• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - జలవనరుల ఆవశ్యకత 

 భూ ఉపరితలంపై మొత్తం జలవనరుల్లో 97% ఉప్పునీరు ఉంటే, మిగిలిన 3% మంచినీరు. ఇందులో 68.7% మంచు కొండలు, హిమనీ నదాల రూపంలో ఉంటే, 30% భూగర్భజలాలు. మిగిలిన 1.3% మంచినీరు సరస్సులు, నదులు, చిత్తడి ప్రాంతాల్లో ఉంది.

 ప్రపంచ ఉపరితల వైశ్యాలంలో భారత్‌ 2.4% కలిగి ఉంది. ప్రపంచంలోని మంచినీటి వనరుల్లో మనదేశం 4% జలవనరులు కలిగి ప్రపంచ 10 దేశాల్లో ఒకటిగా నిలిచింది.

 భారతదేశాన్ని నీటి ఒత్తిడి ఉన్న ప్రాంతంగా ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపీసీసీ) గుర్తించింది. ఈ విషయాన్ని తన నాలుగో నివేదిక అంచనాల్లో వెల్లడించింది. 

 2001 భారత జనాభా లెక్కల ప్రకారం ఆ ఏడాది నీటి లభ్యత 1816 క్యూబిక్‌ మీటర్లు ఉంటే, 2015 నాటికి తలసరి నీటి లభ్యత 1720.29 క్యూబిక్‌ మీటర్లుగా నమోదైంది. ప్రపంచ తలసరి నీటి లభ్యతలో భారత్‌ 133వ స్థానంలో ఉంది. 

 ప్రపంచవ్యాప్తంగా నీటి వనరుల డిమాండ్‌ ఏటా 1% పెరుగుతోంది. అందుకే ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆరో ప్రాధాన్యంగా స్థిరమైన నీటి నిర్వహణను చేర్చింది.

భారతదేశంలో నీటివనరులు

భారతదేశంలో నాలుగు రకాల నీటివనరులు ఉన్నాయి. అవి: 

1. ఉపరితల జలవనరులు  

2. భూగర్భ జలవనరులు

3. వాతావరణ జలవనరులు 

4. సముద్ర/ మహాసముద్ర జలవనరులు

ఉపరితల జలవనరులు

భూమిపై కనిపించే నీటిని ఉపరితల జలం అంటారు. ఇందులో నదులు, సరస్సులు, చెరువులు, కాలువలు మొదలైనవి ఉంటాయి. 

 ఉపరితల నీరు సహజసిద్ధంగా అవపాతం ద్వారా వస్తుంది. వీటికి మూలాధారం నదులే. 

 ప్రస్తుతం భారతదేశంలో మొత్తం సగటు వార్షిక ఉపరితల ప్రవాహం 1633 చ.కి.మీ. నుంచి 1881 చ.కి.మీ. వరకు ఉంది. 

 మన దేశంలో 12 ప్రధాన నదులు 20,000 చ.కి.మీ. కంటే ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. వీటన్నింటి ద్వారా 25.3 లక్షల చ.కి.మీ. పరివాహకప్రాంతం అందుబాటులో ఉంది.

 భారతదేశంలో మొత్తం వార్షిక నీటి ప్రవాహంలో సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదులు 2/3 వంతు ఉపరితల నీటి ప్రవాహాన్ని కలిగి ఉన్నాయి. 

ఉదా: సగటు వార్షిక నీటి సామర్థ్యం బ్రహ్మపుత్రలో 537 చ.కి.మీ., గంగలో 525 చ.కి.మీ., గోదావరిలో 110 చ.కి.మీ. ఉంటే కృష్ణా నదిలో 78 చ.కి.మీ. ఉంది.

 అధిక నీటి నిల్వ సామర్థ్యంతో ఉన్నది గంగానది. అత్యధిక వార్షిక ప్రవాహ నీటి సామర్థ్యం కలిగి ఉన్నది -  బ్రహ్మపుత్ర. ఈ నది అతి తక్కువ నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

 ప్రస్తుతం ఉపయోగిస్తున్న నీటివనరుల్లో 40% గంగ - బ్రహ్మపుత్ర - మేఘన నదీ వ్యవస్థ నుంచే లభ్యం అవుతున్నాయి.

భారతదేశంలో నీటి డిమాండ్‌ 

2025 నాటికి మనదేశంలో వ్యవసాయానికి 910 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (బీసీఎం), తాగునీటికి 73 బీసీఎం, విద్యుత్‌ శక్తికి 15 బీసీఎం, పరిశ్రమలకు 23 బీసీఎం నీటి డిమాండ్‌ ఉంది. ఇది మొత్తంగా 1093 బీసీఎం.

 వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు అందించే విషయంలో భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 

 దేశంలో 1/8 వ వంతు భూభాగంలో వరదలు సంభవిస్తే, 1/6 వ వంతు భాగంలో కరవు ఏర్పడుతుంది.

 భారత రాజ్యాంగంలో నీటి వనరులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. కేంద్ర-రాష్ట్రాల మధ్య నీటి నిర్వహణకు సంబంధించిన అంశాలను ఆర్టికల్‌ 262లో వివరించారు.

 రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్, మొదటి లిస్ట్‌ 56వ ఎంట్రీ ప్రకారం అంతర్‌ రాష్ట్ర నదులు, నదీ లోయలకు సంబంధించిన నియంత్రణ, అభివృద్ధి బాధ్యత పూర్తిగా కేంద్రం ఆధీనంలోనే ఉంటుంది.

 రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్, రెండో లిస్ట్‌ 17వ ఎంట్రీ ప్రకారం నీటి సరఫరా, నీటి పారుదల డ్రైనేజీ, ఆనకట్టలు, రిజర్వాయర్లు, జల విద్యుత్‌ మొదలైనవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. 

 రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 262 ప్రకారం అంతర్‌ రాష్ట్ర జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే 1956లో అంతర్‌ రాష్ట్ర నదీ జలాల బోర్డు, అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాస్పద చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జల వివాదం సంభవిస్తే, కేంద్రం దీని పరిష్కారానికి ఒక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయొచ్చు.

ఉదాహరణలు: 

 కేంద్రం 1969, ఏప్రిల్‌ 10న గోదావరి - కృష్ణా నదీ జలాల వివాదంపై ఆర్‌.ఎస్‌. బచావత్‌ అధ్యక్షతన ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. 1969 నుంచి 2018 వరకు దేశవ్యాప్తంగా 9 ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు.

 ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య వంశధారా నదీ జలాల విషయంలో వివాదం చోటు చేసుకుంది. దీని పరిష్కారానికి 2010 లో ముకుందం శర్మ అధ్యక్షతన వంశధార నదీ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశారు.

 ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య తలెత్తిన నదీజలాల వివాద పరిష్కారానికి 2018లో జస్టిస్‌  ఎ.ఎం.ఖాన్విల్కర్‌ అధ్యక్షతన మహానది జలాల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశారు.

 కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారం కోసం 2004, ఏప్రిల్‌ 2న రెండో ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. దీని అధ్యక్షుడు బ్రిజేష్‌ కుమార్‌. ఇది కృష్ణా నదిలో మొత్తం 2130 టీఎంసీల జలాలు ఉన్నట్లు గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించింది.

భూగర్భ జలవనరులు

భూమి ఉపరితలం కింద ఉండేవాటిని భూగర్భ జలవనరులుగా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా మట్టి లేదా రాతి పొరల మధ్య నుంచి, రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంటాయి.

   భూమి లోపల రాతి పొరల్లో నిల్వ ఉన్న నీటిని జలస్తరాలు లేదా ఆక్వాఫెర్‌ అంటారు.

    అంతర్భాగ జలస్తరాల్లో నీరు నింపే ప్రాంతాన్ని సంతృప్త మండలం (Saturated Zone) అంటారు. సింధు-గంగ-బ్రహ్మపుత్ర ఒండ్రు ప్రాంతంలో ఈ రకమైన భూగర్భ జలాల రిజర్వాయర్‌ ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది.

   అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం భారతదేశంలో 59% భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. దీంతో మొత్తం అంతర్భాగ జల డిమాండ్‌ 2025 నాటికి 680 నుంచి 833 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు పెరగొచ్చని  ఇది పేర్కొంది.

    భారత ప్రభుత్వం 2016, మేలో భూగర్భ జలాల పరిరక్షణ, నియంత్రణ, నిర్వహణ కోసం ఒక నమూనా బిల్లును పార్లమెంట్‌లో ప్రతిపాదించింది.

 

మనదేశంలో భూగర్భ జలాలను, పొరలను అన్వేషించడానికి హరియాణ మొదటిసారి ఆక్వాఫెర్‌ మ్యాపింగ్‌ను ప్రవేశపెట్టింది.

భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాలు: దిల్లీ, హరియాణ, పంజాబ్, రాజస్థాన్‌.

నీటి వనరులను పునర్‌వినియోగించే రాష్ట్రాల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది.

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ నివేదిక ప్రకారం అత్యంత కలుషితమైన భూగర్భ జలాలు ఉన్న ప్రాంతం కర్ణాటకలోని భాగల్‌కోట్‌. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40% నీటి సరఫరా కొరత ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

 


 

Posted Date : 23-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌