కవి పరిచయం* డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జులై 22, 1925లో జన్మించారు.
* ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి.
* 'నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనొ అందాక ఈ భూగోళంబునకగ్గి పెట్టెదను' అని చాటారు.
దాశరథి రచనలు
1) అగ్నిధార
2) రుద్రవీణ
3) పునర్నవం
4) మహాంధ్రోదయం
5) తిమిరంతో సమరం
6) కవితా పుష్పకం
7) ఆలోచనాలోచనాలు
8) అమృతాభిషేకం
9) నవమి (నాటికలు)
10) యాత్రాస్మృతి (స్వీయచరిత్ర)
* పై రచనలు గుర్తుంచుకునేందుకు వాటి మొదటి అక్షరాలు/పదాలతో తయారుచేసిన విధం: (కోడింగ్)
'అరుపు మతి కవిత ఆలోచన అమృతంలా నవయాత్రగా ఉంది'
* సినీ గేయకవిగా ఆణిముత్యాల లాంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చారు.
* తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోశారు.
*1961లో గాలీబ్ గజళ్లను అనువదించారు.
* తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1967), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1974) అందుకున్నారు.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి.
* అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడిపారు.
* సున్నితమైన భావాలు, ప్రాచీన పద్యశైలితో ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి.
పాఠం నేపథ్యం/ ఉద్దేశం

* ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుదిశ్వాస వరకు పోరాడారు.
* దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదురించిన రణక్షేత్రం తెలంగాణ. అలాంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది.
* ఆయుధం ధరించి పోరాడినవారు కొందరైతే, అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు.
* సాహితీయోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమవుతూనే సాటివీరుల సాహసాలను పద్యాల్లో ప్రశంసించారు.
* వీరుల త్యాగాలను చరిత్ర పుటల్లోకి ఎక్కించి భావితరాలకు స్పూర్తినింపి, ఇలాంటి వీరులను కన్న తెలంగాణ తల్లి గొప్పదనాన్ని కీర్తించడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
* వీర తెలంగాణ అనే ఈ పాఠం పద్యప్రక్రియకు చెందింది.
* చారిత్రక వాస్తవిక అంశాలను వస్తువుగా తీసుకున్న ఈ పాఠంలోని పద్యాలు ఆధునిక భావ వ్యక్తీకరణలో అగుపిస్తాయి.
* వీరతెలంగాణ అనే ఈ పాఠం డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటో సంపుటి రుద్రవీణ లోనిది.
ప్రవేశిక:
సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలియలికట్ట దాటడం ఎవరూ ఊహించలేరు. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలు, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేలమీద జరిగిన విముక్తి ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ప్రత్యేక రాష్ట్ర మహోద్యమాల్లో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు.
ఆ హోరును.., తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును..., మహోన్నత త్యాగాల తీరును.... దాశరథి పద్యాల్లో విని ఉత్తేజితులమవడానికి ఈ పాఠంలోకి పయనిద్దాం...
పాఠ్యభాగం
పద్యాలు - ప్రతిపదార్థాలు
1వ పద్యం
ఉ. ఓ తెలగాణ! నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములీ
భూతల మెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె, ఓ
హో! తెలవార్చివేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుక్
ప్రీత జలేజ సూన తరళీకృత దేవనదీతరంగముల్
ప్రతిపదార్థం:
ఓ తెలగాణ | = ఓ తెలంగాణమా |
నీ పెదవులొత్తిన | = నీ పెదవులతో ఊదిన |
శంఖ మహారవమ్ములు | = శంఖం యొక్క గొప్ప శబ్దాలు |
ఈ భూతలము + ఎల్లన్ | = ఈ భూమండలం అంతా |
ఒక్కమొగి | = ఒక్కసారిగా |
బొబ్బలు | = గర్జనలు |
పెట్టినయట్లు | = పెట్టినట్లుగా |
తోచె | = ప్రతిధ్వనించాయి |
ఓహో! | = ఆహా! |
నవ + ఉదయ | = కొత్తగా ఉదయించిన |
అర్క | = సూర్యుడి |
రుక్ | = కిరణాలతో |
ప్రీత | = ప్రీతి పొందిన |
జలేజ సూన | = పద్మాలతో |
తరళీకృత | = చలించిన |
దేవనదీ | = ఆకాశ గంగ |
తరంగముల్ | = తరంగాలు |
ఒక్కొక్క దిక్కున్ | = అన్ని దిక్కులను |
తెల్లవార్చి వేసినవి | = తెల్లారేలా చేశాయి |
తాత్పర్యం: ఓ తెలంగాణమా! నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కసారిగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఆహా! ఉదయించిన సూర్యుడి కిరణాలతో, ప్రీతిపొందిన పద్మాలతో చలించిన ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెల్లవారేలా చేశాయి.
2వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
శా. తల్లీ! నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్
డుల్లెన్ కొన్నితరాలదాక! ఇపుడడ్డుల్ వోయే; సౌదామనీ
వల్లీ ఫుల్లవిభావళుల్ బ్రతుకుత్రోవల్‌జూపు కాలమ్ములున్
మళ్ళెన్! స్వచ్ఛతరోజ్జ్యల ప్రథమ సంధ్యాభానువేతెంచెడిన్
ప్రతిపదార్థం:
తల్లీ | = ఓ తెలంగాణ అమ్మా |
నీ | = నీ యొక్క |
ప్రతిభా విశేషములు | = ప్రజ్ఞావిశేషాలు |
కొన్ని తరాలదాకా | = కొన్ని తరాల వరకు |
భూతప్రేత | = చెడు శక్తుల |
హస్తమ్ములన్ | = చేతుల్లో |
డుల్లెన్ | = పడిపోయాయి (చిక్కుకున్నాయి) |
ఇపుడు | = ఇప్పుడు |
అడ్డుల్ + పోయేన్ | = అడ్డంకులు తొలగిపోయాయి |
సౌదమనీ | = మెరుపు |
వల్లీ | = తీగల |
ఫుల్ల | = విచ్చుకున్న |
విభా + ఆవళుల్ | = కాంతుల వరసలు |
బ్రతుకుత్రోవల్ | = బతుకు దారులను |
చూపు | = చూపే |
కాలమ్ములున్ | = సమయాలు |
మళ్ళెన్ | = తిరిగి వచ్చాయి |
స్వచ్ఛతర | = అత్యంత స్వచ్ఛమైన |
ఉజ్జ్వల | = ప్రకాశమంతమైన |
ప్రథమ సంధ్యా | = తొలి పొద్దు |
భానువు | = సూర్యుడు |
ఏతెంచెడిన్ | = ఉదయిస్తున్నాడు |
భావం: అమ్మా తెలంగాణమా! నీ గొప్పదనపు విశేషాలు కొన్నితరాల వరకు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగ కాంతిరేఖలు బతుకు తోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతిమంతమైన సంధ్యా సూర్యుడు మొదటిసారి ఉదయించాడు.
3వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
ఉ. నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్!
ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా
జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్
చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!
ప్రతిపదార్థం:
మాతరో | = అమ్మా |
నీ ఒడిలోన | = నీ ఒడిలో |
పెంచితివి | = పెంచావు |
నిండుగ | = నిండైన |
కోటి తెలుంగు | = కోటి మంది తెలుగు |
కుర్రలన్ | = పిల్లలను |
ప్రాయము | = యుక్తవయసు |
వచ్చినంతనె | = రాగానే |
కృపాణములు | = కత్తులు |
ఇచ్చితి | = ఇచ్చావు |
యుద్ధమాడి | = యుద్ధం చేసి |
వాజ్రేయ | = వజ్రాయుధం అంతటి కఠినమైన |
భుజాబలమ్ము | = భుజపరాక్రమాలను |
దరసింప | = చూపేలా |
జగమ్ము | = లోకం |
నవాబుతో | = నిజాం రాజుతో |
సవాల్ చేయుము | = ఎదురు ప్రశ్నించమని |
అటంటివి | = అన్నావు |
ఈ తెలుగు రేగడిలో | = తెలుగు నేలలో |
జిగి మెండు | = బలము అధికం |
తాత్పర్యం: అమ్మా! కోటిమంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి, వజ్రాయుధం అంతటి కఠినమైన భుజ పరాక్రమాలను చూపేలా నిజాం రాజుతో తలపడమన్నావు. అమ్మా ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉందో కదా!
4వ పద్యం
మ. తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా
జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము! భీ
తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్! దిశాం
చలముల్ శక్రధనుపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్
ప్రతిపదార్థం:
తెలగాణమ్మున | = తెలంగాణలో |
గడ్డిపోచయును | = గడ్డిపోచ కూడా |
సంధించెన్ | = ఎదిరించింది |
కృపాణమ్ము | = కత్తిబట్టి |
రాజలలాముండు | = గొప్పరాజుగా పేరొందిన |
అనువాని | = నిజాం రాజును |
పీచము | = గర్వం |
అడచన్ | = అణిచేలా |
సాగించె యుద్ధమ్ము | = యుద్ధం సాగించింది |
ఏమి అగునో | = ఏం జరుగుతుందో |
తెల్యంగ రాకన్ | = తెలియక పోగా |
జగము + ఎల్ల | = జగమంతా |
భీతిలిపోయెన్ | = భయపడిపోయింది |
దిశాంచలముల్ | = దిగంతాలన్నీ |
శక్రధను | = సింగిడీల |
పరంపరలతో | = ఏర్పాటుతో |
సయ్యాటలాడెన్ | = కలిసి ఆడాయి |
దివిన్ | = ఆకాశంలో |
తాత్పర్యం: ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. గొప్ప రాజుగా పేరొందిన వాడి గర్వాన్ని అణిచేలా యుద్ధం సాగించింది. ఏం జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల పరంపరలతో సయ్యాటలాడాయి.
5వ పద్యం
ఉ. నాలుగు వైపులన్ జలధి నాల్కలు సాచుచు కూరుచుండె! క
ల్లోలము రేపినారు భువిలో! నలుదిక్కుల గండికొట్టి సం
ద్రాలకు దారినిచ్చిరి! ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధా
రాలులితమ్ము కాదొడగె, రాజు రివాజులు బూజు పట్టగన్
ప్రతిపదార్థం:
నాలుగు వైపులన్ | = నాలుగు వైపుల నుంచి |
జలధి | = సముద్రం |
నాల్కలు సాచుచు | = నాలుకలు చాపుతూ |
కూరుచుండె | = కూర్చుంది |
కల్లోలము | = అలజడి |
భువిలో | = భూమిపై |
రేపినారు | = లేపారు |
నలుదిక్కులన్ | = నాలుగు దిక్కుల నుంచి |
గండి కొట్టి | = తోవ చేసుకుని |
సంద్రాలకు | = సముద్రాలకు |
దారినిచ్చిరి | = దారిని ఇచ్చారు |
ధరాతలము + ఎల్ల | = ఈ నేలంతా |
స్వతంత్ర | = స్వాతంత్య్రం అనే |
వారి ధారాలు | = నీటి ధారలతో |
ఉలితమ్ము | = తడపడం |
కా దొడగె | = అయ్యింది |
రాజు | = రాజు |
వాజులు | = సంప్రదాయాలు |
బూజు పట్టగన్ | = బూజు పట్టినట్లయ్యింది (కాలం చెల్లిపోయింది) |
తాత్పర్యం: తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతోంది. నాలుగు వైపుల నుంచి సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్య్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది.
6వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
మ. తెలగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!
ప్రతి పదార్థం:
తెలగాణా | = అమ్మా తెలంగాణా |
భవదీయ | = నీ యొక్క |
పుత్రకులలో | = పిల్లల్లో |
తీండ్రించు | = ప్రకాశించే |
వైప్లవ్య | = విప్లవాత్మకమైన |
సంచలనమ్ము | = కదలిక |
రక | = ఊరికే |
పోవలేదు | = పోలేదు |
వసుధా | = భూ మండలము |
చక్రమ్ము | = పూర్తిగా |
సారించి | = సవరించి |
ఉజ్జ్వల | = ఉజ్జ్వలమైన |
వైభాతిక | = ప్రాతకాలానికి సంబంధించిన |
భానునిన్ | = సూర్యుడిని |
పిలిచి | = పిలిచి |
దేశంబంతటన్ | = దేశమంతా |
కాంతివార్థులు | = కొత్త కాంతి సముద్రాలు |
నిండించిరి | = నింపారు |
బళా | = బాగు |
వీరు | = ఈ తెలంగాణ పిల్లలు |
వీరులు | = వీరులు |
పరార్థుల్ | = పరోపకారులు |
తాత్పర్యం: అమ్మా తెలంగాణా! నీ పిల్లల్లో ప్రకాశించే విప్లవాత్మక కదలిక ఊరికే పోలేదు. ఈ భూమండలాన్నంతా సవరించి, ఉజ్జ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి, దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులే కాదు, న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగువీరులు సుమా!
7వ పద్యం
మ. మతపైశాచి వికార దంష్ట్రికలతో మా భూమి లంఘించి మా
కుతుకల్ గోసెడి వేళ గూడ, యెటు దిక్కున్ తోచకున్నప్పుడున్
బ్రతుకే దుర్భరమైన యప్పుడును ఆంధ్రత్వమ్ము పోనాడ లే
దు, తుదిన్ గెల్చితిమమ్మ యుద్ధమున రుద్రుల్ మెచ్చనాంధ్రాంబికా!
ప్రతి పదార్థం:
ఆంధ్రాంబికా! | = ఓ తెలుగు తల్లి |
మతపైశాచి | = మతం అనే పిశాచి |
వికార దంష్ట్రికలతో | = క్రూరమైన కోరలతో |
మా భూమి | = మా నేలను |
లంఘించి | = ఆక్రమించి |
మా కుతుకల్ | = మా గొంతులు |
గోసెడి | = కోసేటప్పటి |
వేళగూడ | = సమయంలో కూడా |
యెటుదిక్కున్ | = ఏ దిక్కూ |
తోచకున్నప్పుడున్ | = తోచనప్పుడు |
బ్రతుకే | = బతకడమే |
దుర్భరమైన | = భారమైన |
అప్పుడున్ | = ఆ సమయంలో |
ఆంధ్రత్వమ్ము | = తెలుగుదనాన్ని |
పోనాడ లేదు | = కోల్పోలేదు |
తుదిన్ | = చివర |
గెల్చితిమమ్మ | = విజయాన్ని సాధించాం అమ్మా |
యుద్ధమున | = యుద్ధంలో |
రుద్రుల్ మెచ్చన్ | = రుద్రాదులు మెచ్చారు |
తాత్పర్యం: అమ్మా! మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కూ తోచనప్పుడు, బతకడమే భారమైనప్పుడు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధరంగంలో రుద్రాదులు మెచ్చేలా చివరికి విజయాన్ని సాధించాం.
8వ పద్యం
సీ: కాకతీయుల కంచు గంట మ్రోగిననాడు
కరకు రాజులకు తత్తరలు పుట్టె
వీర రుద్రమదేవి విక్రమించిన నాడు
తెలుగు జెండాలు నర్తించె మింట
కాపయ్య నాయకుండేపు సూపిన నాడు
పరరాజులకు గుండె పట్టుకొనియె
చాళుక్య పశ్చిమాశా పాలనమ్మున
కళ్యాణ ఘంటలు గణగణమనె
తే. నాడు నేడును తెలగాణ మోడలేదు
శత్రువుల దొంగ దాడికి; శ్రావణాభ్ర
మటుల గంభీర గర్జాట్టహాసమలర
నా తెలంగాణ పోవుచున్నది పథాన
ప్రతిపదార్థం:
కాకతీయుల | = కాకతీయ రాజుల |
కంచు గంట | = కంచు గంట |
మ్రోగిననాడు | = మోగినప్పుడు |
కరకు రాజులకు | = దుర్మార్గులైన శత్రురాజులకు |
తత్తరలు పుట్టె | = కలవరం పుట్టింది |
వీర రుద్రమదేవి | = వీర రుద్రమదేవి |
విక్రమించిన నాడు | = పరాక్రమించినప్పుడు |
తెలుగు జెండాలు | = తెలుగు జెండాలు |
నర్తించె | = ఆడాయి |
మింట | = ఆకాశంలో |
కాపయ్య నాయకుడు | = కాపయ్య నాయకుడు |
ఏపు సూపిననాడు | = విజృంభించినప్పుడు |
పర రాజులకు | = శత్రు రాజులకు |
గుండె పట్టుకొనియె | = గుండెలు ఆగిపోయాయి |
చాళుక్య | = చాళుక్య రాజులు |
పశ్చిమాశా | = పశ్చిమ దిక్కున |
పాలనమ్మున | = పరిపాలనలో |
కళ్యాణ | = మంగళకరమైన |
ఘంటలు | = జయ జయ ధ్వనులు |
గణగణమనె | = మోగాయి |
నాడు నేడును | = నాటి నుంచి నేటి వరకు |
తెలగాణ మోడలేదు | = తెలంగాణ ఓడిపోలేదు |
శత్రువుల | = శత్రువుల |
దొంగ దాడికి | = దొంగ దెబ్బలకు |
శ్రావణ | = శ్రావణమాస |
అబ్ర | = మేఘం |
అటుల | = లా |
గంభీర | = గంభీరమైన |
గర్జా | = గర్జనలు |
అట్టహాసము | = అలరారుతుండటం |
నా తెలంగాణ | = నా తెలంగాణా |
పోవుచున్నది | = ముందుకు సాగుతుంది |
పథాన | = మార్గాన |
తాత్పర్యం: ఇక్కడ కాకతీయ రాజుల కంచు గంట మోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణ చూపినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయ జయ ధ్వనులు మోగాయి. నాటి నుంచి నేటి వరకు తెలంగాణం శత్రువుల దొంగ దెబ్బలకు ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణ ముందుకు సాగుతూనే ఉంది.
రచయిత: జి. అంజా గౌడ్