• facebook
  • whatsapp
  • telegram

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమేనా?

సంస్థలు కోరుకుంటున్న అంశాలు ఇవే!

ఒక మంచి కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం సంపాదించడం ఎందరో అభ్యర్థుల కల. దీనికి పకడ్బందీ సన్నద్ధత అవసరం. ఇందుకు ఏయే అంశాలు ఉపకరిస్తాయో గమనిద్దాం!  

బహుళజాతి సంస్థల్లో అభివృద్ధికి అవకాశం కల్పించగల స్థిరమైన ఉద్యోగం సంపాదించడం ప్రాంగణ నియామక ప్రయోజనాల్లో ప్రధానమైనది. ఎక్కువ సంస్థలు ఎంట్రీ స్థాయి ఉద్యోగుల కోసం క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తుంటాయి. పోటీని తట్టుకుని వీటిలో ఎంపికయ్యేందుకు అభ్యర్థులు తమను తాము సిద్ధపరచుకోవాలి. విశ్వవిద్యాలయాలు నిర్దేశించే సిలబస్‌లో ప్రాంగణ నియామకాలకు సన్నద్ధం చేసే అంశాలు అరుదు. అందుకే విద్యార్థులు అకడమిక్‌ సిలబస్‌కు సమాంతరంగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు  సిద్ధపడాలి.  

విద్యార్థులకు గతంలో కంటే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ మార్గంలో ఉద్యోగావకాశాలను పొందటంపై అవగాహన పెరిగింది. సంస్థలు నిర్వహించే రిక్రూట్‌మెంట్‌ డైవ్‌లలో నాణ్యత ఉన్నవారే ఉద్యోగాలకు ఎంపికవుతారు. ఆ నాణ్యతను సాధించేలా కృషి చేయటం ప్రధానం.  

రిక్రూటర్లు కోరుకునేవి

తమ సంస్థలో ఉద్యోగులుగా చేరగోరేవారు మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని తమ లక్ష్యాల సాధనకు సరికొత్త విధానాలను అనుసరించాలని రిక్రూటర్లు కోరుకుంటుంటారు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులు మార్పును సవాలుగా స్వీకరిస్తారు. సానుకూలంగా స్పందిస్తారు. ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు సమర్థంగా ఎదుర్కొంటారు. నియామక సంస్థలు అభ్యర్థుల్లో గమనించేది ఇలాంటి అంశాలనే.

సమయానుకూల ప్రవర్తన

కొంతమంది సహజంగా ప్రతి సందర్భానికీ తగ్గట్టుగా సర్దుబాటు కాగలరు. ఈ లక్షణాలున్నవారు మార్పును జీవిత సత్యంగా, నిరంతర చర్యగా భావిస్తూ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా తమ పని పద్ధతులను మార్చుకోగలరు. భిన్న అంశాలను విశ్లేషించి లక్ష్య సాధనకు వాటిని ఏకీకృతం చేయగలిగిన విశాలదృక్పథం ఉన్నవారికే నియామకాల్లో మొగ్గు ఉంటుంది.  

గ్రహణ శక్తి

మార్పు గురించి ఆలోచిస్తున్నపుడు మార్పును స్వీకరించేటపుడు జరిగే పరిణామాలను సులభంగా గ్రహించగలగాలి. ముఖ్యంగా లక్ష్యాలు సాధించే క్రమంలో సానుకూలంగా స్పందించడం, నూతన విషయాలు నేర్చుకోవడానికి సంసిద్ధమవడం, సంస్థ ఉద్దేశాలను గ్రహించడం చాలా ముఖ్యం.  

పరిశోధన

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహించే ప్రతి సంస్థా నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తుంటుంది. అభ్యర్థులు ప్రాంగణ నియామకాలకు హాజరయ్యేముందు ఆ సంస్థ ప్రమాణాలను తెలుసుకోవాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే సంస్థకు సంబంధించిన వివరాలు, ఆ సంస్థ వ్యాపార సంబంధిత సమాచారం, పోటీదారులు, ఆర్థిక పరిస్థితులు లాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఇలాంటి ప్రాథమిక పరిశోధన కోసం ఇంటర్నెట్‌లోనూ, ఆ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారానూ సమాచార సేకరణ చేసుకోవచ్చు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి స్నేహితులు, కుటుంబసభ్యులతో అనుసంధానమవడం వల్ల ఆ సంస్థ తాను ఎన్నుకునే ఉద్యోగుల్లో ఆశిస్తున్నదేమిటో తెలుసుకోవచ్చు. సంస్థ యాజమాన్య టీం గురించి, సంస్థ కార్యకలాపాల సామర్థ్యం, నిర్వహణ సిద్ధాంతాలు, విజన్‌- మిషన్‌ల గురించి తెలుసుకోవాలి. మార్కెట్‌లో సంస్థ గురించిన తాజా సమాచారం తెలుసుకోవడంవల్ల కంపెనీ విలువలపై అవగాహన వస్తుంది.

నిజానికి అభ్యర్థులు పరిశోధించి తెలుసుకున్న ప్రతి అంశమూ సెలెక్షన్‌ క్రమంలో ఎదురుకాకపోవచ్చు. అయితే, సంస్థ పరంగా ఎంత ఎక్కువ సమాచారం అందుబాటులో ఉంటే అంత అవగాహన, స్పష్టత పెరుగుతాయి. ఇవి విజయావకాశాలను మెరుగుపరుస్తాయి.

ఇవి పాటిస్తే.. నెగ్గొచ్చు

1. ఒక పనిని ఒక వ్యక్తి విజయవంతంగా చేసినప్పుడు అంతే విజయవంతంగా మనం ఎందుకు చేయలేమన్న భావనను కలిగి ఉండాలి. దానికోసం కృషి చేయాలి.  

2. ఎంచుకున్న వృత్తిలో ఎదగాలంటే ఆ రంగానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి కనీసం రోజుకు ఒక గంట ప్రత్యేకంగా కేటాయించడం. రోజువారీ కార్యక్రమాల్లో సమయం సరిపోకపోతే రోజూ గంట ఆలస్యంగా నిద్రపోవడమో,  గంట త్వరగా నిద్ర లేవడమో చేయవచ్చు. ఆదా అయ్యే ఈ అదనపు సమయాన్ని ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల అనుకున్న స్థాయి విజయం సాధించవచ్చు.  

3. నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహకరించే మీటింగులు, సెమినార్లను గుర్తించి వాటికి హాజరవడం. ముఖ్యమైన విషయాలను నోట్‌ చేసుకోవడం, ఆ పాయింట్లను వృత్తిగత జీవితానికి అన్వయించడం.  

4. అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన విషయాలను అనుసరించడం.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గణాంక శాస్త్రంలో ఘనమైన కోర్సులు

‣ మరచిపోకుండా నేర్చుకోవాలంటే...!

‣ SSC CHSL: ఇంటర్‌ ఉంటే.. కొట్టేయవచ్చు కేంద్రం కొలువు!

‣ అటవీ ఉత్పత్తుల వృద్ధిలో నైపుణ్యం పెంచే కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-02-2022


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం