• facebook
  • whatsapp
  • telegram

మెయిన్స్‌లో విజయానికి మెలకువలు!

గ్రూప్‌ - 1 ప్రిపరేషన్‌ విధానం

 

 

తెలంగాణలో గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు వెలువడి జూన్‌లో మెయిన్స్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెలాఖరుకు గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ఈ తరుణంలో కీలకమైన గ్రూప్‌ - 1 మెయిన్స్‌లో విజయం సాధించేందుకు అభ్యర్థులు ఏ ముఖ్య అంశాలపై దృష్టి పెట్టాలో పరిశీలిద్దాం! 

 

1. కంటెంట్‌ నిర్వహణ

ఏ పోటీ పరీక్షకైనా కంటెంట్‌లో అభ్యర్థులకు బలమైన పట్టు లేకపోతే విజయం సాధించలేరు. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. కానీ మిగతా ఆబ్జెక్టివ్‌ పోటీ పరీక్షల్లో సిలబస్‌ మొత్తాన్ని చదవాలి. కానీ గ్రూప్‌ - 1 లాంటి డిస్క్రిప్టివ్‌ ఆధారిత మెయిన్‌ పరీక్షల్లో కంటెంట్‌ మొత్తం చదవటం సరైన నిర్ణయం కాదు. ప్రతి పేపర్‌లో ఎన్ని ప్రశ్నలు వస్తాయి. ఏ టాపిక్స్‌పై ప్రశ్నలు అడగడానికి అవకాశం ఎక్కువుంది అనే ప్రాథమిక అంచనాకు ముందు రావాలి. అలా వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని చాప్టర్లను పూర్తిగా వదిలివేయవచ్చు. లేదా ఒక చాప్టర్లో కొన్ని టాపిక్స్‌ను వదిలివేయవచ్చు. అప్పుడు ఎంపిక చేసుకున్నవాటిపై సమగ్రమైన లోతైన దృష్టి నిలపాల్సి ఉంటుంది. అలా టాపిక్‌లవారీగా చదివేటప్పుడే ఆయా టాపిక్కులపై గతంలో వచ్చిన ప్రశ్నలను పరిశీలించుకోవాలి. గత అనుభవాలను బట్టి ప్రస్తుతం ఎటువంటి ప్రశ్నలు రావటానికి అవకాశం ఉంటుందో ఊహించుకోవాలి. అలా అంచనా వేసేటప్పుడు అధ్యాపకుల, పోటీ పరీక్షల నిపుణుల, సీనియర్‌ అభ్యర్థుల అభిప్రాయాల్ని తీసుకోవడం ద్వారా సన్నద్ధతను హేతుబద్ధంగా మలుచుకోవచ్చు. 

సబ్జెక్టుల స్వభావాన్ని బట్టి కొన్ని సబ్జెక్టులు అభ్యర్థులకు ధారాళంగా మార్కులను ఇస్తాయి. కొన్ని సబ్జెక్టుల్లో ఎంత చదివినా, ఎంత బాగా రాసినా నిర్దిష్ట పరిమితి దాటి మార్కులు వచ్చే అవకాశం తక్కువ. ఉదాహరణకు చరిత్ర, భౌగోళిక, ఆర్థిక సంబంధిత విభాగాల్లో ఎంత గట్టి ప్రయత్నం చేసినా పూర్తిస్థాయిలో మార్కులు పొందడం కష్టతరం. శాస్త్ర సాంకేతికత, రాజ్యాంగం, సాధారణ వ్యాసం, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ మొదలైనవాటిలో మాత్రం బాగా కష్టపడితే గరిష్ఠ మార్కులకు అవకాశం స్పష్టం. అందువల్ల అన్ని పేపర్లనూ సమానంగా అధ్యయనం చేయాలనే సూత్రం పాటిస్తూనే స్కోరింగ్‌ అవకాశమున్న పేపర్లపై దృష్టిపెడితే అదనపు మార్కులు సాధించవచ్చు. 

ఒక పేపర్‌ స్కోరింగ్‌ అయినా కాకపోయినా, ఆ పేపర్‌లోని వివిధ చాప్టర్లు సమాన మార్కులు ఇచ్చే అవకాశమున్నా కొన్ని చాప్టర్లపై కృషి చేయటం ద్వారా అదనపు మార్కులు పొందొచ్చు. కొన్ని చాప్టర్లలో ఎంత కష్టపడినా మార్కులు పొందే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ సూక్ష్మ వివేచన కూడా మార్కులను పెంచేందుకు ఉపయోగపడుతుంది.

అభ్యర్థులు పేపర్ల వారీగా స్కోరింగ్‌ పేపర్లు, నాన్‌ స్కోరింగ్‌ పేపర్లు అనేవాటిని అర్థం చేసుకుని చాప్టర్ల వారీగా కూడా అదే రకమైన అంచనా ద్వారా మెరుగైన ఫలితం రాబట్టుకోవచ్చు. ర్యాంకును మెరుగుపరుచుకోవచ్చు. ఒక రకంగా పండ్లు ఉండే చెట్టుకే రాళ్లు వేసి లబ్ధి పొందటం. 

ఇలాంటి మెలకువలు పాటించడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పైగా శ్రమను హేతుబద్ధంగా వినియోగించడానికి అవకాశం ఎక్కువ. 

 

2. ప్రశ్నల రూపం - తీరుతెన్నులు 

గ్రూప్‌ - 1 మెయిన్స్‌ లాంటి డిస్క్రిప్టివ్‌ పరీక్షల్లో విజయవంతం అవ్వాలనుకుంటే కంటెంట్‌ని చదవడమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా వివిధ సర్వీస్‌ కమిషన్లు ఆయా టాపిక్కులపై ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాయో అధ్యయనం చేయాలి. దీని ద్వారా రాబోయే ప్రశ్నల రూపాన్నీ, తీరుతెన్నులనూ అర్థం చేసుకోగలిగి కంటెంట్‌ను ఏ విధంగా చదవాలో స్పష్టత ఏర్పడుతుంది. 

ఉదాహరణకు ఇటీవల రెండు రాష్ట్రాలు నిర్వహించిన గ్రూప్‌ - 1 ప్రిలిమినరీ పరీక్షల్లో గతానికి భిన్నంగా యూపీఎస్సీ తరహాలో జతపరిచే ప్రశ్నలు, ఎక్కువ సమయాన్ని కోరే ప్రశ్నలు, ఎసర్షన్‌ - రీజన్‌ ప్రశ్నలను అడిగారు. ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు. వ్యూహాత్మకంగా సర్వీస్‌ కమిషన్లు యూపీఎస్సీ అడుగుజాడల్లో పయనిస్తున్నాయని చెప్పవచ్చు. రెండు రాష్ట్రాల్లో రాబోయే మెయిన్స్‌ పరీక్షల్లో కూడా అదే ప్రశ్నల ధోరణి కొనసాగే అవకాశం కొంతవరకైనా ఉంది. ముఖ్యంగా సీనియర్‌ అభ్యర్థులు గత ప్రిపరేషన్‌ విధానంలో ప్రస్తుత అంచనాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు కూడా ప్రశ్నల ధోరణిలోని నాడిని పసిగట్టి ప్రిపేరయితే మంచి మార్కులు రాబట్టటం పెద్ద కష్టమేమీ కాదు.

‘వివరించండి, విశ్లేషించండి, నిరూపించండి, అంగీకరించండి, వ్యతిరేకించండి, చర్చించండి, వ్యాఖ్యానించండి’ మొదలైన రకరకాల ట్యాగ్‌లను బట్టి సమాధానాలు ఎలా రాయాలో అభ్యర్థులు స్పష్టత ఏర్పరుచుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి ట్యాగ్‌ లేకుండా కూడా ప్రశ్నలు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో గ్రహించాలి. ప్రశ్నలనేవి ఆయుధాల్లాంటివి. వాటిని సరిగా సాన పెట్టుకుంటే పోటీ పరీక్షల యుద్ధంలో విజయం తథ్యం!

 

3. అనువర్తనం ముఖ్యం 

రాష్ట్రస్థాయి పరిపాలన అధికారులను ఎంపిక చేసే లక్ష్యంతో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇది గుర్తిస్తే అందుకు తగిన పరిపాలన సంబంధిత లక్షణాలు అభ్యర్థుల్లో ఉన్నాయా లేవా అని పరిశీలించేందుకు ఈ పరీక్షలు ఆధారం అని గమనించవచ్చు. ఆ క్రమంలో... వివిధ రకాల సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, పరిపాలన మొదలైన సిలబస్‌ అంశాల్లో అభ్యర్థుల అవగాహనను అనువర్తన కోణంలో పరిశీలిస్తారు. అంటే సమాధానాల్లో ప్రత్యేకంగా అడిగితే తప్ప సైద్ధాంతిక అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం సరైన నిర్ణయం కాదు. 

ఉదాహరణకు రాజ్యాంగంలో ఆర్టికల్స్‌ రాయటం వేరు. ఆయా ఆర్టికల్స్‌కు సంబంధించిన వివాదాలు, తీర్పులు, ఫలితాలు మొదలైనవి రాయటం వేరు. జాగ్రఫీలో నేలల గురించి చదవటం వేరు. ఆయా నేలల వల్ల ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన సామాజిక, ఆర్థిక, పరిపాలన అవసరాలను ప్రస్తావిస్తూ సమాధానం రాయడం వేరు.
తెలంగాణ గ్రూప్‌ - 1లో సొసైటీ అనే విభాగంలో సామాజిక శాస్త్ర సైద్ధాంతిక అంశాలను చదవాల్సిన అవసరమే లేదు. ఆయా సామాజిక నిర్మితులు పరిపాలనలో, సమాజంలో ఏ విధమైన ఫలితాలను ఇస్తున్నాయో అధ్యయనం చేయటం ముఖ్యమైన విషయం. ఇదే సూక్ష్మం శాస్త్ర సాంకేతిక విభాగంలో కూడా వర్తిస్తుంది. వ్యాసరచనలో అయితే అనువర్తన విశ్వరూపం చూపించాలి.

 

4. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం 

ఈ పరీక్షల్లో విజయానికి సులభమైన మార్గం ఏమిటంటే - వర్తమానాన్ని లోతుగా, విస్తృతంగా అర్థం చేసుకోవడం. చరిత్ర, భౌగోళిక అంశాలు మొదలైన ఒకటి రెండు అంశాలు తప్ప మిగతా విభాగాలన్నీ అత్యధిక వర్తమానతను కోరేవే. రాజ్యాంగం, గవర్నెన్స్, శాస్త్ర సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, జనరల్‌ ఎస్సే మొదలైన విభాగాల ప్రశ్నలకు వీలైనంత వర్తమానతను జోడించి సమాధానాలను గుబాళింపజేస్తే విజయానికి అవసరమైన మార్కులు తథ్యం. అందుకనే కరెంట్‌ అఫైర్స్‌ బాగా ప్రిపేర్‌ అవ్వండని విజేతలైన అభ్యర్థులు ఎప్పుడూ చెబుతూవుంటారు. కరెంట్‌ అఫైర్స్‌ను జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ పరంగా చదివేటప్పుడు పరిపాలన, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, రాజ్యాంగ మొదలైన బహుముఖ కోణాల్లో ఆయా విషయాలను విశ్లేషించుకుని సమాధానాలతో అనుసంధానించుకోవాలి. ఈ నైపుణ్యం సాధిస్తే సగం విజయం సాధించినట్లే.

 

5. ప్రాంతీయత కూడా ప్రధానమే 

గ్రూప్‌ - 1 ప్రిలిమినరీ అనుభవాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. తెలంగాణ గ్రూప్‌ - 1 ప్రిలిమినరీలో 150 ప్రశ్నలకు దాదాపు 40 ప్రశ్నలు తెలంగాణ సంబందిత అంశాల మీదే అడిగారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు వచ్చాయి. రెండు రాష్ట్రాల గ్రూప్‌ - 1 మెయిన్‌ సిలబస్‌లో ప్రాంతీయ అంశాలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా యూపీఎస్‌సీ అభ్యర్థులు గ్రూప్‌ - 1 కి రాసేటప్పుడు... ఈ విధమైన స్థానికీకరణం చాలా ముఖ్యమని గమనించాలి. 250 నుంచి 300 మార్కులకు ప్రాంతీయ విషయాలపై అడిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ మెయిన్స్‌ సిలబస్‌లో అంతర్జాతీయ అంశాలను తీసివేసి తెలంగాణ ఉద్యమాన్ని 6వ పేపర్‌గా 150 మార్కులకు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ప్రాంతీయ విషయాలకు 50 మార్కుల వ్యాసాన్ని ఇచ్చారు. అందువల్ల అభ్యర్థులు ఆర్థిక, భౌగోళిక, చారిత్రక, పరిపాలన విషయాలను తప్పనిసరిగా ప్రాంతీయ కోణంలో చదివి రాసినప్పుడే విజయం సాధించగలుగుతారు.

 

6. రాయటం సాధన... సాధన  

అభ్యర్థుల స్కోరును గణనీయంగా పెంచడంలో రాతసాధన కీలకమైన ఆయుధం. సమయం సరిపోతుందనుకుంటే సొంత నోట్సు రాయటం ద్వారా రాత సాధన చేయవచ్చు. ఒకవేళ తగినంత సమయం లేదని భావిస్తే చదివిన ప్రతి అంశానికీ సారాంశం  తయారుచేసుకోవడం ద్వారా పెన్ను కదులుతూ ఉండాలి. అదేవిధంగా రాత సాధనలో అంతర్భాగంగానూ, సమయ నిర్వహణలో లోపాలను గుర్తించేందుకూ తప్పనిసరిగా చాప్టర్‌ వారీగా టెస్టులతో పాటు గ్రాండ్‌ టెస్ట్‌కు హాజరవడం మంచిది. దీనిద్వారా గణనీయమైన మెరుగుదల మార్కుల్లో కనిపిస్తుంది, భావవ్యక్తీకరణ బలపడుతుంది. కంటెంట్‌ సాధనలోని బలాలూ, బలహీనతలూ అర్థమవుతాయి. తప్పులను పరిష్కరించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇలా రాత సాధన లేని అభ్యర్థుల్లో పరీక్ష హాల్లో చాలా సందర్భాల్లో అనుకున్నది రాయలేక, సమయానికి రాయలేక ఒత్తిడికి గురవుతారు, అపజయానికి దగ్గరవుతారు.

 

7. నవ్యత, సృజనాత్మకత 

పుస్తకాల్లోని సమాచారాన్నీ, కోచింగ్‌ సెంటర్ల నోట్సునూ యథాతథంగా సమాధానాలుగా రాసే అభ్యర్థులు ఎక్కువ సందర్భాల్లో విఫలమయ్యే అవకాశాలున్నాయి. గత విజేతలు అందరూ తాము నేర్చుకున్న వివిధ విషయాలకు సొంత ఆలోచనలతో నవ్యత, సృజనాత్మకతలను మేళవించి సమాధానాలు రాశారు. అలా గరిష్ఠ మార్కులు పొంది ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ వాస్తవం గ్రహించి కొత్తదనంతో సృజనాత్మకతను జోడించి సమాధానాలు రాయటానికి కృషి చేయాలి. అంతిమంగా ఆ జవాబులు సొంత ముద్రతో ఉన్నాయనే భావన దిద్దేవారికి కలిగిస్తే... మంచి మార్కులు తప్పనిసరిగా వస్తాయి.                

 

గ్రూప్‌ - 1 మెయిన్స్‌లో మార్పులు

తెలంగాణ గ్రూప్‌ - 1 పరీక్షలో ఇంటర్వ్యూ ఎత్తివేయడంతో అభ్యర్థుల సామర్థ్యాలను మరింత లోతుగా పరిశీలించాలనే కోణంలో... కొన్ని మార్పులను ఇటీవల సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. వీటిని గుర్తించి అందుకనుగుణంగా సన్నద్ధతను మార్చుకోవాలి.

వ్యాసరచన 1000 పదాల లోపు రాయాలని పేర్కొన్నారు. ఒకరకంగా అభ్యర్థులకిది సవాల్‌. తెలుగు మీడియం అభ్యర్థులకు క్లిష్టమైన విషయమే. అందువల్ల అభ్యర్థులు రైటింగ్‌ సాధన వేగవంతం చేసి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని వ్యాసంలో పొందుపరిచేందుకు సిద్ధపడాలి.

మిగతా 5 పేపర్లలో ప్రతి సెక్షన్‌లోనూ రెండు ప్రశ్నలకు ఛాయిస్‌ ఉండదని ప్రకటించారు. మిగతా మూడు ప్రశ్నలకు ఛాయిస్‌ ఉంటుంది. ఛాయిస్‌ లేని ప్రశ్నలు ప్రతి సెక్షన్‌లోని మొదటి రెండు చాప్టర్స్‌ నుంచి ఇస్తారా, ఏ చాప్టర్‌ నుంచైనా ఇవ్వవచ్చా అనే స్పష్టత లోపించింది. ఒకవేళ సర్వీస్‌ కమిషన్‌ అలాంటి స్పష్టత ఇవ్వనట్లయితే అన్ని చాప్టర్లనూ పూర్తిస్థాయిలో  చదవాలి. దీనికి అధిక సమయాన్ని వెచ్చించాలి.

పేపర్‌ 5 లోని మూడో విభాగమైన డేటా ఇంటర్‌ప్రెటేషన్లో 5 చాప్టర్లు ఉన్నాయి. అయితే తాజా సూచనల ప్రకారం 30 ప్రశ్నల్లో 25 రాయాలని ప్రకటించారు. ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 మార్కులు గరిష్ఠంగా ఉంటాయి. ప్రతి చాప్టర్లో ఆరు ప్రశ్నలు ఇచ్చి ఐదు రాయమంటారా? అన్ని చాప్టర్లలో కలిపి 30 ప్రశ్నలు ఇచ్చి 25 ఎంపిక చేసుకోమంటారా అనే విషయంలోనూ స్పష్టత లేదు. 30 ప్రశ్నలు ఇచ్చేట్లయితే... అభ్యర్థులు ఎటువంటి ఛాయిస్‌ జోలికి పోకుండా మొత్తంగా చదవాలి. ఇది కూడా ఇబ్బందే. అయితే అభ్యర్థులు ఏ పరిస్థితికైనా సిద్ధపడాలి. సన్నద్ధతను అందుకనుగుణంగా మార్చుకోవాలి.

గతంలో క్వాలిఫైయింగ్‌గా ఇంగ్లిష్, తెలుగు భాషలు రెండు పేపర్లుగా ఉండేవి. ప్రస్తుతం ఇంగ్లిష్‌ను మాత్రమే క్వాలిఫైయింగ్‌ పేపర్‌గా నిర్ణయించారు. 

 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవితబీమాలో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ ఉన్నత విద్యకు ఉపకారవేతనం!

‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ నవతరానికి నయా కొలువులు!

‣ సొంతంగా నేర్చుకుంటున్నారా?

‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!

Posted Date : 27-01-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు