• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

భాషాంశాలు

పదజాలం
1. కింది పదాలను సొంత వాక్యాలతో ప్రయోగించండి.
ఉదా: యాదిచేసుకును = గుర్తుచేసుకును
నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకుని బాగా నవ్వుకున్నాం.

అ) పసందు = ఇష్టం
మా పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం పసందుగా అనిపించింది.

ఆ) రమ్యం = అందమైన
మంజీర నది పరవళ్లు రమ్యమైనవి.

ఇ) క్షేత్రం = పుణ్యస్థలం
ఏడుపాయల క్షేత్రాన్ని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.

 

2. నిఘంటువు సాయంతో కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) కవి: కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి.
ఆ) క్షేత్రం: చోటు, పుణ్యస్థలం, భూమి, శరీరం.

 

3. కింది పర్యాయ పదాలకు పాఠం ఆధారంగా సరైన పదాన్ని రాయండి.
అ) ఇల్లు, గృహం -యింట
ఆ) పొగడ్త, స్తోత్రం - ప్రశంస

 

4. కింది వాక్యాల్లో గీత గీసిన పదాల్లో ప్రకృతి - వికృతులు ఉన్నాయి. వాటిని గుర్తించి ప్రకృతికి - వికృతిని, వికృతికి - ప్రకృతిని రాయండి.
అ) మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉంది
ఆ) నాది ప్రజా కవిత కద!
ఇ) మా అమ్మమ్మ రోజూ కత చెప్పుతుంది
ఈ) కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది
    ప్రకృతి - వికృతి
    భాష - బాస
    కవిత - కైత
    కథ - కత
    స్త్రీ - ఇంతి

 

5. కింది వాక్యాలు చదవండి. వ్యుత్పత్తులకు తగిన పదాలు రాయండి.
అ) అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు: గురువు
ఆ) భాషించునది: భాష

 

వ్యాకరణాంశాలు
 

1. కింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.
అ) తిరుమల రామచంద్రం సంస్కృత, ఆంధ్ర భాషల్లో పండితుడు.
జ: i) తిరుమల రామచంద్రం సంస్కృత భాషలో పండితుడు.
    ii) తిరుమల రామచంద్రం ఆంధ్రభాషలో పండితుడు.

ఆ) నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
జ: i) నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
    ii) నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.

ఇ) ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరువేరు.
జ: i) ఇంట్లో మాట్లాడే భాష వేరు.
    ii) బడిలో చదివే భాష వేరు.

 

2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.
అ) తెలుగువాళ్ల పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరచుకోవడంలేదు.
జ: తెలుగువాళ్ల పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరచుకోవడంలేదు.
ఆ) నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు.
జ: నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు ఉన్నారు.
ఇ) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు.
జ: నమాజు చదవడానికి ఎందరో వచ్చి చదివి పోతుంటారు.

 

3. కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి.
అ) అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటిపూడి వెంకటరత్నం అచ్చువేయించాడు.
జ: అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి, అచ్చు వేయించాడు.
ఆ) గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు పొందాడు.
జ: గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించి, అనేక సన్మానాలు పొందాడు.
ఇ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు.
జ: కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.

 

రుగాగమ సంధి
 

కింది పదాలను గమనించి విడదీయండి.
    అ) పేదరాలు
    ఆ) బీదరాలు
    ఇ) బాలింతరాలు
పై పదాలను విడదీస్తే ఎలా ఉంటాయో గమనిద్దాం. ఎలా మారాయో పరిశీలిద్దాం.
అ) పేద + ఆలు - పేదరాలు - పేద + ర్ + ఆలు = పేదరాలు
ఆ) బీద + ఆలు - బీదరాలు - బీద + ర్ + ఆలు = బీదరాలు
ఇ) బాలింత + ఆలు - బాలింతరాలు - బాలింత + ర్ + ఆలు = బాలింతరాలు
* పై మూడు పదాల్లో పర పదం 'ఆలు'
* పేద, బీద, బాలింత పదాలకు 'ఆలు' పరమైంది.
* పేద, బీద, బాలింత లాంటి శబ్దాలను 'పేదాదులు' అంటారు.
* పేదాది పదాలకు 'ఆలు' అనే పదం కలిసినప్పుడు 'ర్' అనే అక్షరం అదనంగా వచ్చింది.
* ఒక వర్ణం మిత్రుడిలా అదనంగా చేరడాన్ని 'ఆగమం' అంటారు. అంటే పై పదాలతో 'ర్' ఆగమంగా వచ్చింది. దాన్ని 'రుగాగమం' అంటారు.
పై వాటిని కలిపి ఇలా చెప్పవచ్చు.
* పేదాది శబ్దాలకు 'ఆలు' పరమైనప్పుడు రుగాగమమవుతుంది.
* పేదరాలు, బీదరాలు, బాలింతరాలు... ఈ మూడు పదాలను గమనిస్తే పూర్వపదం విశేషణం(గుణం), ఉత్తరపదం విశేష్యం (నామవాచకం) ఇలా విశేషణ, విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయం అంటారు.

సూత్రం 1: కర్మధారయంలో పేదాది శబ్దాలకు 'ఆలు' పరమైతే రుగాగమం అవుతుంది.

పేదాది పదాలు తెలుగు పదాలు
* ఇప్పుడు సంస్కృతానికి సమానమైన (తత్సమ) పదాలకు 'ఆలు' శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.
గుణవంత + ఆలు - గుణవంతురాలు
గుణవంత + ఆలు - గుణవంత + ఉ + ఆలు - గుణవంతు + ఆలు - గుణవంతు + ర్ + ఆలు = గుణవంతురాలు

 

2) బుద్ధిమంత + ఆలు - బుద్ధిమంతురాలు
     బుద్ధిమంత + ఆలు - బుద్ధిమంత + ఉ + ఆలు - బుద్ధిమంతు + ఆలు
     బుద్దిమంతు + ర్ + ఆలు = బుద్ధిమంతురాలు

 

3) శ్రీమంత + ఆలు - శ్రీమంతురాలు
     శ్రీమంత + ఆలు - శ్రీమంత + ఉ + ఆలు - శ్రీమంతు + ఆలు
     శ్రీమంతు + ర్ + ఆలు = శ్రీమంతురాలు
      పై మూడు తత్సమ పదాలకు 'ఆలు' కలిపినప్పుడు పూర్వపదం చివర ఉన్న 'అ' కారానికి బదులు 'ఉ' కారము వచ్చి తర్వాత రుగాగమమైంది.
దీన్ని సూత్రంగా రాస్తే

సూత్రం 2: కర్మధారయంలో తత్సమ శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న 'అ'కారానికి 'ఉ'కారము వచ్చి రుగాగమం అయ్యింది.

 


రచయిత: అంజాగౌడ్

 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం