• facebook
  • whatsapp
  • telegram

ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి అండ‌గా..!

ఈడ‌బ్ల్యూఎస్ విద్యార్థుల‌కు ప‌థ‌కాలు, స్కాల‌ర్‌షిప్‌లు

మ‌న‌దేశంలో ఆర్థిక వెనుక‌బాటు కార‌ణంగా ప్ర‌తిభ ఉన్నా.. ఎంతోమంది పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థులు చ‌దువు మ‌ధ్య‌లోనే మానేస్తున్నారు. అయితే వీరి క‌ల‌ల‌ను సాకారం చేసేందుకు... అండ‌గా నిలిచేందుకు ప్ర‌భుత్వం ప‌లు ర‌కాల‌ స్కాల‌ర్‌షిప్‌లు, లోన్లు అందిస్తోంది. వాటి గురించి తెలుసుకుంటే ఉన్న‌త విద్యను సాఫీగా పూర్తి చేయ‌వ‌చ్చు.. మంచి ఉద్యోగం సాధించ‌వ‌చ్చు... అనుకున్న‌ స్థాయికి ఎద‌గొచ్చు... ఆ వివ‌రాలు మీకోసం!

1. సీఎస్ఎస్ఎస్ స్కాల‌ర్‌షిప్

సెంట్ర‌ల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాల‌ర్‌షిప్ ఫ‌ర్ కాల‌జ్ అండ్ యూనివ‌ర్సిటీ స్టూడెంట్స్‌(సీఎస్ఎస్ఎస్). ఇది క‌ళాశాల‌, విశ్వ‌విద్యాల‌యాల్లో ఉన్న‌త చ‌దువులు చ‌దువుకునే వారికి ఇస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 ల‌క్ష‌లలోపు ఉన్న‌వారు అర్హులు. విద్యార్థుల ప్ర‌తిభ ఆధారంగా ఎంపిక చేసి మొద‌టి మూడేళ్లు ఏడాదికి రూ.10 వేలు అంద‌జేస్తారు. నాలుగు, ఐదో సంవ‌త్స‌రం రూ.20 వేల చొప్పున స్కాల‌ర్‌షిప్ అందుతుంది. 

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

2. సీఎస్ఐఎస్ స్కీం

సెంట్ర‌ల్ సెక్టార్ ఇంట్రెస్ట్ స‌బ్సిడీ స్కీం(సీఎస్ఐఎస్). ఇది విద్యార్థుల‌కు వ‌డ్డీ లేకుండా రుణం ఇచ్చే ప‌థ‌కం. కుటుంబ వార్షికాదాయం రూ.4.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న విద్యార్థి త‌న చ‌దువు కోసం ఈ రుణానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రూ.7.5 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. విద్యార్థి కోర్సు వ్య‌వ‌ధితోపాటు ఆపై ఏడాది వ‌ర‌కు తిరిగి చెల్లించే అవ‌కాశం క‌ల్పిస్తారు. రుణానికి వ‌డ్డీ ఉండ‌దు. ఈ ప‌థ‌కం కోసం కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో రూ.2,150 కోట్లు కేటాయించింది. 

వెబ్‌సైట్‌: https://www.vidyalakshmi.co.in/

3. పీఎంఎస్ఎస్ఎస్ జ‌మ్మూక‌శ్మీర్‌

ప్ర‌ధాన‌మంత్రి స్పెష‌ల్ స్కాల‌ర్‌షిప్ స్కీం ఫ‌ర్ జ‌మ్మూక‌శ్మీర్‌(పీఎంఎస్ఎస్ఎస్ ఫ‌ర్‌ జే&కే). ఈ స్కాల‌ర్‌షిప్‌లు ప్ర‌త్యేకంగా జ‌మ్మూకశ్మీర్ రాష్ట్ర విద్యార్థుల‌కే. కుటుంబ వార్షికాదాయం రూ.8 ల‌క్ష‌ల లోపు ఉండి, ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న‌త విద్య‌కు వెళ్లే విద్యార్థుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. ఏడాదికి రూ.1.30 ల‌క్ష‌ల నుంచి రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇస్తారు. 

వెబ్‌సైట్‌: https://www.aicte-india.org/

4. ఐఐటీల్లో ఫీజు మిన‌హాయింపు

ఐఐటీల్లో చ‌ద‌వాల‌నుకునే విద్యార్థుల‌కు వివిధ ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా ఆర్థిక‌, సామాజికంగా వెనుక‌బ‌డిన వారికి ఫీజు మిన‌హాయింపు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ విద్యార్థులకు ఫీజు మిన‌హాయింపు ఉండ‌గా.. వార్షికాదాయం రూ.ల‌క్ష లోపు ఉన్న వారికి పూర్తిగా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వార్షికాదాయం రూ.ల‌క్ష నుంచి రూ.5 ల‌క్ష‌ల మ‌ధ్య ఉన్న విద్యార్థుల‌కు 2/3వ వంతు త‌గ్గింపు ఉంటుంది. ట్యూష‌న్ ఫీజు చెల్లించాల్సిన వారు విద్యాల‌క్ష్మీ ప‌థ‌కం కింద వ‌డ్డీ లేని రుణం పొంద‌వ‌చ్చు. డిగ్రీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల్లో చేరి విద్యా రుణాలు తీసుకుంటే ఇదే ప‌థ‌కం కింద‌ వ‌డ్డీ మాఫీ అవుతుంది. 

ఇవే కాకుండా రాజ్యాంగంలోని 103వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, 2019 ప్ర‌కారం ఆర్థికంగా వెనుక‌బ‌డిన విద్యార్థుల‌కు విద్యాసంస్థ‌ల్లో ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(నాన్‌-క్రిమిలేయ‌ర్‌), మైనార్టీ విద్యార్థులకు నెట్‌/ సెట్ త‌దిత‌ర ప‌రీక్ష‌ల నిమిత్తం శిక్ష‌ణ ఇస్తారు. ఆయా ప‌థ‌కాలు, స్కాల‌ర్‌షిప్‌లకు నిధుల‌ను ప‌బ్లిక్ ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్ సిస్టం(పీఎఫ్ఎంఎస్‌) ద్వారా, రుణాల‌పై వ‌డ్డీ స‌బ్సిడీని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్‌(డీబీటీ) ప‌ద్ధ‌తిలో అంద‌జేస్తారు. 
 

Posted Date: 11-07-2021


 

తాజా కథనాలు

మరిన్ని