• facebook
  • whatsapp
  • telegram

పల్లెల అధ్యయనానికి ఫెలోషిప్

ఎస్ బీఐ యూత్ ఫర్ ఇండియా ప్రకటన విడుదల

‣ అర్హత ఏదైనా డిగ్రీ, ద‌ర‌ఖాస్తు గడువు ఏప్రిల్ 30 

పల్లెల ప్రగతే దేశ ప్రగతి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంపూర్ణంగా విశ్వసిస్తుంది. అందుకు తనవంతు కృషిగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఎస్ బీఐ యూత్ ఫర్ ఇండియా పేరుతో ఫెలోషిప్ లు అందిస్తోంది. గ్రామాల స్థితిగతులు, గ్రామీణులు ఎదుర్కొంటున్న సమస్యలపై యువతతో అధ్యయనం చేయిస్తోంది. అందుకు ప్రతిఫలంగా వారికి ఆర్థిక చేయూత అందిస్తోంది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. 

ఫెలోషిప్ వివరాలు

ఎంపికైన విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. వీరు ప్రత్యేకంగా విద్య, వైద్యం, మహిళా సాధికారత, టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, ఆహార భద్రత, గ్రామీణ జీవనం, సంప్రదాయ కళలు, స్వయంపాలన, సామాజిక వ్యవస్థాపకత, నీరు, ప్రత్యామ్నాయ విద్యుత్తు వంటి అంశాలపై అధ్యయనం చేయాలి. ఎస్ బీఐ యూత్ ఫర్ ఇండియా సంస్థతో కలిసి పనిచేసే ఎన్జీఓలు ఈ ఫెలోలకు దిశానిర్దేశం చేస్తాయి. క్షేత్రస్థాయిలో తమకు అప్పగించిన పనిని అభ్యర్థులు అర్థం చేసుకోడానికి ఎన్జీఓ కేంద్రాలు సహాయపడతాయి. అనంతరం ప్రోగ్రాం లక్ష్యానికి అనుగుణంగా ఫెలోలు కృషి చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ బీఐ యూత్ ఫర్ ఇండియా రెండు వ‌ర్క్‌షాపుల‌ను నిర్వహిస్తుంది. ఫెలోలు అప్పటివరకు చేసిన పని, ఎదురైన ఇబ్బందులను అందులో చర్చిస్తారు. వాటికి నిపుణులు  పరిష్కార మార్గాలను సూచిస్తారు. ప్రోగ్రాం చివరి దశలో తన నుంచి బాధ్యతలు చేపట్టేందుకు స్థానిక కమ్యూనిటీ లేదా ఎన్జీఓకు చెందిన వ్యక్తిని ఫెలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వారికి బాధ్యతలు అప్పగించి ఫెలోషిప్ పూర్తి చేయాలి. ఈ మొత్తం ప్రోగ్రాం వ్యవధి 13 నెలలు. వసతి కోసం నెలకు రూ.15,000 స్టైపెండ్ ఇస్తారు. స్థానికంగా ప్రయాణ ఖర్చులకు నెలకు రూ.వెయ్యి చెల్లిస్తారు. ఫెలోషిప్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇతర అలవెన్సుల రూపంలో రూ.50,000 అందుతాయి. వీటితోపాటు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది.

అర్హతలు

ఫెలోషిప్‌న‌కు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 ఏళ్ల నుంచి 32 సంవత్సరాల లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో మమేకమయ్యే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ఫెలోషిప్ సమయంలో పల్లెల్లో పర్యటించాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా తమ జీవనశైలిని మలుచుకోవాలి.

దరఖాస్తు ఎలా?

ఫెలోషిప్ ప్రోగ్రాంకు అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తుది గడువు ఏప్రిల్ 30, 2021 వరకు ఉంది. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 

ఎంపిక విధానం

యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాంకు ఎంపిక విధానం మూడు పద్ధతుల్లో ఉంటుంది. ప్రిలిమినరీ అప్లికేషన్, ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనాలిటీ అసెస్‌మెంట్ & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేస్తారు. ముందుగా అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తు చేసుకున్న అనంతరం రెండో దశలో సెలక్షన్ బోర్డు అడిగే అంశాలపై ఆన్‌లైన్ అసెస్‌మెంట్ అందించాల్సి ఉంటుంది. ఇందులో గ్రామీణాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అభ్యర్థి సూచనలను అడుగుతారు. అనంతరం సెలక్షన్ బోర్డుతో పర్సనాలిటీ అసెస్‌మెంట్ & ఇంటర్వ్యూ ఉంటుంది. వీటి ఆధారంగానే తుది ఎంపికలు ఉంటాయి.  

వెబ్‌సైట్: https://register.you4.in/
 

Posted Date: 14-04-2021


 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం