• facebook
  • whatsapp
  • telegram

రోగనిరోధక వ్యవస్థ

నిత్యం మన శరీరంపై సంక్రమణ సూక్ష్మజీవులు దాడి చేస్తూనే ఉంటాయి. వాటన్నింటి నుంచి మన దేహాన్ని రక్షించేందుకు రోగనిరోధక వ్యవస్థ సహాయపడుతుంది. ఇది ఒక శక్తిమంతమైన సాయుధదళంలా, సంరక్షక వ్యవస్థలా మనల్ని రక్షిస్తుంది. మనకు హాని కలిగించే సూక్ష్మజీవుల్లో ప్రధానమైనవి బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు. వీటి నుంచి దేహానికి రక్షణ కల్పించే అవయవాలను, కణాలను, ప్రోటీన్‌లను రోగనిరోధక వ్యవస్థలో భాగంగా పేర్కొంటారు.

 రోగనిరోధకత లేదా రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన అధ్యయనాన్ని ‘ఇమ్యునాలజీ’ లేదా ‘రోగనిరోధక శాస్త్రం’ అంటారు.

 

రక్షణ రేఖలు

పరిణితి చెందిన జీవుల్లో రోగనిరోధకత రక్షణ రేఖల రూపంలో ఉండి, వ్యాధులబారి నుంచి సంరక్షిస్తుంది. అవి:

 ప్రథమ రక్షణ రేఖ: హానికరమైన సంక్రమణ సూక్ష్మజీవులు దేహాంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు చర్మం, శ్లేష్మస్తరాలు, లాలాజలం, కన్నీరు మొదలైనవి వాటిని రాకుండా నిరోధిస్తాయి. దీన్నే ప్రథమ రక్షణ రేఖగా పేర్కొంటారు.

ద్వితీయ రక్షణ రేఖ: వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రథమ రక్షణ రేఖను దాటి, శరీరంలోకి వచ్చినప్పుడు ఫాగోసైట్‌లు, సహజహంతక కణాలు, జ్వరం లాంటి చర్యలు వాటిని నాశనం చేస్తాయి. దీన్నే ద్వితీయ రక్షణ రేఖ అంటారు.

తృతీయ రక్షణ రేఖ: వ్యాధికారక పరాన్నజీవులు మొదటి, రెండు రక్షణ రేఖలను దాటుకుని దేహంలోకి ప్రవేశించినప్పుడు, లింఫోసైట్‌లు లేదా శోషరస కణాలు, ప్రతిదేహాలు సూక్ష్మజీవులతో పోరాడి రక్షణ కల్పిస్తాయి. ఇవే తృతీయ రక్షణ రేఖ భాగాలు. ఇవి క్రియాత్మకతను ప్రదర్శించడానికి చాలా రోజులు పడుతుంది.

 ఈ మూడు రక్షణరేఖలు విఫలమైనప్పుడు మానవులకు వ్యాధి సోకుతుంది.

 

కణాలు

రోగనిరోధక వ్యవస్థ కణాలు మూడు రకాలు. అవి:

i) లింఫోసైట్‌లు లేదా శోషరస కణాలు

'ii) ఫాగోసైట్‌లు లేదా భక్షక కణాలు

iii) ఉపక్రియా కణాలు

లింఫోసైట్‌లు: ఇవి అస్థి మజ్జ కాండ కణాల నుంచి ఉద్భవిస్తాయి. ఇవి గుండ్రంగా లేదా అండాకారంలో ఉండి, పెద్ద కేంద్రకం కలిగిన కణికారహిత తెల్లరక్త కణాలు. వీటిని మూడు రకాలుగా విభజించారు. 

ఎ) B - కణాలు        బి) T - కణాలు 

సి) సహజహంతక కణాలు

B-కణాలు: పరిణితి చెందిన తీ - కణాలు ప్రతిదేహాలను సంశ్లేషించి, వాటిని త్వచ ఉపరితలంపై ప్రదర్శిస్తాయి. ఇవే ప్రతిజనక గ్రాహకాలుగా పనిచేస్తాయి. లీబీది-ఖిఖి అణువులు కూడా వీటి త్వచ ఉపరితలంపై ఉంటాయి. ఇవి హ్యుమరల్‌ ఇమ్యూనిటీలో పాల్గొంటాయి.

T-కణాలు: ఇవి తీ కణాల మాదిరి నేరుగా ప్రతిజనకాన్ని గుర్తించలేవు. గి - కణాలు ప్రతిజనకాన్ని ప్రతిజనక సమర్పక కణాల నుంచి స్వీకరిస్తాయి.

సహజహంతక కణాలు: ఇవి వైరస్‌ సంక్రమిత దేహ కణాలను, క్యాన్సర్‌ కణాలను గుర్తించి, వాటిపై దాడి చేసి నాశనం చేస్తాయి. 

 సహజహంతక కణాలు ప్రతిదేహాల అవసరం లేకుండానే చర్యలు జరుపుతాయి. 

 ఇవి సహజ లేదా స్వాభావిక రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగం. 

 బ్యాక్టీరియా, వైరస్, సంక్రమణ కణాలు, క్యాన్సర్‌ కణాల బారి నుంచి అతిధేయిని రక్షించడంలో ఇవి సహాయపడతాయి.

సహజహంతక కణాల క్రియాశీలత వృద్ధుల్లో తక్కువగా ఉంటుంది. అందుకే దీర్ఘకాలం జీవించే మనిషి  క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

 

ఉపక్రియా కణాలు

 రోగనిరోధక అనుక్రియల్లో లింఫోసైట్‌లకు సహాయపడే కణాలను ఉపక్రియా కణాలు అంటారు. బేసోఫిల్స్, మాస్ట్‌ కణాలు, రక్తఫలకికలు, ప్రతిజనక సమర్పక కణాలు మొదలైనవి ఉపక్రియా కణాలను ఏర్పరుస్తాయి. 

 మాస్ట్‌ కణాలు ఆకారంలోనూ, క్రియల్లోనూ బేసోఫిల్స్‌ను పోలి ఉంటాయి. ఇవి ఏరియోలార్‌ కణజాలంలో ఉంటాయి. ఇవి హిస్టమిన్, హెపారిన్, సెరటోనిన్‌ లాంటి ఉజ్వలన మధ్యవర్తిత్వ పదార్థాలను విడుదల చేసి ఉజ్వలన లేదా మంట, అలర్జీ చర్యలను కలిగిస్తాయి.

రక్త ఫలకికలు కూడా మాస్ట్‌ కణాల లాగా ఉజ్వలన మధ్యవర్తిత్వ పదార్థాలను విడుదల చేసి ఉజ్వలనం, అలర్జీ చర్యలను కలిగిస్తాయి.

 ప్రతిజనకాలను ప్రక్రియీకరణం చేసి లింఫోసైట్‌లకు సమర్పించే కణాలను ప్రతిజనక సమర్పక కణాలు అంటారు.

 

అణువులు

రోగనిరోధక వ్యవస్థలో మూడు రకాల అణువులు ఉంటాయి.

అవి: 1) పరిపూరక ప్రోటీన్‌లు 

2) సైటోకైన్‌లు        3) ప్రతిదేహాలు

రకాలు

జీవుల్లో ఉండే రోగనిరోధకతను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు.

1) సహజ రోగనిరోధకత             2) ఆర్జిత రోగనిరోధకత

సహజ రోగనిరోధకత: పుట్టుకతోనే జీవులన్నింటిలో ఉండే రోగనిరోధక శక్తిని సహజ లేదా స్వాభావిక రోగనిరోధకత అంటారు. దేహంలో సూక్ష్మజీవులపై దాడి జరగకముందే ఈ నిరోధకత ఏర్పడుతుంది. దీనిలో నాలుగు రకాల అవరోధాలు ఉన్నాయి.

1) భౌతిక అవరోధాలు 

2) శరీరధర్మపరమైన అవరోధాలు

3) కణపరమైన అవరోధాలు 

4) సైటోకైన్‌ అవరోధాలు

ఆర్జిత రోగనిరోధకత: దీన్నే స్వీకృత లేదా అనుకూలన రోగనిరోధకత అంటారు. ఇది జీవి పుట్టాక తన జీవితకాలంలో ఏర్పర్చుకున్న రోగనిరోధకత. 

 సూక్ష్మజీవి లేదా ప్రతిజనకం దేహంలోకి ప్రవేశించాకే ప్రతిదేహాల ఉత్పత్తి జరిగి, రోగనిరోధకత ఏర్పడుతుంది. 

 ఇందులో క్రియాశీల ఆర్జిత రోగనిరోధకత, స్తబ్ధ ఆర్జిత రోగనిరోధకత అని రెండు రకాలు ఉంటాయి.

 గర్భిణుల్లో ప్రతిదేహాలు జరాయువు ద్వారా భ్రూణంలోకి ప్రవేశిస్తాయి. అలాగే కొన్ని ప్రతిదేహాలు కోలోస్ట్రమ్‌ (స్తన ప్రథమ స్రావం) ద్వారా తల్లి నుంచి శిశువులోకి సహజంగా స్తబ్ధంగా వెళ్తాయి. కోలోస్ట్రమ్‌లో IgA ఇమ్యునో గ్లోబ్యులిన్‌ ‘A’ రకపు ప్రతిదేహాలు అధికంగా ఉండి, శిశువుకు రోగనిరోధకతను కల్పిస్తాయి.

 స్తబ్ధ రోగనిరోధకతను కృత్రిమంగానూ కల్పించవచ్చు. యాంటీటెటనస్‌ సీరం ఇంజక్షన్, యాంటీరేబిస్‌ సీరం ఇంజక్షన్, పాము విషానికి విరుగుడుగా ఇచ్చే యాంటీవీనమ్‌ ఇంజక్షన్‌ మొదలైన వాటిలో ముందస్తు ప్రతిదేహాలు ఉంటాయి. వీటిని దేహంలోకి ప్రవేశపెట్టినప్పుడు కృత్రిమ స్తబ్ధ రోగనిరోధకత కలుగుతుంది.

 అనుక్రియ రకం ఆధారంగా రోగనిరోధకతను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:

1) హ్యుమరల్‌ లేదా ద్రవనిర్వర్తిత రోగనిరోధకత

2) కణనిర్వర్తిత రోగనిరోధకత

 ప్రతిజనకానికి ప్రేరణ చెందిన తీ-కణాలు విశిష్ట ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ప్లాస్మా, శోషరసం మొదలైన దేహ ద్రవాల్లోకి విడుదల చేస్తాయి. ప్రతిదేహాల ద్వారా జరిగే రోగనిరోధకతను హ్యుమరల్‌ లేదా దేహనిర్వర్తిత రోగనిరోధకత అంటారు.

 T - లింఫోసైట్‌ల చర్యల వల్ల జరిగే రోగనిరోధక అనుక్రియలను కణనిర్వర్తిత రోగనిరోధకత అంటారు.

 

ఫాగోసైట్‌లు

‘ ఇవి కణభక్షణ జరిపే తెల్లరక్త కణాలు. కేంద్రక రకం ఆధారంగా ఫాగోసైట్‌లను రెండు రకాలుగా విభజించారు. అవి:

i) ఏక కేంద్రక భక్షక కణాలు 

ii) బహురూప కేంద్రక భక్షక కణాలు

ఏక కేంద్రక భక్షక కణాలు: ఇవి రేణురహిత తెల్లరక్త కణాలుగా ఉన్న మోనోసైట్‌లు. ఇవి రక్తం నుంచి కణజాలాలకు చేరతాయి. అక్కడ మాక్రోఫేజ్‌లుగా మారి సూక్ష్మజీవులను, మాతృకణ వ్యర్థాలను భక్షిస్తాయి. 

 క్రియాశీల మాక్రోఫేజ్‌లు ప్రతిజనక సమర్పక కణాలుగా కూడా పనిచేస్తాయి.బహురూప కేంద్రక భక్షక కణాలు: రేణుసహిత తెల్లరక్త కణాలుగా పేర్కొనే న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇయోసినోఫిల్స్‌లను బహురూప కేంద్రక భక్షక కణాలు అంటారు. వీటిలో న్యూట్రోఫిల్స్‌ సంఖ్య అధికం. అందుకే వీటినే బహురూప కేంద్రక ఫాగోసైట్‌లు అంటారు.

 బేసోఫిల్స్‌ భక్షక కణాలు కావు. ఇవి హిస్టమిన్, బ్రాడికైనిన్, హెపారిన్‌ లాంటి ఉజ్వలన మాధ్యమిక పదార్థాలను విడుదల చేసి, సంక్రమణ క్రిములపై పోరాడతాయి. 

 ఇయోసినోఫిల్‌లు బలహీన భక్షక కణాలు. ఇవి ఎలర్జీ సంబంధ చర్యలను నిరోధిస్తాయి. 

 సంక్రమణ జరిగిన ప్రాంతంలో ఏర్పడిన ‘చీము’లో అధిక సంఖ్యలో మరణించిన న్యూట్రోఫిల్స్, కణ వ్యర్థాలు ఉంటాయి.

 

లింఫాయిడ్‌ అవయవాలు

శోషరస కణాల ఆవిర్భావం, పరిపక్వత, విస్తృత విభజనలో పాల్గొనే అవయవాలను లింఫాయిడ్‌ అవయవాలు అంటారు. క్రియాత్మకంగా ఇవి రెండు రకాలు.

1) ప్రాథమిక లింఫాయిడ్‌ అవయవాలు 

2) ద్వితీయ లింఫాయిడ్‌ అవయవాలు

ప్రాథమిక లింఫాయిడ్‌ అవయవాలు: వీటిలో లింఫాయిడ్‌ మూల కణాలు పరిణతి చెంది, రోగనిరోధక సామర్థ్య కణాలుగా మారతాయి.

 ఇవి జన్మించినప్పుడు పెద్దవిగా ఉండి, వయసు పెరిగే కొద్దీ క్షీణిస్తాయి

 క్షీరదాల్లో లింఫాయిడ్‌ అవయవాలకు ఉదాహరణ - అస్థిమజ్జ, థైమస్‌ గ్రంథి. ద్వితీయ లింఫాయిడ్‌ అవయవాలు: వీటిలో పరిణతి చెందిన లింఫోసైట్‌లు క్రియాత్మక లింఫోసైట్‌లుగా మారతాయి. ఇవి పుట్టినపుడు చిన్నవిగా ఉండి, వయసు పెరిగేకొద్దీ పెద్దగా అవుతాయి.

 ప్లీహం, శోషరస కణుపులు, టాన్సిల్స్, చిన్నపేగులోని పీయర్స్‌ ఫీచస్, ఉండుకం (Appendix) మొదలైనవి  ద్వితీయ లింఫాయిడ్‌ అవయవాలకు ఉదాహరణలు.

 ప్లీహంలో ప్రధానంగా శోషరస కణాలు, భక్షక కణాలు ఉంటాయి. ఇది రక్తంలోని సూక్ష్మజీవులను వడపోత ద్వారా నిర్బంధించే రక్త వడపోత పరికరంగా పనిచేస్తుంది.

 ఇది ఎర్రరక్త కణాలను (ఆర్‌బీసీ) నిల్వ ఉంచే పెద్ద ఆశయంగానూ, వయసుమీరిన ఆర్‌బీసీలను విచ్ఛిన్నం చేసే శ్మశానవాటికగానూ పనిచేస్తుంది.

 శోషరస కణుపులు శోషరస వ్యవస్థలోని వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో చిన్నవిగా ఉండే నిర్మాణాలు.

 వీటిలో శోషరస కణాలు, స్థూల భక్షక కణాలు ఉంటాయి. వీటి ద్వారా శోషరసం ప్రవహించేటప్పుడు సూక్ష్మక్రిములను, ప్రతిజనకాలను వడపోత ద్వారా బంధించి సంహరిస్తాయి.

 ఇలా బంధితమైన ప్రతిజనకాలే ఈ కణుపుల్లో ఉన్న లింఫోసైట్‌ల ప్రేరణకు కారణం.

 శ్లేష్మస్తర అనుబంధ లింఫాయిడ్‌ కణజాలం లేదా Mucos Associated Lymphoid Tissue (MALT) అనేది శ్వాస, జఠరాంత్ర మూత్ర జననేంద్రియ నాళాల లోపలి తలంలో విస్తరించి ఉంటుంది. మానవ దేహంలో మొత్తం లింఫాయిడ్‌ కణజాలంలో ఇది దాదాపు 50 శాతం ఉంటుంది. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఇతర ప్రతిజనకాలను బంధించి నాశనం చేస్తాయి.


మాదిరి ప్రశ్నలు

 

1. ప్రణాళికాబద్ధ కణ మరణాన్ని ఏమంటారు?

1) ఎపోటోసిస్‌ (Apoptois)    2) సెరటోనిన్‌    3) ఇంటర్‌ఫెర్మాన్‌       4) గ్రాన్‌జైమ్‌

జ: ఎపోటోసిస్‌ (Apoptois) 

 

2. వైరస్‌తో సంక్రమణ చెందిన దేహకణాలు విడుదల చేసే రక్షక యాంటీవైరల్‌ ప్రోటీన్‌లను ఏమంటారు?

1) గ్రాన్‌జైమ్‌లు      2) ఇంటర్‌ఫెరాన్‌లు    3) లైసోజైమ్‌లు        4) ప్రతివైరల్‌ దేహాలు

జ: ఇంటర్‌ఫెరాన్‌లు    ​​​​​​​

 

3. కిందివాటిలో సరైనవి ఏవి?

i) ఇంటర్‌ఫెరాన్‌లు ప్రధానంగా ఆల్ఫా, బీటా, గామా అనే మూడు రకాలుగా ఉంటాయి.

ii) ఒక కణం నుంచి మరో కణానికి వైరస్‌ వ్యాపించకుండా ఇవి నిరోధిస్తాయి.

iii) శరీరంలో ఇంటర్‌ఫెరాన్‌లు తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతాయి. కానీ డీఎన్‌ఏ రీకాంబినెంట్‌ టెక్నాలజీ ద్వారా వీటిని అధిక పరిమాణంలో పారిశ్రామికంగా తయారు చేయొచ్చు.

iv) హెపటైటిస్‌ - తీ, హెర్పిస్, పాపిలోమా, రేబిస్‌ వ్యాధుల చికిత్సలో బయోటెక్నాలజీ ద్వారా  ఉత్పత్తయిన ఇంటర్‌ఫెరాన్‌లను ఉపయోగిస్తున్నారు.

1) i, ii, iii             2) ii, iii, iv        3) i, iii, iv             4) i, ii, iii, iv

జ:  i, ii, iii, iv​​​​​​​

 

4. బీఖిజు సంక్రమణకు మొదటిసారి గురైనప్పటి నుంచి, దానికి అనుక్రియగా రోగనిరోధక వ్యవస్థ ప్రతిదేహాలను ఉత్పత్తి చేయడానికి మధ్య ఉన్న కాలాన్ని ఏమంటారు?

1) డోర్‌ పీరియడ్‌      2) క్లంసీ పీరియడ్‌     3) విండో పీరియడ్‌      4) క్లౌడీ పీరియడ్‌

జ: విండో పీరియడ్‌​​​​​​​

 

5. కింది అంశాల్లో సరైనవి ఏవి?

i) హెచ్‌ఐవీ ఒక రిట్రోవైరస్‌

ii) హెచ్‌ఐవీ మధ్య భాగంలో ఏకపోచ ఆర్‌ఎన్‌ఏ జన్యుపదార్థంగా ఉంటుంది.

iii) హెచ్‌ఐవీ సంక్రమణను గుర్తించడానికి విరివిగా ఉపయోగించే వ్యాధి నిర్ధారణ పరీక్ష ELISA

iv) నిలిఖిళీతి కేవలం గుర్తింపు పరీక్ష లేదా ప్రాథమిక పరీక్ష మాత్రమే. వెస్టర్న్‌ బ్లాట్‌ పరీక్ష ద్వారా HIV సంక్రమణను ధ్రువీకరిస్తారు.

1) i, ii, iii         2) ii, iii, iv       3) i,iii, iv        4) i, ii, iii, iv

జ: i, ii, iii, iv​​​​​​​

 

6. వ్యాక్సినేషన్‌ లేదా ఇమ్యునైజేషన్‌ సూత్రం ఏ లక్షణంపై ఆధారపడుతుంది?

1) రోగనిరోధక జ్ఞప్తి          2) రోగనిరోధక కణం

3) రోగనిరోధక విచ్ఛిత్తి       4) రోగనిరోధక బహురూపకం

జ: రోగనిరోధక జ్ఞప్తి​​​​​​​


రచయిత 
కొర్లాం సాయివెంకటేష్‌
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 18-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌