• facebook
  • whatsapp
  • telegram

మన విశ్వం - గ్రహాలు

అంతర్జాతీయ ఖగోళ సమితి 2006లో గ్రహాలకు సంబంధించి కొన్ని నియమాలను ప్రతిపాదించింది. నక్షత్రం చుట్టూ తిరిగే వస్తువు ఆ నియమాలను పాటిస్తేనే దాన్ని గ్రహం అంటాం. అవి:

నక్షత్రం చుట్టూ, మనకైతే సూర్యుడి చుట్టూ పరిభ్రమించాలి.

 గోళాకారాన్ని పొందేంత గురుత్వాకర్షణ బలాన్ని కలిగి ఉండాలి

తన మార్గంలో లేదా సమీపంలోకి చిన్న ఖగోళ వస్తువులు చేరకుండా చూసుకునేంత అధిక పరిమాణాన్ని (గురుత్వాన్ని) కలిగి ఉండాలి. పై నిబంధనలను పాటించలేకపోవడంతో ప్లూటో తన గ్రహం హోదాను కోల్పోయింది.

నక్షత్రం ఏర్పడిన సమయంలో దాని చుట్టూ మిగిలిపోయిన వాయువు పళ్లెం (Disk) లో, ఉష్ణోగ్రతా వ్యత్యాసాలకు అనుగుణంగా గడ్డకట్టిన వాయువు లేదా ద్రవ్యం గ్రహంగా మారుతుంది.

నక్షత్రానికి సమీపంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది.ఈ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవించగల పదార్థాలు సిలికేట్, ఇనుము కణాలు. 

నక్షత్రానికి దూరంగా ఉండే ప్రదేశాల్లో మంచుతో ఆవరించిన కణాలు ఘనీభవించి, గ్రహాలుగా మారతాయి.

మన సౌర వ్యవస్థలో సూర్యుడికి సమీపంలో ఉండే అంతర్‌ లేదా ఖగోళ గ్రహాల్లో (బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు) సిలికేట్, ఇనుము కణాలు అధికంగా ఉంటే, అత్యల్ప పరిమాణంలో మంచు ఉంటుంది. 

సూర్యుడికి దూరంగా ఉండే బాహ్య (Outer) లేదా జోవియన్‌ (బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్‌) గ్రహాల్లో మంచుతో ఆవరించిన కణాలు ఉంటాయి.

గ్రహాలు కాలక్రమేణా ఎన్నో మార్పులకు లోనయ్యాయి. ఉదాహరణకు గుంతలు (craters) ఏర్పడటం లేదా గుంతలు ఇతర పదార్థాలతో నిండిపోవడం. వాయువులతో కూడిన వాతావరణం ఏర్పడటం లేదా వాతావరణం గ్రహాలను వదిలి వెళ్లడం మొదలైనవి. మన సౌర వ్యవస్థలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. అవి: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు (అంగారకుడు), బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్‌.

 

బుధుడు (Mercury)

 సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న అతి చిన్న గ్రహం బుధుడు. ఇది భూమి కంటే చంద్రుడ్ని అధికంగా పోలి ఉంటుంది. 

భూమి నుంచి చూసినప్పటి కంటే బుధుడి నుంచి చూస్తే సూర్యుడి పరిమాణం 2.5 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. భూమిపై పడే సూర్యకాంతి తీవ్రత కంటే ఏడు రెట్లు ఎక్కువ ప్రభావంతో సూర్యుడు బుధుడిపై ప్రకాశిస్తాడు.

బుధుడు తనచుట్టూ తాను తిరిగేందుకు పట్టే కాలం 58.65 రోజులు. ఇది సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలంలో (87.97 రోజులు) 2/3 వ వంతు.  

బుధుడి సాంద్రత 5,420 kg/m3 ఉంటుంది. అధిక సాంద్రత కలిగిన గ్రహాల్లో ఇది రెండో స్థానంలో ఉంది.

బుధుడి మధ్య రేఖ వద్ద అధికంగా 825 రీ ఉష్ణోగ్రత ఉంటే, ధ్రువాల వద్ద అల్పంగా 163 K ఉష్ణోగ్రత ఉంటుంది. 

ఈ గ్రహంపై వాతావరణం దాదాపుగా లేదు. కాబట్టి, ఉష్ణం మధ్య రేఖ (Equator) నుంచి ధ్రువాల వద్దకు ప్రసరించదు. దీంతో ధ్రువ ప్రాంతాల్లో మంచు పేరుకుని ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ప్రదర్శించే గ్రహంగా బుధుడ్ని పేర్కొంటారు.

 

శుక్రుడు (Venus)

ఇది సూర్యుడి నుంచి రెండో స్థానంలో ఉంటుంది. దీన్ని భూమికి కవల గ్రహం (Earth,s twin) గా పేర్కొంటారు. ఇది పరిమాణం, సాంద్రతల్లో భూమిని పోలి ఉన్నప్పటికీ, ఎన్నో అంశాల్లో భూమిని విభేదిస్తుంది. 

ఇది భూమికి అత్యంత సమీపంలో ఉంటుంది. చంద్రుడి తరువాత మనకు అత్యంత ప్రకాశవంతంగా కనిపించే గ్రహం శుక్రుడే.  ఇది సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దీన్ని మార్నింగ్‌ స్టార్, ఈవెనింగ్‌ స్టార్‌ అని కూడా అంటారు.

గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ అపసవ్య దిశలో ఆత్మభ్రమణం చెందితే, శుక్రుడు సవ్యదిశలో ఆత్మభ్రమణం చెందుతాడు. అందుకే ఈ గ్రహంపై సూర్యుడు పడమర ఉదయించి, తూర్పున అస్తమిస్తాడు. 

శుక్రుడు తనచుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడితే, సూర్యుడి చుట్టూ తిరిగేందుకు 224.7 రోజులు పడుతుంది. అంటే శుక్రుడిపై రోజు సమయం, సంవత్సర సమయం కంటే తక్కువ.

శుక్రుడిపై కార్బన్‌ డైఆక్సైడ్‌ ్బ96%్శ, నైట్రోజన్‌  ్బ3%్శ అధికంగా ఉంటాయి. దీంతో అక్కడ హరితగృహ ప్రభావం ఎక్కువ కావడంతో ఉష్ణోగ్రత కూడా అత్యధికంగా 740 రీ ఉంటుంది.

 

భూమి 

ఖగోళ (అంతర్‌) గ్రహాల్లో భూమి అతిపెద్ద గ్రహం. సూర్యుడి చుట్టూ తిరిగే అతిపెద్ద గ్రహాల్లో అయిదో గ్రహం. ఉపరితలంపై ద్రవరూపంలో నీటిని కలిగి, జీవులు మనుగడ సాగించేందుకు అనుకూలమైన ఏకైక గ్రహం భూమి.

ఇది సుమారు 6,400 కి.మీ. వ్యాసార్ధంతో, సాంద్రతతో,  kg  ద్రవ్యరాశితో ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి సుమారు 150 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంది. 

సూర్యుడు - భూమి మధ్య సగటు దూరాన్ని ఖగోళ ప్రమాణం (AU) అంటారు. ఇతర అంతరిక్ష వస్తువుల మధ్య దూరాలను ఖగోళ ప్రమాణం (AU) తో  కొలుస్తారు. 

సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరడానికి సుమారు ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది.

భూమి ఆత్మభ్రమణ కాలం 23.9 గంటలు. పరిభ్రమణ కాలం 365.25 రోజులు. 

భూమి భ్రమణాక్షం సూర్యుడు - భూమి కక్ష్యాతలానికి 23.4ా కోణంతో వాలుగా ఉంటుంది. దీని వల్లే మనకు రుతువులు (Seacsons) ఏర్పడుతున్నాయి.

భూమి ఉపరితలం 70% నీటితో ఆవృతం కావడం; భూ వాతావరణం నైట్రోజన్, ఆక్సిజన్‌లతో నిండి ఉండటం; ఇతర గ్రహశకలాలు భూమిని చేరకుండా వాతావరణం, భూ అయస్కాంత క్షేత్రం రక్షణగా ఉండటం మొదలైన లక్షణాలన్నీ ఈ గ్రహాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

భూమి అంతర్‌ నిర్మాణం ఉడికిన కోడి గుడ్డును పోలి ఉంటుంది. పెంకును పోలిన పైపొరను పటలం (crust)  అని, తెల్లటి మందమైన పొరను పోలిన దాన్ని ప్రావారం(mantle) అని,  మధ్యలో ఉండే పసుపుపచ్చ గోళాన్ని పోలిన దాన్ని కేంద్రకం (core) అని అంటారు.

భూమి కేంద్రకం వద్ద సుమారు 6,500 K ఉష్ణోగ్రత ఉండగా, సూర్యుడి బాహ్యతలంలో సుమారు 6,000 K ఉష్ణోగ్రత ఉంటుంది. కేంద్రకంలోని రేడియోధార్మిక మూలకాల విఘటనం (decay) వల్ల అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి. 

కేంద్రకంలోని ఇనుము లాంటి లోహాల భ్రమణం (ఎలక్ట్రాన్ల చలనం)తో భూమి అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది. సౌర పవనాలు, ఇతర కారణాల వల్ల భూమి వైపు వచ్చే ఆవేశిత కణాలను అయస్కాంత క్షేత్రం కొంత దూరంలోనే నిలిపేస్తుంది. కణాలు గుమికూడి ఉండే ఈ ప్రదేశాలనే ‘వ్యాన్‌ అలెన్‌ పట్టీలు’ అంటారు. 

 భూ అయస్కాంత క్షేత్రం పరిమాణం కాలంతోపాటు మారుతుంది. ఇది ప్రతి 10,000 సంవత్సరాల్లో క్రమంగా క్షీణించి, ఉత్తర-దక్షిణ ధ్రువాలు తారుమారై, తిరిగి వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం భూ అయస్కాంత క్షేత్రô క్షీణత దశలో ఉంది.

 

కుజుడు (అంగారకుడు)

సూర్యుడి నుంచి దూరంలో నాలుగో గ్రహం కుజుడు. బుధుడి తర్వాత అతి చిన్న గ్రహం. 

భూమితో పోలిస్తే దీని పరిమాణం సగం. దీని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 11%. భూమి నుంచి చూస్తే ఇది ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘అరుణ గ్రహం’ అంటారు. గ్రహం తలంలోని ఇనుము తుప్పు పట్టడం వల్ల ఇది ఎర్రగా కనిపిస్తుంది. 

అంగారకుడి ఆత్మభ్రమణ కాలం 24.6 గంటలు. కక్ష్యావర్తన కాలం 687 రోజులు.

అంగారకుడికి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫోబోస్‌ (Phobos), డీమోస్‌ (Deimos).

‘జీవావరణానికి కుజ గ్రహం అనుకూలమా?’ అనే అంశంపై అనేక దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. అందులో భాగంగానే భారత్‌ 2013, నవంబరు 5న మామ్‌ ్బలీవీల్శీ (లేదా) మంగళ్‌యాన్‌ పేరుతో ఒక మిషన్‌ను ప్రయోగించింది. ఇది 2014, సెప్టెంబరు 24 నుంచి కుజుడి చుట్టూ పరిభ్రమిస్తోంది.

 

శని (Saturn)

 గ్రహాలన్నింటిలో శని రెండో అతిపెద్ద గ్రహం. ఇది అత్యల్ప సాంద్రత విలువను కలిగి ఉంటుంది. శని అందమైన గ్రహం.

 దీని చుట్టూ బిలియన్ల సంఖ్యలో చిన్న రాతి ముక్కలు, మంచు, ధూళి తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ గ్రహం చుట్టూ వలయాలుగా కనిపిస్తాయి. 

శని గ్రహంపై ఒక రోజు భూమిపై 10.7 గంటలకు సమానమైతే, సంవత్సర కాలం 29.4 ఏళ్లకు (10,756 రోజులు) సమానం.

శని గ్రహానికి చుట్టూ పరిభ్రమించే 53 ఉపగ్రహాలను అధికారికంగా గుర్తించారు. మరో 29 ఉపగ్రహాలను గుర్తించాల్సి ఉంది. శనికి ఉండే అతిపెద్ద ఉపగ్రహం ‘‘టైటాన్‌’’. దీనిపై వాతావరణం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

 

యురేనస్‌

 సౌరకుటుంబంలోని అతిపెద్ద గ్రహాల్లో మూడోది యురేనస్‌. ఇది చల్లని పవనాలతో ఉంటుంది. దీని చుట్ట్టూ 13 కాంతిహీన వలయాలు, 27 చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. 

కక్ష్యాతలానికి 90ా వాలులో పరిభ్రమించడం దీని ప్రత్యేకత. ఇది టెలిస్కోప్‌తో కనిపెట్టిన తొలి గ్రహం. 1781లో విలియం హెర్షల్‌ దీన్ని కనిపెట్టాడు.

యురేనస్‌ ఆత్మభ్రమణ కాలం 17 గంటలైతే, కక్ష్యావర్తన కాలం  84 సంవత్సరాలు. 

 

నెప్ట్యూన్‌

 ఇది చీకటి, చల్లని, సూపర్‌ సోనిక్‌ పవనాలను కలిగిన పెద్ద మంచు గ్రహం. సూర్యుడి నుంచి అత్యంత దూరంలో ఉంటుంది. భూమి-సూర్యుడి మధ్య దూరంతో పోలిస్తే దీని దూరం 30 రెట్లు ఎక్కువ. ఈ గ్రహాన్ని చేరే సౌర కాంతి తీవ్రత భూమిని చేరే తీవ్రతలో 900 వంతు ఉంటుంది. 

 దీని ఆత్మభ్రమణకాలం 16 గంటలైతే, కక్ష్యావర్తనకాలం 165 సంవత్సరాలు ్బ60,190 రోజులు). 

  దీని చుట్టూ14 ఉపగ్రహాలను, తొమ్మిది వలయాలను గుర్తించారు.

 

బృహస్పతి(Jupiter)

ఇది సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం. అన్ని గ్రహాల మొత్తం ద్రవ్యరాశికి రెట్టింపు ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది.

బృహస్పతిపై మనకు కనిపించే చారలు (Stripes), సుడులు (Swirts) నిజానికి అక్కడి హైడ్రోజన్, హీలియం; వాతావరణంలో తేలే అమ్మోనియా, నీటి మేఘాలు. ఇవి చల్లగా ఉంటాయి. 

బృహస్పతిపై ప్రత్యేకంగా పెద్ద ఎర్రని మచ్చ (Great Red Spot) కనిపిస్తుంది. ఇది అక్కడ వందల సంవత్సరాలుగా ఏర్పడిన పెద్ద తుపాన్‌ను (భూమి కంటే పెద్దది) సూచిస్తుంది. బృహస్పతిపై ఉండే వలయాలు   అక్కడి ధూళి వల్ల ఏర్పడ్డాయి. 

బృహస్పతిపై ఒక రోజు భూమిపై పది గంటలకు సమానమైతే, సంవత్సర కాలం 12 ఏళ్లకు (4,333 రోజులు) సమానం.

బృహస్పతి, దానికున్న ఉపగ్రహాలన్నింటినీ కలుపుకుని ఒక చిన్న సౌరవ్యవస్థను పోలి ఉంటుంది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు 53 ఉపగ్రహాలను అధికారికంగా గుర్తించారు. మరో 26 ఉపగ్రహాలను గుర్తించాల్సి ఉంది.

 

చంద్రుడు

భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. సౌర వ్యవస్థలో సుమారు 200 కంటే ఎక్కువ ఉపగ్రహాలు ఉండగా, చంద్రుడు పరిమాణంలో అయిదో స్థానంలో ఉన్నాడు. మనకు రాత్రి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన, పెద్ద ఖగోళ వస్తువు చంద్రుడు. 

చంద్రుడి ఉపస్థితి (Presence) కారణంగానే భూమి తన అక్షంపై స్థిరంగా భ్రమణం చెందుతూ, స్థిర వాతావరణంతో, జీవులు జీవించడానికి అనువుగా ఉండగలుగుతోంది. 

చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం వల్లే సముద్రాల్లో అలలు (tides) ఏర్పడుతున్నాయి. 

కుజుడి పరిమాణంలోని వస్తువు భూమిని ఢీకొట్టడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడని శాస్త్రవేత్తల అంచనా. తోకచుక్కలు, గ్రహశకలాలు చంద్రుడ్ని ఢీకొట్టడం వల్ల దానిపై ఎక్కువగా గుంతలు (Craters), గోతులు (Pits)ఏర్పడ్డాయి. 

చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం, భూమి చుట్టూ తిరిగిరావడానికి పట్టే కాలంతో సమానం కాబట్టి,  మనం నిరంతరం చంద్రుడి ఒకవైపు తలాన్ని మాత్రమే చూస్తాం. 

భూమి నుంచి చంద్రుడు 3,85,000  కి.మీ. దూరంలో ఉన్నాడు. చంద్రుడి నుంచి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం సుమారు 1.2 సెకన్లు.

Posted Date : 24-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌