• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర బడ్జెట్‌ 2023-24

* కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌ తొలి అమృతకాల్‌ బడ్జెట్‌ను 2023, ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రానున్న 25 ఏళ్లలో భారత్‌ 100వ స్వాత్రంత్య దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో దేశం సాధించాల్సిన అభివృద్ధికి అనుగుణంగా అమృత్‌ కాల్‌ పేరుతో నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన 11వ బడ్జెట్‌ ఇది. (2019లో సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో కలిపి).

*  దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వరుసగా 5 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆరో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ గుర్తింపు పొందారు. ఈమె 2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళగానూ నిర్మలా సీతారామన్‌ నిలిచారు.

వరుసగా అయిదు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వారు:

అరుణ్‌జైట్లీ, చిదంబరం, యశ్వంత్‌సిన్హా, మన్మోహన్‌సింగ్, మొరార్జీ దేశాయ్‌.


బడ్జెట్‌ పరిణామక్రమం 

* స్వాతంత్య్రానికి ముందు మనదేశంలో తొలి బడ్జెట్‌ను అప్పటి ఆర్థికమంత్రి జేమ్స్‌ విల్సన్‌ 1860, ఏప్రిల్‌ 7న ప్రవేశపెట్టారు. 

* మనదేశంలో సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుచేసి ప్రవేశపెట్టాలని విలియం అక్వర్త్‌ కమిటీ 1921లో సిఫార్సు చేసింది. దీని ప్రకారం, 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుచేసి ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెట్టాలనే అంశంపై సూచనలు ఇవ్వాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం బిబేక్‌ దెబ్రాయ్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచన మేరకు 2017 - 18 నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెడుతున్నారు. 

* 2017 - 18 నుంచి ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అంతకు ముందు ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. 2017 - 18 బడ్జెట్‌ నుంచి ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అనే పదాలను తొలగించారు.

* మనదేశంలో తొలి డిజిటల్‌ బడ్జెట్‌ను 2021 ఫిబ్రవరి 1న (2021 - 22 బడ్జెట్‌) ప్రవేశపెట్టారు.

* స్వతంత్ర భారతదేశంలో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది - ఆర్‌.కె.షణ్ముఖం చెట్టి (1947, నవంబరు 26)


* గణతంత్ర భారతంలో మొదటిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది - జాన్‌మత్తాయ్‌ (1950, ఫిబ్రవరి 28)


ఐఎంఎఫ్‌ నివేదిక

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని సుమారు 200 దేశాల జీడీపీలను పరిశీలిస్తే.. అందులో సగం వాటా కేవలం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్‌లదే. వీటిలో అమెరికా, చైనాల వాటా 40 శాతం వరకు ఉంది. 


అమృతకాల్‌ - సప్తరిషి

* 2023 - 24 బడ్జెట్‌లో అమృతకాల్‌ విజన్‌లో భాగంగా 3 అంశాలు; సప్తరిషి (సప్తర్షి) పేరుతో 7 ప్రాధాన్య అంశాలను ప్రస్తావించారు.


అమృత్‌కాల్‌లోని మూడు అంశాలు:

1) పౌరులకు, ముఖ్యంగా యువతకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పుష్కల అవకాశాలు కల్పించడం(Facilitating ample opportunities for citizens, especially the youth, to fulfil their aspirations)

2) వృద్ధి, ఉపాధికి బలమైన ప్రోత్సాహాన్ని అందించడం(Providing strong impetus to growth and job creation)

3) స్థూల - ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం(Strengthening macro-economic stability)

సప్తర్షి ప్రాధాన్యత లక్షాలు:

1. సమ్మిళిత అభివృద్ధి  

2. చిట్టచివరి వ్యక్తికి లబ్ధి

3. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు

4. సామర్థ్యాల వెలికితీత

5. హరితవృద్ధి  

6. యువశక్తికి ప్రోత్సాహం

7. ఆర్థికరంగ బలోపేతం


స్వతంత్ర భారత్‌  తొలి బడ్జెట్‌ గణాంకాలు

అంశాలు    గణాంకాలు (కోట్లలో)
రెవెన్యూ రాబడి    171.15
రెవెన్యూ వ్యయం    197.39
రెవెన్యూ (నికర)లోటు  26.24
కస్టమ్స్‌ రాబడి       50.5
రక్షణ సేవలు        92.74
ఫారెక్స్‌ నిల్వలు      1547
ఆదాయపన్ను అంచనా,   అంచనా: 29.5
వసూలు          వసూలు: 88.5

ఆధారం: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ


గణతంత్ర భారత్‌లో తొలి బడ్జెట్‌ గణాంకాలు

అంశాలు     గణాంకాలు (కోట్లలో)
మొత్తం రెవెన్యూ రాబడి 347.5
మొత్తం వ్యయం  337.88
మిగులు 9.62
పౌర వ్యయం   169.87

ఆధారం: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ


జనవరి 31, 2023 నాటి ఐఎంఎఫ్‌ డేటా ఆధారంగా

దేశం      జీడీపీ విలువ (కోట్లలో)
అమెరికా 21,43,58,995
చైనా   15,74,74,878
జపాన్‌  3,57,67,423
జర్మనీ  3,37,21,231
భారత్‌    3,12,65,802
బ్రిటన్‌     2,84,82,982
ఫ్రాన్స్‌   2,29,99,189
కెనడా    1,90,70,502
రష్యా  1,75,15,397
బ్రెజిల్‌   1,68,60,615

ఆధారం: 2023 - 24 బడ్జెట్‌  

సమ్మిళిత అభివృద్ధి (Inclusive Development)

వ్యవసాయానికి సహకారం:

* రైతు సమస్యల పరిష్కారం, ఆర్థిక వృద్ధి కోసం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తారు.

ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ హార్టీకల్చర్‌ క్లీన్‌ప్లాంట్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా వ్యాధి నిరోధకత, నాణ్యత కలిగిన మొక్కలు, పరికరాలను రైతులకు అందిస్తారు. అధిక విలువగల ఉద్యానవన పంటల ఉత్పత్తే దీని లక్ష్యం. 

* దేశాన్ని తృణధాన్యాల హబ్‌గా మార్చేందుకు ‘శ్రీ అన్న’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌ (ఐఐఎంఆర్‌)ను దీనికి వేదికగా ఎంచుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని యువ ఆవిష్కర్తలు ఏర్పాటు చేసే వ్యవసాయ అంకుర సంస్థలకు ‘అగ్రికల్చర్‌ యాక్సలరేటర్‌ ఫండ్‌ (ఏఏఎఫ్‌)’ ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తారు. 

* పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కోట్ల రుణాలు మంజురు చేస్తామని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా వికేంద్రీకృత విధానంలో గోదాములు నిర్మిస్తారు.


ఆరోగ్యం:

* దేశవ్యాప్తంగా 2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక మిషన్‌ను ప్రారంభిస్తారు.

ఫార్మారంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ ద్వారా ప్రమోట్‌ చేస్తారు. 

ప్రభుత్వం ఎంపిక చేసిన ఐసీఎంఆర్‌(Indian Council of Medical Research) ల్యాబ్‌లలో పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వ-ప్రైవేట్‌ వైద్యకళాశాలల్లోని  బోధన సిబ్బందికి అనుమతి ఇస్తారు.

* 2019 లో దేశ జీడీపీలో ఆరోగ్యంపై చేసిన ఖర్చు 1.4% ఉండగా, 2023 లో 2.1 శాతం ఉన్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు.


విద్య, నైపుణ్యం:

* వినూత్న బోధన పాఠ్యాంశాలు, నిరంతర వృత్తి పరమైన అభివృద్ధి, ఐసీటీ అమలు లాంటి అంశాల ఆధారంగా ఆధునిక పద్ధతుల్లో టీచర్ల శిక్షణ కార్యక్రమాలు రూపొందిస్తారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థల ద్వారా శిక్షణలో సమూల మార్పులు చేస్తారు. వీటిని centre fo excellence గా అభివృద్ధి చేస్తారు.

పిల్లలు, కౌమార దశలోని వారి కోసం జాతీయ డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తారు.

* పంచాయితీ, వార్డు స్థాయుల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తారు. 

* 2019 లో జీడీపీలో విద్యపై చేసిన ఖర్చు  2.8% కాగా, ఇది 2023 లో 2.9%.


సమ్మిళిత అభివృద్ధిలో 2014 నుంచి సాధించిన విజయాలు:

* 2014లో ప్రపంచ దేశాల్లో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అయిదో ర్యాంకులో నిలిచింది.

గ్రామాల్లో 9 కోట్ల తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని 2016, మే 1న ప్రవేశపెట్టారు. దీని ద్వారా దేశంలోని 9.6 కోట్ల కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చారు.

* స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద 11.7 కోట్ల కుటుంబాలకు (గృహాలకు) మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు.

* 102 కోట్ల మందికి 220 కోట్ల కొవిడ్‌ టీకాలు అందించారు.

* ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకాన్ని 2014, ఆగస్టు 28న ప్రారంభించారు. దీని ఉద్దేశం ‘ఆర్థిక లేదా విత్త సమ్మిళిత్వాన్ని (Financial Inclusion) సాధించడం. దీని ద్వారా 47.8 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిచారు.

* ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి యోజన పథకాల ద్వారా 44.6 కోట్ల మందికి బీమా సౌకర్యం అందించారు. ఈ రెండు పథకాలను 2015లో ప్రారంభించారు.

* ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా 11.4 కోట్ల మంది రైతులకు 2.2 లక్షల కోట్ల రూపాయల నగదు బదిలీ చేశారు.

* తలసరి ఆదాయం రెండింతలు పెరిగి రూ.1.97 లక్షలకి చేరింది.


సమ్మిళిత అభివృద్ధి ఉద్దేశం

దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనుకబడిన వర్గాల మధ్య అసమానతలు తగ్గించడం. ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ నినాదంతో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టడం. దేశాభివృద్ధి ద్వారా సమకూరే ప్రయోజనాలు అందరికీ అందేలా విధానాలు రూపొందించడం.

Posted Date : 05-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌