• facebook
  • whatsapp
  • telegram

మెరిపించే ముందస్తు సన్నద్ధత!

ఉద్యోగాన్వేష‌ణ‌లో స్వీయ మార్కెటింగ్‌
 

ఉద్యోగ ఖాళీలు.. ప్రస్తుతం చాలామంది వినపడటానికి ఇష్టపడుతున్నమాట. సాధారణం కంటే పెరిగిపోయిన నిరుద్యోగుల సంఖ్యే ఇందుకు కారణం. ఈ పోటీలో పిలుపును అందుకోవడమే గొప్ప అవకాశంగా మారింది. కాబట్టి, దాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్పనిసరి. కేవలం రాతపరీక్ష, రెజ్యూమెలపైనే కాకుండా తదుపరి సన్నద్ధతనూ సీరియస్‌గా తీసుకోవాలి!
 

మౌఖిక పరీక్షలో మెలకువలు

తమ వస్తువు/ సేవలను వినియోగదారుడు ఉపయోగించటానికి ప్రయత్నించేలా చేయడాన్ని మార్కెటింగ్‌గా చెబుతాం. ఉద్యోగార్థికీ నియామక ప్రక్రియలో ఇది చాలాముఖ్యం. బాగా రాసిన రెజ్యూమె, బలమైన రెకమెండేషన్లు ఇంటర్వ్యూ వరకూ తీసుకెళ్లగలవు. కానీ ఉద్యోగాన్ని చేజిక్కించుకోవడం ఈ స్థాయిలో తాను చేసే ప్రతిభా ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాక మిమ్మల్ని మీరు ఎంతవరకూ మార్కెట్‌ చేసుకోగలిగారన్న దానిపైనే మీ ఉద్యోగ సాధన ఆధారపడి ఉంటుంది.

ఇక్కడ అభ్యర్థి చేయాల్సిందేంటంటే.. నియామక సంస్థ ప్రతినిధులకు తాను ఫలానా సంస్థకు ఎంతవరకూ ఉపయోగకరమో తెలియజేయడమే. ఆ కొలువుకు తాను ఎలా అర్హుడో తెలియజేయగలగాలి, ఒప్పించగలగాలి. అప్పుడే ఉద్యోగ మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతారు. ఇందుకు కొంత ముందస్తు సన్నద్ధతా అవసరమవుతుంది. ఇక్కడ వీటిని నేర్చుకునే వీలుండటం సంతోషించదగ్గ విషయం. ప్రయత్నించడమే తరువాయి.
 

మొదటి అడుగు ఎలా పడింది?

మొదటి అభిప్రాయం/ ఫస్ట్‌ ఇంప్రెషన్‌.. ఇంటర్వ్యూ దగ్గర దీనికి ప్రాధాన్యం ఎక్కువ. చాలావరకూ హైరింగ్‌ మేనేజర్లు వస్త్రధారణ ఆధారంగా అభ్యర్థిపై తొలి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఇక్కడ చాలా ఖరీదైన/ సంప్రదాయ వస్త్రధారణకే ప్రాధాన్యమివ్వాలని కాదు. సంస్థను బట్టి దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇది సంస్థకూ, ఉద్యోగానికీ అభ్యర్థి ఎంతమేరకూ గౌరవం ఇస్తున్నాడన్నది సూచిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసాన్నీ ప్రదర్శించాలి. ఐ కాంటాక్ట్‌ ఇవ్వడం, కూర్చునే విధానం, స్వరస్థాయి.. ఇవన్నీ ప్రభావం చూపే ప్రధాన అంశాలు. కాబట్టి, అద్దం ముందు, తెలిసినవారి ముందు వీటిని సాధన చేయాలి.
 

ప్రవర్తన పరంగా అడిగితే!

ఇంటర్వ్యూ అనగానే వ్యక్తిగతం, సబ్జెక్టుకు సంబంధించినవే అడుగుతారనేది చాలామంది అభిప్రాయం. అందుకే ఎక్కువ దృష్టి వీటిమీదే పెడుతుంటారు. కానీ ప్రవర్తన పరమైన ప్రశ్నలనూ ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉదాహరణకు- తోటివారితో సమస్య వచ్చినపుడు ఎలా ఎదుర్కొంటారు?; మీరు చేసిన పనిలో తప్పు దొర్లిందని తెలిస్తే ఏం చేస్తారు? ఇలా ప్రశ్నలు అడిగే వీలుంది. వీటికీ సన్నద్ధమవ్వాలి. చూడటానికి తేలికగా అనిపించినా చెప్పే సమయానికి కష్టంగా తోయొచ్చు. అలాగే ఇక్కడ సమాధానం ఒక్కటే కాదు. దాని వెనుక మీ తీరుతెన్నులను అంచనా వేసే వీలుందనీ గమనించాలి.
 

ఏమైనా అడిగారా?

ఇంటర్వ్యూ సమయంలో ‘మీకు ఏవైనా సందేహాలున్నాయా?’ అని రిక్రూటర్లు అడుగుతుంటారు. ఇది అభ్యర్థి ఆసక్తిని అంచనా వేయడంలో భాగంగా అడిగే ప్రశ్నే. కాబట్టి, సులువుగా వెబ్‌సైట్‌ చూస్తేనో.. ఎవరికైనా తెలిసే అవకాశమున్న ప్రశ్నలను అడగొద్దు. దీనికన్నా అడగకుండా ఉండటం మంచిది. అడిగే ప్రశ్న సంస్థపై మీకున్న ఆసక్తితోపాటు దానిపై పరిశోధన చేశారన్న విధంగా ఉండాలి. కాబట్టి, సంస్థ తాజా ప్రాజెక్టులు, పనితీరు వంటి వాటి గురించి అడగొచ్చు.
 

ఏ స్థాయిలో చెప్పారు?

పరిశ్రమ/ సంస్థ ఏదైనా.. అభ్యర్థిని తమ గురించి తాము చెప్పమని అడుగుతారు. కాబట్టి, 30-60 సెకన్ల వ్యవధిగల స్వీయ పరిచయాన్ని ముందుగానే సిద్ధం చేసుకుని ఉండాలి. మీ గురించి చెప్పడం అంటే కుటుంబం, విద్య, నైపుణ్యాలు.. ఇలా! అయితే నైపుణ్యాలను బృందంతో పనిచేయగలను, కష్టపడి పనిచేస్తాను.. ఇలాంటివి మాటలతో పరిమితం కాకుండా ఉదాహరణలతో వివరిస్తే దానికి విలువ ఉంటుంది. ఉదాహరణకు- ఏదైనా ఫెస్ట్‌లో పాల్గొనడమో, నిర్వహించడమో చేసినపుడు మీ కారణంగా వచ్చిన లాభం లేదా తగ్గిన ఖర్చు లాంటి వాటిని చెప్పొచ్చు. అందుకున్న అవార్డులూ, పొందిన ప్రశంసలకూ విలువ ఉంటుంది. వీలైతే వాటికి చోటివ్వండి.

ఇక్కడ దాన్ని ఏ స్థాయిలో సాధన చేశారన్నదీ ముఖ్యమే. ఎందుకంటే సంస్థను బట్టి అవసరాలు మారుతుంటాయి. కాబట్టి, మీరు మాట్లాడే విధానం వారికి తగినట్టుగా ఉండాలి. కాబట్టి, ఉద్యోగానికి సంబంధించిన వివరణను జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా స్వరస్థాయినీ చూసుకోవాలి. ఉదాహరణకు- క్లయింట్లతో కలిసి పనిచేయడమైతే.. అవతలివారిని ఒప్పించడం, ఓపికతో ఉండటం అవసరమవుతాయి. వేరే వాళ్లతో పనిచేయించడమైతే మరీ కఠినంగా కాకపోయినా కాస్త సీరియస్‌ టోన్‌ అవసరమవుతుంది. ఇలా పరిశ్రమ, సంస్థల ఆధారంగా ఏమేం అవసరమో చూసుకోవాలి. వారి వెబ్‌సైట్, సోషల్‌ మీడియా పేజ్‌ల్లో ఉన్న తాజా ప్రెస్‌ రిలీజ్‌లు, ప్రోగ్రామ్‌లు ఇందుకు సాయపడతాయి. వీటిమీద సరైన అవగాహన రాలేదనిపిస్తే.. మరీ మెల్లగానో, మరీ గట్టిగానో కాకుండా మాధ్యమిక స్థాయిలో ప్రయత్నించాలి. స్వరస్థాయిలో హెచ్చుతగ్గులు లేకుండా ఒకే స్థాయిలో పూర్తిచేయగలగాలి. మాట్లాడే విధానం అప్పజెబుతున్నట్లుగా ఉండకూడదు. ఆత్మవిశ్వాసం కనిపించాలి.
 

Posted Date: 25-11-2020


 

ఉద్యోగాన్వేష‌ణ‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం