• facebook
  • whatsapp
  • telegram

విదేశీ వ్యవహారాల అధ్యయన వ్యూహం ఇదీ!

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ సన్నద్ధతకు సూచనలు

 

 

అటు సివిల్స్, ఇటు గ్రూప్స్‌ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌లో విదేశీ వ్యవహారాలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది. తగిన ప్రణాళికతో వీటిని చదివి అర్థం చేసుకోవడం ద్వారా ప్రిలిమ్స్‌లోనే కాక మెయిన్స్‌లోనూ రాణించే అవకాశం ఉంటుంది.

 

అంతర్జాతీయ వ్యవహారాలతో జాతీయ, రాష్ట్రీయ అంశాలూ ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారానికీ, 1972లో జరిగిన స్టాక్‌హోమ్‌ కాన్ఫరెన్స్‌కూ మధ్య ఉన్న సంబంధం ఏంటో సిన్సియర్‌గా ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థికి అర్థం కావాలి! మన ప్రధానమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దలు ఏయే దేశాలకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? ఇందువల్ల మన దేశానికి కలిగే ప్రయోజనం ఏమిటి అన్నది మనకు తెలియాలి. అదే మాదిరిగా ఇతరులు మన దేశానికి ఎందుకు వస్తున్నారు, దానివల్ల మనకు కలిగే ఆర్థిక, రాజకీయ, సాంకేతిక ప్రయోజనాలేమిటన్న అవగాహన ఉంటేనే పరీక్షల్లో మనం కచ్చితమైన సమాధానాలు ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది.

 

ప్రపంచ పరిస్థితులు.. భారతదేశ విధానాలు..

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం గురించి గతం, వర్తమానం తెలుసుకుని దీనిపై భారతదేశ విధానం ఏంటో గుర్తించాలి. ఉక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను రష్యా 2014లో ఆక్రమించుకోవడం, ఉక్రెయిన్‌ నాటోవైపు మొగ్గు చూపడం అనేవి యుద్ధానికి ప్రధాన కారణాలన్న విషయం మనకు తెలియాలి. యూఎస్‌ఏ, యూఎస్‌ఎస్‌ఆర్‌లు నాటో, వార్సా కూటములుగా మారి ఇతర దేశాలను తమ కూటముల్లో చేర్చుకునే విధానమే కోల్డ్‌ వార్‌కు దారితీసింది. రష్యా పక్కనే ఉన్న ఉక్రెయిన్‌ అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేరితే రష్యాకు ముప్పని తెలిసే ఆ దేశం యుద్ధానికి తెగబడింది.

 

భారత్‌ నాటో, వార్సా కూటముల్లో చేరకుండా నాటి ప్రధాని నెహ్రూ, మార్షల్‌ టిటో, నాజర్‌లతో కలిసి అలీన విధానానికి నాంది పలికారు. ఎందులోనూ చేరకుండా నేటికీ భారతదేశం అదే విధానాన్ని పాటిస్తోంది. రెండు కూటముల్లో యూఎస్‌ఎస్‌ఆర్‌ పతనానంతరం వార్సా కూటమి లేనప్పటికీ మన విధానంలో పెద్దగా తేడా లేదు. నూతనంగా మనం దీన్ని డీ-హైపెనేటెడ్‌ విధానం అంటున్నాం.

 

ఉదాహరణకు గల్ఫ్‌ దేశాలతో మనకున్న సంబంధాలు ఈ విధానాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఒపెక్‌ దేశాలతో మనకు ముడి చమురు, సహజ వాయువు అవసరాలున్నాయి. అత్యంత ఎక్కువ ముడి చమురును సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలా అని మనం ఇతర దేశాలతో గొడవలు పడటం లేదు, వారి ప్రాంతీయ విభేదాల్లో జోక్యం చేసుకోవడం లేదు. 

 

అలాగే పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, పాలస్తీనాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ అవి రెండూ నిత్యం గొడవలతోనే ఉంటాయి. మధ్య ఆసియాలోని అయిదు దేశాలతో మనకి విడివిడిగా మంచి సంబంధాలున్నాయి. కానీ వాటి మధ్య వాటికి అనేక గొడవలు ఉన్నాయి. 

 

ముఖ్యంగా యూఎస్, చైనా, రష్యాలు నిత్యం పోటాపోటీగా ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సైన్యం చైనా దగ్గర ఉంది. అలాగే రష్యాతో యూఎస్‌ఏకు చారిత్రక, ఆర్థిక వైరం ఎంతో కాలంగా నడుస్తోంది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్‌ మాత్రం పై మూడు దేశాలతో ఆచితూచి అడుగులు వేస్తుందని తెలుసుకోవాలి.  ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యత్వం అవసరం ఏమిటి? అది లేకపోతే ఏం జరుగుతుందనే విషయంపై అభ్యర్థి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా లుక్‌ ఈస్ట్, ఆక్ట్‌ ఈస్ట్‌ పాలసీ నేపథ్యం తెలియాలి. లుక్‌ వెస్ట్‌కు దారితీసిన పరిస్థితులు చర్చించుకోవాలి.

 

ఈ విభాగం నుంచి ప్రశ్నలు ద్వైపాక్షిక సంబంధాలపై గానీ, ప్రాంతీయ సమస్యల మీదగానీ లేదా సంబంధిత సంస్థలపై కానీ వచ్చే అవకాశం ఉంది. వీటిని మనం ఒక క్రమ రూపంలో ఏబీసీడీఈఎఫ్‌జీఎస్‌ విధానం ద్వారా గుర్తుంచుకోవచ్చు.

 

1. ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ - అంటే భారత్‌కు కంబోడియాకు మధ్య ఉన్న సంబంధాలు అధ్యయనం చేసేటప్పుడు అక్కడ ఉన్న దేవాలయాల సంబంధిత సమాచారం తెలుసుకోవాలి. యూఎస్‌ ఎందుకు దీపావళి ఉత్సవాలు చేస్తుంది, యోగాను అనేక దేశాలు ఎందుకు అనుకరిస్తున్నాయి, మనకూ ఇతర దేశాలకూ ఎటువంటి సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయనేది తెలుసుకుని అవగాహన పెంచుకోవాలి. దీన్ని సాఫ్ట్‌ పవర్‌ అంటారు. 

 

2. బైలేటరల్‌ ఇంట్రెస్ట్‌ - ఉదాహరణకు చైనాను నిలువరించడానికి ఇండో పసిఫిక్‌ ప్రాంతాల్లో భారత్‌ - అమెరికాలు కలిసి పనిచేస్తున్నాయి. చైనాను ఈ ప్రాంతంలో నిలువరించడం మనకూ, అమెరికాకూ అవసరం. ఇటువంటి ఇతర విషయాలు ఈ కోవకు వస్తాయి. 

 

3. కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌ - ఆర్‌సీఈఎఫ్‌ నుంచి భారత్‌ బయటకు రావడం - ఏఎస్‌ఈఏఎన్‌లోని దేశాలతో మరొక 6 దేశాలైన చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, జపాన్, భారత్‌లు కలిసి ఉన్నదే ఆర్‌సీఈపీ. దీనివల్ల మన ఆర్థిక వ్యవహారాలు దెబ్బతినే అవకాశం ఉండటం వల్ల మనం బయటకు వచ్చాం. ఇలాంటి వాటిపై అవగాహన ఉండాలి.

 

4. డెమోక్రసీ అండ్‌ డయాస్పోరా - ఉదాహరణకు హెచ్‌వన్‌బీ వీసా పరిస్థితి ఏంటి, అమెరికాలో మనవాళ్లు ఎంత మంది ఉన్నారు, వారు ఎలా అటు అమెరికాకు, ఇటు భారత్‌కు మేలు చేస్తున్నారు అనే దాన్ని అధ్యయనం చేయాలి. అలాగే ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి ఇతర దేశాల్లోనూ మనవారి పరిస్థితి ఏమిటన్న విషయం తెలుసుకోవాలి.

 

5. ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకానమీ - ప్రస్తుత ప్రపంచంలో డీకార్బనైజేషన్‌ అనేది ప్రముఖమైన అంశం. దానికి సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సహకారం రెండూ కావాలి. 1972 నుంచి యూఎన్‌ఈపీ ఏర్పాటు ద్వారా అన్ని దేశాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ధనిక దేశాలు పేద దేశాలకు సాంకేతికతను, పెట్టుబడిని అందిస్తున్నాయి. కాబట్టి మనం ఏ సంబంధాలను విశ్లేషించినా ఈ కోణాన్ని ప్రముఖంగా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మనకు ఇజ్రాయెల్‌ నుంచి సాంకేతికత లభిస్తోంది.

 

6. ఫండింగ్‌ అండ్‌ ఆర్గనైజేషన్‌ - ఉదాహరణకు భారత్‌ - జపాన్‌ సంబంధాల్లో వారు మన దేశంలో ఏర్పాటుచేసే పారిశ్రామిక కారిడార్లు, మెట్రో రైలుకు సంబంధించి తక్కువ వడ్డీతో రుణాలు వంటివి ఇందులో భాగం.

 

7. గవర్నమెంట్‌ ధోరణి- ప్రతి దేశానికీ ఒక విదేశీ విధానం ఉంటుంది. నెహ్రూ కాలంలో మనకి పంచశీల విధానం, అలీన విధానం ఉండేది. మనం అన్ని నిర్ణయాలు దాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటాం. మిత్రదేశాలు - శత్రు దేశాలు - పక్క దేశాలన్న భావనలు ఆ దేశాలతో మనకుండే సంబంధాలను నిర్ణయిస్తాయి. 

 

8. సెక్యూరిటీ - ఇది న్యూక్లియర్‌ సెక్యూరిటీ కావొచ్చు, ఎనర్జీ సెక్యూరిటీ కావొచ్చు, స్టాట్యూట్‌ సెక్యూరిటీ కావొచ్చు. ఒక దేశం తీసుకునే నిర్ణయంలో దీని పాత్ర ఉంటుంది. ఉదాహరణకు మనం ఫ్రాన్స్, యూఎస్, జపాన్‌లతో వ్యవహరించేటప్పుడు న్యూక్లియర్‌ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని మాట్లాడతాం. ఒపెక్‌ దేశాలతో వ్యవహరించే విధానంలో ముడి చమురు, సహజ వాయు నిక్షేపాలను దృష్టిలో ఉంచుకుని సంబంధాలు నెరుపుతాం. పీ5 దేశాలతో సంబంధాలు పెంచుకునేటప్పుడు యూఎన్‌లో మన శాశ్వత సభ్యత్వం గురించి ఆలోచించుకుని అడుగులు వేస్తాం.

 

ఇలా విభాగాల వారీగా అన్ని అంశాలనూ విభజించుకుని, ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ చదివితే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నల్లో అభ్యర్థులు పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బోధన, పరిశోధనలకు అధికారిక అర్హత

‣ మెరుగైన ర్యాంకుకు మెలకువలు ఇవిగో!

‣ విద్యార్థులూ... కళ్లను నిర్లక్ష్యం చేయకండి!

‣ మార్కులు తెచ్చే విపత్తు నిర్వహణ

‣ విద్యార్థులకు విప్రో ఉద్యోగాలు సిద్ధం!

‣ ఇంటర్‌ విద్యార్థులకు ఐఐఎస్‌సీ ఆహ్వానం

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌