• facebook
  • whatsapp
  • telegram

యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

యూఎన్‌ఓ 2023 థీమ్‌ వివరాలుఐక్యరాజ్యసమితి ఈ ఏడాది నిర్వహించిన అంతర్జాతీయ యువజనోత్సవం (ఆగస్టు 12)కు నిర్ణయించిన థీమ్‌.. ‘గ్రీన్‌ స్కిల్స్‌ ఫర్‌ యూత్‌: టువర్డ్స్‌ ఏ సస్టైనబుల్‌ వరల్డ్‌’.


ఈ భూమిపై నేడు మనమిలా ఉన్నాం.. రేపు మన భవిష్యత్తు తరాలు కూడా ఇలాగే ఉండాలంటే పుడమి భద్రంగా ఉండాలి. ఇందుకు ఏ ఒక్కరో కృషి చేస్తే సరిపోదు, అన్ని రంగాల్లోనూ అన్నిచోట్లా వాతావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్న యువతా హరిత నైపుణ్యాలను అలవర్చుకోవాలి. అందుకే ఇటీవల వీటికి ప్రాముఖ్యం పెరుగుతోంది.


పచ్చదనం దిశగా అడుగులు వేయడం వాతావరణ మార్పులను తగ్గించడం మాత్రమే కాదు, స్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడానికీ ఉపయోగపడుతుంది. ఇందుకోసం కావాల్సిన ‘అవగాహన (నాలెడ్జ్‌), సామర్థ్యం (ఎబిలిటీ), విలువలు (వాల్యూస్‌), వైఖరి (ఆటిట్యూడ్‌)’ని గ్రీన్‌ స్కిల్స్‌ అంటున్నారు. భవిష్యత్తులో భూమి ఆరోగ్యానికి భరోసా కావాలంటే.. ప్రతిదీ ‘గ్రీన్‌’ కావాల్సిందే! గత పదేళ్లలో మొదలైన ఈ మార్పు రాబోయే కాలంలో మరింతగా నూతన అవకాశాలను సృష్టించబోతోంది.


వివిధ రంగాల్లో, కార్యకలాపాల్లో.. పర్యావరణానికి హాని చేసే కారకాలను తగ్గించి, మరింత హరిత ప్రక్రియలను అవలంబించడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇటువంటి ప్రక్రియలు కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు సహజ వనరులను తక్కువ ఉపయోగించుకునేలా చేస్తాయి. ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్న ‘గ్రీన్‌ టెక్నాలజీల’ను ఉపయోగించడంలో అవగాహన కూడా ఇందులో ప్రధానమైంది. భవిష్యత్తుకు భరోసానిచ్చేవి కావడంతో ఈ నైపుణ్యాలను ‘స్కిల్స్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ అని కూడా అంటున్నారు. వీటికి ఒక కోర్సు, ఒక సబ్జెక్టు అని కాకుండా ఇంటర్‌ డిసిప్లినరీ ఫోకస్‌ అవసరం.


ప్రముఖ సంస్థ లింక్డిన్‌ తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో భవిష్యత్తు అవసరాలకు సరిపడా గ్రీన్‌ స్కిల్స్‌ ఉన్న నిపుణులు లేరు. పెరుగుతున్న జనాభా, కాలుష్యానికి తగినట్టుగా పర్యావరణాన్ని కాపాడేలా మరింతమంది హరిత నైపుణ్యాలను అలవరుచుకోవాలి. ఉదాహరణకు ఒక ఫ్యాషన్‌ డిజైనరే ఉన్నారు అనుకుంటే వారు పర్యావరణ పరిరక్షణకు పాటుపడేలా మరింత ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్‌ తీసుకోవచ్చు. ట్రావెల్‌ మేనేజర్‌లు వీలైనన్ని ఎక్కువ ఎలక్ట్రానిక్‌ వాహనాలు ఉపయోగించేలా చర్యలు తీసుకోవచ్చు. రంగం ఏదైనా, పని ఏదైనా భూమికి మన వంతు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. ఇది కేవలం నైపుణ్యం మాత్రమే కాదు.. ఇది ఒక ఆలోచనాధోరణి!


ప్రభుత్వ ఆధ్వర్యంలో..

కేంద్ర ‘వాతావరణం - ఫారెస్ట్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌’ మంత్రిత్వ శాఖ ఆధ్వర్వంలో ‘గ్రీన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’ను ఇప్పటికే నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా యువతకు గ్రీన్‌స్కిల్స్‌పై అవగాహన కల్పించి ఉపాధి కల్పనకు దోహదపడటం దీని ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులెవరైనా తమ అర్హతలను అనుసరించి ఇందులో ఉన్న 25 కోర్సుల్లో దేనికైనా దరఖాస్తు చేయవచ్చు.

గత ఐదేళ్లలో హరిత నైపుణ్యాలున్న అభ్యర్థుల ఎంపిక ప్రపంచవ్యాప్తంగా అధికమైంది. వీరి వాటా 9.6 శాతం నుంచి 13.3 శాతానికి పెరిగింది. ఇది ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది. హరిత వనరులు, సుస్థిరత - సమతుల్యత రంగాల్లో.. ఉద్యోగాలకు పూర్తిస్థాయిలో హరిత నైపుణ్యాలు అవసరం అవుతాయి.


ఐటీలో..

ఇటీవల ఐటీ రంగంలోనూ హరితం అనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు హరిత విధానాలు అవలంబిస్తున్నాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్స్‌ - సర్వర్‌ అప్లికేషన్ల వర్చువలైజేషన్, డేటా సెంటర్ల ఆప్టిమైజేషన్, ఎస్‌వోఏఎస్‌ మోడళ్ల అధిక వినియోగం, రిమోట్‌ యాక్సెస్‌ వాడకం.. ఇవన్నీ ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు. 

కర్బన ఉద్గారాలను తగ్గించడం కంపెనీలు, ప్రభుత్వాల సమష్టి లక్ష్యం. ఇందుకోసం హరిత ఆలోచనాధోరణి తెలిసిన నిపుణులు కావాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో నేలను తక్కువగా వినియోగించుకోవడం, వృథా ఆహారం నుంచి ఉప ఉత్పత్తులు తయారుచేయడం, మొత్తంగా.. ప్రకృతి నుంచి తక్కువ ఉపయోగించుకుంటూ ఎక్కువ రాబట్టగలగడం ఇందులో ప్రధాన నైపుణ్యం. 

సస్టైనబిలిటీ మేనేజర్, సోలార్‌ కన్సల్టెంట్, ఎకాలజిస్ట్, ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ మేనేజర్‌.. ఇవన్నీ గతంలో అంతగా నియామకాలు లేని పోస్టులు. కానీ వీటికిప్పుడు అధిక ఆదరణ లభిస్తోంది. తిరిగి ఉపయోగించుకోగలిగిన వనరులు, వాతావరణ పరిరక్షణ, రీసైక్లింగ్‌ - వృథా నిర్వహణ, రవాణా, టెక్నాలజీ.. ఇలాంటి పలు రంగాల్లో హరిత నైపుణ్యాల అవసరం ఉంది. వ్యవసాయం, పశుపోషణ, నిర్మాణం, ఆయిల్, గ్యాస్, మైనింగ్‌.. ఇలా ప్రతి రంగంలోనూ హరిత మార్పులు జరుగుతున్నాయి. అందువల్ల విద్యార్థులు దీనికి తగిన విధంగా సన్నద్ధం కావాలి. 

కార్బన్‌ ఫుట్‌ప్రింటింగ్, సస్టైనబిలిటీ రిపోర్టింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ లా, సస్టైనబిలిటీ కన్సల్టింగ్, రేడియేషన్‌ సేఫ్టీ.. ఇలా చెప్పుకొంటూ పోతే మరిన్ని నైపుణ్యాలు హరిత జాబితాలో విద్యార్థుల కోసం వేచిచూస్తున్నాయి!


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు

‣ పీఓ కొలువుల ప్రిపరేషన్‌ ప్లాన్‌

‣ లెఫ్టినెంట్‌ హోదాలో మహిళామణులు

‣ అకడమిక్‌ యాంగ్జైటీని అధిగమిద్దాం!

‣ కేంద్రంలో 307 ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు

Posted Date: 13-09-2023