• facebook
  • whatsapp
  • telegram

మిషన్‌ శక్తి

శత్రు దేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని ఎన్నో ఏళ్లుగా భారత్‌ కలిగి ఉన్నప్పటికీ మార్చి 27న తొలిసారి యాంటి శాటిలైట్‌ మిస్సైల్‌ (ఎ-శాట్‌)ను ప్రయోగించి, దిగువ భూ కక్ష్యలో తిరుగుతున్న భారత శోధక ఉపగ్రహాన్ని కూల్చివేశారు. దీంతో ఎ-శాట్‌ మిస్సైల్‌ లేదా అంతరిక్ష ఆయుధ సంపత్తి కలిగిన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్‌ చేరింది. యుద్ధ సమయాల్లో క్షిపణులను దిశానిర్దేశం చేయడానికి, సైనికులకు సమాచారాన్ని చేరవేయడానికి ఉపగ్రహాలు తోడ్పడతాయి. శత్రుదేశాల ఉపగ్రహాలను ఎ-శాట్‌ క్షిపణుల సహాయంతో కూల్చివేస్తారు.
డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ఎ-శాట్‌ క్షిపణిని ఒడిశా తీరంలోని కలాం దీవి నుంచి ప్రయోగించారు. అది 3 నిమిషాల్లోనే 300 కి.మీ. ఎత్తులో తిరుగుతున్న భారత ఉపగ్రహాన్ని ఛేదించింది. ఉపగ్రహ శకలాలు కొన్ని రోజుల్లోనే భూవాతావరణంలోకి ప్రవేశించి గాలి వల్ల కలిగే ఘర్షణతో కాలి బూడిద అవుతాయి.
యుద్ధ సమయాల్లో భారత్‌లోని ఏ క్షిపణినైనా యాంటి శాటిలైట్‌ మిస్సైల్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మిషన్‌ శక్తిలో వినియోగించిన మూడంచెల బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌.. ఇంటర్‌సెప్టార్‌లో రెండు ఘన ఇంధన మోటార్లు, ఇంపాక్టర్లను ఉపయోగించారు.
లక్ష్య శాటిలైట్‌ని ఢీకొట్టి, ముక్కలుగా చేసేందుకు క్షిపణి ‘కైనెటిక్‌ కిల్‌ వెహికిల్‌’ టెక్నాలజీని ఉపయోగించింది. మిషన్‌ శక్తి లేదా ఎ-శాట్‌ను డీఆర్‌డీఓ రూపకల్పన చేసింది. దీన్ని తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రయోగించింది.

వివిధ దేశాల యాంటి శాటిలైట్‌ క్షిపణులు
* యాంటి శాటిలైట్‌ క్షిపణులు లేదా రోదసి ఆయుధాల తయారీలో తొలి అడుగు వేసిన దేశం రష్యా. 1960 దశకంలోనే ఉపగ్రహ విధ్వంసక క్షిపణుల తయారీని చేపట్టింది. 1970-80 దశకంలో రష్యా ప్రయోగించిన ఎ-శాట్‌ లేజర్లు అమెరికా గూఢచర్య ఉపగ్రహాలను తాత్కాలికంగా పనిచేయకుండా నిలిపివేశాయి. 2015 నవంబరు 18న రష్యా కొత్తగా అభివృద్ధి చేసిన పీఎల్‌-19, నుడాల్‌ అనే ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని తొలిసారి పరీక్షించింది. దీని ప్రయోగాల పరంపరలో భాగంగా 2018, డిసెంబరు 23న ఏడోసారి పీఎల్‌-19, నుడాల్‌ని ప్రయోగించింది.
* 2008 ఫిబ్రవరి 14న అమెరికా ‘రిమ్‌-161 స్టాండర్డ్‌ మిస్సైల్‌ 3 ఏబీఎమ్‌’ పేరుతో ఎ-శాట్‌ని పరీక్షించింది.
* 2007, జనవరి 11 న చైనా ఎస్సీ-19, ఎ-శాట్‌ అంతరిక్ష క్షిపణితో తమదేశానికే చెందిన ఉపగ్రహాన్ని కూల్చివేసింది. 2018,  ఫిబ్రవరి 5 న డాంగ్‌నెంగ్‌-3తో ఎ-శాట్‌ను ఉపయోగించి ఎక్జో అట్మాస్ఫెరిక్‌ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది.

విదేశీమారక ద్రవ్యం
ఇస్రో చౌక ధరల్లో విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతోంది. ఇప్పటివరకు సుమారు 300 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. 2017-18లో రూ.1,932 కోట్లు ఆర్జించింది. విదేశీ ఉపగ్రహాల ప్రయోగ ఒప్పందాలను ఇస్రోకి చెందిన వాణిజ్య విభాగం ఆంట్రిక్స్‌ నిర్వహిస్తోంది.
ఫాల్కన్‌ - 9 వాహక నౌకల ప్రయోగ ఖర్చులో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగ ఖర్చు నాలుగోవంతు మాత్రమే. పీఎస్‌ఎల్‌వీ-సీ45 ద్వారా 220 కి.గ్రా. ద్రవ్యరాశితో ఉన్న 28 విదేశీ నానో ఉపగ్రహాలను ప్రయోగించారు. అందులో అమెరికాకు చెందినవి 24 కాగా, మిగతావి స్విట్జర్లాండ్, లిథువేనియా, స్పెయిన్‌ దేశాలకు చెందినవి.

పీఎస్‌ఎల్‌వీ - క్యూఎల్
పీఎస్‌ఎల్‌వీ-సీ45 మిషన్‌లో ఇస్రో తొలిసారి ఈ శ్రేణికి చెందిన కొత్త తరహా రాకెట్‌ పీఎస్‌ఎల్‌వీ - క్యూఎల్‌ని వినియోగించింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) 44 మీ. ఎత్తుండే నాలుగంచెల రాకెట్‌.  దీనిలో మొదటి, మూడో అంచెల్లో ఘన ఇంధనాన్ని; రెండు, నాలుగో అంచెల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ప్రయోగ అవసరాల దృష్ట్యా వివిధ రకాలైన పీఎస్‌ఎల్‌వీ రాకెట్లను వాడతారు. అవి పీఎస్‌ఎల్‌వీ - జీ, పీఎస్‌ఎల్‌వీ - సీఏ, పీఎస్‌ఎల్‌వీ - ఎక్స్‌ఎల్, పీఎస్‌ఎల్‌వీ - క్యూఎల్‌ మొదలైనవి.
 మొదటి దశ ఇంజిన్‌కి సహాయకారిగా ఉండే స్ట్రాప్‌ - ఆన్‌ మోటార్ల సంఖ్య ఆధారంగా రకాలను నిర్దేశించారు.

ఎమిశాట్‌
* ప్రాజెక్ట్‌ కౌటిల్యలో భాగంగా ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ శాటిలైట్‌ ఎమిశాట్‌ను ఇస్రో పీఎస్‌ఎల్‌వీ - సీ45 రాకెట్‌ ద్వారా, మరో 28 విదేశీ ఉపగ్రహాలతో పాటు 2019, ఏప్రిల్‌ 1న విజయవంతంగా ప్రయోగించింది. ఎమిశాట్‌ను డీఆర్‌డీఓ (డీఆర్‌డీఎల్, హైదరాబాద్‌) అభివృద్ధి చేసింది. ఇది గూఢచర్య శత్రు రాడార్లను నిర్వీర్యం చేస్తుంది.
* ఎలక్ట్రో మాగ్నెటిక్‌ ఇంటెలిజెన్స్‌ శాటిలైట్‌ (ఎమిశాట్‌) పూర్తిగా సైనిక అవసరాలకు నిర్దేశించిన ఉపగ్రహం. కార్టోశాట్‌-2 శ్రేణి ఉపగ్రహాలతోపాటు   భారత అంతరిక్ష సైన్యంలో చేరిన మరొక ఉపగ్రహం ఎమిశాట్‌. ఇది‌ విద్యుదయస్కాంత సిగ్నల్స్‌ని గుర్తించి శత్రుదేశాల రాడార్లను, ఇతర ఎలక్ట్రానిక్‌ ప్రసార పౌన:పున్యాల సిగ్నల్స్‌ను గుర్తిస్తుంది. సరిహద్దు దేశాల నుంచి జరిగే తీవ్రవాదుల కార్యకలాపాలను, చొరబాట్లను ఎమిశాట్‌ పసిగట్టడంతో పాటు మన కదలికలను శత్రుదేశాలు పసిగట్టకుండా తోడ్పడుతుంది. విద్యుదయస్కాంత వర్ణపటం (స్పెక్ట్రం)లో 40 GHz పౌన:పున్యం వరకు ఉన్న Ka బ్యాండ్‌ సిగ్నల్స్‌ని ఇది సున్నితంగా గుర్తిస్తుంది. ఎమిశాట్‌ ఇస్రోకి చెందిన ఇండియన్‌ మినీ శాటిలైట్‌-2 బస్‌ ప్లాట్‌ఫాం కోవకి చెందిన హైసిస్‌ (HySIS) తరహా ఉపగ్రహం. దీని ప్రధాన ఉద్దేశం విద్యుదయస్కాంత తరంగాల మాపనం.
 

పీఎస్‌ఎల్‌వీ - సీ45
ఇస్రో తన 47వ పీఎస్‌ఎల్‌వీ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ - సీ45 ద్వారా ఏక కాలంలో 29 ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. అలాగే మూడో కక్ష్యలో ఆరు నెలలపాటు పరిశోధనలు చేసేందుకు తోడ్పడే పేలోడ్స్‌ (ప్లాట్‌ఫాం)ను విజయవంతంగా ప్రయోగించి రికార్డ్‌ సృష్టించింది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన 17 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ - సీ45 నుంచి ఎమిశాట్‌ ఉపగ్రహం 749 కి.మీ. ఎత్తులో ఉండే కక్ష్యలో విడిపోయింది. మరో 110 నిమిషాలకు 28 విదేశీ ఉపగ్రహాలు 504 కి.మీ. ఎత్తులోని కక్ష్యలోకి చేరాయి. తర్వాత రాకెట్‌ తిరోగమనం చెంది 180 నిమిషాలకు 485 కి.మీ. ఎత్తులో పరిశోధనా పేలోడ్స్‌ని ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ నాలుగో దశ పీఎస్‌-4.  ఇది అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ వాతావరణంలో పరిశోధనలు చేసుకొనేందుకు తోడ్పడే ప్లాట్‌ఫాం.  దీనిలో  3 పేలోడ్స్‌ ఉన్నాయి.
అవి...
1. ఇస్రోకి చెందిన ఆటోమెటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టం (AIS). ఇది నౌకల నుంచి వచ్చే సందేశాలను పసిగడుతుంది.
2. AMSAT  (Radio Amateur Satellite Corporation‌)  ‌ భారత్‌కు చెందిన ‘ఆటోమెటిక్‌ పాకెట్‌ రిపీటింగ్‌ సిస్టం’. ఇది పొజిషన్‌ డేటాను మానిటరింగ్, ట్రాకింగ్‌ చేసేందుకు అమెచ్యూర్‌ (Amateur) రేడియో ఆపరేటర్లకు సహాయపడుతుంది.
3. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన ARIS  (అడ్వాన్స్‌డ్‌ రిటార్డింగ్‌ పొటెన్షియల్‌ అనలైజర్‌ ఫర్‌ ఐనోస్ఫెరిక్‌ స్టడీస్)తో ఐనో వాతావరణ నిర్మాణం, సంయోజకాల అధ్యయనం చేయనున్నారు.

గ్రూప్‌-1 ప్రశ్నలు

* ‘మిషన్‌ శక్తి’ ప్రయోగ ఫలితాలను వివరించండి.
* ఎమిశాట్‌ ఉపగ్రహం భారత సైనిక పాటవాన్ని ఏ విధంగా పెంచుతుందో వివరించండి.

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌