• facebook
  • whatsapp
  • telegram

భావ వ్యక్తీకరణ శ్రుతి తప్పితే?

 భావ వ్యక్తీకరణ ఎందుకు శ్రుతి తప్పుతుంది? అపార్థాలకు దారి తీస్తుంది? ఎందుకు తప్పు అర్థాన్ని సూచిస్తుంది? ఇది సంబంధాలను ఏవిధంగా ప్రభావితం చేస్తుంది? ఆశించిన ఫలితాన్ని ఎలా అడ్డుకుంటుంది  ?

''నువ్వేం చెప్పావన్నది కాదు, నాకేం అర్థమైందన్నది ముఖ్యం" - ఈ ఒక్క వాక్యంలో ఎంతో అర్థం దాగుంది, గమనించండి.

1. సహోద్యోగితో కలిసి మీరు నిర్వహిస్తున్న ఒక ప్రాజెక్టు విషయమై గత వారం మీ ఇద్దరికీ ఒక మీటింగ్ జరిగింది. సమాచారం (data) అతను సేకరిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. ఈ వారం మీరిద్దరూ కలిసినప్పుడు ''అదేమిటి, నువ్వే డేటా అంతా సేకరిస్తున్నానని నేననుకుంటున్నానే అని అతడంటే? మీ ఇద్దరూ ఒక విషయం మీద అంగీకారానికి ముందే వచ్చి ఉంటే ఇలా జరుగుతుందా?

2. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి : ''ఈ ఉద్యోగానికి మీరు సరైన వ్యక్తి అని మీరెలా చెప్పగలరు
 

ఉద్యోగార్థి : ''నేను నా దరఖాస్తులో చెప్పానుగా, నాకు మూడేళ్ల అనుభవం ఉంది"

  ఇది సరైన జవాబా? ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కేవలం ఉద్యోగార్థి అనుభవం గురించి అడిగాడా? ఈ ఉద్యోగానికి ఎంచుకోవడంలో అతని ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడా? ఎందుకు శ్రుతి తప్పుతుంది భావ వ్యక్తీకరణ?... 

 ''నువ్వేం చెప్పావన్నది కాదు, నాకేమి అర్థం అయిందన్నదే నాకు ముఖ్యం... మొదట్లో చెప్పుకున్న ఈ వాక్యం ప్రాముఖ్యం ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా అన్నారా? 

 పోనీ ఎదుటివారు మీతో అనగా విన్నారా? మీరు బాగా మాట్లాడగలరు! చెప్పదల్చుకున్నది చక్కగానే వ్యక్తీకరించగలరు. శ్రద్ధగా వినగలరు కూడా! మంచి భాష కూడా వాడతారు. మరి..? ఏమిటి సమస్య? 

చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పడమొక్కటే ముఖ్యం కాదు. చెప్పాల్సింది చెప్పకుండా వదిలివేయడం కూడా అపార్థాలకు దారి తీయొచ్చు. ఇది కమ్యూనికేషన్‌లో చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. ఒక విషయం మీద చర్చ జరిగి ముగింపు దశకు వచ్చాక అందులో పూర్తి స్పష్టత ఉండి తీరాలి. ''అవతలివాళ్లు ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతారా? అన్న చిన్నపాటి నిర్లక్ష్యంతో వదిలేసిన స్వల్ప విషయాలు ఒక్కోసారి పెద్ద అపార్థాలకు దారితీస్తాయి; వాటిని పూర్తి వ్యతిరేక దిశలో అర్థం చేసుకోడానికి కారణమవుతాయి. 

ఇందాకటి ఉదాహరణలను విశ్లేషిద్దాం!
 

ఉదాహరణ 1: ఇక్కడ ఇద్దరు సహోద్యోగులూ ప్రాజెక్టు గురించి చర్చించారే తప్ప 'ఎవరు ఏ పని చేయాలి? అన్న విషయం మీద ఒక అంగీకారానికి రాలేదు. 'అతను చేస్తాడులే అని ఎవరికి వారే అనుకోవడం వల్ల అక్కడ అసలు పనే జరగకుండా అది ప్రాజెక్టునే దెబ్బ తీసే పరిస్థితి ఏర్పడింది.
 

ఉదాహరణ 2: ఉద్యోగార్థి దరఖాస్తుని కూలంకషంగా పరిశీలించారు కాబట్టే అతణ్ని ఇంటర్వ్యూకి పిలిచారన్నది స్పష్టం. ఈ ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి అతడికి ఉన్న ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు అడిగిన ప్రశ్న. దాన్ని సరిగా అర్థం చేసుకోవడమే సరైన కమ్యూనికేషన్. (ఇటువంటి విచక్షణతో కూడిన ప్రశ్నలకు అభ్యర్థి ఇచ్చే సమయోచిత సమాధానాలే అభ్యర్థిత్వాన్ని నిర్ణయిస్తాయి).

... ఇవీ పరిష్కారాలు!

1. సరైన వ్యక్తీకరణతో సత్సంబంధాలు : కమ్యూనికేషన్ రెండు వైపుల నుంచీ సరిగా ఉన్నప్పుడే అది ప్రభావశీలంగా ఉంటుంది. మీరనుకున్నదాన్ని అవతలివారికి వివరించడమే కాక, అది మీరు ఉద్దేశించిన రీతిలో వారు అర్థం చేసుకునేలా వివరించగలగాలి.
 

2. అపార్థాలకు తావుంటుందేమోనని ముందే ఊహించడం : ప్రతి వ్యక్తీ ఒక విషయం పట్ల తానున్న పరిస్థితులకు, పరిమితులకు లోబడి ఒక అవగాహన ఏర్పరచుకుంటాడు. అది కేవలం ఆ వ్యక్తి తాలూకు కోణం మాత్రమే! మీ కోణాన్ని వివరించేటప్పుడు అది అవతలి వ్యక్తి మరోలా అర్థం చేసుకునే అవకాశాలను ముందుగానే అంచనా వేయాలి. అపార్థాలకు తావివ్వకుండా వివరణ సిద్ధం చేసుకోవాలి.
 

3. మాటల్లో నిజాయతీ : వీలైనంతవరకూ నిజాయతీగా, నిజాలనే మాట్లాడాలి. ఇది మీ పట్ల అవతలివారిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఇంకొక ముఖ్య విషయం. ఎవరిపైన అయినా ఆరోపణ ధ్వనించేలాగానో, నిందాపూర్వకంగానో మాట్లాడటం మంచి ఫలితాలనివ్వదు. ఇది అవతలివారిలో మీపట్ల తేలిక అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. 

 అమీర్‌ఖాన్ '3 ఇడియట్స్ చిత్రం నుంచి ఒక దృశ్యాన్ని ఉదాహరిస్తాను. ఆత్మహత్యా ప్రయత్నం చేసి వికలాంగుడై, చివరకు ఆత్మవిశ్వాసంతో ఇంటర్య్యూకి హాజరైన రాజు ప్రతి ప్రశ్నకూ సూటిగా జవాబులిస్తాడు. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సంగతి దాచడు. ఆందుకు కారణం ఒక రకంగా ప్రిన్సిపలే అయినా ఆ నింద అతనిమీద వేయడు. భయం వల్ల సరిగా చదవలేకపోయానని, అందుకే ఏటా మార్కులు తక్కువగా వచ్చాయని ఒప్పుకుంటాడు. ఇంత సూటిగా, నిజాయతీగా మాట్లాడే తీరు, మనస్తత్వం తమ కంపెనీకి సరిపడదనీ, అది మార్చుకుంటే ఉద్యోగం ఇస్తామనీ కంపెనీ ప్రతినిధులు ప్రతిపాదిస్తే తిరస్కరిస్తాడు. ఆ ధోరణిని వదులుకోలేననీ, ఉద్యోగాన్నే వదులుకుంటాననీ చెప్తాడు... 

   ఇంతకుముందు వ్యాసాల్లో మనం చర్చించిన నిజాయతీ, ఆత్మవిశ్వాసం, స్వీయ అంచనా ఇవన్నీ ఈ సన్నివేశంలో ప్రతిబింబిస్తాయి, గమనించండి.
 

4. వివిధ రకాల వ్యక్తిత్వాలు : భిన్న దృక్పథాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేసినపుడు భేదాభిప్రాయాలు సహజం. అలాంటప్పుడు వ్యతిరేక దృక్పథం గల వ్యక్తితో ఏర్పడే భేదాభిప్రాయాల మీద కంటే అనుకూల దృక్పథం గల వ్యక్తితో ఉండే సత్సంబంధాల మీద దృష్టి కేంద్రీకరించడం శ్రేయస్కరం. 

   ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తిని పరిశీలించి ఏర్పరచుకున్న సొంత అభిప్రాయాలకే విలువ ఇవ్వాలి తప్ప మరొకరు చెప్పిన మాటల ద్వారా ఏర్పడే అభిప్రాయానికి కాదు. 

  మన గురించి మనకున్న అంచనా ప్రకారం పరిస్థితులను అవగాహన చేసుకుంటాం. ఒక వ్యక్తి సంభాషించేటప్పుడు ఎదుటి వ్యక్తి స్వీయ అంచనా ఆధారంగా ఈ సంభాషణ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సంభాషించే వ్యక్తి సైతం స్వీయ అంచనా ప్రకారం ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో ప్రతి విషయాన్నీ అవగాహన చేసుకోవడంలో (ఇతరులను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే దానితో సహా) మన స్వీయ అంచనా ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది జాగ్రత్తగా గమనించాలి.
 

5. వినడం నేర్చుకోవాలి : సంభాషణ జరిగేటప్పుడు ప్రధానాంశం మీద దృష్టి కేంద్రీకరించాలి తప్ప అనవసర చర్చలకు దారి తీసే స్వల్ప విషయాలకు సమయం ఖర్చు చేయడం మంచిది కాదు. నిష్పాక్షికమైన, వస్తునిష్ఠ (ఆబ్జెక్టివ్) దృష్టి అలవర్చుకోవడం వల్ల చర్చాంశంలోని మంచి చెడూ రెంటినీ సమదృష్టితో చూడగలిగే సామర్థ్యం వక్తకు ఏర్పడుతుంది.
 

6. జ్ఞాపకం పెట్టుకోవడం : రోజు వారీ ఉద్యోగ బాధ్యతల్లో ఎన్నెన్నో విషయాలు గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అంత శ్రమ మెదడుకు ఇవ్వడం మంచిది కాదు. కొన్నిసార్లు ముఖ్యమైన విషయాల్ని మర్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఎవరైనా ముఖ్యమైన/ క్లిష్టతరమైన విషయం గురించి వివరిస్తే దాన్ని హార్డ్‌కాపీగా తీసుకోవడంలో తప్పులేదు. ఈ-మెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీ అయినా పంపమని అడగాలి.
 

7. హావభావాలు/ముఖ కవళికలు : మాటలతో వ్యక్తం కాని కొన్ని హావభావాలుంటాయి. వీటిలో రెండు రకాల హావభావాలను ఒకే రకంగా వ్యక్తం చేసే సందర్భాలుండవచ్చు. ఉదాహరణకు భయం, ఆశ్చర్యం వేర్వేరు భావాలు. అయినా ఒక్కోసారి ఈ రెండూ మొహంలో ఒకే రకంగా ప్రతిఫలించవచ్చు. అందువల్ల ఎదుటి వ్యక్తి మొహంలో కనిపించే భావ ప్రకటనను బట్టి అతని అభిప్రాయం ఏమై ఉంటుందో ఊహించేందుకు ప్రయత్నించక, సందేహం ఉంటే వెంటనే అడిగి తెలుసుకోవడం శ్రేయస్కరం.

  సీనియర్ మేనేజర్లు, హెచ్ఆర్ ఉద్యోగులు, రిక్రూటింగ్ ఉద్యోగులతో సహా చాలామంది అనుభవజ్ఞులైన ఉద్యోగులు తమ బాడీ లాంగ్వేజ్ మీద చక్కని నియంత్రణతో ఉంటారు. చక్కని హావభావాలతో మెరుగైన ముఖ కవళికలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునేలా ప్రవర్తిస్తారు.
 

8. మాటల్లో పలికే భావాలు : ''హాయ్ రాజూ, ఇవాళ పొద్దున నడి రోడ్డులో నా కారు ఆగిపోయింది" ; ''హలో కుమార్, ఈ విషయం తెలుసా! మైక్రోసాఫ్ట్ నుంచి నాకో ఆఫర్ వచ్చింది" 

     ఈ రెండు వాక్యాలకూ ''ఓహ్ అలాగా! నిజమా? అనేదే సహజ స్పందన. కానీ రెంటినీ గొంతులో పలికించే తీరులో తేడా ఉంటుంది, గమనించండి. ఇలాంటి భావాలు పలికించే విషయంలో సందర్భానుసారంగా ఉండేట్లు చూసుకోవాలి. ద్వంద్వార్థాలు ధ్వనిస్తే మొదటికే మోసం అని గ్రహించాలి.

Posted Date: 07-09-2020


 

భావ వ్యక్తీకరణ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం