• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వీర తెలంగాణ

'ఆలోచించండి - చెప్పండి'కి సమాధానాలు

1. ఈ భూమండలం అంతా ఎందుకు ప్రతిధ్వనించింది?
జ: తెలంగాణా పెదవులతో ఊదిన శంఖ ధ్వనులు ఎక్కువయ్యేసరికి ఈ భూమండలం అంతా ఒక్కసారిగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించింది.
 

2. బతుకు తోవ చూపే కాలం రావడం అంటే ఏమిటి?
జ: తెలంగాణలోని గొప్పదనపు విశేషాలు కొన్నితరాల దాకా దుర్మార్గుల చేతుల్లో చిక్కుకుని విముక్తి పొందాయి. అక్కడి గొప్పదనపు విశేషాలు బతికేందుకు మార్గాన్ని చూపించాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు బతకడం కోసం మార్గాన్ని చూపించాయి. స్వేచ్ఛా వాయువును పీల్చలేని జనాలు తృప్తిగా బతికే కాలం వచ్చిందని కవి తెలిపారు.
 

3. ''తెలంగాణ నేలలో ఎంత కాంతి ఉన్నదో కదా!" అని కవి ఎందుకన్నాడు?
జ: తెలంగాణా కోటి మంది తెలుగు పిల్లలను ఒడిలో పెంచింది. వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్రాయుధం లాంటి కఠినమైన భుజ పరాక్రమాలను చూపేలా నిజాం రాజుతో తలపడమంది. ఈ తెలుగు నేలలో ఎంతో బలం, కాంతి ఉన్నాయి. అందుకే ప్రజలందరూ పోరాడి విజయం సాధించారు. తెలంగాణకు కొత్త కాంతిని ఇచ్చారు.
 

4. 'గడ్డిపోచ కూడా కత్తిలా మారడం' అంటే ఏమిటి?
జ: గొప్పరాజుగా పేరొందిన నిజాం రాజు గర్వాన్ని అణిచివేసే ప్రయత్నంలో గడ్డిపోచ కూడా కత్తిలా మారింది. ఎందుకంటే ఏమీ చేతగాని వారు కూడా కత్తిలా మారి తమ యుద్ధ పటిమను చూపించారు. అంటే ఏమీ విలువ లేని గడ్డి కూడా కత్తిలా మారిందని కవి అన్నాడంటే ప్రతి వ్యక్తి, ప్రతి అంశం, ప్రతి సందర్భం.... ఇలా అన్నీ కత్తిలా మారి పనిని విజయవంతం చేశాయి.
 

5. 'నవోదయం' రావడమంటే మీరేమని అనుకుంటున్నారు?
జ: 'నవోదయం' రావడం అంటే 'కొత్త ఉదయం రావడం'. తెలంగాణ ప్రజలు ఎన్నోతరాల పాటు నవాబు చేతుల్లో బతికి అన్యాయాలు, అకృత్యాలను ఎదుర్కొని పోరాడి విజయం సాధించారు. ఆ విజయ ఫలాలు అందుకున్న సమయమే 'నవోదయం'. వారి జీవితాల్లో సరికొత్త శకం మొదలైంది. స్వచ్ఛమైన కాంతిమంతమైన సంధ్యా సూర్యుడు మొదటిసారిగా ఉదయించాడని తెలుస్తుంది. నూతన జీవితానికి తెలంగాణ ప్రజల అంకురార్పణ మొదలైందే ఈ 'నవోదయం' అని అర్థమవుతుంది.
 

6. తెలంగాణ వీరుల ప్రత్యేకత ఏమిటి?
జ: తెలంగాణ వీరులు వయసు రాగానే చేతులకు కత్తులు పట్టారు. వీరు భుజపరాక్రమాలు ఉన్నవారు. తెలంగాణ వీరుల్లో విప్లవాత్మకమైన కదలిక ఉంది. భూమండలాన్ని అంతా సవరించి ఉజ్జ్యలమైన, కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులే కాదు న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగు వీరులు.
 

7. బతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది?
జ: 'మతం' అనే పిశాచి తన క్రూరమైన కోరలతో నేలను ఆక్రమించి, గొంతు కోస్తున్నప్పుడు, ఏ దిక్కు తోచనప్పుడు బతుకు దుర్భరం అవుతుంది. మత మౌడ్యం ఆవహించిన సమయంలో మానవుడే సాటి మానవుడికి సహాయం అందించలేడు. ఆ సమయంలో బతుకు భారమవుతుంది.
 

8. ఆకాశాన జెండాలు రెపరెపలాడటం దేనికి సంకేతం?
జ:  ఆకాశాన జెండాలు రెపరెపలాడటం విజయానికి సంకేతం. ఒక జాతి వారు ఎన్నో ఏళ్లు పోరాడి ఎదుర్కొని సాధించిన ఫలాలు పొందే ఆనందంలో ఆకాశాన జెండాలు ఎగురుతాయి. త్యాగాల పునాదులపై సాధించిన విజయానికి గుర్తుగా ఆకాశంలో జెండాలు రెపరెపలాడతాయి. శౌరత్వానికి, వీరత్వానికి చిహ్నంగా జెండాలు ఎగురుతాయి. కోరిన కోరికలు సాధించే క్రమంలో జెండాలు ఎగురుతాయి.

ఇవి చేయండి

I. అవగాహన - ప్రతిస్పందన

కింది అంశాన్ని వివరించండి.

అ. 'వీరతెలంగాణ' అనే పాఠం పేరు వినగానే మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? దాశరథి తెలంగాణను 'వీర తెలంగాణ' అనడాన్ని తగిన ఉదాహరణలతో సమర్థించండి.
జ:  వీర తెలంగాణ అనే పాఠం పేరు వినగానే ఇన్నాళ్లకు తెలంగాణ వీరులను గుర్తుచేసుకునే అవకాశం వచ్చిందన్న గర్వం నాలో గొప్ప అనుభూతిని కలిగించింది. తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులు; సమ్మెలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరాహారదీక్షలు.... ఇలా అన్నీ నా కళ్లముందు కదలాడాయి. ఆనాటి కాలంలో నిజాం నవాబు చెర నుంచి తెలంగాణ విముక్తి అయిన విధం గుర్తుకు వచ్చింది.
దాశరథి తెలంగాణను వీరతెలంగాణ అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నిజాం కాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రజాకార్లు తమ ఇష్టం వచ్చినట్లుగా జనాలను భయభ్రాంతులకు గురిచేసేవారు. అయినా తెలంగాణ వీరుల త్యాగ ఫలితంగా మోక్షం లభించింది. కొమురమ్ భీం, చాకలి ఐలమ్మ లాంటివారు తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొని ప్రజలకు అండగా నిలిచారు. తనువులు చాలించి విజయం సాధించారు. అంతమంది వీరులు తెలంగాణలో ఉన్నారు కాబట్టే నిజాం నవాబును గద్దె దించారు. ప్రాణాలకు వెనుకాడక పదిమందిలో కలిసిపోయి ప్రతీకారం తీసుకున్న వీరుల వేదిక తెలంగాణ. కవులు, కళాకారులు చైతన్యం తీసుకురావడంలో ముందుండి నడిపారు. కాళోజీ, సుద్దాల హన్మంతు లాంటివారు అనేకమంది వీరులుగా మిగిలారు. ఉద్యమానికి ప్రాణం పోశారు. వీరుల స్వర్గధామం తెలంగాణ.

 

2. కింది అపరిచిత కవితను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
   తోటమాలి బలిదానం చేస్తేనే
   పువ్వులు పరిమాళాల నీనగలవు
   మానవుడు కలవాలి మానవుణ్ణి
   తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి
   ఆకాశానికి శోభ చందమామ
   మిణుగురుతో విద్యుత్ కాంతులు ప్రసరించవు
   మారాలి నేటి నాటువ్యక్తి
   కాకుంటే లేదెన్నటికి విముక్తి
   మానవుడికి మానవుడే ధ్యేయం
   మానవత్వమే మానవ జాతికి శ్రేయం
   చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
   ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం. (కవిరాజమూర్తి)

 

ప్రశ్నలు:
అ. పూలు ఎప్పుడు తమ పరిమళాలను వెదజల్లగలుగుతాయి?
జ: తోటమాలి బలిదానం చేస్తేనే పూలు తమ పరిమాళాలను వెదజల్ల గలుగుతాయి.
 

ఆ. ఎవరిని తిట్టకూడదు?
జ: కనిపించని దేవుడిని తిట్టకూడదు.
 

ఇ. ఎవరు మారాలి? ఎందుకు మారాలి?
జ: నేటి నాటువ్యక్తి మారాలి. విముక్తి కోసం మారాలి.
 

ఈ. మానవుడు ఏ విధంగా ప్రయాణం చేయాలి?
జ: మానవుడు ధరిత్రిని వెనక్కి నెట్టి ప్రయాణం చేయాలి.
 

ఉ. పై కవితకు శీర్షిక నిర్ణయించండి.
జ: పై కవితకు శీర్షిక 'ప్రబోధం'
 

ఊ. పై కవితను రాసింది ఎవరు?
జ: పై కవితను 'కవిరాజమూర్తి' రాశారు.
 

II. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
 

అ. ''తెలంగాణ గొప్పదనపు విశేషాలు కొన్నితరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి" అన్న కవి మాటలను మీరెలా సమర్థిస్తారు?
జ: సకల సంపదల కాణాచి తెలంగాణ. తెలంగాణను నవాబులు కొన్ని వందల సంవత్సరాలు పాలించారు. ప్రకృతి రమణీయతతో అలరారే జలసంపద, ఆదాయాన్ని ఇచ్చే వనరులు విరివిగా ఉండేవి. వాటిని విశేషంగా వినియోగించుకుని ఎలాంటి అభివృద్ధికి తావు ఇవ్వకుండా ప్రజలను పీడించి కష్టాలకు గురిచేశారు. అధికంగా పన్నులు వసూలుచేసి విలాసాలకు తావు ఇచ్చారు. కొన్ని తరాలు కనీస సౌకర్యాలైన కూడు, గూడు, బట్ట లేని జీవితాన్ని గడిపాయి. నవాబులు విద్య, వైద్యం లేని విధానాలు పాటించారు. వీరికి పూర్వం పాలించిన గొప్ప గొప్ప రాజుల విధానాలు, అభివృద్ధి మార్గాలు మూసుకుపోయాయి. తెలంగాణా ప్రజలు బానిసలుగా బతికారు. తెలంగాణ గొప్పదనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి అన్న కవి మాటలను నేను సమర్థిస్తాను.
 

ఆ. ''తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము" అని దాశరథి ఎందుకన్నాడు?
జ: నిజం నవాబు కాలంలో రజాకార్లు దుశ్చర్యలకు పాల్పడ్డారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. వారిని బానిసలుగా భావించి అన్ని రకాల సేవలు చేయించుకున్నారు. క్రూరమైన కోరలతో, మత మౌడ్యంతో నీచమైన పనులు చేశారు. నిజాం నవాబు గర్వంతో ప్రజలను పన్నులు వేసి పీడించాడు. ఎంతో విసిగి వేసారిన తెలంగాణా ప్రజల్లో బలహీనులైన వారు సైతం నవాబుతో యుద్ధానికి సిద్ధమయ్యారు. కనీస సామర్థ్యం లేనివారు కూడా వీరులతో చేతులు కలిపి కదనానికి సిద్ధమయ్యారు. అందుకే దాశరథి ''తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము" అని అన్నాడు.
 

ఇ. తెలంగాణాలో సంధ్యాభానుడు మొదటిసారి ఉదయించాడని కవి ఎందుకన్నాడు?
జ: నిజాం నవాబు పరిపాలనలో అస్తవ్యస్తమైన జీవితాన్ని గడిపిన తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే తెలంగాణ గొప్పదనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో ఉండిపోయాయి. వాటిని అనుభవించే స్థితిని కోల్పోయిన వారంతా ఏకమై అడ్డంకులు తొలగించుకునేందుకు పోరాటం చేశారు. బలహీనులైనా కత్తి చేతబట్టి పోరుకు సిద్ధమయ్యారు.
   విచ్చుకున్న మెరుపుతీగల కాంతి రేఖలతో బతుకు తోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన, కాంతిమంతమైన విజయం వరించింది. ఆ విజయాన్ని తెలంగాణలో సంధ్యాభానుడు మొదటిసారిగా ఉదయించాడని కవి అన్నాడు.

 

ఈ. వీరతెలంగాణ పాఠ్యాంశాన్ని రచించిన కవి రచనాశైలిని అభినందిస్తూ రాయండి.
జ: వీరతెలంగాణ అనే ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. సాహితీ యోధుడైన దాశరథి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటూ సాటివీరుల సాహసాలను పద్యాల్లో ప్రశంసించాడు.
   వీరుల త్యాగాలను చరిత్ర పుటల్లోకి ఎక్కించి భావి తరాలకు స్ఫూర్తి నింపాడు. తెలంగాణ తల్లి గొప్పదనాన్ని అద్భుతంగా వినిపించాడు.
   తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును మహోన్నత త్యాగాల తీరును పద్యాల్లో వినిపించాడు. చారిత్రక వాస్తవిక అంశాలను వస్తువుగా తీసుకుని ఆధునిక భావ వ్యక్తీకరణతో కూడిన పద్యాలు అందించాడు. ఆయన అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడిపాడు. సున్నితమైన భావుకతతో, ప్రాచీన పద్యశైలిలో ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి దాశరథి.
తెలంగాణ తల్లి శంఖారవమ్ము పూరించినయట్లుగా ప్రబోధించాడు. తెలుగు రేగడిలో జిగిమెండు అన్నమాట తెలుగుదనానికి ప్రతీక. ఇందులోని ప్రతిపద్యం భావస్ఫోరకంతో సాగుతుంది. తెలంగాణా ప్రజల శక్తిని చూపే పద్యాలు అలరిస్తాయి.

3. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ. వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి.
జ: తెలంగాణము పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కసారిగా ప్రతిధ్వనించాయి. ఉదయించిన సూర్యుడి కిరణాలతో, ప్రీతిపొందిన పద్మాలతో చలించిన ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెల్లవారేలా చేశాయి. తల్లి తెలంగాణ గొప్పదనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ రోజలు గతించి, అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతిరేఖలు బతుకు తోవను చూపే కాలం వచ్చింది. సంధ్యా సూర్యుడు మొదటిసారి ఉదయించాడు.
   తెలంగాణాలో పిల్లలు యుక్తవయస్సు రాగానే నిజాం రాజుతో తలపడ్డారు. ఈ తెలంగాణ నేలలో ఎంతో బలం ఉంది. గొప్ప రాజుగా పేరొందిన నైజాం నవాబు గర్వాన్ని అణిచేలా యుద్ధం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలు ఇంధ్రధనుస్సుల పరంపరలతో ఆకాశంలో సయ్యాటలాడాయి.
   గడ్డిపోచ కూడా కత్తిపట్టి ఎదిరించింది. తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగింది. నవాబుల ఆజ్ఞకు కాలం చెల్లించారు. తెలంగాణ పిల్లల్లో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఉంది. భూమండలాన్ని అంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్తకాంతి సముద్రాలు నింపారు. తెలంగాణా వీరులు యోధులే కాదు. న్యాయం తెలిసిన పరోపకారులు.
మతం అనే పిశాచి తెలంగాణ నేలను ఆక్రమించి గొంతులను కోస్తున్నప్పుడు, ప్రజలకు బతకడం భారమైనప్పుడు కూడా వారు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధంలో రుద్రాదులు మెచ్చేలా విజయం సాధించారు.
   తెలంగాణలో కాకతీయరాజుల కంచుగంట మోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడి విజృంభణతో శత్రురాజుల గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు జయ జయ ధ్వనులు మోగాయి.
   నాటి నుంచి నేటి వరకు తెలంగాణం శత్రువుల దొంగ దెబ్బలకు ఓడిపోలేదు. శ్రావణ మాసంలో మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా తెలంగాణా ముందుకు సాగుతూనే ఉంది.

4. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
అ. 'తెలంగాణ తల్లి' తన గొప్పదనాన్ని వివరిస్తున్నట్లుగా ఏకపాత్రాభినయం రాసి ప్రదర్శించండి.
                   లేదా
     తెలంగాణ ఆత్మకథ రాయండి.

జ: 'తెలంగాణ తల్లి' గొప్పదనంపై ఏకపాత్రాభినయం
   ప్రియమైన బిడ్డలారా! నేను మీ తెలంగాణ తల్లిని. సకల సౌకర్యాలతో సంతోషమైన జీవనాన్ని అందించే పుష్కల వనరులు నాలో ఉన్నాయి.
   ఈ గాలిలో, ఈ నేలలో ధైర్యసాహసాలు అత్యధికం.
కాకతీయ రాజుల కంచుగంట మోగినప్పుడు శత్రురాజులు హడలిపోయారు. రుద్రమ్మ పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. అలాంటి విశేష స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న వైభవాల సౌధం నేను. కానీ నిజాం నవాబు దుశ్చర్యలతో తల్లడిల్లాను.
   కళలకు కాణాచి అయిన నాలో చాలా గొప్పదనం ఉంది. కోలాటం, యక్షగానం, చిందు బాగోతం, ఒగ్గుకథ, బుర్ర కథలు తొణికిసలాడి నా వైభవాన్ని పెంచాయి. జానపద కళాకారులు నా జాగృతిని పెంచారు. పోతన నుంచి దేశపతి శ్రీనివాస్ వరకు గొప్ప గొప్ప కవులు నా ఖ్యాతిని విస్తరించారు. ఎన్‌టీపీసీ, సింగరేణి బొగ్గు గనులు, చక్కెర కర్మాగారాలు నా సిగలోని కుసుమాలు. హైద్రాబాదు నా గుండెకాయ. గొల్కొండ కోట, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, హుస్సేన్ సాగర్, అసెంబ్లీ మరెన్నో ప్రదేశాలు చూడముచ్చటైన కళాఖండాలు. సర్వమత సంక్షేమం కోసం పరితపిస్తాను.
   తెలంగాణ బిడ్డలారా సాయుధ పోరాటం చేసి నిజాం నవాబు చేతుల్లో నుంచి నాకు విముక్తి కలిగించారు. ప్రేమ, దయ, కరుణామయులైన మీరంతా ధన్యులు. నన్ను ప్రత్యేక రాష్ట్రంగా భరతమాత ముద్దుబిడ్డగా గుర్తించినందుకు మీ అందరికీ శుభాభివందనాలు. మన సంస్కృతిని కాపాడుతూ మన్ననలు తెస్తూ మరింత ముందుకు తీసుకెళతారని నా ఆశ. హరిత హారంతో పచ్చదనాల పల్లకిని తయారుచేస్తారని కోరుకుంటున్నాను. నా కోసం అమరులైన వీరులకు జోహార్లు అర్పిస్తున్నాను.

తెలంగాణ తల్లి ఆత్మకథ

   భారతావని గడ్డపై బహుముఖ ప్రజ్ఞాశాలినై, వెయ్యేళ్ల కిందటే వెలిసిన స్వర్గధామాన్ని నేను (తెలంగాణ). నేను వెలసినప్పటి నుంచి నన్ను ఏలిన రాజులు సర్వసుఖాలు పొంది, స్వర్ణమయ పాలన అందించి ప్రజలను సుఖసంతోషాలతో ఉంచారు. విశేషమైన వనరులు, నదులు, క్షేత్రాలు నా ఒడిలో అలరారాయి. నా గొప్పదనపు విశేషాలు కొన్ని తరాలపాటు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయి. నిజాం నవాబు చేసిన అకృత్యాలు, రజాకార్ల అఘాయిత్యాలు చూడలేక బాధపడ్డాను. ఆ కసితోనే పిల్లలను పెంచాను. వారి చేతులకు కత్తులను ఇచ్చి రాజుపైకి పంపి యుద్ధం చేయించాను. నా ఈ నేలకు ఎంతో బలం ఉంది.
   తెలంగాణా సాయుధ పోరాటాన్ని సాగించేందుకు కొమురమ్ భీం లాంటి యోధులను తయారు చేశాను. నవాబుపై గెలిపించాను. ఆ సమయం నన్ను ఆనందపరిచింది. నా పిల్లల్లో విప్లవాత్మకమైన కదలికలు జోరుగా ఉన్నందుకు జగమంతా భయపడిపోయింది. నా పిల్లలు వీరులు, యోధులే కాదు న్యాయం తెలిసిన పరోపకారులు.
   విమోచన ఉద్యమాన్ని ముందుకు నడిపిన వీరులకు వందనం. ధనమంతా దోచుకెళ్లిన వారి గుట్టు రట్టు చేసి విముక్తి చేసిన వారందరికీ శుభాభివందనం. నా కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారిని చూసి తల్లడిల్లాను. కళాకారులు, కవులు కదంతొక్కి కదిలిన విధం కనువిందు చేసింది. కష్టాల్లో నుంచి నవ తెలంగాణా దిశగా అడుగులు వేస్తున్నాను. హరిత తెలంగాణనై ఈ భూమికే అందంగా అవుదామనుకుంటున్నాను.
   శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు చేస్తూ నేను ముందుకు సాగుతున్నాను.


రచయిత: జి. అంజా గౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం