• facebook
  • whatsapp
  • telegram

ఆవరణశాస్త్ర సంబంధ అంశాలు - ఆవరణ వ్యవస్థ

ఆవరణశాస్త్ర సంబంధ అంశాలను అధ్యయనం చేసే నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణంగా ఆవరణ వ్యవస్థను పేర్కొంటారు. ఆవరణ వ్యవస్థను రెండు విధాలుగా విభజిస్తారు. 

అవి: 1. సహజ ఆవరణ వ్యవస్థ 

       2. కృత్రిమ ఆవరణ వ్యవస్థ

 

సహజ ఆవరణ వ్యవస్థ

  సహజంగా ప్రకృతిలో వ్యవస్థితమయ్యే ఆవరణ వ్యవస్థను సహజ ఆవరణ వ్యవస్థ అంటారు. ప్రకృతి వనరులే వీటి మనుగడకు మూలాధారం. అడవులు, పచ్చిక భూములు, ఎడారులను సహజ భౌమ్య ఆవరణ వ్యవస్థలుగా పేర్కొంటారు. నదులు, కొలనులు మొదలైనవాటిని జల సంబంధ ఆవరణ వ్యవస్థలుగా పరిగణిస్తారు.

 

కృత్రిమ ఆవరణ వ్యవస్థ

​​​​​​​  మానవ ప్రమేయంతో నిర్వహించే వాటిని కృత్రిమ ఆవరణ వ్యవస్థలు అంటారు. 

ఉదా: పంటపొలాలు, పండ్ల తోటలు, ఎక్వేరియమ్‌లు మొదలైనవి.

 

లక్షణాలు:

​​​​​​​  ఏ ఆవరణ వ్యవస్థ అయినా జీవ - నిర్జీవ అనుఘటకాలతో నిర్మితమై ఉంటుంది. ఇవి ఆవరణ వ్యవస్థ పనితీరును సైతం ప్రభావితం చేస్తాయి.

 ఆవరణ వ్యవస్థ పనితీరును ఆహారపు గొలుసులు, వలలు, జీవావరణ సంబంధ పిరమిడ్‌లు, వ్యవస్థలో శక్తి ప్రవాహం, జీవ భౌమ్య రసాయన వలయాల ద్వారా అవగతం చేసుకోవచ్చు.

 

స్థాయులు

 ఆవరణ వ్యవస్థలో జీవ అనుఘటకాలన్నీ అనేక పోషక స్థాయుల్లో, వాటి శక్తి విలువల ఆధారంగా వివిధ స్థానాలను కలిగి ఉంటాయి. 

​​​​​​​  ఉత్పత్తిదారులైన మొక్కలు, వృక్షాలు మొదలైనవి మొదటి శక్తిస్థాయి లేదా పోషక స్థాయిలో ఉంటాయి. 

​​​​​​​  మొక్కలపై ఆధారపడేవి శాకాహారులు. వీటినే ప్రథమ వినియోగదారులు అంటారు. ఇవి రెండో పోషక స్థాయిలో ఉంటాయి.

​​​​​​​ శాకాహారులపై ఆధారపడేవి మాంసాహారులు. వీటిని ద్వితీయ వినియోగదారులు అంటారు. ఇవి మూడో స్థానంలో ఉంటాయి. 

 

ఆహారపు గొలుసు

ఉత్పత్తిదారుల నుంచి మాంసాహారుల వరకు సాగే పోషక స్థాయి ఆధారిత గొలుసును ఆహారపు గొలుసు అంటారు. దీన్ని భౌమ్య, జలావరణ వ్యవస్థల్లో గమనించొచ్చు.

 భౌమ్య ఆవరణ వ్యవస్థల్లో ఆహారపు గొలుసుకు ఉదాహరణ:

 నీటి సంబంధ ఆవరణ వ్యవస్థల్లో ఆహారపు గొలుసుకు ఉదాహరణ:

 ఆహారపు గొలుసుల ద్వారా ఆవరణ వ్యవస్థలో ఉండే జంతువుల మధ్య ఆహార సంబంధాలను కనుక్కుంటారు. హానికరమైన విషపూరితాల వల్ల కలిగే కాలుష్యాన్ని, జీవులపై వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి, బయో మాగ్నిఫికేషన్‌ లాంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఆహారపు గొలుసులు ఉపయోగపడతాయి.

 ప్రకృతిలో ఆహారపు గొలుసులు విడివిడిగా వ్యవస్థితమై ఉండలేవు. ఇవి ఒకదానికొకటి సంధానించి ఉంటాయి. దీని వల్ల ఆహారపు గొలుసుల పరస్పరాధారిత అనుసంధానం జరిగి, ఆహారపు వల ఏర్పడుతుంది.

 పర్యావరణ సమతౌల్యతను సాధించడంలో ఆహారపు గొలుసు ప్రధాన పాత్ర వహిస్తుంది. పర్యావరణంలో పాములను ఎక్కువగా పట్టి, సంహరిస్తుంటే ఎలుకల బెడద పెరుగుతుంది. జీవుల మధ్య ఆహార సంబంధమైన సమతౌల్యత జనాభా క్రమబద్ధీకరణకు తోడ్పడుతుంది.

 

ఆవరణ సంబంధ పిరమిడ్‌లు

 ఆవరణ వ్యవస్థలో జీవ అనుఘటకాల మధ్య సంబంధాన్ని ఇకలాజికల్‌ పిరమిడ్‌ల ద్వారా పటం రూపంలో వ్యక్తపరుస్తారు. వీటిని మొదటగా బ్రిటిష్‌ ఆవరణ శాస్త్రవేత్త చార్లెస్‌ ఎల్టన్‌ ప్రతిపాదించారు.  అందుకే వీటిని ఎల్టోనియన్‌ పిరమిడ్‌లు అని కూడా అంటారు.

 ఆవరణ సంబంధ పిరమిడ్‌లు మూడు రకాలుగా ఉంటాయి. 

i) సంఖ్యా సంబంధ పిరమిడ్‌ 

ii) జీవ ద్రవ్య పిరమిడ్‌ 

iii) శక్తి సంబంధ పిరమిడ్‌

 సాధారణంగా ఆవరణ సంబంధ పిరమిడ్‌లు నిటారుగా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శక్తి పిరమిడ్‌ మినహా మిగిలినవి తిరిగిన పిరమిడ్‌ ఆకారం లేదా కండె రూప అమరికల్లో ఉంటాయి.

 ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఎప్పుడూ ఒకే దిశలో జరుగుతుంది. ఇది ఉత్పత్తిదారుల నుంచి ఉన్నత శ్రేణి మాంసాహార జీవుల దిశగా ప్రయాణిస్తుంది. ఇది ఉష్ణగతిక శాస్త్ర నియమాలకు లోబడి ఉంటుంది. ప్రతి శక్తి స్థాయిలో కొంత శక్తి వృథాగా పోతుంది. శక్తి ప్రవాహం ఒక శక్తి స్థాయి నుంచి వేరొక స్థాయికి మారే క్రమంలో కొంత శక్తి తగ్గుతూ పోతుంది. 

 అన్ని ఆవరణ వ్యవస్థలకు సూర్యుడే ప్రధాన శక్తి వనరు. 

 శక్తి ప్రవాహం మొక్కలు లేదా వృక్షాలు తర్వాత శాకాహారులు ఆపై మాంసాహారులు దాని తర్వాత ఉన్నత శ్రేణి మాంసాహారులు ఇలా ఒక శ్రేణిగా జరుగుతూ ఉంటుంది.

 

జీవ భౌమ్య రసాయన వలయం

​​​​​​​ ఆవరణ వ్యవస్థలో లవణాలు జీవుల నుంచి మృత్తికకు - మృత్తిక నుంచి వాతావరణానికి - వాతావరణం నుంచి జీవుల్లోకి ఒక వలయం రూపంలో ప్రయాణిస్తాయి. దీన్నే జీవ భౌమ్య రసాయన వలయం అంటారు. ఇవి మూడు రకాలు.

1) జల చక్రం లేదా హైడ్రలాజిక్‌ వలయం

2) వాయు వలయాలు: కార్బన్, హైడ్రోజన్, నత్రజని వలయాలు

3) సెడిమెంటరీ వలయాలు: కాల్షియం, ఫాస్ఫరస్‌ వలయాలు

 

అనుక్రమం

​​​​​​​ పరిసరాలకు అనుగుణంగా జీవుల నిర్మాణంలో మార్పులు జరగడమనేది అన్ని సముదాయాల్లో ఒక ముఖ్య లక్షణం. ఇవి ఒక నిర్దిష్ట క్రమంలో, దిశలో, భౌతిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతాయి. ఈ మార్పులన్నీ చివరకు ఒక స్థిరమైన, పక్వమైన సమతా స్థితికి దగ్గరగా ఉన్న మొక్కల సంఘాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే చరమ సంఘం అంటారు. ఈ విధంగా ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘటనంలో ఊహించగల మార్పులు జరగడాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అంటారు.

​​​​​​​ ఒక ప్రదేశంలో వివిధ సముదాయాలు నిశ్చితమైన క్రమంలో వరుసగా మారే విధానాన్ని క్రమకం అంటారు. అనుక్రమంలో మాధ్యమిక సముదాయాలను క్రమకీయ దశలు లేదా క్రమకీయ సముదాయాలు అంటారు. మాధ్యమిక క్రమకీయ దశల్లో జీవజాతుల వైవిధ్యంలో మార్పులు, జాతుల సంఖ్య అధికమవడం, జీవ ద్రవ్యరాశి మొత్తం పెరగడం లాంటివి జరుగుతాయి.

​​​​​​​ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సముదాయాలన్నీ భూమిపై జీవం పుట్టినప్పటి నుంచి మిలియన్‌ సంవత్సరాల అనుక్రమం ద్వారా ఏర్పడినవే.

​​​​​​​ అనుక్రమం అనేది ముందుగా ఎలాంటి జీవజాతులు లేని చోట మొదలయ్యే ప్రక్రియ. అంటే నగ్నశిలా ప్రదేశాలు లేదా ఏదైనా ప్రాంతంలోని జీవులు ఏ కారణంగానైనా నశించిపోయిన ప్రదేశాలైనా కావొచ్చు. వీటిలో మొదటిదాన్ని ప్రాథమిక అనుక్రమం అని, రెండోదాన్ని ద్వితీయ అనుక్రమం అని అంటారు.

ప్రాథమిక అనుక్రమం: లావా చల్లారాక ఏర్పడిన ప్రదేశాలు, రాతి నేలలు, కొత్తగా ఏర్పడిన సరస్సులు లేదా రిజర్వాయర్లు ప్రాథమిక అనుక్రమం జరిగే ప్రదేశాలకు ఉదాహరణలు. ఇందులో కొత్త జీవ సముదాయాల స్థాపన నెమ్మదిగా జరుగుతుంది.

ద్వితీయ అనుక్రమం: ఒక ప్రదేశంలో మొదట ఉన్న జీవ సముదాయాలన్నీ నాశనం అయ్యాక ద్వితీయ అనుక్రమం మొదలవుతుంది. పాడైన వ్యవసాయ భూములు; నిప్పు వల్ల, చెట్లు నరకడం వల్ల నాశనమైన అరణ్యాలు; వరదలకు గురైన నేలలు లాంటి ప్రదేశాలు దీనికి ఉదాహరణ.

​​​​​​​ ఆవరణ సంబంధ అనుక్రమ అవగాహన ప్రధానంగా వృక్ష సంపదలోని మార్పులను లక్ష్యంగా చేసుకుని ఉంటుంది. ఈ మార్పులు వివిధ జంతువుల ఆహార, ఆవాస పరిస్థితులపై ప్రభావాన్ని చూపిస్తాయి. దీని కారణంగా అనుక్రమం జరిగే కొద్దీ జంతువులు, విచ్ఛిన్నకారుల సంఖ్య రకాలు మారుతూ ఉంటాయి.

​​​​​​​ ప్రాథమిక లేదా ద్వితీయ అనుక్రమం జరిగే సమయంలో నిప్పు, అడవుల నిర్మూలన లాంటి సహజ లేదా మానవ ప్రేరిత అవరోధాలు అనుక్రమంలోని ఒక నిర్దిష్ట క్రమకీయ దశ (సీరల్‌ దశ)ను దాటి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఈ అవరోధాల వల్ల ఏర్పడే కొత్త పరిస్థితులు కొన్ని జాతుల వృద్ధిని ప్రోత్సహించి, మరికొన్ని జాతుల క్షీణతకు కారణమవుతాయి

​​​​​​​ మొక్కల సహజ ఆవాసాల ఆధారంగా వాటి అనుక్రమాల్లో కొన్ని రకాలను గుర్తించారు. వాటిలో ప్రధానమైనవి జల క్రమకం (హైడ్రోసీర్‌), జలాభావ క్రమకం (జీరోసీర్‌). 

​​​​​​​ నీరు లేదా నీటి పరిసరాలతో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని జలక్రమం అనీ, జలాభావ లేదా శుష్క ఆవాసాల్లో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని జలాభావ క్రమకం అని పిలుస్తారు.

​​​​​​​ జలక్రమకం తేమ ప్రాంతాల్లో ప్రారంభమై వివిధ క్రమకీయ దశ సంఘాల ద్వారా జలాభావ పరిస్థితుల నుంచి సాధారణ పరిస్థితులుగా మారతాయి. దీనికి విరుద్ధంగా జలాభావ క్రమకం శుష్క ప్రాంతాల్లో మొదలై వివిధ క్రమకీయ దశ సంఘాల ద్వారా శుష్క ప్రదేశాల నుంచి సాధారణ పరిస్థితులుగా మారతాయి. 

​​​​​​​ చివరకు జలక్రమకం, జలాభావ క్రమకాలు అధిక శుష్కత, అధిక తేమ లేని మధ్యస్థ స్థితిగా రూపాంతరం చెంది, ఆవరణశాస్త్ర సంబంధ స్థిరత్వం పొందే దిశగా క్రమకీయ దశలను కలిగి ఉంటాయి.

 

ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు

 ఆవరణ వ్యవస్థలోని జీవులు వాటి మధ్య పరస్పర సంబంధాలు, వాటి చుట్టూ ఉండే భౌతిక పరిసరాలకు వివిధ రకాలుగా ఉపయోగకారులుగా ఉంటాయి. 

 మిలీనియం ఎకోసిస్టమ్‌ అసెస్‌మెంట్‌ ప్రకారం ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలను నాలుగు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు.

i) ఆధారపూర్వక సేవలు: ఖనిజ లవణాల వలయం, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం, మృత్తిక ఏర్పడటం, మొక్కల పరాగ సంపర్కానికి సహకరించడం.

ii) సరకుల రూప సేవలు: ఆహారం, నారలు, ఇంధనం, నీరు రూపాల్లో సేవలు.

iii) నియంత్రణాత్మక సేవలు: శీతోష్ణస్థితి పరిస్థితుల నియంత్రణ, నీటి పరిశుద్ధత, వరదల నివారణ.

iv) సంస్కృతి సంబంధ సేవలు: విద్య, ఆటవిడుపు, సౌందర్య విలువలు మొదలైనవి.

 మొత్తం ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవల్లో మృత్తిక ఏర్పడటం 50% ఉంటుంది. ఇతర సేవలు అన్నీ 50% వరకూ ఉంటాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. బాగా క్షీణించి, పరిమాణంలో చిన్నగా ఉండే పత్రాలు, పొలుసు ఆకుల్లా ఉండే నిర్మాణాలు, కంటక రూపాంతర పత్రాలు మొదలైనవి ఏ మొక్కల్లో ఉంటాయి?

1) ఎడారి మొక్కలు    2) నీటి మొక్కలు      3) సమోద్భీజాలు     4) మాంగ్రూవ్‌లు

జ: ఎడారి మొక్కలు​​​​​​​

 

2. ఆవరణ సంబంధ శక్తి పిరమిడ్‌ ఎలా ఉంటుంది?

1) తిరగేసిన పిరమిడ్‌ ఆకారంలో     2) ఎల్లప్పుడూ నిటారుగా

3) కొన్నిసార్లు కండె ఆకారంలో     4) కొన్నిసార్లు నిటారుగా

జ: ఎల్లప్పుడూ నిటారుగా​​​​​​​

 

3. ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలం.....

1) సూర్యుడు     2) భూమి        3) నీరు          4) గాలి

జ: సూర్యుడు           ​​​​​​​

 

Posted Date : 18-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌