• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానానికి చుక్కాని!

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

నీళ్లలో ఎలా ఈదాలో తెలిసుండటం విజ్ఞానం. నిజంగా ఈదగలగడం నైపుణ్యం! ఈ రెండింటిలో ఏది ముఖ్యం? రెండూ అవసరమే. దేనినైనా ముందు తెలుసుకుని ఆపై నేర్చుకోవాలి. అలాగే విజ్ఞానం వేరు, విజ్ఞత వేరు. విజ్ఞానాన్ని ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుండటమే విజ్ఞత.

అణుశక్తిని వినాశానికి ప్రయోగించవచ్చు, మానవ వికాసానికీ ఉపయోగించవచ్చు. దేనికి వాడాలన్నది మానవుల విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. విజ్ఞత కొరవడి చరిత్రహీనులుగా మిగిలిపోయిన విజ్ఞానఖనులున్నారు. విజ్ఞానం పరిమితంగా ఉన్నా వివేకంగా వ్యవహరించి చరిత్ర సృష్టించినవారూ ఉన్నారు. అందుకే విజ్ఞత ఒక జీవన నైపుణ్యంగా విరాజిల్లుతోంది. విజ్ఞానానికి తోడు వివేకాన్ని సంతరించుకున్నవారిని ఈ నైపుణ్యం సమూహం నుంచి వేరుగా నిలబెడుతుంది.

తార్కిక ఆలోచనలతో..

ఎక్కడ ఎలా ఉండాలి? ఏం మాట్లాడాలి? ఎలా వ్యవహరించాలి? ఏయే సమయాల్లో ఎలా మసలుకోవాలి? ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎక్కడ తగ్గాలి? ఎక్కడ నెగ్గాలన్న తపన ఉండాలి? వీటన్నింటి సమాహారమే విజ్ఞత. ఇది ఏ పాఠ్యపుస్తకాల్లోనూ దొరకదు. ఏ కళాశాలలోనూ బోధించరు. కానీ విజ్ఞానార్జన క్రమంలో తార్కిక ఆలోచనలతో విజ్ఞతను అలవరచుకోవాలి. ఈ ప్రజ్ఞను పెంచుకోవాలి.

సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ జరుగుతుందనుకోండి. అభ్యర్థిగా ఇంటర్వ్యూ బోర్డు ముందు కూర్చున్నారు. వివిధ రంగాల్లో తలపండిన అనుభవజ్ఞులు ఇంటర్వ్యూ చేస్తున్నారు. దేశంలో అత్యున్నత సర్వీసులైన సివిల్‌ సర్వీసులకు పంపేందుకు తగిన లక్షణాలు మీలో ఉన్నాయా? లేదా? అని వారు నిశితంగా పరిశీలిస్తున్నారు. కచ్చితంగా అప్పుడు మిమ్మల్ని ఒడ్డునపడేసే గెలుపు సూత్రం విజ్ఞత. ఏ ప్రశ్నకు ఎలా స్పందించాలి? ఏమేరకు జవాబు ఇవ్వాలి? ఎక్కడ సంభాషణ కొనసాగించాలి? ఎక్కడ ముక్తసరిగా జవాబు ఇచ్చి ఊరుకోవాలి? ఎక్కడ ఆవేశం చూపాలి? ఎక్కడ ప్రశాంతత కనబర్చాలి... అన్న విజ్ఞత మీలో ఉంటే మీ విజ్ఞానానికి తోడు ఈ నైపుణ్యం వారిని మెప్పిస్తుంది. అంటే ఇలాంటి అగ్నిపరీక్షా సమయంలో విజ్ఞతే తోడు.. నీడ!

క్రాస్‌వర్డ్‌ బుక్‌స్టోర్‌ చాలామంది చూసేవుంటారు. దాని అధినేత ఆర్‌. శ్రీరామ్‌. కాలేజీ చదువును మధ్యలోనే వదిలేసి దేశంలోనే  అతిపెద్ద గొలుసు విక్రయశాలలను నిర్మించారు. దేశంలో చదివే వ్యసనాన్ని వ్యాప్తి చేశారు. ఆయన జీవితంలో ఒకానొక దశలో చూపిన విజ్ఞతే ఈ విజయానికి కారణం.

పుస్తకాలంటే ప్రేమ, భిన్నమైన అభిప్రాయాలున్న శ్రీరామ్‌ తొలుత ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థలో సాంకేతిక విషయాలు రాసే పనిలో చేరారు. చేరిన రెండు నెలల్లోనే తన జీవితంలో తాను చేయదలచుకున్న పని ఇది కాదని గుర్తించారు. ఉదయం నిద్ర లేచేటప్పుడు ఉద్యోగ ధర్మం నిర్వర్తించడానికి ఆసక్తి కలగకపోతే ఎక్కడో ఏదో తప్పిదం జరుగుతున్నట్టు విశ్వసించి విజ్ఞతతో దాన్ని వదిలిపెట్టారు. పుస్తకాల వ్యాపారం వైపు కదిలి క్రమేపీ క్రాస్‌వర్డ్‌ అనే చైన్‌ బుక్‌ స్టోర్‌ను నెలకొల్పి ప్రసిద్ధుడయ్యారు.

కర్ణాటకలో సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చిన సుధామూర్తి ఉన్నత విద్యావంతురాలై దేశంలో తొలితరం ఐటీ సంస్థ వ్యవస్థాపక బృందంలో ఒకరయ్యారు. దేశంలోని శ్రీమంతుల్లో ఒకరైనా తాను నడచివచ్చిన దారిని మరచిపోలేదు. విజ్ఞతతో సేవామార్గాన్ని ఎంచుకున్నారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ నెలకొల్పి మనసున్న మనిషిగా విశిష్ట వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నారు.

ఏం చేయాలి?

బంగారానికి గోడ చేర్పులా విజ్ఞానానికి చుక్కానిలా వినియోగపడే విజ్ఞత నైపుణ్యాన్ని అలవరచుకోవచ్చా? సాలోచనతో సాధన ద్వారా విజ్ఞత అలవరచుకునే ప్రయత్నం చేయవచ్చు.

సమన్వయం: చాలా సందర్భాల్లో మెదడు సంకేతాలు ఒకలా, మనసు చెప్పేది మరోలా ఉంటాయి. ఈ రెండింటిలో ఏది మంచిదో నిర్ణయించుకునే శక్తిని సముపార్జించుకోవాలి. రెండింటినీ సమన్వయం చేయడమో లేదా ఆయా సందర్భాల్లో రెండింటిలో దేనివైపు మొగ్గాలో నిర్ణయించుకోవడం అలవాటు చేసుకోవాలి.

విశాల దృక్పథం: విశ్వదృష్టి, మానవత్వం, లౌకిక విలువలు, వివిధ జీవన రంగాల్లో ఉన్నత ప్రమాణాలపై తగిన అవగాహన పెంచుకోవడం ద్వారా ఆర్జించిన విజ్ఞానానికి తోడు విజ్ఞత ఏర్పడుతుంది.

జీవిత చరిత్రలు:  ప్రముఖుల జీవితచరిత్రలు, వారి జీవనయానంలో వివిధ దశల్లో జరిగిన సంఘటనలు, వారి స్పందన, అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే విజ్ఞత చూపాల్సిన ఉన్నత సందర్భాలు బోధపడతాయి. అవి నిత్యజీవితంలోనూ ప్రతిబింబిస్తాయి.

గతానుభవాలు: మన గత అనుభవాలు విజ్ఞతను అలవర్చే చోదకశక్తులే. నడచివచ్చిన జీవితంలో చేదు, తీపి అనుభవాలు మనం విజ్ఞత చూపిన, మనలో విజ్ఞత కొరవడిన ఫలితాలను అవలోకనం చేసుకుంటే అద్దంలా ప్రతిబింబిస్తాయి.

సాదాసీదా మనుషులను అసామాన్యులుగా వెలుగులవైపు నడిపిన విజ్ఞత జీవన నైపుణ్యంగా విరాజిల్లుతోంది. అలవర్చుకుని, అనుకరించినవారిని అగ్రస్థానంలో నిలుపుతుంది. అగోచరమైన ఈ నైపుణ్యాన్ని గుర్తించడం, సాధన చేయడమే భవిష్యత్తు జీవితానికి రక్ష!


 

Posted Date: 25-01-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం