమగ్రత లాంటి లక్షణాలున్న అభ్యర్థుల కోసం బోర్డు అన్వేషిస్తుంటుంది. 

2. అభ్యర్థికి మెయిన్స్‌లో వచ్చిన మార్కులు బోర్డుకు తెలుస్తాయా? 

రాత పరీక్షలో అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయం ఇంటర్వ్యూ బోర్డుకు తెలియదు. 

3. సివిల్స్‌ ఎంపికలో సిఫార్సులకూ, బోర్డును ప్రభావితం చేయడానికీ అవకాశముంటుందా?

ఎలాంటి అవకాశమూ ఉండదు. ఏ అభ్యర్థిని ఏ బోర్డు ఇంటర్వ్యూ చేస్తుందనే విషయం అభ్యర్థులకు గానీ, బోర్డు చైర్‌పర్సన్, అడ్వైజర్లకు గానీ తెలియదు. ప్రతి సెషన్‌ ప్రారంభానికి ముందు మాత్రమే అభ్యర్థుల వివరాలతో సీల్‌చేసి ఉన్న కవర్‌ను తెరుస్తారు. కాబట్టి ప్రభావితం చేయడానికీ, సిఫార్సులకూ తావుండదు. 

4. మార్కుల కేటాయింపు ఎలా ఉంటుంది?

అభ్యర్థుల వ్యక్తిగత లక్షణాలు, సమాధానాల ఆధారంగా బోర్డు సభ్యులు మార్కులు వేస్తారు. వివిధ అంశాల మీద చర్చల్లో అభ్యర్థి మొత్తమ్మీద చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.

5. ఇంటర్వ్యూలో కనీసార్హత మార్కులుంటాయా?

ఉండవు. ఒకప్పుడు.. 1950 నుంచి 1957 వరకు ఉండేవి. ఏకపక్ష నిర్ణయాలకు అవకాశం ఉంటుందనీ, బలహీనవర్గాల అభ్యర్థులకు ఇది ప్రతికూలంగా ఉందనే ఉద్దేశంతో కనీస అర్హత మార్కులను రద్దుచేశారు. సాధారణంగా 90 నుంచి 100 మార్కులు వస్తే తక్కువ వచ్చినట్టుగా పరిగణిస్తారు. ఉదాహరణకు 2019 పరీక్షలో సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థి సాధించిన తక్కువ మార్కులు 110/275.

6. యూట్యూబ్‌లో చాలా ఇంటర్వ్యూలు చూస్తుంటాం. ఇవన్నీ యూపీఎస్‌సీ నిర్వహించిన నిజమైన ఇంటర్వ్యూలేనా? 

కాదు. చాలామంది ఇవన్నీ యూపీఎస్‌సీ నిర్వహించిన నిజమైన ఇంటర్వ్యూలేనని భ్రమపడుతుంటారు. నిజానికి యూపీఎస్‌సీ ఏ ఇంటర్వ్యూలనూ రికార్డు చేయడానికి అనుమతించదు. అవన్నీ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించి, అప్‌లోడ్‌ చేసే నమూనా  ఇంటర్వ్యూలు మాత్రమే!  

7. ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు సాధించాలనే లక్ష్యం పెట్టుకోవాలి? 

గత సంవత్సరాల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను పరిశీలిస్తే.. ఎక్కువమంది 275 మార్కులకు 170 నుంచి 179 మార్కులను సాధించారు. బాగా సాధన చేస్తే ఈ మార్కులను సంపాదించవచ్చు. సరైన మార్గదర్శకత్వంలో సిద్ధమైతే 180 నుంచి 199 మార్కులను పొందడం కష్టంకాదు. 

8. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలంటూ వివాదాస్పదమైనవి కొన్ని సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటాయి. నమ్మొచ్చా?

అలాంటివి అడగరు. యూపీఎస్‌సీ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వపరంగా జరిగే సీరియస్‌ ఇంటర్వ్యూ కాబట్టి బోర్డు సభ్యులు చాలా జాగ్రత్తగా ప్రశ్నలు సంధిస్తారు. అభ్యర్థుల మనోభావాలనూ, మతపరమైన, ఇతరమైన విశ్వాసాలనూ కించపరిచే విధంగా ప్రశ్నలు వేయరు. ఉదాహరణకు అవివాహిత అయిన అభ్యర్థిని ‘మీరెందుకు పెళ్లి చేసుకోలేదు?’ అని అడగరు. ఎందుకంటే అది ఆమె వ్యక్తిగత విషయం కాబట్టి.

ప్రశ్నలుగా అడిగే అవకాశమున్న అంశాలు

కొవిడ్‌-19 పాన్‌డమిక్‌ 

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌

ఎకనమిక్‌ స్టిమ్యులస్‌ మెజర్స్‌

నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం)

మిషన్‌ కర్మయోగి

15 ఫైనాన్స్‌ కమిషన్‌ రిపోర్ట్‌

అగ్రికల్చరల్‌ రిఫార్మ్‌ లాస్‌

లేబర్‌ రిఫార్మ్స్‌ బిల్స్‌

నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజన్సీ (ఎన్‌ఆర్‌ఏ)

గ్లోబల్‌ ఆయిల్‌ ప్రైసెస్‌

రీజనల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనమిక్‌ పార్టనర్‌షిప్‌ (ఆర్‌సీఈపీ)

న్యూ స్టార్ట్‌ ట్రీటీ

ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌)

డైరెక్షన్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఫారిన్‌ పాలసీ

రిలేషన్స్‌ ఆఫ్‌ ఇండియా విత్‌ నైబరింగ్‌ కంట్రీస్‌ 


వ్యవస్థాపక డైరెక్టర్,

బ్రెయిన్‌-ట్రీ సివిల్ స‌ర్వీసెస్ కోచింగ్ సెంట‌ర్‌,

హైద‌రాబాద్‌.

 

Posted Date : 23-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌