• facebook
  • whatsapp
  • telegram

మూర్తిమ‌త్వం

       Personality (మూర్తిమత్వం) అనే పదం Persona అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో పర్సోనా అంటే 'ముసుగు' అని అర్థం. పూర్వం గ్రీకులు ముసుగులు ధరించి నాటకాలు వేసేవారు. కానీ ప్రస్తుతం ఎక్కువమంది మూర్తిమత్వాన్ని సరైన భావనతో ఉపయోగించడం లేదు. వ్యక్తి బాహ్య సౌందర్యాన్నే మూర్తిమత్వంగా భావిస్తున్నారు. వాస్తవానికి మూర్తిమత్వం అంటే శారీరక బాహ్య సౌందర్యం మాత్రమే కాదు. మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక అంశాల లాంటి అంతర్గత వికాసాలతో ముడిపడి ఉన్న విస్తృత భావనే మూర్తిమత్వం.
నిర్వచనాలు: ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని స్పష్టంగా నిర్వచించడం కష్టం. కానీ కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కింది విధంగా వివరించారు.

 

(స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు) 

ఆల్‌పోర్ట్: ఏ మనో శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే అతడి మూర్తిమత్వం.
ఆర్.బి. కాటిల్: ఇచ్చిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించేందుకు దోహదపడేదే అతడి మూర్తిమత్వం.
ఐసెంక్: వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులే అతడి మూర్తిమత్వం.
వాట్సన్: దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం.
ఇ. ఫారిస్: సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం.
జె.ఎఫ్. బ్రౌన్: మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా.

 

(ఎస్‌జీటీ అభ్యర్థులకు) 

ఆల్‌పోర్ట్: ఏ మనో శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణే మూర్తిమత్వం.
ఇ. ఫారిస్: సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం.
ఇ.డబ్ల్యు. బర్జెస్: వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యమే ఆ వ్యక్తి మూర్తిమత్వం.
జె.ఎఫ్. బ్రౌన్: మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా.


మూర్తిమత్వం లక్షణాలు:

* వ్యక్తి పుట్టుకతో మూర్తిమత్వం ఏర్పడదు. జీవితానుభవాలు, అభ్యసనం ద్వారా వ్యక్తిగతంగా ఇది ఏర్పడుతుంది.
* మూర్తిమత్వం వైయక్తిక భేదాలను చూపుతుంది. కాబట్టి ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు.
* బాహ్య ప్రవర్తన, లక్షణాల ద్వారా ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు.
* మూర్తిమత్వం సరళత నుంచి ఉన్నత స్థానానికి మార్పు చెందుతుంది. శిశువుకు అనువంశికంగా పుట్టుకతో వచ్చిన లక్షణాలు క్రమంగా పరిసర ప్రతిచర్యలతో నిర్మాణం కావడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
* ప్రతి వ్యక్తిలోనూ మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దుగా ఉండదు. ఎందుకంటే మూర్తిమత్వం గతిశీల (Dynamic) ప్రక్రియ.
* ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించి అంచనా వేయవచ్చు కానీ కచ్చితంగా మాపనం చేయలేం.
* మూర్తిమత్వం ప్రత్యేకమైంది. ప్రతి వ్యక్తిలోనూ సర్దుబాటు చేసుకునే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.
* వ్యక్తి కొన్ని సందర్భాల్లో కనబరిచే ప్రవర్తనా నమూనాలను గమనించి అతడి మూర్తిమత్వాన్ని గణించకూడదు.
* వ్యక్తి మూర్తిమత్వం అతడిలోని వైఖరులపై ఆధారపడుతుంది.
* అభ్యసనం, అనుభవాలు మూర్తిమత్వ అభివృద్ధికి దోహదపడుతాయి.

 

మూర్తిమత్వ కారకాలు

వ్యక్తి మూర్తిమత్వ వికాసాన్ని ప్రధానంగా రెండు కారకాలు ప్రభావితం చేస్తాయి.
అవి 1) అనువంశికత 2) పరిసర కారకాలు
1. అనువంశికత: వ్యక్తి మూర్తిమత్వాన్ని మొదట ఆ వంశం నుంచి సంక్రమించే లక్షణాలు ప్రభావితం చేస్తాయి. ఇందులో ఆ వ్యక్తి బాహ్యరూపం, నాడీమండలం, గ్రంథులు, ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రేరణ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, ఉద్వేగాలు ప్రధానమైనవి.
గ్రంథులు: శరీరంలోని గ్రంథులను రెండు రకాలుగా విభజించవచ్చు.
అవి ఎ) నాళ గ్రంథులు బి) వినాళ గ్రంథులు
 ఎ. నాళ గ్రంథులు (Exocrine glands): ఇవి స్రవించే స్రావకాలను ఎంజైములు అంటారు. ఇవి నేరుగా రక్తంలోకి స్రావితం కావు (కలవవు). కాబట్టి వీటి ప్రభావం వ్యక్తి మూర్తిమత్వంపై అధికంగా ఉండదు.
ఉదా: లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయ గ్రంథి, మూత్రపిండాలు, స్వేద గ్రంథులు, జననాంగ గ్రంథులు.
బి. వినాళ గ్రంథులు (Endocrine glands): వీటికి నాళాలు ఉండవు. ఇవి విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోనులు అంటారు. ఇవి నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి. మూర్తిమత్వంపై వీటి ప్రభావం ఎక్కువ.
  

 2. పరిసరాలు: వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాల్లో మొదటిది కుటుంబం, తర్వాత పాఠశాల, పరిసరాలు ముఖ్యమైనవి. తల్లిదండ్రుల సక్రమ పెంపకం, సక్రమ ఉద్వేగాలతో అవసరాలు తీర్చుకుంటూ పెరిగినవారు స్థిరత్వం గల నిర్మాణాత్మక మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులతో సక్రమంగా పెరగనివారు బాధ్యతారహితంగా, ఈర్ష్యాద్వేషాలతో సమాజానికి కీడు చేసేవారిగా ఉంటారు. పాఠశాలను పరిశీలిస్తే... ఉపాధ్యాయుల నుంచి క్రమశిక్షణ, సహకారం, నిజాయతీ గల స్నేహితుల వల్ల మంచి మూర్తిమత్వం ఏర్పడుతుంది. సమాజపరంగా ఎదురయ్యే దృక్పథాలు, నియమాలు, ఆచార వ్యవహారాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి పిల్లలను వీలైనంత మంచి పరిసరాల్లో పెంచాలి.
 

మూర్తిమత్వ సిద్ధాంతాలు

వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడానికి అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి
1. రూపక సిద్ధాంతాలు
(Types theories)
2. లక్షణాంశ సిద్ధాంతాలు (Trait theories)
3. నిర్మితి సిద్ధాంతాలు (Structure theories)

 

1. రూపక సిద్ధాంతాలు: వ్యక్తి మూర్తిమత్వ నిర్మాణాన్ని వివరించడంలో బాహ్య రూపాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్న సిద్ధాంతాలివి.
ఈ సిద్ధాంతాలను రూపొందించినవారు
     1. హిప్పోక్రటస్
     2. క్రెష్మర్
     3. షెల్డన్
     4. యూంగ్
     5. స్ప్రాంగర్

 

2. లక్షణాంశ సిద్ధాంతాలు: కొంతమంది రూపానికి బదులు లక్షణాంశాలను పరిగణనలోనికి తీసుకుని మూర్తిమత్వాన్ని వర్ణించారు. ఇది కొంత మెరుగైన పద్ధతి. వ్యక్తిలో దాదాపు శాశ్వతంగా కనిపించే గుణాన్ని లక్షణం అంటారు. మంచితనం, దౌర్జన్యం, పిసినారితనం, చిరాకు, కోపం, సహనశీలత్వం మొదలైనవి కొన్ని లక్షణాంశాలు. లక్షణాంశ సిద్ధాంతాలను పేర్కొన్నవారిలో ఆల్‌పోర్ట్, రేమండ్ బి.కాటిల్ ముఖ్యులు.
 

3. నిర్మితి సిద్ధాంతాలు: వ్యక్తి సమగ్ర రూపాన్ని, ప్రవర్తనా ప్రాకార్యాలను ఆధారం చేసుకుని మూర్తిమత్వాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నమే ఈ సిద్ధాంతాలు. వీటిలో ముఖ్యమైనవి
ఎ. మనోవిశ్లేషణ సిద్ధాంతాలు: ఆస్ట్రియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన మనోవిశ్లేషణ మూర్తిమత్వ సిద్ధాంతం ప్రాచుర్యం పొందింది. ఈయన రాసిన గ్రంథం ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్.
బి. మనో సాంఘిక వికాస సిద్ధాంతం: వ్యక్తిలోని అహం సృజనాత్మమైందనీ, ఇది పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ సృజనాత్మకమైన పరిష్కార మార్గాన్ని కనుక్కుంటూ వ్యక్తి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తుందని 'ఎరిక్‌సన్' ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు.

 

మూర్తిమత్వాన్ని అంచనా వేయడం (Assessment of Personality)

వ్యక్తిలోని మూర్తిమత్వం గతిశీలమైంది అంటే నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి మూర్తిమత్వాన్ని మాపనం చేయడం కంటే అంచనా వేయవచ్చు. మూర్తిమత్వాన్ని ప్రధానంగా 2 పద్ధతుల ద్వారా అంచనా వేయవచ్చు. అవి
I. ప్రక్షేపక పరీక్షలు
II. అప్రక్షేపక పరీక్షలు

 

I. ప్రక్షేపక పరీక్షలు (Projective Tests): వ్యక్తి అచేతనంలో ఉండే వివిధ లక్షణాంశాలను గమనించడానికి చేసే పరీక్షలను ప్రక్షేపక పరీక్షలు అంటారు. ప్రక్షేపణం అనేది ఒక అచేతన ప్రక్రియ. ఈ పరీక్షలోని ఉద్దీపనలు అస్పష్టంగా, అర్థరహితంగా, అసంపూర్ణంగా ఉంటాయి. ఇవి వ్యక్తి మూర్తిమత్వ అంతర్గత అంశాలను తనకు తెలియకుండా వ్యక్తపరిచేలా చేస్తాయి. వ్యక్తి అస్పష్టమైన చిత్రాలను చూసి ఊహించి, ప్రత్యక్షాత్మక భావాల్లో కథను చెప్పాల్సి ఉంటుంది.
 

i. హిల్‌గార్డ్ ప్రకారం: ప్రక్షేపక పరీక్షల్లో ప్రయోజ్యుడు తన ఊహా కల్పనతో తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. అసంపూర్ణమైన ఉద్దీపన వ్యక్తిని స్వేచ్ఛగా ఆలోచించి ప్రతిస్పందన చేసేందుకు దోహదం చేస్తుంది.
 

ii. లిండ్ జే ప్రకారం: ప్రక్షేపక పరీక్ష అనేది ఒక పరికరం. దీని ద్వారా అంతర్గత లేదా అచేతన ప్రవర్తనాంశాల సూక్ష్మగ్రాహకత జరుగుతుంది. ప్రయోజ్యుడి అసాధారణమైన, విలువైన ప్రతిస్పందన, దత్తాంశాలను అతడికి తెలియకుండానే సేకరిస్తారు.
ఈ పరీక్షల్లో ముఖ్యమైనవి A) రోషాక్ సిరామరకల పరీక్ష B) ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష C) పిల్లల గ్రాహ్యక పరీక్ష.

 

 A. రోషాక్ సిరామరకల పరీక్ష (R.I.B.T.): ప్రక్షేపక పరీక్షల్లో ఎక్కువగా వాడుకలో ఉన్న ఈ పరీక్షను రూపొందించినవారు స్విట్లర్లాండ్ దేశానికి చెందిన 'హెర్మాన్ రోషాక్'. ఈ పరీక్షలను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినవారు - బెక్. ఈ పరీక్ష ఉద్దేశం మొదట ప్రయోజ్యుడికి తెలియదు. పరీక్షలో 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. వీటిపై అస్పష్ట సిరా మరకలు ఉంటాయి. 5 కార్డులు తెలుపు నలుపు రంగుల్లోనూ, 2 కార్డులు నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లోనూ మిగిలిన 3 కార్డులపై పంచవర్ణ సిరామరకలు ఉంటాయి. నిర్ణీత కాలపరిమితి ఏమీ లేకుండా కార్డులు ప్రయోజ్యుడికి ఇచ్చి ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు అనే నాలుగు అంశాల ద్వారా గమనిస్తారు.
 

1. స్థానం (Location): ప్రయోజ్యుడు ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తాడో తెలుపుతుంది.
    * W - పూర్తి బొమ్మ
(Whole Response)
    * D - పెద్ద భాగం (Large Details)
    * d - చిన్న భాగం (Small Details)
    * S - ఖాళీ భాగం (Space Response)

 

2. విషయం (Content): ఇచ్చిన సిరా మరక కార్డులో ఏం చూశాడో తెలుపుతుంది.
    * H - మానవ రూపం
(Human forms)
    * A - జంతు రూపం (Animal forms)
    * Hd - మానవ భాగం (Human details)
    * Ad - జంతు భాగం (Amimal details)
    * N - ప్రకృతి భాగం (Natural objects)
    * O - ప్రాణరహితమైనవి (Inanimate things)

 

3. నిర్ణాయకాలు (Determinants): ఉద్దీపనలో దేని ఆధారంగా నిర్ణయం తెలుపుతున్నాడో ఇది తెలియజేస్తుంది.
    * F - ఆకారం
(Form)
    * C - రంగు (Colour)
    * K - తేలిక రంగు గల ప్రదేశం (Shading)
    * M - కదలికలు (Movements)

 

4. మౌలికాలు (Orginalities): ఎలాంటి నిర్ణయాన్ని తెల్పుతున్నాడో తెలుపుతుంది.
    * స్వతంత్ర అభిప్రాయాలు
(Original responses)
    * సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు (Popular responses)

 

B. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష (Thematic Apperception Test): ఈ పరీక్షను ముర్రే, మోర్గాన్ రూపొందించారు. ఈ పరీక్ష వివిధ సందిగ్ద పరిస్థితులతో కూడి ఉంటుంది. దీనిలో దీర్ఘచతురస్రాకార 30 మానవరూప చిత్రాలు, ఒక ఖాళీ కార్డు ఉంటాయి. ఇందులో 10 కార్డులు స్త్రీలకు, 10 కార్డులు పురుషులకు, మిగిలిన 10 కార్డులు స్త్రీ, పురుషులకు సంబంధించినవి, ఒక ఖాళీ కార్డు ఉంటుంది. ఈ పరీక్ష కేవలం వయోజనులను వైయక్తికంగా పరీక్షించడానికి ఉద్దేశించింది. ఒక్కో ప్రయోజ్యుడికి 21 కార్డులను ఇస్తారు. ప్రయోజ్యుడు ఈ కార్డులను చూసి ఒక కథను ఊహించి రాయాలి. తద్వారా అతడు తనకు తెలియకుండానే తనలోని నిగూఢమైన ప్రేరణలను, సంఘర్షణలను, వైఖరులను వెలిబుచ్చుతాడు.
ఇందులో మూర్తిమత్వాన్ని అంచనా వేసే అంశాలు
    1. కథానాయకుడు ఎవరు?
    2. కథా సారాంశం ఏమిటి?
    3. కథా పరిమాణం ఏమిటి?

 

C. చిన్నపిల్లల గ్రాహ్యక నికష (Children Apperception Test): 3 - 10 సంవత్సరాల చిన్న పిల్లలకు సంబంధించిన ఈ పరీక్షను ఎస్.బెల్లాక్, ఎల్.బెల్లాక్ రూపొందించారు. ఈ పరీక్షలో జంతువులు, పక్షుల బొమ్మలకు సంబంధించిన 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. పిల్లలు ఈ బొమ్మలను చూసి కథ చెప్పాల్సి ఉంటుంది. ఇందులో కథానాయకుడు, కథా సారాంశం, కథ ముగింపు లాంటి విషయాలను పరిశీలించి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అయితే ఈ పరీక్షను నిర్వహించేవారు బాగా తర్ఫీదు పొందినవారై ఉండాలి.
 

II. అప్రక్షేపక పరీక్షలు (Non-Projective Tests)
  ఈ పద్ధతిలో ఉద్దీపనలు స్పష్టంగా ఉంటాయి. ఇందులో మూర్తిమత్వ లక్షణాలను తెలిపే వాక్యాలు లేదా ప్రశ్నలు ఉంటాయి. ఈ ఉద్దీపనలకు ప్రయోజ్యులు లేదా వారి పరిచయస్థులు స్పందించవచ్చు.

 

ఇందులో ముఖ్యమైనవి:
1. నిర్ధారణ మాపనులు
(Rating Scales)
2. మూర్తిమత్వ శోధికలు (Personality Inventories)
3. ప్రశ్నావళి (Questionnaire)

 

1. నిర్ధారణ మాపనులు (Rating Scales): ఒక వ్యక్తి లక్షణాంశాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించి ఒక వ్యక్తి గురించి విస్తారంగా తెలుసుకోవచ్చు.
ఉదా: వ్యక్తిలో సహకారభావం, నమ్మకం, భావోద్రేక సమతౌల్యత, నాయకత్వ లక్షణాలు మొదలైనవి. ఈ నిర్ధారణ మాపనులను రెండు రకాలుగా పరిశీలించవచ్చు.

 

A. స్వీయ నిర్ధారణ మాపని: వ్యక్తి తనలోని లక్షణాంశాలను తనకు తానే నిర్ధారించుకుంటాడు. దీన్ని నిరక్షరాస్యులు, చిన్నపిల్లలు, మానసిక రోగులకు ఉపయోగించలేం.
 

B. ఇతరులతో నిర్ధారించడం: ఒక వ్యక్తి లక్షణాంశాలను మరో వ్యక్తి నిర్ధారిస్తాడు.
 

1. నిర్ధారణ మాపనులు:
* ది వినిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్
* విటిన్స్ బర్న్‌స్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్
* ది బెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్
* హగేర్టీ - అల్సన్ - విక్‌మన్ రేటింగ్ షెడ్యూల్స్

 

ఉపయోగాలు:
* విశ్వసనీయత ఉంటుంది.
* మూర్తిమత్వ లక్షణం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
ఉదా: పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆవశ్యకత
 

పరిమితులు:
A. కేంద్రీయ ప్రవృత్తి లోపం:
మాపనం చేసే వ్యక్తి అధికంగా మధ్యస్థం లేదా సగటు మార్కులు గుర్తించడం.
B. ఔదార్య దోషం: ఉదారంగా ఎక్కువ స్థాయిలో గుర్తించడం.
C. హాలో ఎఫెక్ట్ (పరివేష ప్రభావం): ఒక వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని మాపనం చేయడం.

2. మూర్తిమత్వ శోధికలు: ఇవి ప్రశ్నావళుల మాదిరి ఉంటాయి. వీటిలో ప్రయోజ్యుడు తన గురించి తాను అంచనా వేసుకుంటాడు. ఇందులో ప్రతి ప్రశ్నకు తప్పు/ ఒప్పు లేదా అవును/ కాదు/ చెప్పలేను అని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇందులో ప్రయోజ్యుడు ఎంత నిజాయతీతో జవాబులు ఇచ్చాడనే విషయంపై మూర్తిమత్వ అంచనా ఆధారపడి ఉంటుంది. ఇందులో మొదట రూపొందించిన మూర్తిమత్వ శోధిక 'ఉడ్‌వర్త్ పర్సనల్ డేటా షీట్'.
వీటిలో ముఖ్యమైనవి
మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ (MMPI): ఈ శోధికను అమెరికాకు చెందిన మెకిన్‌లే, హథావే రూపొందించారు. ఇది అతిపెద్ద, బాగా ప్రాచుర్యంలో ఉన్న శోధిక. ఇందులో మొత్తం 550 ప్రవచనాలను 10 వర్గాలుగా విభజించారు.
ది బెల్స్ సర్దుబాటు శోధిక (Bell's Adjustment Inventory): దీన్ని హెచ్.ఎం. బెల్ అనే శాస్త్రవేత్త రూపొందించాడు. ఈ శోధికలో వ్యక్తి జీవితానికి చెందిన గృహం, ఆరోగ్యం, సాంఘిక సర్దుబాటు, ఉద్వేగ సర్దుబాటుకు చెందిన ప్రవచనాలు ఉంటాయి. వీటికి ఎదురుగా అవును/ కాదు లాంటి జవాబులు ఉంటాయి.

సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీలు: వ్యక్తిలోని ఆత్మవిశ్వాసానికి సంబంధించిన అంశాలను తెలుసుకుని మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి.
 

3. ప్రశ్నావళి (Questionnaire):
మూర్తిమత్వ అంచనా సాధనాల్లో తరచుగా, ఎక్కువగా ఉపయోగించే సాధనం ప్రశ్నావళి. ఇది తక్కువ సమయంలో ఎక్కువమంది నుంచి సమాధానాలను సేకరిస్తుంది. దీని నిర్వహణ తేలిక. కానీ ఇందులో వ్యక్తి నిష్ఠత ఎక్కువ. ఇది రెండు రకాలు
1. నిర్ధారిత ప్రశ్నావళి: ముందుగానే అవును/ కాదు/ చెప్పలేను అనే నిశ్చయాల్లో ఏదో ఒకటి ఎంపిక చేయాలి.
2. స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి: దీనిలో ప్రతి ప్రశ్నకు వ్యక్తి స్వేచ్ఛగా తనకు తోచిన సమాధానాన్ని రాయడానికి అవకాశం ఉంటుంది.
ఉదా: రేమండ్ బి.కాటిల్ అభివృద్ధి చేసిన 16 PF ప్రశ్నావళి.

 

సర్దుబాటు/ సమయోజనం (Adjustment) 

       వ్యక్తి పుట్టినప్పటి నుంచి జీవితమంతా నిరంతరం తనచుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే సర్దుబాటు ఒక నిరంతర ప్రక్రియ. వ్యక్తి అవసరాలకు, వాటిని తృప్తిపరచడానికి మధ్య సమతుల్యతను కలిగి ఉండటమే సర్దుబాటు.

నిర్వచనాలు:
జేమ్స్ డ్రెవర్:
ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడానికి, పరిహరించడానికి తగినట్లు మార్పు చెందడమే సర్దుబాటు.
జె.బి. చాప్లిన్: 'డిక్షనరీ ఆఫ్ సైకాలజీ' అనే గ్రంథంలో సర్దుబాటును 2 రకాలుగా నిర్వచించారు.
* ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే కృత్యాల్లో వైవిధ్యం.
* భౌతిక, సాంఘిక పరిసరాలతో సుహృద్భావం ఏర్పరచుకోవడానికి జీవి కనబరిచే కృత్య వైవిధ్యం.

 

ఆటంకాలు: వ్యక్తి సర్దుబాటు చేసుకోవడంలో కింది ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఆటంకాలను ప్రధానంగా కింది విధంగా చెప్పవచ్చు.
I. వ్యక్తిగత ఆటంకాలు:

1. వ్యక్తిగత ఆటంకాలు: శారీరకంగా కలిగే శారీరక సంబంధ లోపాలను గుర్తించవచ్చు. ఇవి పుట్టుకతోనో లేదా మధ్యలోనో జరిగి ఉండవచ్చు.
2. మానసిక ఆటంకాలు: వ్యక్తి సర్దుబాటులో అతడి అంతర్గత భావోద్రేక సమతౌల్యం, తక్కువ ప్రజ్ఞ లాంటివి వస్తాయి.

 

2. పరిసర ఆటంకాలు:
1. భౌతిక ఆటంకాలు:
వ్యక్తి సర్దుబాటులో తన చుట్టూ ఉండే పరిస్థితులు దీని కిందకు వస్తాయి.
ఉదా: నదులు, ఎడారులు, సముద్రాలు లాంటివి.
2. మానసిక ఆటంకాలు: వ్యక్తి తనపట్ల ఏర్పరచుకునే స్వీయ భావన.
ఉదా: వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలు.

3. సాంఘిక ఆటంకాలు: ఆచార వ్యవహారాలు, సాంఘిక అంతరాలు, కులమత ఆచారాలు వ్యక్తికి ఇబ్బంది కలిగించవచ్చు.
సరైన సర్దుబాటు గల వ్యక్తి లక్షణాలు:
* అన్ని మంచి అంశాల పట్ల ధనాత్మక వైఖరి కలిగి ఉంటాడు.
* తన శక్తి సామర్థ్యాలను తెలుసుకుని దానికి తగిన లక్ష్యాన్ని ఎన్నుకుంటాడు.
* సర్దుబాటుతో తాను ఆనందంగా ఉంటూ ఇతరులను ఆనందంలో ఉంచుతాడు.
* ఆత్మగౌరవం, భావోద్వేగ సమతౌల్యం, తగిన సాంఘిక పరిపక్వతను కలిగి ఉంటాడు.
* ఇతరులను తక్కువగా విమర్శిస్తూ, పరిస్థితికి అనుకూలంగా ఉంటాడు.

 

మానసిక ఆరోగ్యం (Mental Health) 

     ఎలాంటి మానసిక రుగ్మతలు లేకుండా వ్యక్తి సంతోషకర జీవితాన్ని గడపడాన్నే మానసిక ఆరోగ్యం అంటారు.
బెర్నార్డ్: ''వ్యక్తులు తమకు తాము మొత్తం ప్రపంచంతో అనుగుణ్యత చెంది సమర్థవంతంగా, సంతృప్తికరంగా, సంతోషదాయకంగా, సాంఘిక అనుకూలమైన ప్రవర్తనను నెలకొల్పి నిత్యజీవితంలోని పరిస్థితులను సక్రమంగా ఎదుర్కొని అంగీకరించడాన్ని మానసిక ఆరోగ్యం అంటారు".
     వ్యక్తి సంపూర్ణ జీవితం గడపడానికి సక్రమమైన మానసిక ఆరోగ్యం అవసరమని మానసిక ఆరోగ్య మూలపురుషుడిగా పేరుగాంచిన 'క్లిఫర్డ్ బీర్స్' పేర్కొన్నాడు. 1908లో 'A mind that found itself' అనే గ్రంథాన్ని ప్రచురించాడు.

వ్యక్తికి మానసిక ఆరోగ్యం అనేది అత్యంత ముఖ్యమైందని 'క్లిఫర్డ్ బీర్స్' పేర్కొన్నాడు. దీనిపై పరిశోధనలు చేయడానికి మానసిక ఆరోగ్య సంస్థలను ఏర్పాటు చేశాడు.
     1909 - National Committee for Mental Health
     1930 - International Mental Hygiene Congress
     1948 - World Health Organization
     మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న మనిషి ప్రవర్తించే విధానాన్ని కొందరు 'దెయ్యాలు'గా నమ్ముతారని... అసలు దెయ్యాలు, భూతాలు అనేవి లేవని వాటిపై శాస్త్రీయ దృక్పథాన్ని పీనల్ అనే శాస్త్రవేత్త ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలోని 'యునిసెఫ్' మానసిక ఆరోగ్యం గురించి కృషి చేస్తోంది.
సంఘర్షణలు (Conflicts) 

డగ్లస్ అండ్ హాలెండ్: రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితినే సంఘర్షణ అంటారు.
 

కర్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణ రకాలు:
1. ఉపగమ - ఉపగమ సంఘర్షణ (Approach - Approach Conflict):
రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎన్నిక లేదా అనుకూలమైన రెండు గమ్యాల్లో ఏదో ఒకదాన్ని కచ్చితంగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణ.

ఉదా:  * పరీక్షలో బాగా తెలిసిన రెండు జవాబుల్లో ఏదో ఒకటి రాయాల్సి వచ్చినప్పుడు.
       * సినిమా చూడాలని ఉంది. నిద్ర వస్తుంది కాబట్టి నిద్ర పోవాలనిపించడం.
       * అవ్వా కావాలి... బువ్వా కావాలి అనే సామెత.

2. పరిహార - పరిహార సంఘర్షణ (Avoidance - Avoidance Conflict): రెండు అయిష్టమైన గమ్యాల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ.

ఉదా: * అనారోగ్యంతో బాధపడే బాలుడికి సూదిమందు తీసుకోవడం ఇష్టం లేదు. మాత్ర మింగడం ఇష్టం లేదు.
* ఉద్యోగం బదిలీ కావడంతో దూర ప్రదేశానికి వెళ్లడం ఇష్టం లేకపోవడం. రాజీనామా చేయడం కూడా ఇష్టం లేకపోవడం.

 

3. ఉపగమ - పరిహార సంఘర్షణ (Approach - Avoidance Conflict): అనుకూలమైన, ప్రతికూలమైన గమ్యాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ.

ఉదా: * పరీక్షల్లో పాస్ కావాలని కోరిక ఉంది. కానీ రోజూ చదవాలంటే బాధగా ఉండటం.
* బాలుడికి కుక్కపిల్లతో ఆడుకోవాలని ఉండటం... కరుస్తుందని భయపడటం.

4. ద్విఉపగమ - పరిహార సంఘర్షణ (Double approach - Avoidance conflict): రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల, ప్రతికూల విషయాలు ఉండటం వల్ల ఏర్పడే సంఘర్షణ.

ఉదా: ఒక వ్యక్తి తక్కువ జీతంతో తమ ఊరిలోనే పనిచేస్తున్నాడు. కానీ అతడికి ఎక్కువ జీతంతో దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఇందులోని అంశాలను పరిశీలిస్తే ఎక్కువ జీతం, తన ఊరిలో పనిచేయడం లాంటివి ధనాత్మకం కాగా తక్కువ వేతనం, దూరపు ప్రదేశంలో పనిచేయడం రుణాత్మకమైనవి.
 

రక్షక తంత్రాలు (Defence Mechanisms)

        వ్యక్తిలో మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉంటే సర్దుబాటు ప్రక్రియ జరుగుతుంది. ఈ సర్దుబాటు సక్రమంగా జరగకపోతే వ్యక్తిలో తన్యత (Tension) ఏర్పడి సంఘర్షణ (Coflict)కు దారితీస్తుంది. ఈ సందర్భంలో వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడితే కలిగే బాధాకర ఉద్వేగ పరిస్థితిని కుంఠనం (Frustration) అంటారు. ఈ కుంఠనం వ్యాకులత (Anxiety)కి దారితీసిన సందర్భంలో వ్యక్తి తనకు తానుగా ఉపశమనం పొందడానికి రక్షక తంత్రాలను ఉపయోగిస్తాడు. ఈ రక్షక తంత్రాలు అనేవి వ్యక్తి మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయని 'సిగ్మండ్ ఫ్రాయిడ్' అభిప్రాయపడ్డాడు. అవి:

1. దమనం (Repression): విచారకరమైన, ఇబ్బందికరమైన విషయాలను మనసులోని అచేతనంలోకి నెట్టి వ్యక్తి ఉపశమనం పొందడమే దమనం. 'అమ్నీషియా' అనే మానసిక రోగంలో ఈ రక్షక తంత్రం ప్రభావం ఉంటుంది.
ఉదా: * స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల మరణవార్తను విని బాధాకరమైన ఈ సంఘటనను కొంత కాలానికి ప్రయత్నపూర్వకంగా మరచిపోవడం.
* తోటి స్నేహితుల ముందు జరిగిన అవమానాన్ని మరచిపోవడం.

 

2. ప్రక్షేపణం (Projection): వ్యక్తి తనలోని లోపాలను, తప్పిదాలను ఇతరులపైకి నెట్టివేయడం.
ఉదా: * పరీక్షలో ఎందుకు ఉత్తీర్ణత కాలేదని విద్యార్థిని అడిగితే, ఉపాధ్యాయుడు సరిగా చెప్పలేదని చెప్పడం.
* క్రికెట్‌లో డకౌట్ అయిన బ్యాట్స్‌మన్ పిచ్ బాగాలేదు అని చెప్పడం.

 

3. పరిహారం (Compensation): ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకుని అభివృద్ధిని సాధించడం.
ఉదా: * చదువులో రాణించలేని వ్యక్తి క్రీడల్లో రాణించడం.
* వ్యాపారంలో నష్టపోయిన వ్యక్తి ఉద్యోగం చేయడం.

 

4. హేతుబద్ధీకరణ (Rationalization): వ్యక్తి తాను చేసే తప్పులకు తనను తాను సమర్థించి చెప్పుకోవడం.
ఉదా: * పరీక్షలో ఫెయిలైన విద్యార్థిని ఎందుకు పాస్ కాలేదని అడిగితే ''పాసయి ఏం లాభం' అని చెప్పడం.
* క్రీడల్లో రాణించలేని విద్యార్థి ''క్రీడల వల్ల కాలం వృథా, చదువుకోవడం మంచిది" అని చెప్పడం.

5. విస్తాపనం (Displacement): వ్యక్తి తనలోని కోపాన్ని, కుంఠనాన్ని తన కంటే తక్కువ స్థాయి వ్యక్తులు, వస్తువులపై చూపించడం.
ఉదా: * ఇంట్లో భార్యతో పోట్లాడిన ఉపాధ్యాయుడు తన కోపాన్ని పాఠశాలలోని విద్యార్థులపై చూపించడం.
* పరీక్షలో ఫెయిలైన విద్యార్థి పుస్తకాలను చింపడం.

 

6. తదాత్మీకరణం (Identification): వ్యక్తి ఒక్కోసారి తాను సాధించలేని కోర్కెలను ఇతరులతో సాధింపజేసి తానే సాధించినట్లు అనుభూతి పొందడం.
ఉదా: * ఇండియా క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిస్తే రాజు అనే వ్యక్తి తానే గెలిచినట్లు అందరికీ స్వీట్లు పంచడం.
* ఐఏఎస్ సాధించలేని వ్యక్తి, దాన్ని తన కొడుకు సాధించినప్పుడు తానే సాధించినట్లు ఆనందపడటం.

 

7. ప్రతిగమనం (Regression): వ్యక్తి తనకు ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోలేక చిన్నపిల్లాడిలా ప్రవర్తించడం.
ఉదా: * ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లాడిలా ఏడవటం.
* వ్యాపారంలో నష్టపోయిన వ్యక్తి ఏడవటం.

 

8. ఉదాత్తీకరణం (Sublimation): ఉద్వేగపూరితమైన ఆలోచనలను నిర్మాణాత్మక క్రియల్లో కేంద్రీకరించడం.
ఉదా: * భగ్న ప్రేమికుడు తన ప్రేమ, ప్రేయసిపై అనేక కవితలు రాసి గొప్ప కవిగా పేరు ప్రఖ్యాతులు పొందడం.
* వీధి పోరాటాలు చేసే మైక్ టైసన్ బాక్సింగ్‌లో పేరు ప్రఖ్యాతలు సాధించడం.

9. బౌద్ధీకరణం (Intellectualisation): బాధ కలిగించే పరిస్థితుల నుంచి బౌద్ధిక నిర్వచనాలతో పూర్తిగా ఆ పరిస్థితి నుంచి దూరం కావడం.
ఉదా: * విహారయాత్రలో అపశృతులను మరచి కేవలం ఆనందకరమైన అంశాలను మాత్రమే గుర్తుంచుకోవడం.
* కుటుంబంలోని వ్యక్తి మరణిస్తే అతడు బతికినంత కాలం గొప్పగా బతికాడని చెప్పడం.

 

10. వ్యక్తీకరణ (Acting out): వ్యక్తిలో ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం. ఇది తాత్కాలిక ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తుంది కానీ చెడును తలపిస్తుంది.
ఉదా: తల్లిదండ్రులు పెట్టే బాధను ఒకానొక రోజు పిల్లవాడు వారిముందు వెళ్లగక్కడం.

 

11. స్వైరకల్పన (Fantasy): వ్యక్తి సాధించలేని వాటి గురించి పగటి కలలు కంటూ, ఊహల్లో ఉండటమే స్వైరకల్పన.
ఉదా: * పేదరికంలోని వ్యక్తి ధనవంతుడైనట్లు కలలు కనడం.
* కార్మికుడు తాను పనిచేస్తున్న కంపెనీకి యజమాని అయినట్లు కల కనడం.

 

12. నిరాకరణ (Danial of Reality): అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకపోవడం.
ఉదా: * వ్యక్తిని నీవు అహంకారి అంటే కాదని గట్టిగా సమాధానమివ్వడం.
* పరీక్షలో తప్పిన విద్యార్థిలోని లోపాలను చెబితే ఒప్పుకోకపోవడం.

 

13. ప్రాయశ్చిత్తం (Undoing): తమ మనసులో అంగీకరించని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగడం.
ఉదా: * తండ్రిని సక్రమంగా చూడలేని కుమారులు అతడు మరణించిన తర్వాత దానధర్మాలు చేయడం.

14. ఉపసంహరణ (Withdraw): వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి వ్యక్తి తప్పించుకోవడం లేదా పారిపోవడం.
ఉదా: పరీక్షలకు బాగా చదవని విద్యార్థి గైర్హాజరవడం.

 

15. సానుభూతి (Sympathism): ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొంది స్వాంతన పొందడం.
ఉదా: ఇంటి పని (Home work) చేయని విద్యార్థి తన ఆరోగ్యం సరిగా లేదని చెప్పడం.

 

16. ప్రతిచర్యా నిర్మితి (Reaction Formation): వ్యక్తిలోని కోరికలు, దృక్పథాలకు బాహ్య ప్రవర్తన అతడిలోని వాంఛలకు పూర్తి వ్యతిరేకంగా ఉండటం.
ఉదా:  * పిసినారి అయిన వ్యక్తి ''నాకు దానధర్మాలు ఎక్కువగా చేయాలనుంది" అని ప్రకటించడం.
* శత్రువు కనిపించినప్పుడు ప్రేమగా నటించి దగ్గరకు తీసుకోవడం.

Posted Date : 28-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు