• facebook
  • whatsapp
  • telegram

క్యాంపస్‌ కొలువు కొట్టాలంటే?

పెంచుకోవాల్సిన నైపుణ్యాలపై నిపుణుల సూచనలు

మొదటి ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రభావవంతమైనది. ప్రతిభ, సరైన ప్రణాళిక ఉంటే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సంభవమే. వందలమంది విద్యార్థులు హాజరయ్యే ఈ సెలక్షన్స్‌లో పదుల్లో మాత్రమే ఎంపికవుతారు. కొన్నిసార్లు ఇంకా తక్కువ సంఖ్య ఉంటుంది. ఆ విజేతల్లో మీరూ ఒక్కరుగా ఉండాలంటే అందుకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవలసి ఉంటుంది!  

ప్రాంగణ నియామకాలకు హాజరయ్యే విద్యార్థులు ఆయా సంస్థల వివరాలు సేకరించి తగిన విధంగా సిద్ధమవుతుంటారు. దీనికంటే ముందు మీ బలాలు, బలహీనతలు, మీకున్న అవకాశాలను అంచనా వేసుకుని, ఆ సంస్థ అంచనాలను మీరు అందుకోగల సామర్ధ్యాన్ని ప్రశ్నించుకోండి. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని, ఆ సంస్థకు మీరు తగిన అభ్యర్థినని నిరూపించే నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి. ఆ సంస్థ ఆశయాలూ, దార్శనికతలను మీలో వ్యవస్థీకృతం చేసుకోవడం ఒక నైపుణ్యం. సహజంగా విద్యార్థులు తమతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యే ఇతర అభ్యర్థులతో పోల్చుకుని వారికంటే కాస్త మెరుగ్గా ఉంటే చాలనుకుంటారు. దీంతో పరిధిని కుదించుకుంటారు. మరికొన్నిసార్లు ఇతర పోటీదారులను అనుసరిస్తూ, వారి కదలికలను గమనిస్తూ సాధన చేస్తుంటారు. అలా కాకుండా మీ కెరియర్‌ లక్ష్యాలకు అవసరమైన సమయపాలన, యాజమాన్య పద్ధతులు నిర్దేశించుకుని అందుకు అవసరమైన వాస్తవ ప్రణాళికను రూపొందించుకోవాలి. 

మీకో వ్యూహం  

సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటూ క్యాంపస్‌ సెలెక్షన్స్‌కు మీకంటూ ఓ ప్రత్యేక వ్యూహాన్ని తయారుచేసుకోండి. మొదటి చర్యగా సంస్థలు నిర్వహించే వివిధ పరీక్షలకు ఎలా తయారవ్వాలో తెలుసుకోండి. ఒక్కో సంస్థకు ఒక్కోరకమైన సెలక్షన్‌ పద్ధతి ఉంటుంది. పరీక్షల నాణ్యత స్థాయిలో కూడా సంస్థకూ సంస్థకూ తేడాలుంటాయి. గతంలో ఎంపికైనవారి అనుభవాల నుంచి విషయాలు సేకరించి మీ నైపుణ్యాలకు తగిన ప్రణాళిక తయారుచేసుకోండి. ప్రతి నైపుణ్యంలోనూ మీరు శిక్షణ తీసుకుంటారు. అయినా, ఎంతో కొంత లోపం ఉంటుంది. ఆ లోపాన్ని సరిగా అర్థం చేసుకుని, గ్యాప్‌ను గుర్తించాలి. తŸగిన సాధన చెయ్యండి.  

మూలాలను మరవద్దు  

చాలామంది విద్యార్థులు ఫైౖనల్‌ ఇయర్‌కు వచ్చేసరికి చాలా విషయాల్లో ప్రాథమిక సమాచారాన్ని మరచిపోతుంటారు. తొలి, రెండో సంవత్సర సబ్జెక్టులు గుర్తుండవు. మీది ఏ సబ్జెక్టు అయినా ప్రాంగణ నియామకాలకు హాజరయ్యే సమయానికి ఆ సబ్జెక్టులను మననం చేసుకోండి. సహజంగా తొలి రెండు సంవత్సరాల అకడమిక్‌ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించే దిశగా సెలెక్టివ్‌గా చదువుతారు. అంటే అక్కడ అకడెమిక్‌ మార్కులు సాధించడమే ప్రధాన లక్ష్యం. ప్రాంగణ ఎంపికలకు ఇది సరిపోదు. పరిజ్ఞానాన్నీ, నైపుణ్యాలనూ మరింతగా మెరుగుపరచుకుంటేనే ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి. 

భిన్నంగా..

ఇతరులు చేయని పని మీరు చేస్తూ ఇతరులకంటే భిన్నంగా ప్రయత్నించండి. విద్యార్థిదశలోనే కొన్ని నూతన విషయాలను ఆవిష్కరించటం, పరిశోధనలపై దృష్టి సారించటం మేలు చేస్తుంది. రెజ్యూమేలో నూతనత్వం కనిపించేలా కొత్త అంశాలను జోడిస్తే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చు. సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడంలోనే సామర్థ్యం ఉంది. అకడెమిక్స్‌కు అతీతంగా ఏదో చేశారన్న భావన సెలెక్టర్లకు కలిగించగలగాలి. 

ఇష్టమైన అంశాలు  

ప్రతి విద్యార్థికీ ఏవో కొన్ని అంశాలు ఇష్టమైనవీ, పెట్‌ టాపిక్స్‌ అనేవి ఉంటాయి. ఇంటర్వ్యూల్లో మీకిష్టమైన సబ్జెక్టు ఏదనే చర్చ రావచ్చు. ఇది ప్రశ్న రూపంలో కావచ్చు; చర్చల రూపంలో కావచ్చు. సెలెక్టర్లు కొన్నిసార్లు లోతుగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆసక్తి ఉన్నదానిలో ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడం దీని ఉద్దేశం. దీనిననుసరించి ఇతర ఉద్యోగ అంశాల్లో మీ చొరవ, పనితీరు అంచనా వేస్తారు. అందుకనే మీ అభిమాన సబ్జెక్టులో విశ్లేషణాత్మకంగా సమాచారం తెలుసుకోవటం మంచిది.

అతి విశ్వాసం  

ఎంపిక ప్రక్రియలో ఒక్కో అంశంలో విజయం సాధించి మరో ప్రక్రియలోకి ప్రవేశించే క్రమంలో ఆత్మవిశ్వాసం పెరుగుతూంటుంది. అన్ని రౌండ్లూ పూర్తయ్యేసరికి వందల మంది అభ్యర్థుల్లోనుంచి చివరికి పదుల సంఖ్యలో మిగులుతారు. ప్రతి దశలోనూ విజయం సాధిస్తున్న మీలో క్రమేపీ ఆత్మవిశ్వాసం పెరుగుతుండడం సహజం. అయితే ఇది అతి విశ్వాసంగా మారకుండా జాగ్రత్తపడాలి. చివరిదైన హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో అతివిశ్వాసం ఉన్నవారిని తిరస్కరించే అవకాశాలు ఎక్కువ. బాగా నైపుణ్యాలున్నవారు కూడా హెచ్‌ఆర్‌ రౌండ్‌లో ఫెయిల్‌ అవుతుండేది ఇందుకే! విశ్వాసంతో ఉండకూడదని కాదు, చిరునవ్వుతో కూడిన ఆత్మవిశ్వాసం చాలు.

కాలేజీ సొసైటీల్లో సభ్యత్వం తీసుకోవాలి. కల్చరల్, స్పోర్ట్స్‌ లాంటి వివిధ సంఘాల్లో చురుగ్గా పాల్గొంటే స్వీయ విలువను పెంచుకోవచ్చు.  

ఇంటర్న్‌షిప్‌లో చేరి, దాన్ని పద్ధతి ప్రకారం పూర్తిచేయాలి. కార్పొరేట్‌ పరిజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గణాంక శాస్త్రంలో ఘనమైన కోర్సులు

‣ మరచిపోకుండా నేర్చుకోవాలంటే...!

‣ SSC CHSL: ఇంటర్‌ ఉంటే.. కొట్టేయవచ్చు కేంద్రం కొలువు!

‣ అటవీ ఉత్పత్తుల వృద్ధిలో నైపుణ్యం పెంచే కోర్సులు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 21-02-2022


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం