• facebook
  • whatsapp
  • telegram

ముఖ్యమైన రసాయన పదార్థాలు

సిమెంట్‌ (Cement)


  సిమెంట్‌ను ‘జోసెఫ్‌ ఆస్పిడిన్‌’ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు.

  రసాయనికంగా సిమెంట్‌ అంటే కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్‌ల మిశ్రమం.

  సిమెంట్‌ తయారీకి సున్నపురాయి, బంకమట్టి, జిప్సంను ముడిపదార్థాలుగా ఉపయోగిస్తారు.

  దీన్ని పోర్ట్‌లాండ్‌ సిమెంట్‌ అని కూడా అంటారు. ఇది ఇంగ్లండ్‌లోని పోర్ట్‌లాండ్‌లో లభించే రాయిని పోలి ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

​​​​​​​  మొదట ఏర్పడే బూడిద రంగు గట్టి సిమెంట్‌ ముద్దలను ‘క్లింకర్‌ సిమెంట్‌’ అంటారు. దీన్ని పొడి చేసి, 23% జిప్సంను కలిపి సిమెంట్‌గా ఉపయోగిస్తారు.

​​​​​​​  సిమెంట్‌ గడ్డకట్టడాన్ని జిప్సం నియంత్రిస్తుంది.

​​​​​​​  ఇసుక, కంకర, సిమెంట్, నీటి మిశ్రమాన్ని ‘కాంక్రీట్‌’ అంటారు. ఇసుక, సిమెంట్, నీటి మిశ్రమాన్ని ‘మోర్టార్‌’ అంటారు. మోర్టార్‌ కంటే కాంక్రీట్‌ గట్టిగా ఉంటుంది.

​​​​​​​  ఇసుక, కంకర, తడి సిమెంట్‌ మిశ్రమాన్ని ఇనుప చువ్వల మధ్య నింపితే, దాన్ని రీన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ సిమెంట్‌ (Reinforced Concrete Cement - RCC) అంటారు.

అద్దకపు రంగులు (Dyes)

వీటిని ‘రంజనాలు’ అంటారు.

ఇండిగో మొక్కల నుంచి నీలిమందు అనే నీలిరంగు లభిస్తుంది.

రంజనాల అణు నిర్మాణంలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవి:   

1. క్రోమోఫోర్‌ (Chromophore)

2. ఆక్సోక్రోమ్‌ (Auxochrome)

క్రోమోఫోర్‌ భాగం రంజనానికి రంగును కలిగిస్తుంది.

ఆక్సోక్రోమ్‌ భాగం రంజనం రంగు తీవ్రతను పెంచుతూ దారంతో రసాయన బంధాన్ని ఏర్పరుస్తుంది.

ముఖానికి రాసుకునే పౌడర్‌ సంఘటనం:

1. అపారదర్శకత (కప్పి ఉంచే సామర్థ్యం): టైటానియం ఆక్సైడ్, జింక్‌ ఆక్సైడ్, కాంజికాభ బంక మట్టి.

2. జారుడు గుణం (తేలిగ్గా పంపిణీ అవ్వడం): టాల్క్‌ (మెగ్నీషియం సిలికేట్‌)

3. అసంజనత కోసం (చర్మానికి అంటుకుని ఉండటం): జింక్‌ స్టియరేట్, మెగ్నీషియం స్టియరేట్, కాల్షియం స్టియరేట్‌.

4. శోషణం కోసం (చెమటను, నూనెను పీల్చుకునే సామర్థ్యం): కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేట్, కాయోలిన్‌ 

5. రంగు         

6. సువాసన.

డిటర్జెంట్లు

ఆల్కైల్‌ బెంజీన్‌ సల్ఫొనేట్‌ లవణాన్ని డిటర్జెంట్‌ (Detergents) అంటారు.

ఇవి మృదు, కఠిన జలాలు రెండింటితోనూ నురగను ఇస్తాయి.

జిగుర్లు 

ఉపరితలాలను అతికించటం ద్వారా రెండు వస్తువులను కలిపి ఉంచగల పదార్థాలను  ‘జిగుర్లు’ (Adhesives) అంటారు.

జిగుర్లు రెండు రకాలు. అవి: 

1. సహజ జిగుర్లు  2. కృత్రిమ జిగుర్లు

సహజ జిగుర్లు: పిండి పదార్థం, డేక్స్‌ట్రిన్, కేసిన్‌ అనే పాల ప్రోటీన్‌ నుంచి ఏర్పడే బంక మొదలైనవి సహజ జిగుర్లకు ఉదాహరణలు.

కృత్రిమ జిగుర్లు: సిలికోన్‌లు, ఇపాక్సి రెజిన్‌లు, పాలియూరిథేన్‌లు, ఎక్రలిక్‌ జిగుర్లు మొదలైనవి కృత్రిమ జిగుర్లకు ఉదాహరణలు.


గాజు (Glass)


గాజును శీతలీకరణం చెందిన ద్రవం అంటారు. ఇది చూడటానికి ఘనరూపంలో ఉన్నా, నిజమైన ఘనపదార్థం కాదు.

గాజు రసాయనికంగా సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికా మిశ్రమం.

గాజు తయారీలో సోడాయాష్, సున్నపురాయి, ఇసుకను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు.

ద్రవరూపంలోని గాజును త్వరగా చల్లార్చితే అది పెళుసుగా మారుతుంది. కాబట్టి గాజును అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు చాలా నెమ్మదిగా చల్లారుస్తారు. ఈ విధానాన్ని ‘మందశీతలీకరణం’ అంటారు.

గాజును వేడిచేసి, మెత్తబరిచి, దానిలోకి గాలిని ఊది కావాల్సిన ఆకృతిలో వస్తువులను తయారు చేస్తారు. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ‘గ్లాస్‌ బ్లోయింగ్‌’ అంటారు.

గ్లాస్‌ బ్లోయింగ్‌ ప్రక్రియ బోరోసిలికేట్, పైరెక్స్‌ గాజు రకంతో సాధ్యమవుతుంది.


సబ్బులు (Soaps)

​​​​​​​ ఫ్యాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాన్ని సబ్బు అంటారు. 

​​​​​​​ ఒక క్షారం సమక్షంలో కొవ్వు లేదా నూనెలను జల విశ్లేషణ చెందిస్తే సబ్బుగా మారుతుంది.

​​​​​​​ కొవ్వు/ నూనెలను క్షారాలతో తటస్థీకరణం చెందిస్తే సబ్బు, గ్లిజరాల్‌ ఏర్పడతాయి. ఈ రసాయన చర్యను ‘సఫోనిఫికేషన్‌’ అంటారు.

​​​​​​​ సాధారణ సబ్బు మృదు జలంతో నురుగును ఇస్తుంది. కఠిన జలంతో ఇది సాధ్యం కాదు.

​​​​​​​ సబ్బు నాణ్యతను అందులోని ఫ్యాటీ ఆమ్లాల శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. దీన్నే టోటల్‌ ఫ్యాటీ మ్యాటర్‌ (Total Fatty Matter - TFM) విలువ అంటారు.

Posted Date : 03-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌