• facebook
  • whatsapp
  • telegram

ఆవరణశాస్త్ర సంబంధ అంశాలు

ఆవరణ వ్యవస్థలో ప్రధానంగా నాలుగు రకాల జీవకారకాలు ఉంటాయి.

1. ఉత్పత్తిదారులు   2. శాకాహారులు

3. మాంసాహారులు  4. విచ్ఛిన్నకారులు

ఉత్పత్తిదారులు:

 ఏ ఆవరణ వ్యవస్థలోనైనా మొక్కలు సాధారణంగా ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఇవి ఆవరణవ్యవస్థకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి.

 వీటికి కిరణజన్యసంయోగక్రియ జరుపుకునే సామర్థ్యం ఉంటుంది. మొక్కలు వాతావరణంలోని కార్బన్‌ డైఆక్సైడ్, నీటిని వినియోగించుకుని సూర్యరశ్మి సమక్షంలో క్లోరోఫిల్‌ లేదా పత్రహరితం సాయంతో కార్బోహైడ్రేట్‌ల రూపంలో శక్తిని నిక్షిప్తం చేస్తాయి. అందుకే మొక్కలను శక్తి ఉత్పాదకాలు అంటారు.

శాకాహారులు:

 మొక్కలపై ప్రత్యక్షంగా ఆధారపడే జీవులను మొదటి వినియోగదారులు (ప్రథమ వినియోగదారులు) అంటారు. ఇవే శాకాహారులు. ఇవి మొక్కల నుంచి శక్తిని ఆహారం రూపంలో సంగ్రహిస్తాయి.

మాంసాహారులు:

 శాకాహారులపై ఆధారపడి జీవించే జీవులు మాంసాహారులు. ఇవి ద్వితీయ వినియోగదారులు. ఒక మాంసాహార జీవిని ఆహారంగా తీసుకునే మరో మాంసాహార ప్రాణిని ఉన్నత శ్రేణి మాంసాహార జీవులు అంటారు.

విచ్ఛిన్నకారులు:

 చనిపోయిన జంతు - వృక్ష కళేబరాలను పూతికాహార పోషణ ద్వారా విచ్ఛిన్నం చేసి వాటిని నిర్మూలించడం ద్వారా జీవావరణ పరిశుభ్రత సాధ్యమవుతుంది. సాధారణంగా బ్యాక్టీరియా, శిలీంధ్రాలు విచ్ఛిన్నకారులుగా వ్యవస్థితమై ఉంటాయి.

జీవులపై పరిసరాల ప్రభావం

 ఆవరణ వ్యవస్థలో వాతావరణ కారకాలైన నేల, ఉష్ణోగ్రత, ఆర్ధ్రత, లవణాలు మొదలైనవాటిని నిర్జీవకారకాలుగా పేర్కొంటారు.

 జీవులు వాటి పరిసరాలతో అనేక అనుకూలనాలను చూపిస్తాయి. ఇవి వాటి మనుగడకే కాకుండా ప్రత్యుత్పత్తికి కూడా తోడ్పడతాయి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించడం, దాని కక్ష్యలో తిరగటం ద్వారా నిర్దిష్టమైన రుతువులు ఏర్పడతాయి. వీటి ప్రభావం వల్లే వాతావరణంలో ఉష్ణోగ్రతల తీవ్రత,  కాలావధులు ఏర్పడతాయి. వీటితోపాటు ఒక సంవత్సరంలో వర్షపాతం వల్ల కలిగే మార్పులు, ప్రభావాల వల్ల ప్రధానమైన బయోమ్‌లు ఏర్పడ్డాయి. అవే ఎడారులు, వర్షారణ్యాలు, టండ్రాలు.

 వాతావరణంలోని అనుకూల పరిస్థితులను తట్టుకోవటానికి జీవులు వివిధ ప్రత్యామ్నాయాలను చూపిస్తాయి. కొన్ని జీవులు శరీర ధర్మ సంబంధ సర్దుబాట్లను, మరికొన్ని ప్రవర్తన సంబంధ సర్దుబాట్లను కలిగి ఉంటాయి. ఈ సర్దుబాట్లనే అనుకూలనాలు అంటారు.

 అనుకూలనాలను జీవి, అది నివసించే ఆవాసంలో మనుగడకు, ప్రత్యుత్పత్తికి తోడ్పడే స్వరూప సంబంధ, శరీరధర్మ సంబంధ, ప్రవర్తన సంబంధ లక్షణాలుగా పేర్కొంటారు. చాలా అనుకూలనాలు జీవుల్లో దీర్ఘకాలిక పరిణామ క్రమంలో ఏర్పడి జన్యుపరంగా స్థిరత్వాన్ని చూపిస్తాయి.

 ఉదాహరణకు ఒపన్షియా (బ్రహ్మజెముడు) మొక్క దానికి కావాల్సిన నీటి అవసరాన్ని మొత్తంగా రసభరిత అంగాల నుంచి తీసుకుంటుంది. రసభరిత భాగాల్లో మ్యూసిలేజ్‌ లేదా జిగురు రూపంలో నీటి నిల్వ జరుగుతుంది. 

 చాలా ఎడారి మొక్కల్లో పత్రాల బాహ్యచర్మం మందమైన అవభాసిని పొరతో ఉండి, వివిధ వరుసల బాహ్యచర్మ కణాలతో నిర్మితమై, దిగబడిన పత్రరంధ్రాలు ఉంటాయి. వీటి కారణంగానే ఎడారి మొక్కల్లో బాష్పోత్సేకం ఉండదు. నీటి ఎద్దడి అధికంగా ఉన్న పరిస్థితుల్లో బాష్పోత్సేకం అధికంగా జరిగితే మొక్క ఎక్కువ పరిమాణంలో నీటిని కోల్పోయి, మరణించే ముప్పు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడారి మొక్కల అంతర్నిర్మాణ సంబంధ అనుకూలనాలు ఆ మొక్కలు, ఆ ఆవాసంలో పెరగడానికి అనుకూలంగా ఉంటాయి.

 మొక్కలకు నీటికి ఉన్న సంబంధాలను అనుసరించి వాటిని మూడు ప్రధాన ఆవరణ వృక్ష సముహాలుగా వర్గీకరించారు. అవి: 

1. నీటిమొక్కలు లేదా హైడ్రోఫైట్‌లు 

2. సమోద్భిజాలు లేదా మధ్యరకం మొక్కలు మీసోఫైట్‌లు

3. ఎడారి మొక్కలు లేదా జీరోఫైట్‌లు

సమోద్భిజాలు/ మధ్యరకం మొక్కలు

 మధ్యరకం మొక్కలు సాధారణంగా జలాభావ పరిస్థితులు లేదా నీరు అధికంగా లేని చోట పెరుగుతాయి. ఇలాంటి ఆవాసాల్లో మృత్తికలు నీటిని, వాయువులను దాదాపు సమానంగా కలిగి ఉంటాయి. ఈ పరిస్థితులు అడవులు లేదా సస్య సంపద బాగా అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటాయి. అధిక నీరు లేదా జలాభావ పరిస్థితి మొక్కల పెరుగుదలకు ప్రతికూల అంశాలు. 

 భూమిపై మధ్యరకం మొక్కలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. 

ఉదా: గోధుమ, మొక్కజొన్న, బార్లీ, బఠానీ, చెరకు గడ్డిమైదాన జాతులు; ఉష్ణమండల, సమశీతోష్ణ అడవుల్లో పెరిగే మొక్కలు ఎడారి మొక్కలు లేదా జీరోఫైట్‌లు

 నీరు లోపించిన జలాభావ పరిస్థితుల్లో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు లేదా జీరోఫైట్‌లు అంటారు.

 ఎడారి మొక్కలను అల్పకాలిక మొక్కలు, రసభరిత మొక్కలు, రసభరితం కాని మొక్కలు అని మూడు రకాలుగా విభజించారు.

అల్పకాలిక మొక్కలు:

 వీటినే ఎఫిమెరల్స్‌ అంటారు. ఇవి సాధారణంగా ఏక వార్షికాలు.

​​​​​​​ ఇవి శుష్క ప్రాంతాల్లో పెరుగుతాయి. 

​​​​​​​ ఈ మొక్కలు అతి తక్కువ కాలంలో తమ జీవిత చక్రాన్ని ముగిస్తాయి.

ఉదా: ట్రెబ్యులస్‌

రసభరిత మొక్కలు: 

​​​​​​​ వీటిని సక్యులెంట్స్‌ అని కూడా అంటారు. ఇవి వర్షాకాలంలో నీటిని శోషించి, వివిధ భాగాల్లో జిగురు లేదా మ్యూసిలేజ్‌ రూపంలో నిల్వచేస్తాయి.

​​​​​​​ దీని ఫలితంగా నిల్వచేసే భాగాలు రసభరితంగా ఉంటాయి. ఒపన్షియాలో కాండం, అలోవెరాలో పత్రం, ఆస్పరాగస్‌లో వేరు రసభరిత భాగాలుగా ఉంటాయి.

​​​​​​​ ఈ విధంగా నిల్వ చేసిన నీటిని, నీరు దొరకని సమయంలో ఇవి చాలా పొదుపుగా వినియోగిస్తాయి.

 రసభరితం కాని నాన్‌ సక్యులెంట్‌ మొక్కలు దీర్ఘకాలిక జలాభావ పరిస్థితుల్ని తట్టుకోగలవు. వీటిని బహువార్షిక మొక్కలు అంటారు. ఉదా: కాజురైనా

ఎడారి మొక్కల్లో ఆవరణ సంబంధ  అనుకూలనాలు:

 స్వరూపశాస్త్రం ప్రకారం ఈ మొక్కలు మంచి వేరువ్యవస్థను, బాష్పోత్సేక వేగాన్ని నిరోధించే ప్రత్యేకతలను కలిగి ఉంటాయి.

 వేర్లు బాగా విస్తరించి, అనేక శాఖలతో విశాలంగా వ్యాపించి ఉంటాయి. మూలకేశాలు, వేరు తొడుగులు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. కాండాలు చాలా వరకు పొట్టిగా ఉండి, కేశాలు - మైనం పొరతో ఆవరించి ఉంటాయి.

 బాష్పోత్సేక వేగాన్ని తగ్గించటానికి బాహ్య చర్మంపై మందమైన అవభాసిని పొర ఉంటుంది. బాహ్య చర్మ కణాల్లో సిలికా స్పటికాలు ఉంటాయి. అనేక వరుసలు కలిగిన బాహ్యచర్మం ఉంటుంది.

 పత్రాల కింది భాగంలో పత్ర రంధ్రాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దిగబడిన పత్రరంధ్రాలు కనిపిస్తాయి. 

 యాంత్రిక కణజాలాలు బాగా అభివృద్ధి చెంది, మంచి ఆధారాన్ని కల్పిస్తాయి. 

 నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెంది, మంచి ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి.

 జీవుల మధ్య, జీవులు - పరిసరాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే జీవశాస్త్ర విభాగాన్ని ఆవరణశాస్త్రం లేదా ఇకాలజీ అంటారు.

 అధ్యయన అంశాల  ఆధారంగా ఇకాలజీని రెండు రకాలుగా  వర్గీకరించారు. అవి: 

1. వృక్ష ఆవరణశాస్త్రం 

2. జంతు ఆవరణశాస్త్రం

 ఆవరణశాస్త్రం జీవసంబంధ వ్యవస్థలోని నాలుగు ప్రధాన స్థాయులతో కూడి ఉంటుంది. అవి: జీవులు, జనాభా, సముదాయాలు, బయోమ్‌లు.

 ఆవరణ వ్యవస్థలు సాధారణంగా  జీవసంబంధ, నిర్జీవ సంబంధ అనుఘటకాలతో నిర్మితమై ఉంటాయి.

నీటి మొక్కలు

 పూర్తిగా నీటిలో లేదా  తడిగా ఉండే నేలలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు లేదా హైడ్రోఫైట్‌లు అంటారు. నీటిలో పెరిగే విధానాన్ని ఆధారంగా చేసుకుని వీటిని అయిదు రకాలుగా విభజించారు. నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు: ఇవి మృత్తిక ఆధారంగా కాకుండా నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఉదా: పిస్టియా, లెమ్నా లగ్నీకరణ చెంది, నీటిపై తేలే మొక్కలు: ఇవి మృత్తికలో స్థాపన చెంది, వేరు వ్యవస్థతో పాటు నీటి ఉపరితలంపై తేలతాయి. వీటికి పత్రాలు ఉంటాయి.

ఉదా: నింఫియా, విక్టోరియా రీజియా

పూర్తిగా నీటిలో మునిగి, అవలంబితంగా ఉండే మొక్కలు: ఇవి నీటితో మాత్రమే సంబంధం కలిగి ఉంటాయి. ఇవి నీటిలో పూర్తిగా మునిగి, మృత్తికలో నాటుకుని ఉండకుండా అవలంబితంగా ఉంటాయి.

ఉదా: హైడ్రిల్లా

లగ్నీకరణ చెంది, నీటిపై తేలే పత్రాలున్న మొక్కలు: ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి, వేరువ్యవస్థ సాయంతో కొలను అడుగున మృత్తికలో నాటుకుని ఉంటాయి. 

ఉదా: వాలిస్‌నేరియా

ఉభయచర మొక్కలు: ఈ రకం మొక్కలు నీటిలో, వాయుగతంగా పాక్షికంగా పెరుగుతాయి. 

ఉదా: టైఫా, సాజిటేరియా.

నీటి మొక్కల్లో ఆవరణ సంబంధమైన అనుకూలనాలు 

ఇవి రెండు రకాలైన అనుకూలతలను ప్రదర్శిస్తాయి. అవి: 

1. స్వరూపాత్మక సంబంధ ఆవరణ  అనుకూలతలు 

2. అôతర్నిర్మాణ సంబంధ ఆవరణ అనుకూలతలు

స్వరూపాత్మక సంబంధ ఆవరణ అనుకూలతలు:

 నీరు సమృద్ధిగా ఉండే ఆవాసాల్లో పెరిగే మొక్కల్లో వేర్లకు తక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. కొన్ని మొక్కల్లో వేర్లు ఉండవు. ఒకవేళ ఉన్నా కృశించి ఉంటాయి. 

 నీటిలో మునిగి ఉన్న పత్రాలు వేర్లలా పనిచేస్తాయి.

 కాండం పొడవుగా సున్నితంగా సాగి ఉంటుంది. పత్రాలు పలుచగా, పొడవుగా, రిబ్బన్‌ ఆకృతిలో ఉంటాయి. లేదా సన్నగా, పొడవుగా లేదా చీలిపోయి ఉంటాయి. 

 నీటిపై తేలే పత్రాలు పెద్దవిగా, బల్లపరుపుగా ఉంటాయి. వాటి ఊర్ధ్వతలం మైనంతో కప్పి ఉంటుంది. ఇవి నీటి మొక్కల్లో ఉండే స్వరూప సంబంధ ఆవరణ అనుకూలతలు.


అôతర్నిర్మాణ సంబంధ ఆవరణ అనుకూలతలు:

​​​​​​​ నీటిలో మునిగి ఉండే మొక్క భాగాల్లో అవభాసిని ఉండదు. కానీ అది వాయుగత భాగాల ఉపరితలాల మీద అతిపలుచని పొరలా ఉండొచ్చు. 

​​​​​​​ బాహ్య చర్మ కణాలు పలుచని కణకవచాన్ని, శోషణ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిలో హరిత రేణువులు కూడా ఉంటాయి. దీంతో ఇవి కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి.

​​​​​​​ పూర్తిగా నీటిలో మునిగి ఉండే మొక్కల్లో పత్రరంధ్రాలు ఉండవు. వాయుమార్పిడి లేదా వినిమయం నేరుగా విసరణ పద్ధతిలో పలుచని కణకవచాల ద్వారా జరుగుతుంది. 

​​​​​​​ నీటిపై తేలే పత్రాలున్న మొక్కల్లో పత్ర రంధ్రాలు ఊర్ధ్వ భాగంలో ఉంటాయి. 

​​​​​​​ నీటి మొక్కలన్నింటిలో వాయుపూరిత మృదుకణజాలం ఉంటుంది. ఇలాంటి కణజాలాన్ని ఏరెంఖైమా అంటారు. ఇది వాయుమార్పిడికి ఉపయోగపడటమే కాకుండా మొక్క నీటిపై తేలడానికి సహాయపడుతుంది. 

 దృఢకణజాలాలు, దారువు లాంటివి నీటి మొక్కల అంతర్నిర్మాణంలో తక్కువగా కనిపిస్తాయి. ఆవరణ సంబంధ అనుకూలనాలను ప్రదర్శించడంలో భాగంగా నీటి మొక్కలు ఇలాంటి అంతర్నిర్మాణ సంబంధ ప్రత్యేకతలను ప్రదర్శిస్తాయి.

Posted Date : 24-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌