క్రీ.శ.1206లో మహ్మద్‌ఘోరీ మరణానంతరం కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత క్రీ.శ.1526 వరకు అంటే సుమారు మూడు శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు పరిపాలించాయి. వీరు సువిశాల సామ్రాజ్య స్థాపనతోపాటు ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేశారు.
బానిస వంశం
బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ఇతడు క్రీ.శ.1206లో తన యజమాని మహ్మద్‌ఘోరీకి వారసులు లేకపోవడం వల్ల తన స్వాతంత్య్రాన్ని భారతదేశంలో ప్రకటించుకొని క్రీ.శ.1210 వరకు పరిపాలించాడు. ఇతడి వారసుల్లో ఇల్‌టుట్‌మిష్, రజియా సుల్తానా, ఘియాజుద్దీన్ బాల్బన్ ప్రముఖులు. ఈ వంశాన్నే మామ్లూక్ వంశంగా పేర్కొంటారు. వీరు 1206 నుంచి 1290 మధ్య పరిపాలించారు.
కుతుబుద్దీన్ ఐబక్
బానిసగా జీవితాన్ని ప్రారంభించిన ఐబక్ తన శక్తి సామర్థ్యాలతో ఘోరీ మహ్మద్ సేనానిగా ఎదిగాడు. తరైన్ యుద్ధాలు, ఘోరీ భారతదేశ దండయాత్రల్లో పాల్గొన్న ఐబక్, భారతదేశంలో ఘోరీ ప్రతినిధిగా నియమితుడయ్యాడు. ఢిల్లీని ఆక్రమించుకున్నందుకు గుర్తుగా ‘కువ్వత్-ఉల్-ఇస్లామ్’ అనే మసీదును నిర్మించాడు. ఘోరీ మరణానంతరం క్రీ.శ. 1206లో ఐబక్ స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతడి అధికారాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసిన బెంగాల్ పాలకుడు అలీమర్థాన్‌ను అణచివేసి ఆయన స్థానంలో మహ్మద్ షెరాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. ఘజనీ పాలకుడైన తాజ్-ఉద్దీన్-యల్‌డజ్ ఢిల్లీపై దండెత్తగా అతడిని ఓడించాడు. అజ్మీర్‌లో ‘అర్హిదిన్ కా జోంప్రా’ అనే మసీదును నిర్మించాడు. లాహోర్‌ను రాజధానిగా చేసుకుని పాలించాడు. తన రెండో రాజధానిగా ఢిల్లీని ప్రకటించాడు (ఢిల్లీని పూర్తి రాజధానిగా చేసింది ఇల్‌టుట్‌మిష్). భారతదేశంలో ఇస్లాం రాజ్యస్థాపనకు గుర్తుగా ఢిల్లీలో కుతుబ్‌మీనార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కుతుబ్‌మీనార్ అనేది తన గురువు కుతుబుద్దీన్ భక్తియార్ కాకి సమాధి. ఐబక్ తన దానగుణం వల్ల లాక్‌భక్ష్గా పిలవబడ్డాడు. ఇతడు 1210లో లాహోర్‌లో చౌగాన్ (పోలో) ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించాడు. అనంతరం అతడి కుమారుడు ఆరామ్‌షా (ఆరామ్‌భక్ష్) పాలకుడయ్యాడు.
ఇల్‌టుట్‌మిష్ (క్రీ.శ.1211 - 1236)
ఆరామ్‌షాను పదవి నుంచి తొలగించి ఇల్‌టుట్‌మిష్ క్రీ.శ.1211లో సుల్తాన్ పదవిని చేపట్టాడు. ఇతడు ఐబక్ అల్లుడు. ఇతడు ఐబక్ మరణించే నాటికి బదయాన్ (బదక్షాన్) ప్రాంత గవర్నర్‌గా ఉన్నాడు. ఇల్‌టుట్‌మిష్ ఇల్బారీ తెగకు చెందినవాడు. అసలు పేరు ష్‌మ్స్ - ఉద్దీన్ - ఇల్‌టుట్‌మిష్. ఖలీఫా నుంచి భారతదేశ సుల్తాన్‌గా అనుమతి పత్రం పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఇతడే. ఢిల్లీని శాశ్వత రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఘజనీ పాలకుడు తాజ్‌వుద్దీన్ యల్‌డజ్‌ను, ముల్తాన్ పాలకుడు నాసిరుద్దీన్ కుబాచాను ఓడించాడు. విశాల సామ్రాజ్య స్థాపన చేశాడు. చెంఘీజ్‌ఖాన్ నాయకత్వంలోని మంగోలుల దాడులను సమర్థంగా తిప్పికొట్టాడు. ఇతడి కాలంలోనే 40 మంది తురుష్క సర్దారుల కూటమి చిహల్‌గనీ ఏర్పడింది. ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో ‘ఇక్తా’ అనే సైనిక విధానాన్ని ప్రవేశపెట్టాడు. నాటి సైనిక రాష్ట్రాలను ఇక్తాలు, వాటి అధిపతిని ముక్తీ అని పిలిచేవారు. ఇతడు ఢిల్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా ‘హౌజ్-ఇ-సుల్తానీ’ అనే రాజుల స్నాన ఘట్టాన్ని నిర్మించాడు. ఐబక్ ప్రారంభించిన కుతుబ్‌మీనార్ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. టంకా అనే వెండి నాణేలు, జితాల్ అనే రాగి నాణేలను ముద్రించాడు. ఇతడికి గల పరమత ద్వేషం వల్ల భిల్సా, ఉజ్జయిని దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ప్రముఖ చరిత్రకారుడు ఆర్.పి.త్రిపాఠీ ప్రకారం భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని నెలకొల్పినవారు ఇల్‌టుట్‌మిష్. తన ఆస్థానంలో మిన్హజ్-ఉస్-సిరాజ్ (మిన్హజుద్దీన్ షిరాజ్), తాజుద్దీన్ లాంటి కవులను పోషించాడు.
ఘియాజుద్దీన్ బాల్బన్ (క్రీ.శ.1266 - 1287)
బానిసవంశ పాలకుల్లో గొప్పవాడు బాల్బన్. ఇతడు బానిసగా, తోటమాలిగా, నీరు మోసేవాడిగా, సేనానిగా, సర్దార్‌గా చివరకు సుల్తాన్‌గా అనేక పాత్రలను పోషించాడు. బానిసగా భారతదేశానికి వచ్చిన బాల్బన్ ఇల్‌టుట్‌మిష్ కొలువులో చేరి చిహల్‌గనీ కూటమిలో ప్రధానపాత్ర పోషించాడు. తన శక్తి సామర్థ్యాల ద్వారా ఖాస్‌దార్, అమీర్-ఇ-షకార్ లాంటి పదవులను పొందాడు. రజియా సుల్తానా మరణానంతరం బహరాంషా, మసూద్‌షా, నాసిరుద్దీన్‌ల పాలనాకాలంలో బాల్బన్ కీలకపాత్ర పోషించాడు. వారి నుంచి రేవరి, హాన్సీ లాంటి జాగీర్‌లను పొందాడు. నాసిరుద్దీన్ తన కుమార్తెను బాల్బన్‌కు ఇచ్చి వివాహం చేయడమే కాకుండా నాయబ్-ఐ-మీ మాలిక్ (ఉపప్రధాని)గా నియమించాడు. 1266లో నాసిరుద్దీన్ మరణించగా బాల్బన్ ఢిల్లీ సుల్తాన్ పదవిని చేపట్టాడు. బాల్బన్ అనేక విజయాలు సాధించాడు. పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. మంగోలుల దండయాత్రను సమర్థంగా తిప్పికొట్డాడు. అనేక పర్షియా రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. చిహల్‌గనీ కూటమిని నిర్మూలించి రాజ్యంలో శాంతిభద్రతలు నెలకొల్పాడు. బెంగాల్ గవర్నర్ టుగ్రిల్‌కాన్ తిరుగుబాటును అణచివేశాడు. చిహల్‌గనీ ముఠా నాయకుడు అమీర్‌ఖాన్‌ను హత్య చేయించాడు. రాచరికం దైవదత్తం (జిల్లీ - ఇల్లాహే/రాజు భగవంతుడి నీడ) అనే సిద్ధాంతాన్ని బాల్బన్ విశ్వసించాడు. సామాన్య ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు.
సుల్తాన్ అధికారాన్ని పెంచడానికి అనేక పర్షియన్ రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. వాటిలో ప్రధానమైనవి సిజ్ధా, ఫైబోస్/జమ్నిబోస్. సుల్తాన్ ఆస్థానంలోనికి వచ్చినవారెవరైనా అతడికి సాష్టాంగ నమస్కారం చేయాలన్నదే సిజ్ధా అర్థం. అలాగే సుల్తాన్ పాదాలను లేదా సింహాసనాన్ని ముద్దుపెట్టుకోవాలన్నది ఫైబోస్/జమ్నిబోస్ అర్థం. బాల్బన్ నిరంకుశ భావాలతో పరిపాలన చేశాడు. దివాన్-ఇ-అర్జ్ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఇమాద్-ఉల్ ముల్క్‌ను అధిపతిగా నియమించాడు.
సైనిక వ్యవస్థలో వృద్ధాప్య పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అడువులను నరికించి, వ్యవసాయ భూములుగా మార్చిన తొలి ఢిల్లీ సుల్తాన్‌గా కీర్తించబడ్డాడు. మంగోలుల దండయాత్రలను ఎదుర్కోవడానికి రక్షణ ఏర్పాట్లు చేశాడు. లాహోర్ కోటను సందర్శించి దానికి మరమ్మతులు చేయించాడు. మంగోలుల దండయాత్రల వల్ల బాల్బన్ పెద్ద కుమారుడు మహ్మద్ మరణించాడు. బాల్బన్ అనంతరం అతడి మనుమడైన కైకూబాద్ చివరి బానిస సుల్తాన్‌గా పరిపాలించాడు.
సుల్తానా రజియా (క్రీ.శ.1236 - 1240) భారతదేశాన్ని పరిపాలించిన తొలి, ఏకైక ముస్లిం మహిళ రజియా సుల్తానా. ఈమె ఇల్‌టుట్‌మిష్ కుమార్తె. రజియా శక్తి సామర్థ్యాలను గమనించిన ఇల్‌టుట్‌మిష్ తన కుమారులను (మహ్మద్, రక్నుద్దీన్) కాదని ఈమెను వారసురాలిగా ప్రకటించాడు. అయితే ఒక మహిళ పాలకురాలు కావడం ఇష్టం లేని ఆస్థాన సర్దారులు, సామంతులు ఆమెపై అనేక తిరుగుబాట్లు చేశారు. లాహోర్, ముల్తాన్ పాలకులు చేసిన తిరుగుబాట్లను రజియా సమర్థంగా అణచివేసింది. మాలిక్ జమాలుద్దీన్ యాకూత్ అనే అబిసీనియా దేశస్థుడిని అశ్వదళాధిపతి (అమీర్- ఇ- అబూఖత్)గా నియమించింది. ఈ నియామకం స్వదేశీ ముస్లింలు, సర్దారుల్లో మరింత ద్వేషాన్ని పెంచింది. రజియా యొక్క సర్దార్ నిజామ్-ఉల్-జునైడీ భటిండా పాలకుడు అల్‌తునియాతో చేరి ఆమెను ఓడించి భటిండా కారాగారంలో బంధించారు. కానీ అవసరం తీరిన జునైడీ అల్‌తునియాను మోసం చేయడంతో అల్‌తునియా భటిండా కారాగారం నుంచి ఆమెను విడిపించి, వివాహం చేసుకుని ఇద్దరూ ఢిల్లీపైకి వస్తుండగా క్రీ.శ.1240లో ఖైతాల్ అనే ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఫలితంగా ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో సుల్తానా రజియా శకం ముగిసింది.
* బాల్బన్ ఒక బానిసగా, నీటి సంచులు మోసే కూలీగా, వేటాధికారిగా, సేనాధిపతిగా, రాజనీతిజ్ఞుడిగా, చివరికి సుల్తాన్‌గా ఎదిగాడు’’ - ప్రముఖ చరిత్రకారుడు లేన్‌పూలే
క్రీ.శ.1206లో కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించిన ఢిల్లీ సుల్తానత్ సామ్రాజ్యం క్రీ.శ.1526 వరకు కొనసాగింది. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాల పాలనలో భారతదేశంలో సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు; సాంస్కృతిక అంశాల్లో ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సుల్తానులు భారతదేశ చరిత్రకు, సాంస్కృతిక ప్రగతికి కృషి చేశారు.
పరిపాలనా విధానం
కేంద్రపాలన
ఢిల్లీ సుల్తానులు ఇస్లామిక్ సంప్రదాయ ‘షరియత్’ ప్రకారం భారతదేశాన్ని పరిపాలించారు. సుల్తాన్‌ను భగవంతుడి ప్రతిరూపంగా భావించి పాలించారు. వారు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్తాలు - షిక్‌లు - పరగణాలు - గ్రామాలుగా విభజించారు. కేంద్రస్థాయిలో సుల్తాన్ సర్వాధికారి, నిరంకుశుడు. సుల్తాన్‌కు పరిపాలనలో సహాయపడటానికి మంత్రిమండలి ఉండేది. నాడు కేంద్ర మంత్రిమండలిలో వజీర్ (ఆర్థికమంత్రి), దివాన్-ఇ-అర్జ్ (యుద్ధ మంత్రి), దివాన్-ఇ-రిసాలత్ (విదేశీ వ్యవహారాల మంత్రి), దబీర్-ఇ-మమాలిక్ (సమాచార మంత్రి), సదర్-ఉస్-సుదూర్ (ధర్మాదాయ, ధార్మిక మంత్రి), దివాన్-ఇ-ఖాజీ/ ఖాజీ-ఉల్-కుజత్ (న్యాయశాఖా మంత్రి) లాంటి మంత్రులు ఉండేవారు. సుల్తాన్‌కు సహాయపడటానికి నాయిబ్ సుల్తాన్ (ఉప ప్రధానమంత్రి) కూడా ఉండేవాడు. ఈ విధంగా కేంద్రంలో సుల్తాన్ సర్వాధికారాలు కలిగి ఉండి మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో పరిపాలించేవాడు.
రాష్ట్ర పాలన
ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలను ఇక్తాలు అనేవారు. ఇల్‌టుట్‌మిష్ ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్తా అధిపతిని ముక్తీ అనేవారు. ఇక్తాలు అనేవి సైనిక రాష్ట్రాలుగా పేరొందాయి. ముక్తీలు రాజు ద్వారా నియమితులై ఇక్తాల నుంచి వచ్చిన ఆదాయంలో కొంత భాగం తీసుకుని సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్‌కు సరఫరా చేయాలి. ఇక్తాల్లో ఉండే రాజ ప్రతినిధిని (గవర్నర్) నాయిమ్/వలి అని పిలిచేవారు. ముక్తీ, నాయిమ్‌తో పాటు రాష్ట్రాల్లో వజీర్, అరిజ్, ఖ్వాజీ లాంటి అధికారులు ఉండేవారు. రాష్ట్రాల్లో ఇక్తాలతో పాటు ప్రాంతాలు, సామంత రాజ్యాలు కూడా ఉండేవి. ప్రాంతాలను ఉప రాజ్యాలు అనేవారు.
స్థానిక పాలన
ఢిల్లీ సుల్తానులు రాష్ట్రాలు/ప్రాంతాలు/ఇక్తాలను షిక్‌లు, పరగణాలు, గ్రామాలుగా విభజించి పరిపాలించారు. షిక్‌ల అధిపతిని షిక్‌దార్, పరగణాల అధిపతిని అమీల్, గ్రామ అధికారులను చౌదరీ, ముఖద్దమ్ అని పిలిచేవారు. గ్రామపాలనలో స్వయంప్రతిపత్తి ఉండేది. కొన్ని గ్రామాల్లో పట్వారీ అనే అధికారి ఉండేవాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానులు ఇస్లాం న్యాయ షరియత్ ప్రకారం పాలించినప్పటికీ గతంలో భారతదేశంలో ఉన్న పాలనా వ్యవస్థనే అనుసరించారని అర్థమవుతుంది. రాజు స్థానంలో సుల్తాన్ వచ్చాడు. అదే మంత్రిమండలి విధానం, రాజ్య విభజన విధానం, ఉద్యోగ బృంద సహకారం కొనసాగింది కానీ వారి పేర్లు మార్పు చెందాయి.
రెవెన్యూ పాలన
ఢిల్లీ సుల్తానులు రెవెన్యూ విధానంలో అనేక నూతన మార్పులను ప్రవేశపెట్టారు. ప్రత్యేక శాఖలను రూపొందించి భూముల సర్వే, విభజన, పంట ఆధారంగా భూమిశిస్తును నిర్ణయించారు. కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో పంటలో 1/10వ వంతును శిస్తుగా నిర్ణయిస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ, మహ్మద్‌బీన్ తుగ్లక్ కాలంలో 1/2వ వంతుగా నిర్ణయించారు. కానీ ఎక్కువ మంది సుల్తానులు 1/3వ వంతునే భూమిశిస్తుగా వసూలు చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ రెవెన్యూ శాఖలో అవినీతిని నిర్మూలించడానికి ప్రత్యేక అధికారులను నియమించాడు. మహ్మద్‌బీన్ తుగ్లక్ ‘దివాన్-ఇ-కోహీ’ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటుచేసి రెవెన్యూ పాలనను పటిష్ఠం చేశాడు. బాల్బన్ తొలిసారిగా అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చాడు. ఫిరోజ్‌షా తుగ్లక్ రైతు బాంధవుడిగా పేరొందాడు.
సైనిక పాలన
ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సైనిక విధానాన్ని ‘ఇక్తా పద్ధతి’ అంటారు. ఢిల్లీ సుల్తానత్ సామ్రాజ్య ప్రగతి ఎక్కువగా సైనిక వ్యవస్థపైనే ఆధారపడి ఉండేది. ముఖ్యంగా మంగోలుల లాంటి విదేశీయుల దండయాత్రలను సమర్థంగా ఎదుర్కోవడానికి, రాజ్య విస్తరణకు సైనికశక్తి అవసరమని గుర్తించిన ఢిల్లీ సుల్తానులు సైనిక పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
ఇల్‌టుట్‌మిష్ ‘ఇక్తాలు’ అనే సైనిక రాష్ట్రాలను ఏర్పాటుచేసి, వాటిపై ముక్తీలనే అధికారులను నియమించాడు. ముక్తీలు తమ అధీనంలో ఉన్న ఇక్తాల నుంచి శిస్తు వసూలు చేసి కొంతభాగాన్ని సుల్తాన్‌కు చెల్లించి, మిగిలిన దానితో సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్‌కు సరఫరా చేసేవారు. బాల్బన్ తన పాలనా కాలంలో దివాన్-ఇ-అర్జ్ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశాడు. సుల్తానుల కాలం నాటి సైనిక వ్యవస్థలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనేక మార్పులు చేపట్టాడు.
ఇతడు ఇక్తా పద్ధతిని రద్దుచేసి, సైనికులకు నగదు రూపంలో జీతం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ముక్తీలు చేస్తున్న అక్రమ గుర్రాల మార్పిడిని నియంత్రించడానికి గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతి (దాగ్)ని ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా సుల్తాన్ సొంత సైన్యం (సిద్ధ సైన్యం)ను రూపొందించాడు. సైనికుల్లో క్రమశిక్షణ పెంచడానికి చెహ్రా అనే హాజరుపట్టీ/మస్తరు విధానాన్ని రూపొందించాడు. తక్కువ జీతం గల సైనికులకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించడానికి మార్కెట్ సంస్కరణలు అమలుచేశాడు. కానీ ఫిరోజ్‌షా తుగ్లక్ కాలంలో ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్ధారీ పద్ధతిగా ప్రవేశపెట్టారు. సైనిక పదవులు వంశపారంపర్యం కావడంతో క్రమంగా సైనిక వ్యవస్థ నిర్వీర్యమైంది. ఫలితంగా సుల్తానుల సామ్రాజ్యం పతనమైంది.
న్యాయపాలన
సామ్రాజ్యంలో సుల్తాన్ అత్యున్నత న్యాయాధికారి. అతనికి న్యాయపాలనలో సాయపడటానికి ప్రధాన ఖాజీ అనే న్యాయశాఖ మంత్రి ఉండేవాడు. అదే విధంగా రాష్ట్ర, స్థానిక స్థాయిల్లోనూ న్యాయపాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామస్థాయిలో గ్రామపెద్దలే తీర్పులు చెప్పేవారు. ఇలానే ఢిల్లీ సుల్తానులు ఖురాన్, షరియత్ ప్రకారం న్యాయ పాలన నిర్వహించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అల్లావుద్దీన్ ఖిల్జీ మరింత కఠినంగా వ్యవహరించేవాడు. ‘నాకు షరియత్ (ముస్లిం చట్టం) తెలియదని, రాజ్య శ్రేయస్సుకు ఏది మంచిదయితే దాన్నే అమలు చేస్తానని’ బహిరంగంగా ప్రకటించాడు.
సాంఘిక పరిస్థితులు

ఆర్థిక పరిస్థితులు
ఢిల్లీ సుల్తానుల కాలంలో వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల రంగాల అభివృద్ధిని పరిశీలిస్తే నాటి ఆర్థిక పరిస్థితులు అర్థమవుతాయి. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఢిల్లీ సుల్తానులు అనేక చర్యలు చేపట్టారు. ఫలితంగా పట్టణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో అనేక నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆహార, వాణిజ్య పంటలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. బంజరు భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చడానికి కృషి చేశారు. నాటి కాలంలో ఇక్తా భూములు, ఖలీసా భూములు, మదద్ - ఇ - మాష్ భూములు అనే మూడు ప్రధాన రకాలు ఉండేవి. ముక్తీల అధీనంలో ఉండే భూములు ఇక్తా భూములు. సుల్తాన్ అధీనంలో ఉండే భూములు ఖలీసా భూములు. వీటి నుంచి వచ్చే ఆదాయం నేరుగా ఖజానాకు చేరేది. వివిధ వర్గాలవారికి పాలకులు దానంగా ఇచ్చిన భూములను మదద్ - ఇ - మాష్ భూములు అనేవారు. ఫిరోజ్‌షా తుగ్లక్ వ్యవసాయ అభివృద్ధికి నాలుగు ప్రధాన కాలువలు తవ్వించి రైతుబాంధవుడిగా పేరొందాడు. సుల్తానుల కాలంలో తోటపంటలు బాగా అభివృద్ధి చెందాయి.
ఫలితంగా గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భూమిశిస్తుతో పాటు ఖామ్స్, జకత్, జిజియా వంటి పన్నులు వసూలు చేసేవారు. రాజ్యానికి అధిక ఆదాయం భూమిశిస్తు (ఖరజ్) ద్వారా సమకూరేది. కానీ ప్రజలు అధిక పన్నుల భారంతో బాధపడేవారు. పట్టణాల సంఖ్య పెరగడం, వృత్తి పనివారు అధికంగా వస్తువులు ఉత్పత్తి చేయడం, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడం అనే మూడు ప్రధాన కారణాల వల్ల పట్టణ ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. తురుష్కుల రాకతో వస్త్ర, పట్టు, కాగితం పరిశ్రమల అభివృద్ధి సాధ్యమైంది. భవన నిర్మాణ రంగంలో సాంకేతికత పెరిగింది. ఢిల్లీలో ఉన్న భవన నిర్మాణ మేస్త్రీలు ఇస్లాం రాజ్యాలున్న అన్ని దేశాల కంటే నైపుణ్యం కలవారని అమీర్‌ఖుస్రూ పేర్కొన్నాడు. చర్మ, లోహ పరిశ్రమలు, తివాచీల అల్లకం, ఆభరణాల రూపకల్పన వంటి రంగాల్లో అభివృద్ధి జరిగింది.
వ్యవసాయ, పరిశ్రమల రంగాలతో పాటు వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి. భారతదేశం నుంచి పర్షియన్ సింధుశాఖ, ఎర్ర సముద్రం, ఆగ్నేయాసియా దేశాలకు వస్తువులు ఎగుమతయ్యేవి. విదేశీ వాణిజ్యంతో పాటు దేశీయ వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. మార్వాడీలు, జైనులు, ముల్తానీలు దేశీయ వ్యాపారంలో ప్రధాన పాత్ర పోషించారు. ముల్తానీలు చాలా ధనవంతులని, కులీన వంశస్థులకు భారీగా రుణాలు ఇచ్చే వారని బరౌనీ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. విదేశాల నుంచి భారీగా వృత్తి పని వారు వలస వచ్చేవారని ఇస్సామీ తెలిపాడు. ఎంత అభివృద్ధి జరిగినా ధనిక, కులీన వర్గాలు మాత్రమే లబ్ధి పొందాయని చెప్పొచ్చు. రైతాంగం, బానిసలు, కూలీలు, మధ్య తరగతి వర్గం అధిక పన్నుల భారంతో బాధపడేవారని సమకాలీన చరిత్రకారుల అభిప్రాయం.
క్రీ.శ.1206లో కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించిన ఢిల్లీ సుల్తానత్ సామ్రాజ్యాన్ని మొదట బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశాలు పరిపాలించాయి. గియాజుద్దీన్ తుగ్లక్ క్రీ.శ.1320లో చివరి ఖిల్జీ వంశ పాలకుడైన నాసిరుద్దీన్ ఖుస్రూషాను హత్య చేయించి తుగ్లక్ వంశ పాలనను ప్రారంభించాడు. తుగ్లక్ వంశ పాలన అనంతరం సయ్యద్, లోడీ వంశాలు పరిపాలించాయి. క్రీ.శ.1526లో చివరి లోడీ వంశ పాలకుడైన ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్ సామ్రాజ్యం అంతరించింది.
తుగ్లక్ వంశం (క్రీ.శ.1320-1414)
ఘియాజుద్దీన్ తుగ్లక్
తుగ్లక్ వంశ పాలనను ప్రారంభించినవారు ఘియాజుద్దీన్ తుగ్లక్. ఇతడు తరుష్కుల్లో కరౌనా/ఖరౌనా తెగకు చెందినవాడు. అల్లావుద్దీన్ పరిపాలనా కాలంలో ఘియాజుద్దీన్ దీపాల్‌పూర్ వైస్రాయ్‌గా పనిచేశాడు. క్రీ.శ.1320లో చివరి ఖిల్జీ వంశ పాలకుడైన నాసిరుద్దీన్ ఖుస్రూషాను వధించి తుగ్లక్ వంశ పాలనను ప్రారంభించాడు. తుగ్లకాబాద్ అనే నగరాన్ని నిర్మించాడు. కఠిన శిక్షలను తగ్గించాడు. రైతు రుణాలను రద్దు చేశాడు. భూమిశిస్తును 1/3వ వంతుగా నిర్ణయించాడు. తన కుమారుడు జునాఖాన్ (మహ్మద్ బీన్ తుగ్లక్)ను దక్షిణ భారతదేశంపైకి పంపి యాదవ రాజ్యంపై విజయం సాధించాడు. క్రీ.శ.1323 నాటికి కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. కానీ క్రీ.శ.1325లో మహ్మద్‌బీన్ తుగ్లక్ తండ్రిని హత్యచేసి సింహాసనాన్ని అధిష్టించాడు.
మహ్మద్ బీన్ తుగ్లక్ (క్రీ.శ.1325-1351)
ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారాన్ని దక్షిణపథంపై నెలకొల్పిన ఏకైన ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బీన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానులందరిలో అత్యంత విద్యావంతుడు, ఉదార స్వభావం గల వ్యక్తిగా పేరొందిన ఇతడు తన చర్యల ద్వారా ‘పిచ్చి తుగ్లక్’గా పేరొందాడు. ఈయనను విరుద్ధ గుణాలు మూర్తీభవించిన వ్యక్తిగా సమకాలీన చరిత్రకారులు అభివర్ణించారు. మహ్మద్ బీన్ తుగ్లక్ అసలు పేరు జునాఖాన్. తండ్రి ఘియాజుద్దీన్ తుగ్లక్ పాలనా కాలంలో యాదవ, కాకతీయ రాజ్యాలపై దండెత్తి అపార ధనరాశులను కొల్లగొట్టాడు. వరంగల్/ఓరుగల్లును ఆక్రమించి దానికి సుల్తాన్‌పూర్ అని పేరు పెట్టాడు. క్రీ.శ.1325లో తండ్రిని హత్యచేయించి సుల్తాన్‌గా పాలనను ప్రారంభించాడు. అనేక విజయాలు సాధించడమే కాకుండా పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా గంగా, యమునా మైదానంలో భూమిశిస్తు పెంచడం, రాజధాని మార్పిడి, టోకెన్ కరెన్సీ ముద్రణ లాంటి సంస్కరణలు విఫలమవడంతో పిచ్చి తుగ్లక్‌గా పేరొందాడు.
గంగా - యమునా అంతర్వేదిలో భూమిశిస్తు పెంచడం
గంగా - యమునా అంతర్వేది (దోవాబ్)లో సారవంతమైన భూములు ఉండటం వల్ల అక్కడ భూమిశిస్తును 1/2వ వంతుకు పెంచాడు. రాజ్య ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ అదే ఏడాది ఆ ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించడంతో రైతులు శిస్తు చెల్లించలేకపోయారు. అధికారులు ప్రజల పరిస్థితులను పట్టించుకోకుండా దౌర్జన్యంగా శిస్తు వసూలు చేశారు. ఆ తర్వాత సుల్తాన్ ప్రతిస్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ‘దివాన్-ఇ-కోహీ’ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. రైతులకు తక్కావీ రుణాలు (పంట రుణాలు) మంజూరు చేశాడు. బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చాడు.
రాజధాని మార్పు
మహ్మద్ బీన్ తుగ్లక్ క్రీ.శ.1327లో రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి (దౌలతాబాద్) మార్చాడు. ఢిల్లీ వాయవ్య భారతదేశానికి దగ్గరగా ఉండటం వల్ల నిత్యం విదేశీ దండయాత్రలకు గురికావడం, దక్షిణపథంపై పట్టు సాధించడం లాంటి కారణాలతో రాజధానిని మార్చాడు. కానీ రాజధానిని మార్చే సమయంలో అతడు జారీచేసిన శాసనాలు ప్రజలకు బాధ కలిగించాయని సమకాలీన చరిత్రకారులు పేర్కొన్నారు. రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రజలందరినీ దౌలతాబాద్‌కు వెళ్లమని ఆదేశించాడని, వెళ్లనివారిని చిత్రహింసలకు గురిచేశాడని, ఫలితంగా ప్రజలు అతడిని మంచివాడు కాదని భావించినట్లు చరిత్రకారులు తెలిపారు. అనేక వ్యయప్రయాసల అనంతరం రాజధానిని దౌలతాబాద్‌కు మార్చినా కొంత కాలానికే క్రీ.శ.1335లో రాజధానిని ఢిల్లీకి మార్చాడు.
టోకెన్ కరెన్సీ ముద్రణ
మహ్మద్ బీన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో తీవ్ర విమర్శలకు గురైంది ఈ నూతన కరెన్సీ ముద్రణ. ఇతడి పరిపాలనా కాలంలో వెండి కొరత ఏర్పడింది. ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో వెండి ‘టంకాలు’ అధికారిక నాణేలుగా చలామణీ అయ్యేవి. వెండి కొరత వల్ల సుల్తాన్ రాగి, తోలు నాణేలు ముద్రించాడని చరిత్రకారులు పేర్కొన్నారు. కరెన్సీ ముద్రణపై ఆంక్షలు జారీచేయకపోవడం, ప్రభుత్వమే కరెన్సీ ముద్రించాలనే షరతులు లేకపోవడంతో రాజ్యంలో నకిలీ నాణేల ముద్రణ అధికమైంది. నాడు దిల్లీలో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారిందని చరిత్రకారులు తెలిపారు. ఫలితంగా నాణేల చలామణి అధికమై ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో ప్రజలంతా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల బాధలను అర్థం చేసుకున్న సుల్తాన్ వారి వద్ద ఉన్న టోకెన్ కరెన్సీకి అసలు, నకిలీ అనే తేడా లేకుండా తన ఖజానాలోని వెండి టంకాలను మార్పిడి చేశాడు. ఫలితంగా ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. ఇలాంటి చర్యలతో మహ్మద్ బీన్ తుగ్లక్ ‘పిచ్చి తుగ్లక్‌గా’ పేరొందాడు. ఈ కరెన్సీ ముద్రణ వల్ల మహ్మద్‌బీన్ తుగ్లక్ ‘ప్రిన్స్ ఆఫ్ మనీయర్’ (నాణేల యువరాజు)గా పేరొందాడు.
మహ్మద్ బీన్ తుగ్లక్ సంస్కరణలు అనేక ఆదర్శ భావాలతో ఉండేవి. రాజ్య రక్షణ, రాజ్యం మధ్యలో రాజధాని ఉండాలనే ఆలోచనతోనే రాజధానిని మార్చాడు. దానివల్ల ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. తురుష్కుల నాగరికత, సంస్కృతి, సాంఘిక ఆలోచనా ధోరణి దక్షిణాదికి వ్యాపించింది. రెవెన్యూ సంస్కరణల ద్వారా వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాడు. ప్రత్యేక వ్యవసాయ శాఖ ‘దివాన్-ఇ-కోహీ’ని ఏర్పాటు చేశాడు. భూమిశిస్తు బకాయిలు వసూలు చేయడానికి సెంచూరియన్ అనే ప్రత్యేక అధికారులను నియమించాడు. క్రీ.శ.1351లో నాటి గుజరాత్ పాలకుడు ధాగి సుల్తాన్‌ను శిక్షించడానికి వెళ్లిన మహ్మద్‌బీన్ తుగ్లక్ ‘థట్టా’ అనే ప్రాంతంలో మరణించాడు. అతడి మరణం గురించి పేర్కొంటూ ‘అతడి బాధ ప్రజలకు, ప్రజల బాధ అతడికి తప్పింది’ అని లేన్‌పూలే చరిత్రకారుడు తెలిపాడు. మహ్మద్ బీన్ తుగ్లక్ పాలనా కాలంలోనే దక్షిణ భారతదేశంలో విజయనగర (1336), బహమనీ (1347) సామ్రాజ్యాలు అవతరించాయి.
ఫిరోజ్‌షా తుగ్లక్ (క్రీ.శ.1351-1388)
మహ్మద్‌బీన్ తుగ్లక్ మరణానంతరం అతడి సోదరుడు ఫిరోజ్‌షా తుగ్లక్ పరిపాలించాడు. ఇతడు వ్యవసాయరంగ అభివృద్ధికి అనేక కాలువలు నిర్మించి ‘రైతు బాంధవుడు’గా పేరొందాడు. తన ప్రధానమంత్రి ఖాన్-ఇ-జహాన్-మక్బూల్ సాయంతో పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేశాడు. మహ్మద్ బీన్ తుగ్లక్ చర్యల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టాడు. నీటిపారుదల వసతులు కల్పించాడు. యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు, సట్లెజ్ నది నుంచి ఘఘ్గర్ వరకు, మాండవ నుంచి హిస్సార్ వరకు నీటిపారుదల కాలువలు ఏర్పాటు చేశాడు. ఆ కాలువలు నేటికీ పంజాబ్, హరియాణాల్లో నీటిని అందిస్తున్నాయి. సుమారు 23 రకాల పన్నులను రద్దు చేసి ముస్లిం మత సూత్రాల ప్రకారం ఖరజ్, ఖామ్స్, జకత్, జిజియా అనే నాలుగు ప్రధానమైన పన్నులను వసూలు చేశాడు. ఫిరోజాబాద్, జాన్‌పూర్, ఫతేబాద్, హిస్సార్ లాంటి నూతన పట్టణాలను నిర్మించాడు. పేదల సంక్షేమం కోసం ‘దివాన్-ఇ-ఖైరాత్’ అనే శాఖను, బానిసల సంక్షేమానికి ‘దివాన్-ఇ-బందగాని’ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. అదా, భిఖ్ అనే నూతన నాణేలను ప్రవేశపెట్టాడు. ఢిల్లీలో దారుల్-షఫా (దార్-ఉల్-షిఫా) అనే ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేశాడు. బాటసారులు, యాత్రికుల కోసం సుమారు 200 సరాయిల (విశ్రాంతి మందిరాలు)ను నిర్మించాడు.
సమకాలీన చరిత్రకారుడైన షమ్స్ ఇ సిరాజ్ ఫిరోజ్‌షా తుగ్లక్ పాలనా వ్యవహారాల గురించి అనేక విషయాలు తెలిపాడు. ఫిరోజ్‌షా తుగ్లక్ పరమత సహనాన్ని అనుసరించలేదు. అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, జిజియా పన్ను విధించాడు. బ్రాహ్మణులపై కూడా ఈ పన్ను విధించాడు. ఒరిస్సాలోని జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఇతడి ఆస్థానంలో బరౌనీ, షమ్స్ ఇ సిరాజ్, మహ్మద్ అఫీఫ్ లాంటి చరిత్రకారులు, కవులు; జలాలుద్దీన్-రూమీ లాంటి పండితులు ఉండేవారు. ఫిరోజ్‌షా తుగ్లక్ అల్లావుద్దీన్ ఖిల్జీ రద్దు చేసిన ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్దారీ పద్ధతిగా ప్రవేశపెట్టాడు. సివిల్, మిలిటరీ ఉద్యోగాలను వంశపారంపర్యం చేశాడు. ముఖ్యంగా 1,80,000 మంది బానిసలను పోషించి ఖజానా ఖాళీ చేశాడని అఫీఫ్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. పెరిస్టా అనే చరిత్రకారుడి ప్రకారం ఫిరోజ్‌షా తుగ్లక్ 50 ఆనకట్టలు, 40 మసీదులు, 30 కళాశాలలను నిర్మించినట్లు తెలుస్తుంది. మీరట్, తోప్రా ప్రాంతాల్లో ఉన్న అశోక స్తంభాలను ఢిల్లీకి (ఫిరోజాబాద్) తరలించాడు. ఈ విధంగా అనేక ప్రజా సంక్షేమ చర్యలతోపాటు ప్రజా, హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. ఫిరోజ్‌షా తుగ్లక్ ‘ఫతూహత్-ఇ-ఫిరోజ్ షాహీ’ పేరుతో తన స్వీయచరిత్రను రాశాడు. ఇతడి అనంతరం రెండో ఘియాజుద్దీన్, అబూబకర్, మహ్మద్ బీన్ ఫిరోజ్, నాసిరుద్దీన్ మహ్మద్ తుగ్లక్ లాంటి పాలకులు పాలించారు. వీరు అసమర్థులు కావడంతో తుగ్లక్ వంశం పతనమైంది. చివరి తుగ్లక్ వంశ పాలకుడైన నాసిరుద్దీన్ మహ్మద్ తుగ్లక్ పాలనా కాలంలోనే క్రీ.శ.1398-99లో తైమూర్ దండయాత్ర జరిగింది. క్రీ.శ.1414లో ఖిజీర్‌ఖాన్ నాసిరుద్దీన్ తుగ్లక్‌ను తొలగించి సయ్యద్ వంశ పాలనను ప్రారంభించాడు.
సయ్యద్ వంశం
క్రీ.శ.1414-1451 మధ్య సయ్యద్ వంశీయులు ఢిల్లీ సుల్తానత్ రాజ్యాన్ని పరిపాలించారు. తైమూర్ ప్రతినిధి ఖిజీర్ ఖాన్ (ఖైదర్ ఖాన్) క్రీ.శ.1414లో సయ్యద్ వంశ పాలనను ప్రారంభించాడు. అతడి అనంతరం ముబారక్ షా, మహ్మద్ షా, అల్లావుద్దీన్ ఆలంషా పరిపాలించారు. ఖిజీర్ ఖాన్ కాలంలోనే గుజరాత్, మాళ్వా, జాన్‌పూర్ పాలకులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ముబారక్ షా కులీనుల చేతిలో హత్యకు గురయ్యాడు. చివరి సయ్యద్ వంశ పాలకుడైన అల్లావుద్దీన్ ఆలమ్‌షాను తొలగించి బహులాల్ లోడీ క్రీ.శ.1451లో లోడీ వంశ పాలనను ప్రారంభించాడు.
లోడీ వంశం
క్రీ.శ.1451-1526 మధ్య ఢిల్లీని పాలించిన చివరి సుల్తానత్ వంశం లోడీ వంశం. లోడీ వంశపాలన ప్రారంభకుడు బహాలూల్ లోడీ. అతడి అనంతరం సికిందర్ లోడీ, ఇబ్రహీం లోడీ పరిపాలించారు. బహాలూల్ లోడీ వ్యక్తిత్వం గురించి అబ్దుల్లా అనే కవి ‘తారిఖ్-ఇ-దావుదీ’ అనే గ్రంథంలో వివరించాడు. అతడి మరణానంతరం కుమారుడైన నిజాంఖాన్ ‘సికిందర్ షా’ (సికిందర్ లోడీ) అనే బిరుదుతో రాజ్యపాలనకు వచ్చాడు. లోడీ వంశ పాలకుల్లో గొప్పవాడిగా పేరొందాడు. ఇతడు బిహార్, గ్వాలియర్ ప్రాంతాలపై విజయం సాధించాడు. ఆగ్రా నగరాన్ని నిర్మించి దాన్ని నూతన రాజధానిగా చేశాడు. వ్యవసాయాభివృద్ధికి చర్యలు చేపట్టాడు. పన్ను భారాన్ని తగ్గించాడు. ఇతడి ఆస్థాన కవి మియాన్ భువా ‘తిత్భీ సికిందరీ’ అనే గ్రంథాన్ని పారశీక భాషలోకి తర్జుమా చేశాడు. చివరి లోడీ వంశ పాలకుడు ఇబ్రహీం లోడీని క్రీ.శ.1526లో బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్ సామ్రాజ్యం అంతరించింది.