• facebook
  • whatsapp
  • telegram

పోటీలో ముందుంచే ప్రామాణిక మంత్రం!

 సంపూర్ణ సన్నద్ధతకు నిరంతర సాధన

సివిల్స్‌ పరీక్షతోపాటు టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే గ్రూప్‌ 1‌ మొదలైన ఇతర పరీక్షలను ఎదుర్కొని భవిష్యత్తును నిర్మించుకునేందుకు తెలంగాణ అభ్యర్థులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేయడం కొత్తేమీ కాదు. అయినా ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని పొందుతూ తెలంగాణ ప్రత్యేక అంశాలపై పట్టు సాధించటం చాలా అవసరం. దీని కోసం అభ్యర్థులు అధీకృత సమాచారంపై మాత్రమే ఆధారపడాలి. ఇలా సన్నద్ధత కొనసాగిస్తే ఏ పోటీపరీక్షలోనైనా మంచి ఫలితాలు సాధించవచ్చు!.......

 

సివిల్స్‌కు సిద్ధమవుతూ గ్రూప్స్‌ పరీక్షలు రాసే నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడి అభ్యర్థులు సివిల్స్‌ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ సంబంధిత అంశాలపై ప్రశ్నలు అడగటం ఆనవాయితీ. అందువల్ల సివిల్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులు సైతం తెలంగాణ అంశాలపై పట్టు సాధించేందుకు వివిధ రకాలైన వనరులపై ఆధారపడాల్సి ఉంటుంది.


గ్రూప్స్‌ పరీక్షలపై దృష్టి పెట్టే చాలామంది అభ్యర్థులు కూడా పరీక్షల సమయంలో మాత్రమే హడావుడిగా ప్రిపేర్‌ అవుతూ సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించటం కనిపిస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్‌ లేనప్పుడు ఎందుకు ప్రిపేర్‌ అవ్వడం అని భావించకుండా స్వరాష్ట్రమైన తెలంగాణ సంబంధిత వివిధ విషయాలపై నిరంతరం దృష్టి నిలపడం అనేది పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం.


తెలంగాణ భౌగోళిక అంశాలు, చరిత్ర- సాంస్కృతిక అంశాలు, తెలంగాణ సామాజిక నిర్మాణం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలైన అంశాల అధ్యయనం కోసం పాఠశాల స్థాయి పుస్తకాలతో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలు, విశ్వవిద్యాలయాల పుస్తకాలు విరివిగా లభ్యమవుతున్నాయి. ఇలాంటి స్థిర సమాచారంతో పాటు గతిశీలకంగా ఉండే అనేక పరిపాలన అంశాలపై కూడా పోటీ పరీక్షల్లో అభ్యర్థులు పట్టు సాధించాలి. అప్పుడే సంపూర్ణమైన ప్రిపరేషన్‌ సాధ్యమవుతుంది. గతిశీలక అంశాల అధ్యయనం కోసం కింది వనరులు బాగా ఉపయోగపడతాయి.


అధికారిక వెబ్‌సైట్‌ : https://telangana.gov.in

ఈ వెబ్‌సైట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రొఫైల్, జిల్లాల సమాచారం, భాషా సంస్కృతి, మౌలిక గణాంకాలు, తెలంగాణ రాష్ట్ర గణాంకాలు (ఫ్యాక్ట్స్‌ అండ్‌ ఫిగర్స్‌) మొదలైన అధీకృత సమాచారం లభిస్తుంది. అనేక ప్రైవేటు పుస్తకాల్లో కూడా ఈ సమాచారం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధీÅకృత సమాచారంగా ఈ సమాచారాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అందువల్ల పోటీ పరీక్షల్లో ఈ సమాచారాన్ని వినియోగించడమే సముచితం. ఇదే Government Initiatives అనే అంశం కింద వివిధ ప్రభుత్వ పథకాల గురించి చూడవచ్చు. తెలంగాణ కంటి వెలుగు, రైతుబంధు, కేసీఆర్‌ కిట్, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, హరితహారం, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ప్రజా పంపిణీ వ్యవస్థ మొదలైన ప్రభుత్వ పథకాల సమాచారం లభిస్తుంది. ఇంకా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, ఆర్థిక సర్వేలు కూడా లింక్స్‌ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇందులోని సమాచారాన్ని సంక్షిప్తీకరించుకుని చదువుకోవటం మంచిది. దీన్ని తెలంగాణ ఎకానమీకి సంబంధించిన విశ్వసనీయ సమాచారంగా వినియోగించుకోవచ్చు.
 ‘బంగారు తెలంగాణ’ అనే విభాగంలో ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా తీసుకుంటున్న చర్యలనూ, నిర్ణయాలనూ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పేదలకు పెరిగిన ఆసరా, పేదలకు ఇళ్లు లాంటి పోటీ పరీక్షల సమాచారం కనిపిస్తుంది.
 ‘సంస్కృతి’ విభాగాన్ని ఎంపిక చేసుకుంటే తెలంగాణలో వైభవంగా జరిగే యాదాద్రి బ్రహ్మోత్సవాలు, బోనాల సంబరాలు, గిరిజన జాతరలు, రంజాన్‌ మాసం విశిష్టత మొదలైన అంశాలు ఉన్నాయి.
 ‘చరిత్ర’ విభాగం ఎంపిక చేసుకుంటే శాసనాల పరిశోధన చరిత్ర,  తెలంగాణ గ్రంథాలయాలు, జాతీయోద్యమంలో హైదరాబాద్, వెయ్యేళ్ల నాటి తెలంగాణ,  తెలంగాణ శిల్ప కళ మొదలైనవాటిపై సమగ్ర అవగాహన పెంపొందించే అంశాలు కనిపిస్తున్నాయి.

 

ప్రభుత్వ మాసపత్రిక: తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మాస పత్రికను నిర్వహిస్తున్నారు. ముద్రణ రూపంలోనే కాకుండా ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా పీడీ…ఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. నెలల వారీగా మ్యాగజీన్‌ సంచికలను పొందవచ్చు. అదేవిధంగా, అంశాల వారీ విభజన కూడా కనిపిస్తుంది. బంగారు తెలంగాణ, సంస్కృతి, పర్యాటకం, మన చరిత్ర, వ్యాసాలు మొదలైన విభాగాలతో సమాచారం లభిస్తుంది.

 ‘పర్యాటకం’ అనే విభాగంలో ‘చూసొద్దాం రండి’ పేరుతో పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారం ఉంది. తెలంగాణ కుంభమేళా మేడారం, తెలంగాణ నయాగరా బొగత, దోమకొండ కోట, గిరిజన కుల దైవం నాగోబా జాతర - ఇలాంటి అనేక అంశాల వివరణ లభిస్తుంది.
 ‘వ్యాసాల’ విభాగంలో చరిత్ర పుటల్లో సారస్వత పరిషత్తు, ఆరేళ్ల ప్రాయంలో తెలంగాణ ప్రగతి, కృష్ణా జల వివాదాలు-అపోహలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఆధునిక అంచుల్లో తెలంగాణ పల్లెలు, ప్రజల అవసరాల ప్రణాళికలు మొదలైనవి ఉన్నాయి. గ్రూప్‌ వన్‌ పరీక్షల్లో రాసే డిస్క్రిప్టివ్‌ సమాధానాలకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఆబ్జెక్టివ్‌ పరీక్షలకూ ఉపయోగపడే సమాచారం ఉంది.
 ‘ఈ-మ్యాగజీన్‌’ విభాగాన్ని ఎంపిక చేసుకుంటే నెలల వారీగా ప్రచురితమైన సమాచారం పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 2020 మ్యాగజీన్‌లో హరితహారం, పౌష్టికాహారం, కోటి ఎకరాల మాగాణి, ఆరోగ్య తెలంగాణ, విద్యా వ్యవస్థ ప్రక్షాళన ప్రణాళిక, విలీనం నుంచి విభజన దాకా అనే అంశాలు పోటీపరీక్షలకు ఉపయోగపడే రూపంలో ఉన్నాయి.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌