• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధిస్తే ఆర్థికసాయం

ఉన్న‌త చ‌దువుల కోసం స్కాల‌ర్‌షిప్‌లు

ఉన్నత చదువులు కొనసాగించాలనే అభిలాష ఉండి కూడా ఆర్థిక స్థోమత లేనివారికి మేధావి నేషనల్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ అవకాశం కల్పిస్తోంది. ‘సాక్షమ్‌ స్కాలర్‌షిప్‌ ఎగ్జామినేషన్‌’ అనే ఆన్‌లైన్‌ పరీక్ష రాసి దానిలో ప్రతిభ చూపినవారికి ఈ ఉపకార వేతనం లభిస్తుంది. 16 నుంచి 40 ఏళ్లలోపు వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ (హెచ్‌ఆర్‌డీఎం) ఆధ్వర్యంలో మేధావి నేషనల్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ నడుస్తోంది. ఇది ఏటా సాక్షమ్‌ పేరిట స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన వారిని ఉన్నత చదువుల దిశగా సాగేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. పరీక్ష నిర్వహించి, మెరిట్‌ ఆధారంగా ఉపకార వేతనాలను అందజేస్తారు. ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష అనంతరం రెండు పనిదినాల్లో ఫలితాలు విడుదలచేస్తారు. తర్వాత 5 పని రోజుల్లో స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని అందజేస్తారు.

దరఖాస్తుదారులు భారతీయులై ఉండాలి. పదో తరగతి లేదా తత్సమాన విద్య కనీస అర్హత. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 16 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ఏ కేటగిరీ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు రకాలు

ఈ పథకం ద్వారా మూడు రకాల స్కాలర్‌షిప్‌లను అందజేస్తారు. మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని రెండు దశల్లో, వరుస నెలల్లో అందజేస్తారు.

టైప్‌-ఎ: 686 మందికి దీన్ని అందజేస్తారు. కనీసం 60% మార్కులు సాధించాలి. రెండు నెలలు రూ.6000 చొప్పున చెల్లిస్తారు.

టైప్‌-బి: 309 మందికి దీన్ని అందజేస్తారు. కనీసం 50% మార్కులు సాధించాలి. వరుసగా రూ.3000 చొప్పున రెండు నెలలు చెల్లిస్తారు. 

టైప్‌-సి: 243 మందిని ఎంపిక చేస్తారు. కనీసం 40% మార్కులు సాధించాలి. వీరికి రూ.1500 చొప్పున రెండు నెలలపాటు చెల్లిస్తారు.

పాస్‌ స్కోరు కనీసం 35% లేదా అంతకన్నా ఎక్కువ సాధించి, మెరిట్‌ జాబితా కిందకి రాని వాళ్లందరికీ పరీక్ష ఫీజును తిరిగి చెల్లిస్తారు.

పరీక్ష విధానం

పరీక్షను ఆండ్రాయిడ్‌ ఆప్‌లో రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయాన్ని మూడు రోజుల ముందు ఆప్‌లో తెలియజేస్తారు. ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. కాలవ్యవధి 18 నిమిషాలు. రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ అంశాల నుంచి వరుసగా 11, 11, 9, 9 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆంగ్ల, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. తప్పు సమాధానానికి రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు జవాబుకు 1/3వ వంతు కోత విధిస్తారు.

దరఖాస్తు ఎలా?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-మెయిల్, వ్యక్తిగత వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.300.

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మే 15, 2021

పరీక్ష తేదీ: మే 30, 2021

ఫలితాల వెల్లడి: జూన్‌ 2, 2021

సిలబస్, ఇతర వివరాలకు: https://www.medhavionline.org/

Posted Date: 13-05-2021


 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం