• facebook
  • whatsapp
  • telegram

కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

జాబ్‌ స్కిల్స్‌ 2024

సర్టిఫికేషన్‌ ఎప్పుడు చేశామని కాదు... ఎంతగా సర్టిఫికేషన్‌ నైపుణ్యాన్ని గడించామన్నదానిపై ఉద్యోగ సాధన ఆధారపడివుంటుంది 
 


ఐటీ రంగంలో సాటిలేని ఉద్యోగిగా రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాల్లో మేటి కావడమే కీలకం. ఇవే కెరియర్‌ ద్వారాలు తెరుస్తాయి. ముందుకు నడిపిస్తాయి. పదోన్నతులు కల్పిస్తాయి. పరపతిని పెంచుతాయి. ఈ నైపుణ్యాలే సుందర్‌ పిచాయ్‌ను ప్రొడక్ట్‌ మేనేజర్‌ స్థాయి నుంచి 20 ఏళ్లలో నాలుగు ప్రమోషన్లతో గూగుల్‌ సీఈఓగా నిలిపాయి. నైపుణ్యాలు అందించే నజరానా ఇదీ!  


సాంకేతిక పరిజ్ఞానం పీట వేసుకొని స్థిరంగా ఉండదు. జలజల పారే సెలయేరులా పరుగెడుతుంటుంది. నేడు ధగధగ మెరిసే టెక్నాలజీ ఏడాది తిరిగేసరికి మసకబారుతుంది. ఈరోజు ప్రపంచాన్ని తనచుట్టూ తిప్పుకుంటున్న సాంకేతికత రెండేళ్లు పోయేసరికి వెలవెలబోతుంది. ప్రజల ఆలోచనా సరళి, అభిరుచి, అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత రూపుదిద్దుకుంటుంది. మారుతున్న టెక్నాలజీలను ఒడిసిపట్టుకోవాలంటే పరిష్కారం.. ఎప్పటికప్పుడు పరుగెడుతున్న టెక్నాలజీని కొత్త కోర్సులతో సొంతం చేసుకోవడమే. దీనికి మార్గమే సర్టిఫికేషన్‌.  


  ఏమిటీ సర్టిఫికేషన్‌?    

ఒకసారి బేసిక్‌ డిగ్రీ చేసి ఉద్యోగంలోకి ప్రవేశించాక మారుతున్న టెక్నాలజీపై పట్టు సాధించేందుకు పదేపదే మళ్లీ కాలేజీకో, యూనివర్సిటీకో పరుగెత్తే అవకాశం ఉండదుగా. అందుకే ఉద్యోగి/ ఉద్యోగార్థి తాను ఉన్నచోటే తనకు అనుకూల సమయంలో అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పించేవే సర్టిఫికేషన్స్‌. ఇవి చేయడం వల్ల తనకు రోజూ సవాలు విసురుతున్న టెక్నాలజీని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు మార్కెట్‌లో మెరుస్తున్న టెక్నాలజీ సామర్థ్యంతో ఎంపిక పరీక్షలకు సలక్షణంగా కూర్చోవచ్చు.  


ఐటీ నిపుణుడిగా రాణించాలని అభిలషిస్తున్న విద్యార్థి సర్టిఫికేషన్స్‌ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఐటీ స్కిల్స్‌- 2023 నివేదిక వెల్లడించింది. సర్టిఫికేషన్స్‌ ఇచ్చే వ్యక్తిగత ప్రయోజనాలు, వేతనాలలో వృద్ధిపై చేసిన సర్వేలో వీటివల్ల తమ పనితీరులో మెరుగైన ఫలితాలు వచ్చాయని 62 శాతం మంది వెల్లడించారు. తమకు నిర్దేశించిన ఉద్యోగ విధులను మునుపటి కంటే త్వరితగతిన చేయగలుగుతున్నామని 42 శాతం మంది సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీ తమ పనితీరులో మెరుగుదలను గుర్తించి వేతనం పెంచిందని 20 శాతం మంది సంబరపడ్డారు. మొత్తంమీద సర్టిఫికేషన్‌ వల్ల నైపుణ్యాలు పెరిగి సానుకూల ఫలితాలే వస్తున్నాయని తేలింది. 


  కొలువుకు సోపానాలు   

ఐటీ ఉద్యోగ సాధనలో సర్టిఫికేషన్లు సోపానాలుగా నిలుస్తున్నాయి. అయితే కొన్ని సర్టిఫికెట్‌ కోర్సులను విద్యార్థి దశలో ఉండగానే చేసే వీలుండగా మరికొన్నింటిని సంబంధిత ఐటీ జాబ్‌లో కాస్తో కూస్తో అనుభవం గడించాక చేయాలి. సర్టిఫికేషన్‌ ఎప్పుడు చేశామని కాదు...ఎంతగా సర్టిఫికేషన్‌ నైపుణ్యాన్ని గడించామన్నదానిపై ఉద్యోగ సాధన ఆధారపడివుంటుంది. ఐటీ నైపుణ్యాలు పెంచే కొన్ని సర్టిఫికేషన్లను పరిశీలిద్దాం. 


  ఏడబ్ల్యూఎస్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌  

కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఆధ్వర్యంలోని అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ వ్యవస్థపై పట్టు కోసం ఈ కోర్సు నిర్వహిస్తున్నారు. ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ను అర్థం చేసుకొని, ఈ వ్యవస్థ ఆనుపానులు తెలుసుకొని, ఈ వేదికతో డేటా అనుసంధానం, డేటా నిర్వహణ, నియంత్రణ, అనుకోని అవాంతరాల పరిష్కారం ఈ సర్టిఫికెట్‌ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. అయితే సైబర్‌ సెక్యూరిటీ విధులు నిర్వహించి ఉంటే ఈ కోర్సు చేసేందుకు మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కోర్సు చేసిన ప్రొఫెషనల్‌ను ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ వ్యవస్థలో డేటా సెక్యూరిటీ నిపుణుడిగా మార్కెట్‌ పరిగణిస్తుంది. 


  సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజర్‌   

సైబర్‌ ప్రపంచంలో డేటా చౌర్యం నానాటికీ ఎక్కువ అవుతున్నందున ఈ డొమైన్‌లో సర్టిఫైడ్‌ కోర్సులు రూపుదిద్దుకుంటున్నాయి. కోట్ల రూపాయల విలువైన డేటా.. సైబర్‌ దాడులకు గురవ్వకుండా చూసేందుకు పెద్ద కంపెనీలు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో ప్రత్యేక విభాగాలు ఏర్పర్చుకుంటున్నాయి. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజర్‌ నాయకత్వంలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల బృందం కంపెనీ డేటాకు కాపలా కాస్తుంది. సైబర్‌ దాడులు, చౌర్యం పెరుగుతున్నకొద్దీ సైబర్‌ సెక్యూరిటీ కోరుకునే కంపెనీలు ఎక్కువవుతున్నాయి. ఇలా కంపెనీలు పెరుగుతున్నకొద్దీ సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజర్‌ సర్టిఫికేషన్‌ కోర్సు ప్రాధాన్యం పెరిగింది.


  అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ సర్టిఫైడ్‌ సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌   

అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ (ఏడబ్ల్యూఎస్‌) క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థను ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు వినియోగించేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఈ డొమైన్‌లో నిపుణుల అవసరం పెద్దఎత్తున ఏర్పడబోతోంది. కంపెనీ ఐటీ వ్యవస్థను ఏడబ్ల్యూఎస్‌తో అనుసంధానించడంలో ఎదురయ్యే సవాళ్ల నుంచి.. నిర్వహణలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను సర్టిఫైడ్‌ సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌ బాధ్యత వహించాలి. పొజిషన్‌ ప్రత్యేకత, ఇందులో ఇమిడివున్న బాధ్యత రీత్యా కంపెనీలు మంచి ప్యాకేజీ ఆఫర్‌ చేస్తున్నాయి.  


  గూగుల్‌ క్లౌడ్‌ ప్రాఫెషనల్‌- క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌   

డేటా నిల్వతో సహా ఐటీ సేవలకు క్లౌడ్‌ వ్యవస్థను నిర్మించిన గూగుల్‌ ఈ టెక్నాలజీలో సాంకేతిక నిపుణులను ప్రపంచవ్యాప్తంగా తయారుచేసేందుకు గూగుల్‌ క్లౌడ్‌ ప్రొఫెషనల్స్‌ కోర్సును తీసుకువచ్చింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కోర్సుల్లో నంబర్‌ వన్‌ స్థానంలో రారాజులా వెలుగుతున్న గూగుల్‌ క్లౌడ్‌ ప్రొఫెషనల్‌ చేస్తే మంచి జీతంతో క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌గా స్థిరపడవచ్చు. పేరుకు తగ్గట్టే ఈ కోర్సులో గూగుల్‌ క్లౌడ్‌ వ్యవస్థాపన, విస్తృతి, సౌకర్యాలు, వినియోగంపై అవగాహన కలుగుతుంది. తాను ప్రవేశించే/ పనిచేస్తున్న కంపెనీ అవసరాలను క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు తగ్గట్టు మలచడం, ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం వంటి నైపుణ్యాలను ఈ సర్టిఫికేషన్‌ ద్వారా సొంతం చేసుకోవచ్చు. 


  గూగుల్‌ క్లౌడ్‌ అసోసియేట్‌   

క్లౌడ్‌ వేదికపై వాణిజ్య పరిష్కారాలను అన్వేషించే నిపుణుల కోసం గూగుల్‌ ప్రత్యేకంగా గూగుల్‌ క్లౌడ్‌ అసోసియేట్‌/ గూగుల్‌ ఇంజినీర్‌ అనే ఈ సర్టిఫికెట్‌ కోర్సును తీసుకువచ్చింది. క్లౌడ్‌ వేదికపై వివిధ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్ల మోహరింపు, క్లౌడ్‌ మౌలిక సదుపాయాలను విస్తృతపరచడం, క్లౌడ్‌ ఆధారిత విధానాల సెక్యూరిటీ విశ్వసనీయతపై నమ్మకం కలిగించడం వంటి వివిధ అంశాలు ఈ సర్టిఫికెట్‌ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. క్లౌడ్‌ సొల్యూషన్స్‌పై అవగాహన, క్లౌడ్‌ వేదికపై వీటిపై పనిచేయగల ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. గూగుల్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌పై కనీసం ఆరునెలలు పనిచేసిన అనుభవం ఉంటే కోర్సు చేయడానికి సౌకర్యంగా ఉంటుంది.  


  ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఆడిటర్‌  

కంపెనీ సాంకేతిక, న్యాయ, నిర్వహణ బృందాల మధ్య ఐటీ- ఆడిటర్‌ సమన్వయకర్తగా ఉంటాడు. కంపెనీ ప్రయోజనాలరీత్యా గోప్యతను పరిరక్షిస్తూ ఏవిధమైన రిస్క్‌లు ఎదురుకాకుండా పర్యవేక్షిస్తుంటాడు. ఈ లక్ష్యంతో టెక్నికల్, లీగల్‌ బృందాలకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, మార్గదర్శకాలను ఐటీ ఆడిటర్‌ పంపిస్తుంటాడు. ఐటీ సర్టిఫికేషన్లలో దీన్ని పురాతనమైనదిగా పరిగణిస్తుంటారు. 1978 నుంచి నిపుణులు గౌరవప్రదంగా భావించే ఈ సర్టిఫికేషన్‌ ద్వారా వివిధ సామ   ర్థ్యాలు అలవడతాయి. ఐటీ ఆడిటింగ్‌ ప్రక్రియ, ఐటీ గవర్నెన్స్‌ మేనేజ్‌మెంట్, ఐటీ సిస్టమ్స్‌ నిర్వహణ, ఐటీ ఆస్తుల పరిరక్షణపై ఈ కోర్సు అవగాహన కల్పిస్తుంది.  


  బ్లాక్‌ చెయిన్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌  

సైబర్‌ సెక్యూరిటీకి గీటురాయి వంటి బ్లాక్‌ చెయిన్‌ సెక్యూరిటీ నిపుణులకు మంచి డిమాండ్‌ ఉంది. కంపెనీ డిజిటల్‌ ఆస్తులు, సమాచారానికి హాని కలిగించే దాడుల నుంచి కాపాడగలిగే బ్లాక్‌ చెయిన్‌ ప్రొఫెషనల్స్‌ ఉన్నారా అని కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చే క్లయింట్లు అడుగుతున్నారంటే ఈ ప్రొఫెషనల్స్‌ అవసరాన్ని అర్థం చేసుకోవచ్చు. బ్లాక్‌ చెయిన్‌ ఆర్కిటెక్ట్, డెవలపర్స్, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్స్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్‌ హోదాల్లో స్థిరపడాలనుకునే ప్రొఫెషనల్స్‌కి ఎంతో విలువైన ఈ సర్టిఫికేషన్‌ ప్రయోజనకరం.  


  గూగుల్‌ క్లౌడ్‌ ప్రొఫెషనల్‌ - డేటా ఇంజినీర్‌   

క్లౌడ్‌ వేదికపై రాణించగల మరో సర్టిఫికేషన్‌ ఇది. డేటా ఇంజినీర్, డేటా సైంటిస్ట్, డేటా స్పెషలిస్ట్‌గా ఉద్యోగ సాధనకు విద్యార్థికి గల ప్రాథమిక పట్టాతో పాటు ఈ సర్టిఫికేషన్‌ ఆదుకుంటుంది. మంచి శాలరీ ప్యాకేజీకి తీసుకెళుతుంది. సమాచారమే సంపద సృష్టికి మూలమవుతున్న నేటి తరుణంలో ఈ సర్టిఫికేషన్‌ ద్వారా క్లౌడ్‌ వేదికపై విశ్వసనీయ, ఆధారపడతగ్గ డేటాను సృష్టించడంతోపాటు పరిరక్షణ, వినియోగంపై నైపుణ్యాలు సాధించవచ్చు. డేటా సేకరణ, ప్రక్షాళన, పరిరక్షణ, వివిధ డేటా శ్రేణుల రూపకల్పన, డేటా ఆధార నిర్ణయాలకు అనుగుణంగా డేటా సిద్ధపరిచే నైపుణ్యాలు నేడు పెద్ద కంపెనీలకు నిత్యం అవసరమవుతున్నాయి. ఈ సామర్థ్యాలున్న అభ్యర్థుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి. తగిన సర్టిఫికేషన్‌తో సిద్ధంగా ఉన్నవారిని పిలిచి పెద్ద పీట వేస్తున్నాయి. 


  అష్ట ప్రయోజనాలు 


బేసిక్‌ డిగ్రీతో పాటు అభ్యర్థి తన నైపుణ్యాలు పెంచుకునేందుకు చేసే సర్టిఫికేషన్‌ వల్ల ప్రధానంగా 8 ప్రయోజనాలున్నాయి. సర్టిఫికేషన్‌ నేర్చుకునే కాల వ్యవధి తక్కువే గానీ సముపార్జించుకునే స్కిల్స్‌ రీత్యా ఎంతో విలువైనదిగా పరిగణిస్తుంటారు.  

1 విశ్వసనీయత: ఉద్యోగార్థి నైపుణ్యాలకు సర్టిఫికేషన్‌ విశ్వసనీయతను కలిగిస్తుంది. రెజ్యూమెలో ఉద్యోగార్థి ముఖ్యంగా ఫ్రెÆషర్‌ పేర్కొనే నైపుణ్యాలకు సర్టిఫికేషన్‌ గీటురాయిగా నిలుస్తుంది. అభ్యర్థి ఐటీ సామర్థ్యాలకు సర్టిఫికేషన్లు యోగ్యతా పత్రాలుగా నిలుస్తాయి.  

2 పోటీలో ముందు: సర్టిఫికేషన్‌ ఉద్యోగార్థిని మిగతా పోటీదారుల్లో ముందు నిలబెడుతుంది. పోటీపడే వారందరివీ ఒకేతరహా విద్యార్హతలైనప్పుడు సర్టిఫికేషన్‌ చేసినవారు మిగతా వారికంటే భిన్నంగా నిలుస్తారు.  

3 ఎక్కువ ప్యాకేజీ: పోటీపడిన ఇతరులకంటే సర్టిఫికేషన్‌ చేసి, అదనపు నైపుణ్యాలు సాధించిన అభ్యర్థులను హైర్‌ చేసేటప్పుడు కంపెనీలు అనివార్యంగా సాధారణంగా ఇచ్చేదానికంటే ఎక్కువ ప్యాకేజీ ఆఫర్‌ చేస్తాయి. వీరిని ప్రత్యేకంగా చూస్తాయి. 

4 నెట్‌వర్క్‌ విస్తరణ: ఒక్కో సర్టిఫికేషన్‌ చేసినకొద్దీ కొత్త ప్రొఫెషనల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే. నూతన పరిచయాలు ఏర్పడతాయి. నెట్‌వర్క్‌ విస్తరిస్తుంది. ఉదాహరణకు ఏఐలో మేలైన సర్టిఫికేషన్‌ చేస్తే.. ఆ నైపుణ్యమున్న కొత్త ప్రొఫెషనల్స్‌తో పరిచయాలు చిగురిస్తాయి. కెరియర్‌ ఉన్నతికి ఇది ఉపయోగపడుతుంది.  

5 వృత్తిపరమైన సంతృప్తి: ప్రాథమిక డిగ్రీని ఒక్కసారే చేస్తాం. కానీ సర్టిఫికేషన్స్‌ని నైపుణ్యాలు పెంచుకోవాలనుకున్నప్పుడల్లా చేయవచ్చు. దీనివల్ల నిర్వర్తించే వృత్తిపరమైన బాధ్యతల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతమవుతుంది. వృత్తిపరమైన సంతృప్తి ఉద్యోగ జీవితంలో కొత్త ఉత్సాహం తీసుకొస్తుంది.  

6 పటిష్ఠమైన రెజ్యూమె: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్వేషణలో పటిష్ఠమైన రెజ్యూమె తిరుగులేని బాణం. కొత్త సర్టిఫికేషన్లు...కొత్త నైపుణ్యాలు... రెజ్యూమెను పుష్టికరంగా రూపొందిస్తాయి. సర్టిఫికేషన్లతో మెరిసే రెజ్యూమెతో మార్కెట్‌లో అగ్రగామి కంపెనీలను ఆకర్షించవచ్చు. ఈతరహా రెజ్యూమెలు హెచ్‌ఆర్‌ మెయిల్స్‌లో మిలమిలా మెరుస్తాయి.  

7 మదింపులో ముందడుగు: చాలా కంపెనీలు ఇటీవలికాలంలో తమ ఉద్యోగుల నైపుణ్యాలను మూడో పక్షం ద్వారా మదింపు చేయిస్తున్నాయి. ఈ తరహా మదింపులో కొత్త సర్టిఫికేషన్లతో నూతన నైపుణ్యాలు సొంతం చేసుకున్న ఉద్యోగి మిగతా వారికంటే ముందంజలో నిలుస్తాడు. యాజమాన్యపు దృష్టిలో ఇటువంటి ఉద్యోగికి ప్రత్యేకత ఉంటుంది.  

8 విభిన్న నైపుణ్యాలు: బేసిక్‌ డిగ్రీ ప్రాథమికంగా పునాది వేస్తే.. మార్కెట్, ఉద్యోగ అవసరాల కోసం చేసే సర్టిఫికేషన్లు ఆ పునాదిపై వేసే భవనాల వంటివి. ఈ నైపుణ్యాలు మంచి ఉద్యోగావకాశాన్ని తీసుకు రావడమే కాదు.. కెరియర్‌కు భద్రత కల్పించి, కంపెనీల్లో రాణింపు తెస్తాయి. 


- యస్‌.వి. సురేష్‌

సంపాదకుడు, ఉద్యోగ సోపానం
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

Posted Date: 09-07-2024


 

నైపుణ్యాలు

మరిన్ని