• facebook
  • whatsapp
  • telegram

మన విశ్వం - అంతరిక్ష శిథిలాలు 

తోకచుక్కలు (comets)

 సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలే తోకచుక్కలు. ఇవి నక్షత్రాలు కావు. 

ఇవి ఘనీభవించిన మంచు గోళాలు. సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు అతి శీతలంగా ఉంటాయి. 

 తోకచుక్కలు సౌర వ్యవస్థ నుంచి చాలా దూరంలో అతి పెద్ద దీర్ఘవృత్తాకార వలయాల్లో పరిభ్రమిస్తాయి. సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే వీటిని మనం కొంతకాలం పాటు చూడొచ్చు.

 సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు తోకచుక్కలు చిన్న పరిమాణంలో ఉంటాయి. సూర్యుడికి సమీపంలోకి రాగానే అందులోని మంచు కరిగి, వాయువులు వ్యాకోచించి, చాలా పెద్దగా కనిపిస్తాయి. 

 సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు వీటికి తోక ఉండదు. వ్యాకోచించిన తర్వాత తల, తోక విడివిడిగా కనిపిస్తాయి. తోకలోని వాయువులు, ధూళి కణాలపై సూర్యకాంతి పడి, పరావర్తనం చెందుతుంది. దీంతో తోక భాగం ప్రకాశిస్తుంది.

 సూర్యకాంతి కలగజేసే పీడనం, సౌర పవనాల వల్ల తోకలోని ధూళి, వాయువులు సూర్యుడి సమీపంలో ఉండలేవు. దీంతో తోక భాగం ఎప్పుడూ సూర్యుడికి దూరంగానే ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువ భాగం తోకచుక్కలు సూర్యుడి నుంచి చాలా దూరంలో సురక్షితంగా పరిభ్రమిస్తాయి. ఇలా కాకుండా సూర్యుడికి అతి సమీపంలోకి వచ్చే లేదా ఢీకొట్టే తోకచుక్కలు (Sungrazers) ముక్కలై, ఆవిరైపోతాయి.

 కైపర్‌ బెల్ట్‌ (Kuiper belt), ఓట్‌ మేఘం (Oort Cloud) లో మిలియన్ల సంఖ్యలో తోకచుక్కలు ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటివరకు సుమారు 3,750 తోక చుక్కలను గుర్తించారు. 

 తక్కువ పరిభ్రమణకాలం (200 సంవత్సరాల కంటే తక్కువ)తో తిరిగే తోకచుక్కలు నెప్ట్యూన్‌కి వెలుపల ఉండే కైపర్‌ బెల్ట్‌లో పరిభ్రమిస్తాయి. ఇవి సూర్యుడి నుంచి సుమారు 3050 AU(Austronomical Units) దూరంలో ఉంటాయి. కైపర్‌ బెల్ట్‌ వంద కిలోమీటర్ల మందంతో ఉంటుంది. దీనిలో సుమారు 70,000 తోకచుక్కలు ఉన్నట్లు అంచనా.

 ఎక్కువ పరిభ్రమణ కాలంతో తిరిగే తోకచుక్కల సముదాయం ఓట్‌ మేఘంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది సూర్యుడి నుంచి 50100 వేల ఖగోళ ప్రమాణాల దూరంలో ఉంది. ఇందులో ట్రిలియన్ల సంఖ్యలో మంచు గోళాలను గుర్తించారు.

 సౌర వ్యవస్థ ఆవిర్భావాన్ని అంచనా వేయడానికి తోకచుక్కల అధ్యయనం తోడ్పడింది. ప్రాణులు జీవించడానికి అవసరమైన నీటిని, కర్బన సమ్మేళనాలను తోకచుక్కలు (ధూమకేతువులు) భూమికి చేరవేశాయని శాస్త్రవేత్తల అభిప్రాయం.

 

కొన్ని ముఖ్యమైన తోకచుక్కలు

షూమేకర్‌ లెవి - 9 (Shoemaker-Levy 9):

 ఇది 1992లో బృహస్పతి గ్రహాన్ని ఢీకొట్టడం వల్ల 21 ముక్కలుగా విడిపోయి తనకు తానుగా వెలుగులోకి వచ్చింది. 

 దీన్ని 1993లో కరోలిన్, షూమేకర్, డేవిడ్‌ లెవి అనే ఖగోళశాస్త్రవేత్తలు గుర్తించారు. 

 ఈ శకలాలు 1994 వరకు వరుసగా, బృహస్పతిని ఢీకొడుతూనే ఉన్నాయి. ఇది విరజిమ్మిన వెలుగులను టెలిస్కోప్, గెలీలియో లాంటి అంతరిక్ష శోధకాల (Space Probes) ద్వారా శాస్త్రవేత్తలు వీక్షించారు.

 

హయకుటాకే (Hyakutake): 

 దీన్ని 1996లో గుర్తించారు. గత 200 సంవత్సరాల్లో భూమికి అత్యంత సమీపంలో ప్రయాణించిన తోకచుక్కగా ఇది గుర్తింపు పొందింది. 

 దీన్ని జపాన్‌కు చెందిన యుజి హయకుటాకే అనే పరిశోధకుడు కనుక్కున్నాడు. దీని కక్ష్యావర్తన కాలం 17,000 సంవత్సరాలు.

 

హేల్‌-బాప్‌ (Hale-Bopp):

 1995, జులై 23న అలెన్‌ హేల్, థామస్‌ బాప్‌ అనే పరిశోధకులు ఈ తోకచుక్కను కనుక్కున్నారు. 

​​​​​​​ఇది 1997 జనవరిలో భూమికి సమీపంలోకి వచ్చింది. 

​​​​​​​ ఇది హేలీ తోకచుక్క కంటే పెద్దగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది బృహస్పతి కక్ష్యలో ఉన్నప్పుడే ్బ1995్శ మనకు కనిపించింది.

 

టెంపుల్‌ - టటుల్‌ (Temple-Tuttle)

 టెంపుల్, టటుల్‌ అనే ఇద్దరు పరిశోధకులు విడివిడిగా ఈ తోకచుక్కను వరుసగా 1865, 1866లో కనుక్కున్నారు. 

​​​​​​​ ఇది పరిమాణంలో చిన్నగా ఉంటుంది. దీని కక్ష్యావర్తన కాలం 33 సంవత్సరాలు. 

​​​​​​​ టెంపుల్‌-టటుల్‌ 1998లో సూర్యుడికి సమీపంగా వచ్చింది. దీన్ని 2031లో మళ్లీ చూడొచ్చు.

​​​​​​​ ఏటా వచ్చే లియోనిడ్‌ (Leonid) ఉల్కాపాతాలకు టెంపుల్‌ - టటుల్‌ మూలం అని శాస్త్రవేత్తల అభిప్రాయం. 

​​​​​​​ తోకచుక్క సూర్యుడ్ని సమీపించినప్పుడు విడుదలయ్యే శకలాలు, కణాలు భూవాతావరణంలోకి ప్రవేశించి మండుతూ వెలుగులను విరజిమ్ముతాయి. వీటినే ఉల్కాపాతాలు అంటారు.

 

ఉల్కలు (Meteoroids)

 అంతరిక్షంలో తోకచుక్కలు, గ్రహశకలాలు లేదా ఇతర ఖగోళ వస్తువుల విచ్ఛిన్నంతో వెలువడిన ఘనరూప అవశేష ఖండాలను (Pieces) ఉల్కలు అంటారు. 

 ఉల్కలు భూమి వాతావరణంలోకి వేగంగా ప్రవేశిస్తున్నప్పుడు, ఘర్షణ కారణంగా అవి మండుతూ ఆకాశంలో కాంతి చారలను (వెలుగులను) ఏర్పరుస్తాయి. వీటినే ఉల్కాపాతాలు అంటారు.

 అత్యధిక ఉల్కలకు జన్మస్థానం గ్రహశకలాల పట్టి (Asteroid Belt).

 గ్రహశకలాలు పరిమాణంలో పెద్దగా ఉండి, మిలియన్ల సంవత్సరాలుగా వేడిని కలిగి ఉంటాయి. వాటి కేంద్రం ఇనుముతో, పైపొరలు రాతి-ఇనుముల మిశ్రమంతో, ఉపరితలం మందమైన రాతితో నిర్మితమై ఉంటాయి.

 రెండు గ్రహశకలాలు పరస్పరం అభిఘాతం (Collision) చెందినప్పుడు అధిక సంఖ్యలో రాతి ఉల్కలను; అల్ప సంఖ్యలో ఇనుము, ఇనుము-రాతి మిశ్రమ ఉల్కలను ఏర్పరుస్తాయి.

 

గ్రహశకలాలు (Asteroids)

 సౌర వ్యవస్థలో సుమారు ఒక మిలియన్‌ గ్రహశకలాలు ఉంటాయి. ఇవి కిలోమీటర్‌ కంటే ఎక్కువ పెద్దవిగా ఉండి, నిరంతరం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తాయి. వీటిని మైనర్‌ గ్రహాలు అని కూడా అంటారు. 

 నిహారిక నుంచి గ్రహాలు ఏర్పడేక్రమంలో, గ్రహంగా రూపాంతరం చెందని అవశేష ఘన పదార్థాలు గ్రహశకలాలుగా మారాయి. ఉల్కలతో పోలిస్తే వీటి పరిమాణం చాలా ఎక్కువ.

 గ్రహశకలాలు అధిక సంఖ్యలో అంగారకుడు (Mars), బృహస్పతి (Jupiter) మధ్య ఉంటూ, సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఈ సముదాయాన్నే గ్రహశకలాల పట్టీ (Asteroid Belt) అంటారు. 

 పట్టీలోని గ్రహశకలాల మధ్య సగటు దూరం ఒక మిలియన్‌ కిలోమీటర్‌ ఉంటుంది. గ్రహశకలాల పట్టీ ద్రవ్యరాశి, భూమి ద్రవ్యరాశిలో 0.1% మాత్రమే.

 బృహస్పతి కక్ష్యలో తిరిగే గ్రహశకలాల సముదాయాన్ని ట్రోజన్‌ (Trojan) గ్రహశకలాలు అంటారు.

 

ప్లూటో (Pluto)

 దీన్ని 1930లో కనుక్కున్నారు. తొలుత ప్లూటోను సౌర వ్యవస్థలో తొమ్మిదో గ్రహంగా పరిగణించారు.  

 గ్రహానికి నిర్దేశించిన నిర్వచనంతో ప్లూటో లక్షణాలు భిన్నంగా ఉన్నాయి. దీంతో 2006లో అంతర్జాతీయ ఖగోళ సమితి ప్లూటోకు గ్రహం హోదాను తొలగించింది. ప్రస్తుతం దీన్ని మరుగుజ్జు (Dwarf) గ్రహంగా పరిగణిస్తున్నారు.

 ప్లూటో కక్ష్య అత్యధిక వాలును (సుమారు 17) కలిగి ఉంది. 

 ఇది నెప్ట్యూన్‌ కంటే దగ్గరగా సూర్యుడి సమీపంలోకి వస్తుంది. 

 నెప్ట్యూన్‌ కక్ష్యను ప్లూటో కక్ష్య ఖండిస్తుంది. దీన్ని తప్పించుకొని వచ్చిన నెప్ట్యూన్‌ను చంద్రుడిగా కూడా పేర్కొంటారు. 

ప్లూటో, దాని పెద్ద ఉపగ్రహం కేరన్‌ (Charon) రెండూ కైపర్‌ బెల్ట్‌కి చెందినవి. నెప్ట్యూన్‌ గురుత్వ ప్రభావంతో ఇవి గ్రహాల క్షేత్రం (domain) లోకి ప్రవేశించి ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. 

 కైపర్‌ బెల్ట్‌లోని అతిపెద్ద ఖగోళ వస్తువు ప్లూటో. దీన్ని ‘కింగ్‌ ఆఫ్‌ కైపర్‌ బెల్ట్‌’ అని కూడా అంటారు.

 

హేలీ తోకచుక్క

 ఇది అత్యంత ముఖ్యమైన, ప్రజాదరణ పొందిన తోకచుక్క. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకోసారి కనిపిస్తుంది. తోకచుక్కలు మళ్లీ కనిపిస్తాయని శాస్త్రవేత్తలు దీని ఆధారంగానే కనుక్కున్నారు.

 హేలీ తోకచుక్క 1986లో చివరిసారి కనిపించింది. 2061లో ఇది సూర్యుడ్ని సమీపించినప్పుడు మళ్లీ చూడొచ్చు.

 ఇంగ్లండ్‌కి చెందిన ఎడ్మాండ్‌ హేలీ (1656-1742) అనే ఖగోళ శాస్త్రవేత్త తోకచుక్కలపై పరిశోధనలు చేశారు. అంతకుముందు అవి ఒకసారి మాత్రమే భూమివైపు వస్తాయని శాస్త్రవేత్తలు భావించారు. కానీ 1531, 1607, 1682లో కనిపించిన తోకచుక్క ఒకటే అని, అది మళ్లీ 175859లో భూమిని సమీపిస్తుందని హేలీ అంచనా వేశారు. 

 ఆయన మరణించిన 16 ఏళ్ల తర్వాత అదే తోకచుక్క తిరిగి కనిపించింది. ఆయన గౌరవార్థం దానికి హేలీ తోకచుక్క అని పేరు పెట్టారు.

రచయిత

దురిశెట్టి అనంత రామకృష్ణ

విషయ నిపుణులు 

Posted Date : 06-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌